
Suspended MPs protest at Gandhi statue
పార్లమెంటరీ సంప్రదాయాలు, నియమ నిబంధనలు, నియమావళి, సుస్ధిర ప్రక్రియలు ఒక్కొక్కటిగా మాయమైపోతున్నాయి. దాదాపు ఆరున్నర దశాబ్దాల పార్లమెంటరీ ఆచరణలో తామే నెలకొల్పుకున్న సో-కాల్డ్ ప్రజాస్వామిక సభా సూత్రాలు రద్దయిపోతూ వాటి స్ధానంలో పార్లమెంటరీ నియంతృత్వ సూత్రాలు ప్రవేశిస్తున్నాయి.
ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకున్న సభ్యులు నిరసనలను గౌరవించడం మాట అటుంచి కనీసం పట్టించుకోవడమే ఒక గొప్ప అంశంగా మారే రోజులు వచ్చాయి. ప్రజాస్వామ్య దేవాలయంగా ఇన్నాళ్లూ మన పాలకులు డప్పు కొట్టుకున్న పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లులు చట్టాలుగా ఆమోదం పొందుతున్న తీరు వారు చెప్పుకునే ప్రజాస్వామ్యానికి కూడా పాడె కట్టుకుంటున్న విషయాన్నే స్పష్టం చేస్తున్నది.
దేశంలో 65 శాతం మందికి పైగా ప్రజానీకం ఉపాధి పొందుతున్న వ్యవసాయ రంగాన్ని స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తూ మోడి ప్రభుత్వం తెచ్చిన 3 వివాదాస్పద బిల్లుల ఆమోదమే అత్యంత అప్రజాస్వామికంగా పాలక పార్టీ మందబలాన్ని అడ్డం పెట్టుకుని, కనీస చర్చ లేకుండా ఆమోదించుకున్నారని ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు, స్వతంత్ర పరిశీలకులు, పత్రికలు తీవ్రంగా తప్పు పట్టాయి.
రైతాంగం సంవత్సర కాలం పాటు సాగించిన ఉద్యమం బిజేపి ఎన్నికల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చడంతో మోడి ప్రభుత్వం దిగివచ్చి వ్యవసాయ చట్టాలు రద్దు చేయబోతున్నట్లు ప్రకటించింది. చెప్పినట్లుగానే నవంబర్ 29 తేదీన వింటర్ సెషన్ మొదటి రోజు మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టిన 5 నిమిషాల్లో ఆమోదించేశారు. ఆమోదానికి ముందు చర్చ జరగాలని, రైతు సంఘాల ప్రధాన డిమాండ్ కనీస మద్దతు ధర గ్యారంటీ విషయమై చర్చించాలని ప్రతిపక్షాలు గొంతు చించుకుంటున్నా పట్టించుకోకుండా మళ్ళీ అదే ఆటోక్రటిక్ ధోరణిలో మూజువాణి ఓటుతో రద్దు బిల్లును ఆమోదించేశారు.
చర్చ లేకుండా బిల్లు ఆమోదించడానికి వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇచ్చుకున్న సమర్ధన సరికొత్త పార్లమెంటరీ సంప్రదాయానికి తెర లేపింది. పాలక, ప్రతిపక్షాలు రెండూ మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుపై ఏకాభిప్రాయం ఉన్నప్పుడు ఇక చర్చ ఎందుకు అన్నది ఆయన ఇచ్చిన సమర్ధన.
పార్లమెంటులో వివిధ అంశాలపై, బిల్లులపై చర్చలు ఎందుకు జరగాలో సుప్రీం కోర్టు ఇచ్చిన వివిధ తీర్పుల సందర్భంగా వివరించబడింది. బిల్లులపై చర్చ కేవలం ఆమోదానికో లేదా తిరస్కరణకో మాత్రమే పరిమితం కాదు. బిల్లు అవసరం ఏమిటి, దాని ఉద్దేశ్యం, లక్ష్యం ఏమిటి? సదరు ఉద్దేశ్యం, లక్ష్యాలను బిల్లు నెరవేర్చుతుందా లేదా? పాలక పక్షం అసలు లక్ష్యం ఒకటి పెట్టుకుని పైకి మరో లక్ష్యం ప్రకటిస్తోందా? బిల్లు ప్రవేశపెట్టడంలో ప్రభుత్వానికి ఉన్న నిజాయితీ ఏమిటి? బిల్లులో ఏమన్నా లోపాలు ఉన్నాయా? లూప్ హోల్స్ ఉన్నాయా? దొడ్డిదారిన వేరే లక్ష్యాలను సాధించుకునేందుకు పాలక పక్షం ఉద్దేశపూర్వకంగా లూప్ హోల్స్ కు అవకాశం ఇచ్చిందా? ఇలాంటి వన్నీ చర్చ జరిగితేనే తెలుస్తుంది. చర్చ లేకుండా బుల్ డోజర్ తో ముందుకు తోసేసినట్లు ఆమోదిస్తే ఇవేవీ బైటికి రావు. ప్రజలకు తెలియవు. అసలు పార్లమెంటు నెలకొల్పిన లక్ష్యమే నెరవేరదు.
పార్లమెంటు చేసే చట్టాలు కోర్టులో సవాలు చేయబడే అవకాశాలు ఉంటాయి. అలాగే చట్టాలు అమలు జరిగే క్రమంలో వచ్చే ఇబ్బందులను బట్టి, ప్రజలకు ఒనగూరే లాభ నష్టాలను బట్టి కోర్టులో కేసులు దాఖలు అవుతాయి. ఈ కేసుల విచారణ సందర్భంలో కోర్టులు కేవలం చట్టం యొక్క పాఠ్యాన్ని (Text) మాత్రమే పరిగణనలోకి తీసుకోవు. సదరు చట్టంపై పార్లమెంటు ఉభయ సభల్లో జరిగిన చర్చలను కూడా కోర్టులు పరిశీలిస్తాయి. చర్చల సందర్భంలో ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలు, అనుమానాలు వాటికి ప్రభుత్వం తరపున మంత్రులు ఇచ్చిన సమాధానాలు, అనుమానాలు పరిష్కరించేటప్పుడు వారు ఇచ్చిన వివరణలు… ఇవన్నీ పరిగణిస్తాయి. ఇవన్నీ కోర్టులో కేసుల పరిష్కారంలో జడ్జిలకు, న్యాయవాదులకు ఉపయోగపడతాయి. వాటిపైన కూడా కోర్టు తీర్పులు ఆధారపడి ఉంటాయి. ఒక్కోసారి పార్లమెంటు చర్చలే న్యాయమూర్తులకు కేసుల పరిష్కారంలో గైడ్ గా ఉపయోగపడతాయి.
ఈ అంశాన్ని సుప్రీం కోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తితో పాటు గతంలో ఇతర న్యాయమూర్తులు కూడా ప్రస్తావించారు. పార్లమెంటులో చర్చలు జరగకుండా చట్టాలు ఆమోదించడం వలన చట్టాల ఉద్దేశ్యం, లక్ష్యం తమకు తెలియకుండా పోతున్నదనీ ఫలితంగా కేసుల పరిష్కారంలో సమస్యలు వస్తున్నాయని కొన్ని నెలల ముందు చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ ఒక ప్రసంగంలో చెప్పారు.
నవంబర్ 27 (శనివారం) తేదీన రాజ్యాంగ దినం (నవంబర్ 26) ఉత్సవ ముగింపు రోజుల ప్రసంగిస్తూ “చట్ట సభలు తాము ఆమోదిస్తున్న చట్టాలపైన గానీ ఆ చట్టాల వల్ల కలిగే ప్రభావాల గురుంచి గానీ అధ్యయనం చేయడం లేదు. దీనివల్ల పెద్ద సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఉదాహరణకి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ లో ప్రవేశపెట్టిన సెక్షన్ 138. ఇప్పటికే కేసుల భారంతో సతమతం అవుతున్న మేజిస్ట్రేట్లు దీనివల్ల మరిన్ని వేల కేసులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక మౌలిక సౌకర్యాలు ఏవీ కల్పించకుండా ఇప్పటికే ఉన్న కోర్టులనే కమర్షియల్ కోర్టుగా రీ బ్రాండ్ చేయడం మరొక ఉదాహరణ. ఇలా చేయడం వల్ల పెండింగ్ కేసుల సంఖ్యలో ఎలాంటి మార్పూ రాదు” అని జస్టిస్ ఎన్‌వి రమణ చెప్పారు.
జస్టిస్ ఎన్‌వి రమణ చెప్పినవి చిన్న ఉదాహరణలు. కానీ మోడి ప్రభుత్వం అత్యంత హ్రస్వ దృష్టితో కేవలం రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం తెచ్చిన సిఏఏ చట్టం, ఎన్‌ఆర్‌సి చట్టం ప్రతిపాదన ఈ కోవలోనిదే. 3 వ్యవసాయ చట్టాల సంగతి సరేసరి. ఈ చట్టాల ప్రధాన లక్ష్యం రైతులు అని చెబుతూ ఆ రైతులతో ఎలాంటి ముందస్తు చర్చలు మోడి ప్రభుత్వం చేయలేదు. అధ్యయనాలు జరపలేదు. కనీసం సెలెక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ని పట్టించుకోలేదు. అదేమంటే 20 యేళ్ళ నుండి ఈ చట్టాలు ప్రతిపాదనలో ఉన్నాయని చెబుతూ నెపాన్ని గత ప్రభుత్వాలపై నెట్టే ప్రయత్నం చేసింది తప్ప చర్చించే ప్రయత్నాలు చేయలేదు.
కనీసం రైతుల ఆందోళన సందర్భంగా కూడా వారితో చర్చించలేదు. 11 సమావేశాలు జరపడం కేవలం లెక్కకే తప్ప ఆ సమావేశాల్లో రైతుల డిమాండ్ ల గురించి చర్చించే ప్రయత్నం చేయలేదు. దాని ఫలితం ఏమిటో మన కళ్ల ముందు ఉన్నది. కేవలం కార్పొరేట్ల ప్రయోజనాలు మాత్రమే మూడు చట్టాలు నెరవేర్చుతాయి. కనుకనే మోడి ప్రభుత్వం చర్చలు చేయడానికి పార్లమెంటులో గానీ, బైట గానీ సుముఖంగా లేదు. చర్చలు జరిగితే చట్టాల అసలు స్వరూపం తెలిసిపోతుంది గనక.
ఈ పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోడి ఘనంగా చేసిన ప్రకటన ఆచరణలోకి వచ్చేసరికి టక్కున మాయమైపోయింది. “జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై పార్లమెంటులో చర్చలు జరగాలని, దేశాభివృద్ధికి మార్గాలు వెతకాలని పౌరులు కోరుకుంటున్నారు. అన్ని అంశాలను చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని ఆయన సమావేశాలకు ముందు ఎంతో ఘనంగా చాటారు.
“ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వినిపించే గొంతులు బలంగా ఉండవలసిందే. కానీ పార్లమెంటు, దాని అధ్యక్షుని ప్రతిష్టను నిలబెట్టాలి” అని ప్రధాని మోడి ప్రకటించారు.
కానీ చలికాలం సమావేశాలు ప్రారంభమయిన నవంబర్ 29 తేదీనే మోడి చేసిన ప్రకటనకు విరుద్ధంగా జరిగింది. మూడు సాగు చట్టాల రద్దు బిల్లుపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు కోరినా పట్టించుకోకుండా మూజువాణి ఓటుతో బిల్లుని ఉభయ సభల్లో ఆమోదింపజేసుకున్నారు. పాలక, ప్రతిపక్షాలు రెండూ ఆమోదించే ఈ బిల్లుపై చర్చ ఎందుకు? అని వ్యవసాయ మంత్రే ప్రశ్నించారు. ఈ ప్రశ్న మోడి చేసిన “అన్ని అంశాలపై చర్చకు సిద్ధం” అన్న ప్రకటనకు వ్యతిరేకం అని మంత్రిగారికి తోచనే లేదా?
ఇంకా ఘోరం ఏమిటంటే మూడు సాగు చట్టాల రద్దు బిల్లు ఆమోదం పొందిన వెంటనే రాజ్యసభలో 12 మంది ప్రతిపక్ష పార్టీల సభ్యులను వింటర్ సెషన్ మొత్తం స్పసెండ్ చేసేశారు. 6గురు కాంగ్రెస్ ఎంపిలు, టిఎంసి, శివసేనలకు చెందిన చెరో ఇద్దరు ఎంపిలు, సిపిఐ, సిపిఎం లకు చెందిన చెరొక ఇద్దరు ఎంపిలను సభ నుండి స్పస్పెండ్ చేశారు. కారణం ఏమిటి అంటే గత సమావేశాల ముగింపు రోజున (ఆగస్టు 11) వీరు కట్టుబాట్లకు విరుద్ధంగా దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని, ఉద్దేశ్యపూర్వకంగా మార్షల్స్ పై హింస ప్రయోగించడం అని చెప్పారు.
కానీ ఆ రోజున పార్లమెంటు కట్టుబాట్లను ఈ 12 మంది ఏ విధంగా ఉల్లంఘినది వివరాలు చెప్పడం లేదు. విచిత్రం ఏమిటంటే పార్లమెంటులో బల్లలు ఎక్కిన ఎంపిలను సస్పెండ్ చేయలేదు. జిఐసి ప్రయివేటీకరణ బిల్లు కాపీలను చించి స్పీకర్ పై విసిరేసిన సభ్యుడినీ సస్పెండ్ చేయలేదు. బహుశా ఇలాంటి చర్యలకు గతంలో బిజేపి సభ్యులు కూడా పాల్పడి ఉండడం వల్ల వారిని సస్పెండ్ చెయ్యలేదేమో తెలియదు. కానీ సస్పెండ్ చేసినవారు ఏయే కట్టుబాట్లు ఉల్లంఘించారో, దుష్ప్రవర్తనకు (misconduct) ఎలా పాల్పడ్డారో చెప్పాల్సిన బాధ్యత పాలకపక్షంపైన ఉన్నది.
ఏకపక్షంగా నేరారోపణ చేసి స్పస్పెండ్ చెయ్యడం అది కూడా సొ-కాల్డ్ ప్రజాస్వామ్య దేవాలయంలోనే అలా జరగడం వల్ల ప్రజలకు ఈ పాలకుల ప్రజాస్వామ్యం నేతిబీర లోని నెయ్యి మాదిరే అని స్పష్టం అవడం తప్ప మరో ప్రయోజనం లేదు. పైగా ఒక సెషన్ లో జరిగిన కట్టుబాటు ఉల్లంఘన తప్పుకు మరుసటి సెషన్ లో స్పస్పెండ్ చెయ్యడం గతంలో ఎప్పుడూ లేదు. ఆ విధంగా పాలకపక్షమే ఒక కట్టుబాటు ఉల్లంఘించినట్లు కనిపిస్తోంది.
ఏతా వాతా తేలిందేమిటంటే “అన్ని అంశాలపైనా చర్చిస్తాం. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాం” అంటూ నోటితో నవ్విన ప్రధాన మంత్రి, మూడు సాగు చట్టాల రద్దుపై చర్చకు అనుమతి ఇవ్వకపోవడం ద్వారా, 12 మంది ఎంపిల సస్పెన్షన్ ద్వారా నొసటితో వెక్కిరించారు. ప్రజల ప్రజాస్వామ్యం అటుంచితే ఇది కనీసం పాలకుల ప్రజాస్వామ్యం కూడా కాదు!
తానో నియంత(మనస్తత్వం)నని మోడీ మరోసారి నిరూపించుకున్నాడు!