క్షమించండి! వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తాను! -మోడి


A protesting farmer distributes sweets at protest site, Tikri

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల వంచాడు. కాదు, కాదు. భారత రైతులే ఆయన తల వంచారు. మోడి నేతృత్వం లోని బి‌జే‌పి-ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టపరమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ దాదాపు సంవత్సర కాలంగా ఎండనకా, వాననకా జాతీయ రహదారులపై ఆందోళన చేస్తున్న రైతాంగం ఎట్టకేలకు అపూర్వ విజయం సాధించింది.

ప్రధాన మంత్రి పదవి చేపట్టినాక కూడా పత్రికలతో ఏనాడూ మాట్లాడి ఎరుగని అహంకారయుత నరేంద్ర మోడి నేడు ఉదయం గం 9 లకు టి‌వి తెరల మీద ప్రత్యక్షమై దేశ రైతాంగానికి క్షమాపణలు చెప్పుకుంటూ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఆందోళన మాని ఇళ్లకు వెళ్లాలని రైతులను అభ్యర్చించాడు.

(1) The Farmers (Empowerment and Protection) Agreement of Price Assurance and Farm Services Act –2020; (2) The Farmers Produce Trade and Commerce (Promotion and Facilitation) Act –2020; (3) The Essentials Commodities (Amendment) Act –2020 ఈ మూడు చట్టాలను వచ్చే ప్రారంభ సమావేశాల్లోనే రద్దు చేస్తామని, అందుకు తగిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని ప్రధాని ప్రకటించారు. “ఈ రోజు గురునానక్ దేవ్ జీ కాంతి జనించిన రోజు. ఎవరినీ నిందించేందుకు ఇది సమయం కాదు” అంటూ గురునానక్ జయంతి రోజును ఎంచుకుని వ్యవసాయ చట్టాల రద్దును మోడి ప్రకటించారు.

“దేశానికి క్షమాపణలు చెబుతూ నిజాయితీతో కూడిన స్వచ్ఛమైన హృదయంతో చెబుతున్నది ఏమిటంటే మా తపస్సులో ఏదో లోపం జరిగిందేమో, ప్రమిద కాంతి అంత స్పష్టంగా కొంతమంది రైతులకు  మేము నిజాన్ని వివరించి చెప్పలేకపోయాము. కానీ ఈ రోజు ప్రకాష్ పర్వ్, ఎవరినీ నిందించే సమయం కాదు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మేము నిర్ణయించామని ఈ రోజు దేశానికి చెప్పాలనుకుంటున్నాను” అని మోడి చెప్పారు. “ఈ మాసాంతంలో ప్రారంభం అయ్యే పార్లమెంటు సమావేశాల్లో మూడు చట్టాలను రద్దు చేసే ప్రక్రియను పూర్తి చేస్తాము” అని ఆయన చెప్పారు.

“ఆందోళన చేసే మా రైతు మిత్రులందరికీ నా విజ్ఞప్తి. పవిత్ర గురు పరబ్ దినమైన ఈ రోజు మీ ఇళ్లకు, మీ పొలాలకు, మీ కుటుంబాల వద్దకు వెళ్ళండి. సరికొత్త ఆరంభాన్ని మొదలు పెట్టండి. మనందరం మళ్ళీ తాజాగా ముందుకు వెళ్దాం” అని ప్రధాని మోడి రైతులను కోరారు.

కింద పడ్డా పై చేయి నాదే అని చెప్పడం మాత్రం ఆయన మానలేదు. నేనేమీ చేసినా రైతుల కోసమే చేశాను. నేను చేస్తున్నదంతా దేశం కోసమే. రైతులందరికీ మేము నచ్చజెప్పలేకపోయినందుకు చింతిస్తున్నాము. రైతుల్లో ఒక సెక్షన్ మాత్రమే చట్టాలను వ్యతిరేకిస్తోంది. కానీ మేము వారికి తెలియజేప్పేందుకు, తగిన సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాము” అని మోడి నమ్మబలికారు.

ప్రధాన మంత్రి వివరణ పరస్పర వైరుధ్యాలతో కూడి ఉండడం ప్రజల దృష్టిని దాటిపోలేదు. రైతుల కోసమే మూడు చట్టాలు చేసినప్పుడు ఆయన ఎందుకు దేశాన్ని క్షమాపణ కోరినట్లు? సంవత్సర కాలంగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఆందోళన చేస్తున్న రైతులు ఎదుర్కొన్న కఠిన పరిస్ధితుల పట్ల ఎన్నడూ జాలి చూపని ప్రధాని ఈ రోజు క్షమాపణ ఎందుకు కోరినట్లు? దాదాపు 700 మంది వరకూ తమ ఇల్లు, తమ ఊరు కాని చోట ప్రాణాలు కోల్పోతుంటే దేశ ప్రధానిగా ఒక్క ఊరడింపు మాట కూడా నోట జారనివ్వని ప్రధాన మంత్రి ఈ రోజు హఠాత్తుగా ఇంటికి వెళ్ళమని రైతులను ఎందుకు అభ్యర్ధించినట్లు?

అసలు గురునానక్ జయంతి వరకూ ఆయన ఎందుకు ఆగినట్లు? ఆందోళనకు అంకురార్పణ చేసిన పంజాబ్ రైతులను ఆకట్టుకోవడానికి ఒక సింబాలిక్ గా గురు నానక్ జన్మదినాన్ని ఆయన ఎంచుకున్నది నిజం కాదా? ఈ సింబాలిక్ ప్రకటన రేపు జరగబోయే పంజాబ్ ఎన్నికలకు ఎంతో కొంత బి‌జే‌పి పార్టీకి లాభించేందు కోసమే ఆయన ఈ రోజు ఎంచుకున్న విషయం నిజం కాదా? రైతుల కోసమే అంతా చేసే పనైతే వందల మంది చనిపోతున్నా పట్టించుకోకుండా ఎన్నికలకు ఉపయోగపడే రోజు కోసం ఎదురు చూస్తారా?

త్వరలో జరగనున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు లక్ష్యంగా చేసుకుని మాత్రమే మోడి-బి‌జే‌పి-ఆర్‌ఎస్‌ఎస్ వ్యవసాయ చట్టాల రద్దుకు నిర్ణయం తీసుకున్నారే తప్ప రైతులపై ప్రేమ కానే కాదని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలే వాస్తవం. ఢిల్లీ సరిహద్దుల్లో తిక్రి, ఘాజీపూర్, సింఘు ల వద్ద ఆందోళనల్లో పాల్గొంటున్న 40,000 మందికి పైగా రైతులు ప్రధానంగా పంజాబ్, హర్యానా, రాజస్ధాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చిన వారే. పంజాబ్, ఉత్తర ప్రదేశ్ లలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి.

పంజాబ్ లో ఎలాగూ బి‌జే‌పి కి పెద్దగా ఓట్లు లేవు. అత్యంత ముఖ్య రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో అధికారం కోల్పోయే పరిస్ధితి వస్తే చివరికి కేంద్రంలో అధికారానికే ఎసరు వస్తుంది. అందుకే ఎంత అవమానకరంగా ఉన్నప్పటికీ విదేశీ స్వదేశీ కార్పొరేట్ కంపెనీలు ఎంతగా ఒత్తిడి చేసినప్పటికీ వ్యవసాయ చట్టాల రద్దుకు మోడి మొగ్గు చూపారు తప్ప ఆయన చెబుతున్నట్లు రైతుల కోసం కాదు. రైతుల కోసమే అయితే పార్లమెంటు ప్రక్రియలను అపహాస్యం చేస్తూ, చర్చలు లేకుండా చేస్తూ ఈ చట్టాలను తెచ్చేవారే కాదు.

రాష్ట్రాల నుండి రైతులు వస్తుంటేనే రోడ్లపై అనేక ఆటంకాలు కల్పించారు. ఢిల్లీలో ప్రవేశించకుండా వేలాది మంది పోలీసుల్ని దించారు. లాఠీ చార్జ్, జల క్షిపణులు ప్రయోగించారు. రోడ్డుపై ఇనప మేకులు నాటారు. సిమెంటు దిమ్మలు పేర్చారు. గోడలు కట్టారు. చర్చల పేరుతో విపరీతమైన కాలయాపన చేశారు. ఉపయోగకరమైన చర్చలు ప్రభుత్వం చేయనే లేదని రైతు సంఘాల పెద్దలు అనేకమార్లు చెప్పారు. సుప్రీం కోర్టులో కేసులు పెట్టించి కోర్టు ఆదేశాలతో ఆందోళనలను విరమింపజేసె ప్రయత్నాలు చేశారు. నిపుణుల కమిటీ పేరుతో చట్టాలకు అనుకూలమైన కార్పొరేట్ అనుకూల మేధావులను ప్రవేశపెట్టారు. ఇన్ని చేసి కూడా రైతుల కోసమే చేశామని చెప్పబోవడం విడ్డూరం తప్ప మరొకటి కాదు.

చట్టాల రద్దు ప్రకటన వెలువడ్డాక ఒకే ఒక్క వ్యక్తి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. “ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తీసుకున్న అత్యంత ప్రగతి నిరోధక చర్య ఇది. ఆయన రైతుల ప్రయోజనం కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చారు” అని సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ సభ్యుడు అనీల్ ఘన్వత్ వ్యాఖ్యానించాడు. ఈ సో-కాల్డ్ నిపుణులు రైతుల కంటే కార్పొరేట్ ప్రయోజనాలకే అమ్ముడు బోయారని దీని ద్వారా స్పష్టం అవుతోంది.

ప్రధాని ప్రకటన వెలువడ్డాక దేశంలోని వివిధ నేతలు, ప్రముఖులు ఈ విధంగా స్పందించారు.

బి‌కే‌యూ (ఉగ్రాహన్) నేత జోగిందర్ సింగ్: మూడు చట్టాలను రద్దు చేయడం మంచి నిర్ణయం. రైతు సంఘాలన్నీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం.

పంజాబ్ మాజీ సి‌ఎం అమరిందర్ సింగ్: గొప్ప వార్త! ప్రతి పంజాబీ కోరికను మన్నించి 3 నల్ల చట్టాలు రద్దు చేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు. రైతుల అభివృద్ధికి ప్రధాని కృషి కొనసాగుతుందని నాకు నమ్మకం ఉంది.

ఆర్‌ఎల్‌డి నేత జయంత్ చౌదరి: ఇది రైతుల విజయం. మనమంతా ఒకటే. ఇది జాతి విజయం.

పి.చిదంబరం: ప్రజాస్వామిక నిరసనల ద్వారా సాధించలేనిది రానున్న ఎన్నికల భయం ద్వారా సాదించవచ్చు! ఏదేమైనా ఇది రైతులకు, వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీకీ గొప్ప విజయం.

సమాజ్ వాదీ పార్టీ యూ‌పి అధ్యక్షుడు నరేశ్ ఉత్తమ్: అఖిలేశ్ యాదవ్ నిర్వహించిన రధ యాత్రలో రైతులు, విద్యార్ధులు పెద్ద ఎత్తున గుంపులుగా జమ కావడంతో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిన నిర్ణయానికి బి‌జే‌పి రాక తప్పలేదు.

పంజాబ్ కాంగ్రెస్ అద్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ: నల్ల చట్టాల రద్దు సరైన దిశలో తీసుకున్న చర్య. రైతు సంఘాల సత్యాగ్రహానికి చారిత్రక విజయం సిద్ధించింది. మీ త్యాగం ఫలితాన్నిచ్చింది. నిర్దిష్ట రోడ్ మ్యాప్ ద్వారా పంజాబ్ లో వ్యవసాయాన్ని పునరుద్ధరించడం ఇక ప్రాధామ్యం కావాలి.

హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా: చట్టాల రద్దు ప్రధాన మంత్రి మోడి గురు పురబ్ దినాన నిరసన రైతులకు ఇచ్చిన బహుమానం.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ: భారత దేశ అన్న దాతలు తమ సత్యాగ్రహం ద్వారా అహంకారం తల వంచు కునేలా చేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా విజయం సాధించినందుకు అభినందనలు. జై హింద్! జై హింద్ కా కిసాన్!

కిసాన్ ఏక్తా మోర్చా: రైతు కూలీల ఐక్యత జిందాబాద్!

బి‌కే‌యూ జాతీయ ప్రతినిధి రాకేశ్ తికాయత్: ఆందోళనను వెంటనే విరమించేది లేదు. పార్లమెంటులో చట్టాలు రద్దు నిజంగా రద్దు అయ్యేవరకూ ఎదురు చూస్తాము. కనీస మద్దతు ధర గ్యారంటీ చేయాలన్న డిమాండ్ ను, ఇతర రైతు సమస్యలను చర్చించడానికి ప్రభుత్వం చర్చలు జరపాలి.

చామరాస్ మాలి పాటిల్ (కర్ణాటక రాజ్య రైతా సంఘ అధ్యక్షుడు): పంజాబ్, యూ‌పి లలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. అయితే పార్లమెంటులో చట్టాలను ఉపసంహరించుకునేంతవరకు రైతుల పోరాటం కొనసాగుతుంది.

బద్గల్ పురా నాగేంద్ర (కే‌ఆర్‌ఆర్‌ఎస్): ప్రజల గొంతు ప్రభుత్వం విని తీరాలనడానికి ఇది రుజువు. ఇది చారిత్రకం. బేదాభిప్రాయాలున్నా గానీ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశం ఒక్కటయింది. మండే ఎండాలను, ఎముకలు కోరికే చలిని, వర్షాలను ఇతర ప్రాకృతిక శక్తులకు తలవంచక రైతులు ఎదురొడ్డి పోరాడారు. ఏడాది పాటు జరిగిన ఆందోళనకు ప్రభుత్వం తల వంచింది.

స్వాభిమాని షేత్కారి సంఘటన చీఫ్ రాజు షెట్టి: ఇది చారిత్రకం. పంజాబ్, హర్యానా తదిర ప్రాంతాల రైతులు ఈ బృహత్ ఆందోళన ప్రారంభించి యేడాది అయింది. ఆందోళనలు శాంతియుతంగా జరిగాయి. ఈ కాలంలో బి‌జే‌పి నేతృత్వం లోని కేంద్రం ఉద్యమాన్ని అపఖ్యాతి పాలు చేసి విచ్ఛిన్నం చేసేందుకు వారి పుస్తకంలోని ట్రిక్కులు అన్నీ ప్రయోగించింది. ఇవి విఫలం అయ్యాక హింసను రెచ్చగోట్టేందుకు ప్రయత్నించింది. అయితే రైతులు గట్టిగా నిలబడ్డారు. ఇక వెనక్కి తగ్గక కేంద్రానికి తప్పలేదు.

సంయుక్త కిసాన్ మోర్చా: ఇది చారిత్రక విజయం. గిట్టుబాటు ధరలు, విద్యుత్ చార్జీల తగ్గింపు లాంటి ఇతర డిమాండ్లు నెరవేరాల్సి ఉన్నది. ఆందోళన విరమించేందుకు ఇంకా నిర్ణయించలేదు.

ఆనద్ శర్మ (కాంగ్రెస్): నిజం, న్యాయం నిలిచి గెలిచాయి. ఎన్నో బాధలకు ఓర్చి వందల మందిని కోల్పోయి రైతులు విజయం సాధించారు. ముఖ్యమైన చట్టాలు హడావుడిగా ఆమోదించడం మానుకోవాలి. పార్లమెంటరీ పరీక్షకు చట్టాలు నిలబడాలి. చట్టాల ఆమోదం ముందు సంబంధిత వర్గాలతో సంప్రదించాలి.

అరవింద్ కేజ్రీవాల్: ప్రకాష్ దివస్ రోజుల సంతోషకరమైన వార్త. మూడు చట్టాలు రద్దయ్యాయి. 700కు పైగా అమరులయ్యారు. వారి త్యాగం శాశ్వతంగా నిలిచిపోతుంది. తమ ప్రాణాలు త్యాగం చేసి దేశాన్ని రైతాంగాన్ని రైతులు ఎలా కాపాడారో భవిష్యత్ తరాలు చెప్పుకుంటాయి. నా దేశ రైతులకు అభినందనలు.

మమతా బెనర్జీ: అలుపు ఎరగక పోరాడిన ప్రతి ఒక్క రైతుకూ నా హృదయ పూర్వక అభినందనలు. బి‌జే‌పి క్రూరత్వానికి బెదరకుండా మీరు నిలబడ్డారు. ఇది మీ విజయం. ఈ పోరాటంలో తమ వారిని పోగొట్టుకున్న ప్రతి ఒక్కరికీ నా సానుభూతి.

అశోక్ గెహ్లాట్ (రాజస్ధాన్ సి‌ఎం): ఇది ప్రజాస్వామ్య విజయం. కేంద్ర ప్రభుత్వ అహంకారానికి ఓటమి. రైతుల ఓరిమి సాధించిన విజయం. మోడి హ్రస్వ దృష్టి, అహంకారం వల్ల ప్రాణాలు కోల్పోయిన వందలాది రైతులను దేశం ఎన్నటికీ మరువదు.

ఎస్‌ఏ‌డి నేత బాదల్: చట్టాల రద్దు చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. ప్రపంచ రైతుల పోరాట చరిత్రలోనే ఇది ఎన్నదగినది. ప్రజాస్వామ్య ప్రభుత్వాల చరిత్రలో సంబంధిత వర్గాలను విశ్వాశంలోకి తీసుకోకుండా అత్యంత క్రూరమైన చట్టాలు చేయడం ఇదే మొదటిసారి. ఏ ప్రభుత్వమూ ఇక ముందు ఇలాంటి కఠినమైన, క్రూతమైన చర్యకు పూనుకోరాదు.

టి‌ఆర్‌ఎస్: ప్రజల శక్తి ఎప్పటికీ అధికారం ఉన్నవారి శక్తి కంటే గొప్పది. ఇది మరోసారి రుజువయింది. జై కిసాన్! జై జవాన్!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s