ఎం‌ఎస్‌పి గ్యారంటీ కోసం ఆందోళన కొనసాగుతుంది -రైతు సంఘాలు


SKM leadership

ఇతర ముఖ్యమైన డిమాండ్ల సాధన కోసం తమ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాలు ప్రకటించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఆపాలజీ వల్ల తమ డిమాండ్లు నెరవేరవనీ, క్షమాపణ కోరడానికి బదులు ‘కనీస మద్దతు ధర’ (Minimum Support Price) ను గ్యారంటీ చేసేందుకు చట్టం తేవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. “మేము ఎక్కడికీ వెళ్ళడం లేదు” అని సంయుక్త కిసాన్ మోర్చా నాయకుల్లో ఒకరు, బి‌కే‌యూ నాయకులూ అయిన రాకేశ్ తికాయత్ స్పష్టం చేశాడు.

నరేంద్ర మోడి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటి యూ‌పి‌ఏ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర విషయంలో సిఫారసు చేసేందుకు ఒక కమిటీ నిర్ణయించింది. ఆ కమిటీలో నరేంద్ర మోడి ఒక సభ్యుడు. చర్చలు, అధ్యయనం అనంతరం ఈ కమిటీ “కనీస మద్దతు ధరను గ్యారంటీ చేసే విధంగా ఒక చట్టం చేయవలసి ఉంది” అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అప్పట్లో తాను కూడా మద్దతు ఇచ్చిన సిఫారసును చట్టంగా చేయాలని విలేఖరుల సమావేశంలో రాకేశ్ తికాయత్ డిమాండ్ చేశారు.

“వారికి మా డిమాండ్లు అర్ధం కావటానికి ఒక సంవత్సరం పట్టింది. మా డిమాండ్లు ఏమిటో మా భాషలో మేము చెప్పాము. కానీ ఢిల్లీలో మిరుమిట్లు గొలిపే బంగాళాల్లో కూర్చున్న వాళ్ళకు వేరే భాష ఉన్నది” అని సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహించిన మహా పంచాయత్ లో మాట్లాడుతూ తికాయత్ అన్నారు

“ఈ చట్టాలు నష్టకరమైనవని వారికి సంవత్సరం తర్వాత అర్ధమై వెనక్కి తీసుకున్నారు. చట్టాలు వెనక్కి తీసుకోవడం ద్వారా వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారు. కానీ కొంతమందికి చట్టాలు అర్ధం చేయించడం విఫలం అయ్యామంటూ రైతులను విభజించే ప్రయత్నం చేశారు. ఆ కొంతమందిమి మేమే” అని ఆయన విమర్శించారు. నిజానికి రహదారులను మూసివేయడం, రైళ్లు రద్దు చేయడం లాంటి చర్యలకు కేంద్రం పాల్పడకుండా ఉంటే దేశం నలుమూలల నుండి రైతులు ఢిల్లీకి చేరుకునేవాళ్ళు. బి‌జే‌పి రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కొన్ని బి‌జే‌పి యేతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం చప్పుడు లేకుండా ఈ తరహా ఆటంకాలు విధించడంలో కేంద్రానికి సహకరించడం ఒక వాస్తవం.

ఆటంకాలు ఎదురైనప్పటికీ దాదాపు అన్ని రాష్ట్రాల నుండి వివిధ విద్యార్ధి, యువజన, కార్మిక, రైతు సంఘాల కార్యకర్తలు, నాయకులు ఢిల్లీ సరిహద్దులోని రైతు శిబిరాలకు వెళ్ళి కొన్ని రోజులు గడిపి రైతుల ఆదరాభిమానాలు, ఆతిధ్యం స్వీకరించి వచ్చారు. అంతే కాదు. రాష్ట్రాలన్నింటిలోనూ రైతుల ఆందోళనకు మద్దతుగా ప్రజా సంఘాలు ట్రాక్టర్ ర్యాలీలతో పాటు వివిధ ఆందోళనలు నిర్వహించాయి. వీటిని మరుగుపరుస్తూ కొంతమంది మాత్రమే ఆందోళనలో పాల్గొన్నట్లు ప్రధాని చెప్పబోవడం వాస్తవ విరుద్ధం.

కాల్పుల విరమణ (సంఘర్ష్-విశ్రమ్) ప్రభుత్వమే ప్రకటించింది తప్ప రైతు సంఘాలు కాదని తికాయత్ స్పష్టం చేశారు. “పోరాటం కొనసాగుతుంది. రైతుల సమస్యల గురించి ప్రభుత్వం వాళ్ళతో చర్చించాలి. మేము ఎక్కడికీ వెళ్ళడం లేదు. దేశవ్యాపితంగా సమావేశాలు జరుగుతాయి. మీరు ఏమేమి చేశారో అన్నీ ప్రజలకు వివరిస్తాం” అని తికాయత్ హెచ్చరించారు.

రైతు ఉద్యమంలో చేరాల్సిందిగా రైతు సంఘాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. “హిందూ-ముస్లిం, హిందూ-సిక్కు, జిన్నా… ఇలా రకరకాల సమస్యలతో మిమ్మల్ని కట్టిపడేస్తారు. దేశాన్ని అమ్మేయటం మాత్రం కొనసాగిస్తూ ఉంటారు” అని తికాయత్ ప్రజలను హెచ్చరించారు. ఎం‌ఎస్‌పి గ్యారంటీ చట్టం, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా అరెస్టు, రైతులపై బనాయించిన అక్రమ కేసుల ఉపసంహరణ, ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కోసం మెమోరియల్ నిర్మాణం, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ… ఈ 6 డిమాండ్లను నెరవేర్చాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.

“మీరు సభ్యులుగా ఉన్న కమిటీ ఎం‌ఎస్‌పి గ్యారంటీ చట్టం తేవాలని సిఫారసు చేసింది. ఆ నివేదిక ఇంకా ప్రధాన మంత్రి కార్యాలయంలో పడి మూలుగుతోంది. మళ్ళీ మరో కమిటీ అవసరం లేదు. దేశానికి మరింత సమయం కూడా లేదు” అని తికాయత్ అన్నారు. మూడు చట్టాల రద్దు నిర్ణయం ప్రకటిస్తూ ప్రధాన మంత్రి మోడి ఎం‌ఎస్‌పి విషయం అధ్యయనం కోసం కమిటీ నియమించబోతున్నట్లు ప్రకటించారు. అలాంటి కమిటీ మరొకటి అవసరం లేదని, పాత కమిటీ నిర్ణయమే అమలు చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

“స్పష్టమైన సమాధానం ఇవ్వండి. ప్రధాన మంత్రి తన సమాధానం ఏమిటో దేశం ముందు స్పష్టంగా చెప్పాలి. ఎం‌ఎస్‌పి గ్యారంటీ చట్టం తేవాలంటూ తానే సభ్యుడుగా ఉన్న కమిటీ చేసిన సూచనను మీరు ఇప్పుడు ఆమోదిస్తారా, లేదా?” అని తికాయత్ పాశుపతాస్త్రాన్ని ప్రధాని మోడి మీదికి సంధించారు.

ప్రధాన మంత్రి చెప్పిన ఆపాలజీ ఒక మిస్టరీ. ఆయన ఎవరికి ఆపాలజీ చెప్పారు. ఆయన మాటల్ని బట్టి చూస్తే రైతులకు ఆపాలజీ చెప్పినట్లుగా లేదు. “కొంతమందికి చట్టాల మేలు గురించి వివరించి చెప్పలేకపోయాం” అంటూ అలా వివరించి అర్ధం చేయించలేకపోయినందుకు ఆ “కొంతమంది”కి కాకుండా మిగిలినవాళ్ళకు ఆపాలజీ చెప్పినట్లు కనిపిస్తోంది. అర్ధం చేయించలేక చట్టాలు రద్దు చేయవలసి వచ్చినందుకు ఆపాలజీ చెప్పారా అన్న అనుమానం కలుగుతోంది. కానీ తక్షణ పరిశీలనలో మాత్రం చట్టాలు చేసినందుకు రైతులకు ఆపాలజీ చెప్పినట్లుగా ప్రధాని మాటలు ధ్వనించాయి. ఇది మోడికి మాత్రమే ప్రత్యేకమైన నైపుణ్యం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s