
First President of Barbados Sandra Mason with Queen
కరేబియన్ దేశాల్లో ఒకటయిన బార్బడోస్ త్వరలో బ్రిటిష్ రాణి ఆధిపత్యం నుండి వైదొలగడానికి నిర్ణయం తీసుకుంది. సర్వ స్వతంత్ర దేశంగా అవతరించనుంది. బ్రిటిష్ డొమీనియన్ నుండి వైదొలిగి నూతన రిపబ్లిక్ దేశంగా అవతరించనుంది.
400 యేళ్ళ పాటు బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా, బ్రిటిష్ వలస దేశంగా మగ్గిన బార్బడోస్ 1965లో స్వాతంత్రం ప్రకటించుకుంది. స్వాతంత్రం ప్రకటించుకున్నప్పటికీ బ్రిటిష్ డొమీనియన్ లో భాగంగా బార్బడోస్ కొనసాగింది. అనగా ఆ దేశ రాజ్యాధిపతిగా (Head of the State) బ్రిటిష్ రాణి కొనసాగింది. వచ్చేవారం బ్రిటిష్ రాణిని రాజ్యాధిపతిగా రద్దు చేసుకుని రిపబ్లిక్ గా అవతరించడానికి నిర్ణయం తీసుకుంది.
బ్రిటిష్ డొమీనియన్ లో అనగా బ్రిటిష్ రాణి రాజ్యాధిపతిగా ప్రస్తుతం 15 దేశాలు కొనసాగుతున్నాయి. యూకే తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, జమైకా మొదలైన దేశాలు ఇప్పటికీ రాణి కిందనే కొనసాగుతున్నాయి. ఇండియా కూడా 1950 జనవరి 26 వరకు బ్రిటిష్ డొమినియన్ లో భాగంగా కొనసాగింది. ఆ తర్వాతనే సర్వసత్తాక స్వతంత్ర దేశంగా అనగా రిపబ్లిక్ గా మారింది.
చివరిగా దాదాపు 30 సంవత్సరాల క్రితం మారిషస్ దేశం బ్రిటిష్ రాణి ఆధిపత్యం నుండి తప్పుకుని రిపబ్లిక్ గా మారింది. ఆ తర్వాత బార్బడోస్ బ్రిటిష్ రాచరికాన్ని రద్దు చేసుకోనుంది. రాచరికం నుండి బైటపడినప్పటికీ మారిషస్, ఇండియాకి మల్లేనే, కామన్ వెల్త్ దేశాల కూటమిలో కొనసాగింది. పాత బ్రిటిష్ వలస దేశాలతో కామన్ వెల్త్ కూటమిని బ్రిటన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
వెనిజులా లోని ఒరినోకో నదీ తీర ప్రాంతం నుండి సలడోయిడ్-బరంకోయిడ్ తెగల ఆదిమ ప్రజలు, కలినాగో తెగ ప్రజలు అలలు అలలుగా వలస వచ్చే వరకు బార్బడోస్ లో జన సంచారం ఉండేది కాదు. 1625లో బ్రిటన్ ఓడలు ఇక్కడికి చేరుకున్నాక బ్రిటిష్ రాజు జేమ్స్, బార్బడోస్ ను తమ ప్రాంతంగా ప్తకటించుకున్నాడు. ఆ తర్వాత 1627 నుండి 1833 వరకు దాదాపు 6 లక్షల మంది ఆఫ్రికన్లను బ్రిటన్ బానిసలుగా బార్బడోస్ కు తరలించింది. వారి చేత సుగర్ ప్లాంటేషన్లు, పొగాకు, పత్తి, నీలి మందు మొ.న వ్యవసాయ క్షేత్రాల్లో గొడ్డు చాకిరి చేయించుకుని కొద్ది దశాబ్దాల్లోనే ఆంగ్ల యజమానులు కోట్లకు పడగలెత్తారు.
ఇంగ్లీష్ వలస పాలకుల ఆధిపత్యంలో బార్బడోస్ ప్లాంటేషన్ సమాజాలకు ప్రయోగశాలగా ఉపయోగపడింది. మరో మాటలో చెప్పాలంటే బానిస సమాజ ప్రయోగశాలగా అవతరించింది. క్రమంగా జమైకా, జార్జియా, కరోలినాస్ లాంటి ప్రాంతాలకు ఈ బానిస సమాజం విస్తరించింది. వివిధ ఐరోపా వలశాధిపత్య దేశాలు దాదాపు కోటి మందికి పైగా ఆఫ్రికన్లను అత్యంత అమానవీయ పరిస్ధితుల్లో అట్లాంటిక్ ద్వారా తరలించుకెళ్లారు. ఆఫ్రికన్ బానిసల శ్రమ తోనే అమెరికా భూతల స్వర్గం నిర్మితం అయిందంటే అతిశయోక్తి కాదు.
1838లో బార్బడోస్ పూర్తి స్వేచ్ఛ సాధించినట్లు చెబుతున్నప్పటికీ తెల్ల జాతి ప్లాంటేషన్ యజమానులు 20వ శతాబ్దం వరకు ఆర్ధిక, రాజకీయ ఆధికారాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారు. 1966లో మాత్రమే బార్బడోస్ ద్వీపం స్వాతంత్రం సాధించింది.
బ్రిటిష్ యువరాజు 73 యేళ్ళ ప్రిన్స్ చార్ల్స్ వచ్చేవారం బార్బడోస్ లో జరిగే రిపబ్లిక్ అవతరణ కార్యక్రమానికి అతిధిగా హాజరు కానున్నారు. 95 యేళ్ళ రాణి ఎలిజబెత్ II రాజ్యాధిపతిగా తప్పుకోనున్నది. బార్బడోస్ కూడా రిపబ్లిక్ గా మారాక 54 దేశాల కామన్ వెల్త్ కూటమిలో కొనసాగనుంది. ఇతర కరేబియన్ దేశాలు కూడా త్వరలో బార్బడోస్ ను అనుసరించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
2021, నవంబర్ 29 తేదీన బార్బడోస్ రిపబ్లిక్ గా అవతరించనున్నది. అప్పటి నుండి బార్బడోస్ గవర్నర్ జనరల్ సాంద్రా మాసన్ ఎలిజబెత్ రాణి స్ధానంలో బార్బడోస్ అధ్యక్షులుగా పదవి చేపడతారు.