
Farmers removing blockade during peek of the movement
మోడి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం చనిపోయిన రైతుల కుటుంబాల దీన పరిస్ధితితో తనకు సంబంధం లేదని చేతులు దులిపేసుకుంది.
తమ నిర్లక్ష్యం, రైతుల పట్ల బాధ్యతారాహిత్యం కారణంగా ఏడాది పాటు చలికి వణుకుతూ, ఎండలో ఎండుతూ, వానలో నానుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలో పాల్గొనడం వలన అర్ధాంతరంగా చనిపోయిన రైతులకు సంబంధించిన రికార్డులు తమ వద్ద లేనందున వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించే ప్రసక్తే తలెత్తదని స్పష్టం చేసింది.
అసలు కనీస తర్కం కూడా లేని వాదనలు చేయడంలో తామే దిట్ట అని బిజేపి, ఆర్‌ఎస్‌ఎస్ తదితర హిందూత్వ సంస్ధలు ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నాయి. దళితులపై అత్యాచారాలు జరిగితే తిరిగి దళిత బాధితులపైనే కేసులు పెట్టడం, ముస్లింలు హత్యకు గురయితే తిరిగి వారి పైనే గోహత్య, లవ్ జిహాద్ లాంటి ఆరోపణలతో కేసులు మోపడం, ప్రభుత్వాన్ని విమర్శిస్తే యాంటీ-నేషనల్ అంటూ సెడిషన్ కేసులు బనాయించడం, మత అల్లర్ల గురించి పత్రికల్లో రిపోర్ట్ చేస్తే జర్నలిస్టులపై టెర్రరిస్టు చట్టం (ఉపా) కింద కేసులు బనాయించడం… అధికారం అండతో బిజేపి ప్రభుత్వాలు సాగిస్తున్న చర్యలివి.
ఇప్పుడు ఆందోళనలో మరణించిన రైతుల రికార్డ్ తమ వద్ద లేనందున “పరిహారం చల్లించే ప్రసక్తే తలెత్తద”ని ప్రకటించడం?! కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే నిరసనల్లో మృతులైన రైతుల వివరాలు సేకరించడం పెద్ద పనేమీ కాదు. పరిహారం చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంటే నిజానికి మృత రైతుల గణాంకాలు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయి కూడా.
రైతుల సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఇతర స్వతంత్ర కార్యకర్తలు రైతుల మరణాల గురించిన వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేశారు. వారి వద్ద వివరాలు సేకరించి, అవసరమైతే స్క్రూటినీ చేసి పరిహారం చెల్లించగల అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కానీ బాధిత ప్రజల పేరుతో నిధులు వసూలు చేయడం తెలిసినంతగా వారికి పరిహారం చెల్లించడం హిందూత్వ ప్రభుత్వాలకు అలవాటు లేని విషయం.
ఆందోళనల్లో మరణించిన రైతులకు రు 3 లక్షల చొప్పున పరిహారం చల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తాము అధికారం లోకి వస్తే యూపి రైతు మృతులకు ఒక్కో కుటుంబానికి 25 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది. ఈ పాటి సహాయం చేయడం కేంద్రానికి లెక్కలోనిది కాదు. కానీ ప్రతీకార రాజకీయాలు నెరిపే మోడి ప్రభుత్వం ఏడాది పాటు తమ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులను దేశ ప్రజల్లో భాగంగా చూడగలదా? ఆందోళన ప్రారంభం నుండి ఖలిస్తానీలనీ, ఉగ్రవాదులనీ, యాంటీ నేషనలిస్టులనీ, విదేశాల నుండి నిధులు అందుతున్నాయనీ రైతులపై రకరకాల ముద్రలు బిజేపి నేతలు, కేంద్ర మంత్రులు వేయడం తెలిసిన విషయమే.
డీమానిటైజేషన్ వల్ల బ్యాంకుల ముందు గంటల తరబడి నిలబడి అక్కడే కుప్పకూలి అనేకమంది వృద్ధులు, రోగులు మరణించారు. వారి సంఖ్య 150 పైనే ఉంటుందని అనధికార లెక్కలు చెప్పాయి. కానీ ప్రధాని మోడి సదరు మరణాల గురించి ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. ఒకరిద్దరు కేంద్ర మంత్రులు ‘దురదృష్టకరం’ అంటూ కనీసం మరణాలను acknowledge చేశారు. ప్రధాన మంత్రి అది కూడా చేయలేదు. కేబినెట్ కి కూడా తెలియకుండా అంతా తానే అన్నట్లుగా డీమానిటైజేషన్ చర్యకు దిగిన ప్రధాని దాని వల్ల కలిగిన తీవ్ర దుష్ఫలితాలకు బాధ్యత వహించడానికి ఎన్నడూ ముందుకు రాలేదు.
ఆందోళన విరమణకు రైతు సంఘాలు 6 డిమాండ్లు ప్రకటించాయి. అందులో ఆందోళనల్లో మరణించిన రైతులకు నష్టపరిహారం చెల్లించడం కూడా ఒకటి. MSP గ్యారంటీ చేస్తూ చట్టం చేయడం, రైతులపై మోపిన కేసుల ఉపసంహరణ, మృత నిరసనకారుల సంసరణార్ధం మెమోరియల్ నిర్మాణం, విద్యుత్ చట్ట సవరణ బిల్లు ఉపసంహరణ, ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ధాన్యం దిగుబడి అనంతరం మిగిలిపోయే ఎండుగడ్డికి నిప్పు పెట్టి కాల్చి వేసే (stubble burning) రైతులను నేరస్ధులను చేసే చట్టం ఉపసంహరణ, లఖిం పూర్ ఖేరి హింసకు బాధ్యుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను మంత్రిగా తొలగించి అరెస్ట్ చేయడం… ఇవి మిగతా 5 డిమాండ్లు.

Stubble burning
కేసుల ఉపసంహరణకు ప్రభుత్వ నేతలు ప్రైవేటుగా అంగీకరించారని కొన్ని పత్రికలు చెబుతున్నాయి. అయితే వ్యక్తులను ఎంచుకుని కేసులు ఎత్తివేయడం కాకుండా మొత్తంగా రైతులపై మోపిన కేసులన్నీ ఎత్తివేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎంఎస్‌పి విషయమై కమిటీ నియమిస్తున్నామనీ కమిటీలో సభ్యులుగా చేరేందుకు సంఘాల తరపున ముగ్గురు పేర్లు సూచించాలని కేంద్రం కోరినట్లు తెలుస్తోంది.
స్టబుల్ బర్నింగ్ ను నేరంగా చేసే చట్టాన్ని రద్దు చేస్తామని, విద్యుత్ చట్ట సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టబోవడం లేదని ప్రైవేటు హామీ ఇచ్చినట్లు కొన్ని పత్రికలు చెబుతున్నాయి. కానీ ఈ హామీలపై అధికారికంగా ఎలాంటి వర్తమానం తమకు అందలేదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. అధికారికంగా, రాతపూర్వకంగా సమాచారం ఇస్తే తప్ప హామీలు నమ్మబోమని వారు తేల్చి చెబుతున్నారు. అయితే కనీసం ఇద్దరు రైతు సంఘాల నేతలు “ఇక ఆందోళన విరమించడం మంచిది” అని ప్రకటించేశారు. ప్రధాన సంఘాలు మాత్రం అందుకు సుముఖంగా లేవు.
మూడు సాగు చట్టాలను ఏదో ఒక రూపంలో తిరిగి చట్టం చేయకుండా బిజేపి ప్రభుత్వం ఉండబోదన్న అనుమానాలు ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాలు ఇప్పటికే వ్యక్తం చేశాయి. కనుక నోటి మాట తో బిజేపి ఇచ్చే హామీలు ఎంతమాత్రం నమ్మదగినవి కావని రైతులు భావిస్తున్నారు. ప్రధాన మంత్రి ప్రకటించినట్లు కేంద్రం నిజంగా రైతుల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నట్లయితే వారి డిమాండ్లు నెరవేర్చాలి.