
Top 10 wealthiest countries
ప్రధాన ఆర్ధిక శక్తిగా అత్యంత వేగంగా ఎదుగుతున్న చైనా ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనిక దేశంగా అవతరించింది. వార్షిక జిడిపి రీత్యా అమెరికా ఇప్పటికీ మొదటి స్ధానంలో ఉన్నప్పటికీ సంపదల సృష్టిలో మాత్రం చైనా అమెరికాను మించిపోయింది.
రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే చైనాలో సంపదలు విపరీతంగా పెరిగాయి. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచంలో సంపదలు మూడు రెట్లు పెరిగాయని ప్రఖ్యాత కన్సల్టింగ్ కంపెనీ మెకిన్సే అండ్ కో తెలిపింది. అత్యంత సంపన్న దేశాలలో టాప్ 10 దేశాల జాతీయ బ్యాలన్స్ షీట్లను పరిశీలించిన కంపెనీ తన సర్వే వివరాలను ప్రకటించింది.
ప్రపంచ నికర సంపదలో 60 శాతం ఈ 10 దేశాలలోనే కేంద్రీకృతం అయి ఉన్నదని మెకిన్సే అండ్ కంపెనీ తెలిపింది. కంపెనీ ప్రచురించిన గణాంకాల ప్రకారం 2000 సం.లో ప్రపంచ సంపద 156 ట్రిలియన్ డాలర్లు (1 ట్రిలియన్ = లక్ష కోట్లు) ఉండగా 2020 నాటికి అది 514 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ పెరుగుదలలో మూడో వంతు చైనాలోనే జరిగింది.
2000 సంవత్సరంలో చైనాలో నికర సంపద కేవలం 7 ట్రిలియన్ డాలర్లు. అది 2020 నాటికి 120 ట్రిలియన్ డాలర్లకు చేరింది. 2001లో చైనా డబల్యూటిఓ లో సభ్య దేశంగా చేరిన అనంతరం అమెరికా, ఐరోపాల నుండి బహుళజాతి కంపెనీలు చైనాకు వరుస కట్టాయి.
చైనా అత్యంత చౌకగా మానవ శ్రమను అందించడం, స్పెషల్ ఎకనమిక్ జోన్ లను ఏర్పాటు చేసి కంపెనీలకు సకల సౌకర్యాలు కల్పించడంతో చైనా సరికొత్త మాన్యుఫాక్చరింగ్ కేంద్రంగా అవతరించింది. కార్మికుల ఆందోళనలను నిర్దయగా అణచివేయడంతో సంఘ నిర్మాణం, కార్మిక చట్టాలు, శ్రమకు తగిన వేతనం లాంటి బాధ్యతల నుండి కంపెనీలు తప్పించుకోగలిగాయి.
అమెరికా సంపద 2000 సం. కంటే 2020లో రెట్టింపుకు కాస్త ఎక్కువగా పెరిగి 90 ట్రిలియన్ డాలర్లకు చేరిందని కంపెనీ అధ్యయనం తెలిపింది.
అమెరికా, చైనా రెండింటి లోనూ మూడింట రెండు వంతుల సంపద అత్యంత పైన ఉన్న 10 శాతం ధనికుల వద్దనే కేంద్రీకృతం అయి ఉన్నది. ఇలా పైన ఉన్న 10 శాతం ధనికుల వాటా అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది.
అయితే ఈ సంపద ఏయే రంగాల్లో ఉన్నది? మెకిన్సే కంపెనీ అధ్యయనం ప్రకారం ప్రపంచ నికర సంపదలో 68 శాతం రియల్ ఎస్టేట్ రంగంలోనే కేంద్రీకృతం అయి ఉన్నది. మిగతా సంపద మౌలిక నిర్మాణాలు, యంత్రాలు మరియు ఇతర పరికరాలు మొ.న రంగాల్లో ఉన్నది. కొంత సంపద మేధో సంపత్తి హక్కులు (ఐపిఆర్) మరియు పేటెంట్ హక్కుల లోనూ ఉన్నదని అధ్యయనం తెలిపింది.
అయితే ఈ సంపదలో ద్రవ్య సంపద (ఫైనాన్షియల్ అస్సెట్) కలిసి లేదు. ఎందుకంటే ఒక చోట ఉన్న ద్రవ్య సంపద మరొక చోట లయబిలిటీగా (చెల్లించవలసిన ఆస్తి)గా ఉంటుంది. ఈ రెండూ ఒకదానినొకటి రద్దు చేసుకుంటాయి గనుక అవి నికర సంపదలో కలవ్వు.
ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు ముఖ్యంగా అమెరికా ఫెడరల్ బ్యాంకు, యూరోపియన్ యూనియన్ కి చెందిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను అత్యంత కనిష్ట స్ధాయిలో ఉంచడం వలన రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువ ఎన్నడూ లేనంత స్ధాయికి పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ ఆస్తుల విలువ దీర్ఘకాలిక సగటు కంటే 50% అధికంగా ఉన్నట్లు మెకిన్సే అధ్యయనంలో తేలింది.
నికర ఆస్తుల విలువ పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని మించి పోవడం ఆర్ధిక వ్యవస్ధలకు అత్యంత ప్రమాదకరం. ఇది అనివార్యంగా అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఈ పరిస్ధితి వలన ఇళ్ల యజమానులకు ఇళ్ల ధరలు భరించలేని స్ధాయికి చేరుకుని చివరికది ద్రవ్య సంక్షోభానికి దారి తీస్తుంది. 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం అమెరికాలో ఇళ్ల రుణాలను తిరిగి చెల్లించలేకపోవడం వలన బద్దలవడం ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు.
ఇటీవల చైనాలోని రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవర్ గ్రాండ్ గ్రూపు ఈ తరహా సంక్షోభంలో కూరుకుపోయింది. అయితే చైనా ప్రభుత్వం అప్రమత్తతతో ఈ సంక్షోభం ప్రస్తుతానికి సమసిపోయింది.
ఈ సమస్య నుండి తప్పించుకోవాలంటే సంపదను రియల్ ఎస్టేట్ నుండి మరింత ఉత్పాదక రంగాలకు తరలించడం ఒక్కటే మార్గమని మెకిన్సే సంస్ధ చెబుతోంది.
అయితే ఈ పరిష్కారం కేవలం పాక్షికమైనది మాత్రమే. అసలు సమస్య సంపదలు రియల్ ఎస్టేట్ లో కేంద్రీకృతం కావడం కాదు. సంపదలు అసమానంగా పంపిణీ చేయబడడమే అసలు సమస్య. అనగా మూడింట రెండు వంతుల సంపద కేవలం 10 శాతం మంది స్వాధీనంలో ఉంటే 90 శాతం మంది చేతుల్లో కేవలం 1/3 వంతు మాత్రమే సంపద ఉండడం.
ఉత్పాదక రంగాలకు సంపదను తరలించినప్పటికీ సంపదల పంపిణీలో అసమానతలను తొలగించకపోతే అక్కడా ఇదే పరిస్ధితి ఏర్పడుతుంది. ఏ రంగంలోని ఆస్తి అయినా ప్రజలందరి సమాన వినియోగానికి చేరువలో ఉండాలి. అప్పుడే సంపదల వినియోగం సంక్షోభ పరిస్ధితులకు దూరంగా ఉంటుంది. సంపద కొద్ది మంది చేతుల్లో ఉన్నప్పుడు వాటి వినియోగం పరిమిత స్ధాయిలోనే ఉంటుంది. కొద్ది మంది చేతుల్లోని సంపదల మిగులు వినియోగానికి నోచుకోక సంక్షోభానికి దారి తీస్తుంది.