
3 capital act repealed
జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నిర్ణయించిన అమరావతి రాజధానికి బదులుగా కర్నూలు, విశాఖపట్నంలను కూడా కలిపి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఆంధ్ర ప్రదేశ్ కోర్టుకు సమాచారం ఇచ్చారు.
వివాదాస్పదంగా మారి దేశ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించిన మూడు వ్యవసాయ చట్టాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వెనక్కి తీసుకోబోతున్నట్లు ప్రకటించిన మూడు రోజులకే ఏపి ప్రభుత్వ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రజలకు ఆమోదయోగ్యం కాని నిర్ణయాలను లేదా చట్టాలను వెనక్కి తీసుకోవడం, రద్దు చేయడం తప్పు కాదనీ, అందువల్ల ప్రజలతో పాటు రాజకీయ పార్టీగా తమకూ లాభమే జరుగుతుందని బహుశా ముఖ్యమంత్రి జగన్ మోహన్ కు అర్ధం అయి ఉండాలి. లేదా ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరుఫుతున్న పరిణామాల వల్ల పోతున్న పరువు తిరిగి కూడగట్టుకునే ప్రయత్నం అయినా చేస్తుండాలి.
మూడు రాజధానుల రద్దు నిర్ణయం వెనుక సాంకేతిక కారణాలే ఉన్నాయి గానీ, నిర్ణయం తప్పని భావించి రద్దు చేయడం లేదని రాష్ట్ర మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి గారు వ్యాఖ్యానించినట్లు ఎన్‌డిటివి న్యూస్ తెలిపింది. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాక దానికి ఇతరేతర కారణాలు చెప్పుకోవడం వల్ల ప్రజల్లో పలచన కావడం తప్ప ఉపయోగం లేదని నేతలు గ్రహిస్తే ఉపయోగం.
రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరాం, మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని హై కోర్టుకు తెలియజేశారు. ఈ నిర్ణయం ప్రకారం AP Decentralization and Inclusive Development of All Regions Act 2020, మరియు Andhra Pradesh Capital Region Development (Repeal) Act 2020 చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ చర్యలు చేపడతారు.
శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు నగరాలను అభివృద్ధి చేయడానికి పై రెండు చట్టాలను 2020లో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. ఈ చట్టాలను రైతు సంఘాలతో పాటు అమరావతి ఏరియాకు చెందిన వివిధ గ్రామాల ప్రజలు హై కోర్టులో సవాలు చేశాయి. ఈ కేసుపై గత కొన్ని రోజులుగా హై కోర్టులో వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి. వాదనలు కొనసాగుతుండగానే కేబినెట్ రద్దు నిర్ణయాన్ని తీసుకుంది.

AP ASSEMBLY BUILDING
రాజ్యాంగం లోని ఆర్టికల్ 3, 4 ప్రకారం రాజధాని నిర్ణయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదనీ, 2014లో పార్లమెంటు ఆమోదించిన ఆంధ్ర ప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ చట్టం ఒక రాజధాని నిర్మాణాన్ని ప్రస్తావించింది తప్ప మూడు రాజధానుల నిర్మాణం గురించి ప్రస్తావించలేదనీ పిటిషనర్ల తరపు న్యాయవాది శ్యామ్ దివాన్ వాదించారు. 33,000 మంది రైతులు తమ భూములను రాజధాని నిర్మాణం కోసం వదులుకున్నారని, ఇప్పుడు వారికి ఎలాంటి జీవనోపాధి లేదని గుర్తు చేశారు.
2014 చట్టం ప్రకారం 10 యేళ్ళ తర్వాత హైద్రాబాద్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధాని అవుతుంది. అప్పటివరకూ, అనగా ఏపి రాజధాని కనీస నిర్మాణాలు పూర్తయ్యేవరకు హైద్రాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఈ చట్టంలో సెక్షన్ 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నూతన రాజధాని నిర్మాణం విషయంలో వివిధ ప్రత్యామ్నాయాలు వెతికేందుకు, తగిన సిఫారసులు చేసేందుకు కమిటీ నియమించాలి. దీని ప్రకారం నియమించబడిన శివరామ కృష్ణ కమిటీ దొనకొండను రాజధానిగా సిఫారసు చేయగా టిడిపి ప్రభుత్వం దానిని గురించి పట్టించుకోనే లేదు. సారవంతమైన పంట భూమిని సింగపూర్ చేస్తామంటూ వేలాది ఎకరాల భూమిని సేకరించి రియల్ ఎస్టేట్ బకాసురులకు అప్పగించింది.
నిజానికి శాసన, కార్యనిర్వాహక, న్యాయ విధులు… ఈ మూడింటిని నిర్వహించేదే రాజధాని. అభివృద్ధి వికేంద్రీకరణ లేదా సమ్మిళిత అభివృద్ధి పేరుతో రాజధాని విధులను విభజించి మూడు దూర ప్రాంత నగరాలకు పంచడం వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదు. ఆ పేరుతో విశాఖపట్నంలో మరో విడత రియల్ ఎస్టేట్ బకాసురులకు వందల కోట్లు ఆర్జించుకోవడానికి వైసిపి ప్రభుత్వం అవకాశం కల్పించింది తప్ప ప్రజలకు మేలు చేసిన మేలు ఏమీ లేదు. సమ్మిళిత అభివృద్ధి అంటూ పైకి ఎన్ని చెప్పినా, రద్దయిన నిర్ణయం కొనసాగి ఉన్నట్లయితే సెక్రటేరియట్ నిర్మాణం తలపెట్టిన విశాఖపట్నమే రాజధాని అయి ఉండేది.
తాజా ప్రకటనతో పలు ఆశలతో వైజాగ్ చుట్టూ భూములు కొన్న ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు మరోసారి నష్టపోనున్నారు. దూరదృష్టి లేని ప్రభుత్వాల నిర్ణయాలు చివరికి కింది వర్గాల ప్రజలకు చేటు చేయడం ఆందోళన కలిగించే విషయం.
ఈ ప్రభుత్వానికి ఎవరు సలహాలు ఇస్తున్నారోగానీ, విధానపరమైన నిర్ణయాలలో ముందుకు ఒక అడుగు,వెనుకకు మూడు అడుగులు పడుతున్నాయి. దీనివల్ల ప్రజాధనం వృథా అవుతుంది. ఇంత తలతిక్క నిర్ణయాలతో సి.యం వ్యక్తిత్వంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.!
మంగళగిరి దగ్గర పదివేల ఎకరాల దేవదాయ భూమి ఉంది. అందులో వెయ్యి ఎకరాలు డీనోటిఫై చేసినా రాజధాని నిర్మాణం తొందరగా పూర్తయ్యేది. విశాఖపట్నంలో సింహాచలం నుంచి హనుమంతవాక వరకు కొండ మొత్తం దేవుడి మాన్యమే. ఆ కొండలో ఒక భాగాన్ని డీనోటిఫై చేసినా అక్కడ రాజధాని నిర్మాణం జరిగి ఉండేది. సీతమ్మధార కొండ మీద ఎవరూ మెరక పంటలు వెయ్యలేదు కానీ దాని మెరకల్లో నీటి ధారలు ఉన్నాయి, అంతే. ఉపయోగంలో లేని దేవుడి మాన్యాల్ని వదిలేసి సాగు భూముల మీద పడ్డారు.