సనాతన కుల-మత వ్యవస్ధ పునరుద్ధరణే కంగనా ప్రబోధిస్తున్న విముక్తి!


Caste system hierarchy

నటి కంగనా రనౌత్ తన వ్యాఖ్యలపై కొంత స్పష్టత ఇచ్చారు. తాను అన్నీ తెలిసే 1947 నాటి స్వతంత్రంపై వ్యాఖ్యానించానని తన వివరణ ద్వారా స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు తప్పయితే తన ‘పద్మ శ్రీ’ అవార్డు వెనక్కి ఇచ్చేందుకు సిద్ధం అని ప్రకటించారు. దానికి ముందు తన అనుమానాలు తీర్చాలని ఆమె కొన్ని ప్రశ్నలు సంధించారు. తన అనుమానాలకు సంతృప్తికరంగా సమాధానం ఇస్తే అవార్డు ఇచ్చేస్తానని చెప్పారు.

అయితే కంగనా రనౌత్ ఇచ్చిన వివరణ మరిన్ని ప్రశ్నలను లేవనేత్తింది. ఏవైతే తన అనుమానాలుగా ఆమె చెప్పారో అవి పాక్షిక దృష్టితో వ్యక్తం చేసినట్లే ఉన్నాయి తప్ప నిజాయితీగా వచ్చిన అనుమానాలుగా కనిపించడం లేదు. ఆమె దృష్టిలో తనవి అనుమానాలు. కానీ ఆ అనుమానాలు చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా చూడలేని ఆమె బలహీనతనే వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో కొన్ని కీలక అంశాలను సైతం ఆమె లేవనెత్తారు.

స్వాతంత్ర సమరయోధులుగా చరిత్రకారులు పేర్కొంటున్న బాల గంగాధర్ తిలక్, అరబిందో ఘోష్, బిపిన్ చంద్ర పాల్ లను ఉటంకిస్తూ ఆమె తనకు 1857 లో “స్వాతంత్రం కోసం జరిగిన ఉమ్మడి పోరాటం” గురించి తెలుసు గానీ అలాంటి పోరాటం ఏదీ 1947లో జరిగినట్లు తనకు తెలియదని ఆమె వ్యాఖ్యానించారు.

“స్పష్టత కోసం చెబుతున్నాను… స్వతంత్రం కోసం మొట్ట మొదటి ఉమ్మడి పోరాటం 1857లో చోటు చేసుకుంది. దానితో పాటు సుభాష్ చంద్ర బోస్, రాణి లక్ష్మీబాయ్, వీర్ సావర్కార్ జీ మొదలైనవారు చేసిన త్యాగాలు నాకు తెలుసు…..”

“… 1857 విషయం నాకు తెలుసు. కానీ 1947లో ఏ యుద్ధం జరిగిందో నాకు తెలియదు. ఈ విషయం నాకు ఎవరన్నా అర్ధం చేయించగలిగితే నేను నా పద్మ శ్రీ అవార్డు వెనక్కి ఇచ్చేస్తాను. క్షమాపణలు కూడా చెబుతాను. దయ చేసి ఈ విషయంలో నాకు సహాయం చేయండి…” అని కంగనా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో రాశారు.

1947 నాటి స్వతంత్రం కేవలం భిక్ష మాత్రమే అనీ నిజమైన స్వతంత్రం 2014లో వచ్చిందని ఆమె టైమ్స్ నౌ చానల్ నిర్వహించిన ఒక ఈవెంట్ లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను మొదట ఖండించింది బి‌జే‌పి నేత వరుణ్ గాంధీ కాగా అనంతరం పలువురు కాంగ్రెస్ నేతలు, ఇతర పార్టీల నేతలు కూడా ఆమెను తప్పు పట్టారు. ఆమెకు ఇచ్చిన అవార్డ్ ను వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతి ని కోరారు.

“జాతీయవాదం పురివిప్పింది, అలాగే మితవాదం కూడా… కానీ అంతలోనే అకస్మాత్తుగా ఎందుకు సమసి పోయింది. గాంధీ భగత్ సింగ్ ను ఎందుకు చనిపోనిచ్చారు? (ఎందుకు ఉరి తీయనిచ్చారు?)… నేతాజీ బోస్ ఎందుకు చనిపోయారు? ఆయన ఎన్నడూ గాంధీ మద్దతు ఎందుకు పొందలేకపోయారు. ఒక తెల్లవాడు విభజన రేఖను ఎందుకు గీశాడు…? స్వతంత్రం ఆనందించడానికి బదులు భారతీయులు ఒకరినొకరు ఎందుకు చంపుకున్నారు? వీటికి సమాధానాలు కావాలి. దయ చేసి సమాధానాలు వెతికేందుకు నాకు సాయం చేయండి.” అని కంగనా కోరారు.

“ఇండియన్ నేషనల్ ఆర్మీ కనీసం కాస్త యుద్ధం చేసినా భారత దేశానికి స్వతంత్రం ముందే వచ్చి ఉండేది. బోస్ మనకు ప్రధాన మంత్రి అయి ఉండేవారు.” అని ఆమె జోస్యం చెప్పారు.

చరిత్రలో జరిగిన ఘటనలకు ప్రత్యామ్నాయ పరిణామాలను ఊహించి చెప్పడం చాలా తేలిక. ‘అలా చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కదా” అంటూ ఊహాగానాలు చేసి ఇతరులను తప్పు పట్టడం, ముఖ్యంగా ఇప్పుడు బ్రతికి లేనివారిని తప్పు పట్టడం ఎంతో తేలిక. కానీ తెలివి ఉన్నవారు ఎవరూ ఆ పని చేయరు.

ముఖ్యంగా దశాబ్దాల క్రితం జరిగిన ఘటనలను, ఆ ఘటనల్లో పాల్గొన్నవారు ఎవరూ బ్రతికి లేని నేటి రోజుల్లో అటువంటి ఊహాగానాలకు పాల్పడడం బుద్ధి హీనత తప్ప మరొకటి కాదు. అటువంటి సమీక్ష చేయగల వారు కేవలం అప్పటి ఘటనల్లో పాల్గొన్నవారు మాత్రమే. వాళ్ళు కూడా పాక్షికంగా మాత్రమే సమీక్ష చేయగలరు.

అప్పటి ప్రజల పోరాట ఫలితాలను అనుభవిస్తూ కడుపులో చల్ల కదలకుండా బతుకుతున్నవారు అటువంటి సమీక్ష చేయలేరు. అటువంటి పనికి పూనుకోవడం వృధా ప్రయాస. దానివల్ల అనవసర వివాదాలు రేపి వార్తల్లో నిలవడం తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగమూ ఉండదు. రాణీ లక్ష్మి బాయి చరిత్రను తెలిపే సినిమాలో రాణి పాత్ర పోషించినంత మాత్రాన కూడా అటువంటి సమీక్ష చేయగల అర్హత వస్తుందనుకోవడం అమాయకత్వం కాగలదు. లేదా తెలివి హీన తెంపరితనం అయినా అయి ఉండాలి.

కంగనా వ్యక్తం చేసిన అనుమానాల్లో మరీ ఘోరమైన అంశం చూడండి: “మితవాద పక్షం (right wing) పోరాటం చేసి సంపాదించడానికి సిద్ధంగా ఉండగా, కాంగ్రెస్ పట్టిన భిక్షా పాత్రలో స్వతంత్రాన్ని ఎందుకు ఉంచారు?” అని కంగనా ప్రశ్నించారు.

ఇంతకీ కంగనా రనౌత్ చెబుతున్న మితవాద పక్షం ఎవరు? పొరాటాలు చేసి స్వతంత్రాన్ని లాక్కోవడానికి సిద్ధంగా ఉన్న ఆ మితవాద పక్షం ఎవరు? ఇండియాలో 1947 నాటికి ఉనికిని చాటుకున్న మితవాద పక్షం కేవలం ఆర్‌ఎస్‌ఎస్ దాని అనుబంధ సంస్ధలు మరియు ఆ సంస్ధకు పునాదులు వేసిన హిందూ మహా సభ లాంటి సంస్ధలు మాత్రమే. భారత సమాజంలో వేల యేళ్ళ పాటు కులం పేరుతో అనేక విభజనలు సృష్టించి శ్రామిక ప్రజలను అణచి ఉంచిన హిందూ మతాన్ని ఆలంబనగా చేసుకున్న వీర సావర్కార్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లాంటి నేతలు ఈ మితవాద పక్ధానికి ప్రధాన నాయకులు.

వీర సావర్కార్ జైలు నుండి విడుదల కోసం ఏ విధంగా బ్రిటిష్ వారిని శరణు వేడారో, ఏ విధంగా లొంగుబాటు పాట పట్టారో పలు పత్రికలు ఇప్పటికే చాలాసార్లు చెప్పాయి. ఆర్‌ఎస్‌ఎస్ సంస్ధ స్వతంత్ర ఉద్యమానికి ఏ విధంగా దూరంగా ఉన్నదో గత ఆర్టికల్ లో ఆర్‌ఎస్‌ఎస్ నేత హెడ్గేవార్ మాటల్లో కాస్త చూశాం. ఇక శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లాంటి నేతలు క్విట్ ఇండియా ఉద్యమాన్ని గట్టిగా వ్యతిరేకించారు. ఆ ఉద్యమాన్ని ఎలా అరికట్టాలో బ్రిటిష్ వాళ్ళతో ఆలోచనలు పంచుకున్నారు. బెంగాల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ క్విట్ ఇండియా ఉద్యమం అణచివేత కోసం’ బ్రిటిష్ వాళ్ళతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపారని ఆర్‌ఎస్ మజుందార్ లాంటి చరిత్రకారులు వివరించారు. ఓ పక్క కాంగ్రెస్ నేతృత్వం లోని రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్ర పోరాటంలో భాగంగా రాజీనామా చేయగా ముఖర్జీ నేతృత్వం లోని హిందూ మహా సభ, ఎన్నికల్లో పోటీ చేసి ముస్లిం లీగ్ తో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన చరిత్ర ఉన్నది.

ఇలాంటి మితవాద పక్షం పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ నుండి స్వతంత్రం లాక్కోవడానికి సిద్ధంగా ఉన్నదని, అందుకు ఏర్పాట్లు చేసిందని కంగనా రనౌత్ దేని ఆధారంగా చెబుతున్నారు? అసలు ఆమె చెప్పే మితవాద పక్షం ఎవరు?

నిజం! స్వతంత్ర పోరాటం లాంటి మహా సంగ్రామం ఏళ్ల తరబడి, దశాబ్దాలు, శతాబ్దాల తరబడి జరుగుతున్నప్పుడు సమాజంలో ఎన్నిరకాల ప్రయోజనాలు, భావజాలాలు ఉన్నాయో అన్ని రకాల భావజాలాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా సంస్ధలు ఏర్పాటు చేస్తాయి, తమ తమ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం తమ తమ ఎత్తుగడలు వేస్తాయి. అలాగే హిందూ మతానికి పట్టుగొమ్మ అయిన కుల వ్యవస్ధ, దాని ద్వారా సంక్రమించిన సామాజిక, రాజకీయ, ఆర్ధిక ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి హిందూ మత సంస్ధలు కూడా మితవాద పక్షం రూపంలో స్వతంత్ర ఉద్యమంలో ప్రవేశించాయి.

ఈ మితవాద శక్తుల ప్రధాన ప్రయోజనం కుల వ్యవస్ధపై ఆధారపడిన శ్రామిక దోపిడీ సామాజిక వ్యవస్ధను పదిలపరుచుకోవడం తప్ప మరొకటి కాదు. పురోహిత వ్యవస్ధ, రాచరిక వ్యవస్ధలను అడ్డు పెట్టుకుని భారత దేశంలోని భూమి వనరులను, ఇతర పారిశ్రామిక వనరులను గుప్పెట్లో పెట్టుకుని ఆర్ధిక-సామాజిక-రాజకీయ దోపిడీ కొనసాగిస్తున్న కుల-వర్గ ఆధిపత్యవర్గాలు అటు కాంగ్రెస్ లో జొరబడడమే కాకుండా స్వంతగా కూడా వివిధ సంస్ధల నేతృత్వంలో తమ ఉనికిని కొనసాగించాయి. కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ నేతృత్వంలోని లిబరల్ రాజకీయ పంధా పై చేయి సాధిస్తున్న నేపధ్యంలోనూ, దేశంలో నానాటికీ విస్తరిస్తున్న వామపక్ష తిరుగుబాట్లను పక్కదారి పట్టించేందుకు నెహ్రూయే స్వయంగా సోషలిస్టు తొడుక్కున్న నేపధ్యం లోనూ హిందూ తీవ్రవాద మితవాద శక్తులు క్రమంగా కాంగ్రెస్ నుండి వేరు పడి ఆర్‌ఎస్‌ఎస్ లాంటి సంస్ధలను ఏర్పరుచుకున్నాయి.

కానీ ఈ సంస్ధలు స్వంత్రానికి కనీసం కాంగ్రెస్ పార్టీ స్ధాయిలో కూడా ప్రయత్నాలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ వలె అధికార మార్పిడి కోసం కూడా ప్రయత్నించిన దాఖలాలు లేవు. పైగా బ్రిటిష్ వారికి సేవ చేయడం లోనూ స్వతంత్ర ఉద్యమంలో భాగంగా జరిగిన అనేక పిలుపులను వ్యతిరేకించడంలోనూ నిమగ్నం అయ్యాయి. తద్వారా బ్రిటిష్ ప్రభుత్వ నిర్బంధం నుండి క్షేమంగా తప్పించుకున్నాయి. వారి ప్రయోజనమల్లా హిందూ మతం ఆధిపత్యంలో ఉన్న కుల దోపిడీ సమాజాన్ని కాపాడుకుని అగ్రకులాల ఆధిపత్యాన్ని కొనసాగేలా చేసుకోవడం. ఆ ప్రయోజనాన్ని బ్రిటిష్ వారితో స్నేహం చేయడం ద్వారా నెరవేర్చుకునేందుకు ప్రయత్నించారే తప్ప కాంగ్రెస్ తరహా పోరాటానికి కూడా సిద్ధపడలేదు. ఇక వాళ్ళు పోరాటం/యుద్ధం చేసి బలవంతంగా బ్రిటిష్ నుండి స్వతంత్రం లాక్కోవడానికి సిద్ధపడ్డారని చెప్పడం పూర్తిగా కట్టు కధ. అసత్య ప్రచారం. తన వాదనకి ఆధారాలు ఏమిటో కంగనా రనౌత్ చెప్పి ఉంటే బాగుండేది.

కంగనా రనౌత్ పేర్కొన్న షాహిద్ భగత్ సింగ్ అసలు కంగనా రనౌత్ చెబుతున్న మితవాద పక్ష భావజాలానికి ఆమడ దూరంలో ఉన్న వీర పోరాట యోధుడు. ఆయన తన యౌవనంలో కేవలం కొద్ది కాలం పాటు మాత్రమే హిందూ మత నినాదాలకు గొంతు ఇచ్చాడు. భగత్ సింగ్ పోరాట చరిత్ర ప్రధానంగా సోషలిస్టు భావజాలంతో నిర్మితమైనది. రాజీ లేని ఆయన పోరాట భావజాలానికి మార్జ్సిజమే పునాది. అత్యంత పిన్న వయసులోనే మార్క్సిజాన్ని అధ్యయనం చేసి దానిని ప్రతిభావంతంగా భారత స్వతంత్ర పోరాటానికి అన్వయించి రచనలు చేసిన విప్లవ యోధుడు. ఆయన పంధా కాంగ్రెస్ పంధాకు పూర్తిగా భిన్నమైనది. సాయుధ పోరాటంతో తప్ప మరే విధంగానూ దేశానికి నిజమైన స్వాతంత్రం దక్కదని త్రికరణ శుద్ధిగా నమ్మిన సోషలిస్టు యోధుడు. అందుకే ఆయన ఉరిశిక్ష రద్దు చేయమని కోరేందుకు గాంధీకి మనస్కరించలేదు. భగత్ సింగ్ భావజాలానికీ మితవాద పక్ష భావజాలానికి అసలు పొంతనే లేదు. కనుక కంగనా రనౌత్ తన ఆలోచనా ధార నుండి భగత్ సింగ్ ను మినహాయించడం శ్రేయస్కరం.

2014 నాడే స్వతంత్రం వచ్చింది అని తాను ఎందుకు చెప్పానో కంగనా రనౌత్ వివరించారు. “2014 లో స్వతంత్రం రావడానికి సంబంధించినంతవరకూ మనకు భౌతిక స్వాతంత్రం వచ్చి ఉండవచ్చు గానీ భారతీయ చైతన్యం మరియు ఆత్మ సాక్షి 2014 లోని విముక్తి సంపాదించింది అని నేను ప్రత్యేకంగా చెప్పాను… (2014లోనే) ఒక మృత నాగరికత జీవాన్ని సంతరించుకుని రెక్కలు విప్పింది. ఇప్పుడది గర్జిస్తూ ఉన్నత శిఖరాలకు ఎగబాకుతోంది…” అని కంగనా వివరించారు.

ఇప్పుడు కంగనా రనౌత్ అంతరార్ధం ఏమిటో కొంతవరకు తెలుస్తోంది. హిందూ మహా సభ, ఆర్‌ఎస్‌ఎస్ సంస్ధలు ఏ సనాతన భారత సామాజిక వ్యవస్ధను కాపాడుకోవాలని మొదటి నుండి కోరుకున్నాయో వేల యేళ్ళ నాటి ఆ కుల-మత-వర్గ వ్యవస్ధ తిరిగి జీవం పోసుకుని వర్ధిల్లడమే కంగనా రనౌత్ కోరుకుంటున్న స్వతంత్రం. సమాజంలో నూటికి 90 మందిగా ఉన్న శ్రమ జీవులు కులం పేరుతో, మతం పేరుతో, హీన జాతి పేరుతో, తక్కువ రకం భాష పేరుతో, పురుష ఆధిపత్యం పేరుతో ఆధిపత్య శక్తుల అణచివేతలకు లొంగి ఉండే వ్యవస్ధ కొనసాగడమే ఆమె కోరుతున్న స్వతంత్రం. కుల, మత వివక్షలు, లైంగిక వివక్ష, జాతి వివక్ష, ప్రాంతీయ వివక్ష, భాషా వివక్షలు పునర్వైభవం సాధించడమే కంగనా కోరుతున్న స్వతంత్రం.

కానీ ఇది స్వతంత్రం కాదు, అణచివేత, విముక్తి కాదు బంధి ఖానా. ఈ వ్యవస్ధలో నూటికి సగంగా ఉన్న మహిళలు పురుషాధిక్య బంధిఖానాలో బందీలుగా ఉంటారు. సబ్బండ శ్రామిక కులాలు బ్రాహ్మణీయ కులాధిపత్య బందిఖానాలో బందీలుగా ఉంటారు. అటు ఈశాన్య భారతంలోని లెక్కకు మిక్కిలిగా కలిగిన జాతులు మరియు ఉపజాతులు, తెగలు, దక్షిణ భారతంలోని ద్రావిడ భాషల ప్రజలు, మధ్య భారతంలో అటవీ ప్రాంతంలో బ్రతుకుతున్న గిరిజన తెగలు అందరూ జాత్యహంకార బందిఖానాలో బందీలైపోతారు. 2014 నుండి దేశంలోని దళితులపైనా, ఈశాన్య జాతులపైనా, అడవుల్లోని గిరిజన ప్రజలపైనా కొనసాగుతూ వస్తున్న హత్యలు, బనాయించబడుతున్న కేసులు-అరెస్టులు, బి‌జే‌పి యేతర ప్రభుత్వాలపై జరుగుతున్న ఈ‌డి-ఐ‌టి దాడులు ఈ బందీఖానాలు తిరిగి కోరలు చాస్తున్న సంగతి చాటి చెబుతున్నాయి.

ఈ నేపధ్యంలోనే 2014 నుండే భారత ఆత్మ చైతన్యం తిరిగి రెక్కలు విప్పి ఎగురుతోందని పులకరించి పోతున్నారు. కానీ ఆమె చెబుతున్న స్వతంత్రత మెజారిటీ శ్రామిక ప్రజలను హైందవ అణచివేత కోరాలకు కట్టివేసే సనాతన అణచివేతతో కూడిన వ్యవస్ధ. శ్రామిక కులాలకు జ్ఞానాన్ని నిరాకరిస్తూ వేలాది శంభూకుల తలలు నరికివేసే అమానవీయ వ్యవస్ధ. అణగారిన ప్రజానీకానికి శస్త్ర, శాస్త్ర విద్యలను నిరాకరించే అణచివేత వ్యవస్ధ. హేతువుకు పెద్ద పీట వేసి చైతన్యాన్ని రాజేసిన చార్వాకుల చెవుల్లో సీసాన్ని పోసిన కుళ్ళు వ్యవస్ధ. ఈ వ్యవస్ధ తిరిగి బలపడడం అంటే భారత దేశం అచ్చమైన బందీఖానాగా మారడమే.

నిజానికి కాంగ్రెస్ పాలన కూడా ఈ బందీఖానా నుండి ప్రజలను విముక్తి చేసిన చరిత్ర లేదు. నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏమిటంటే భారత దేశ శ్రామిక ప్రజలు నిజమైన ప్రజా విప్లవోద్యమం ద్వారా భూస్వామ్య, పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద దోపిడీ అణచివేతల నుండి శాశ్వత విముక్తి పొందేందుకు నిర్ణయాత్మక ప్రయత్నాలకు పాల్పడకుండా తానే సోషలిజం తెస్తానని చెబుతూ వారిని మోసగించడమే. ఈ మాత్రం ప్రజానుకూల నటనను కూడా మితవాద శక్తులు సహించలేకపోయాయి. 

అమ్మా కంగనా రనౌత్ గారూ, మీకూ మీ స్వతంత్రానికి ఒక దండం!! మీరు ప్రబోధించే విముక్తి భారత ప్రజలకు మహా గండం. ఈ గండం నుండి బైటపడడమే భారత ప్రజల తక్షణ కర్తవ్యం.

1 thoughts on “సనాతన కుల-మత వ్యవస్ధ పునరుద్ధరణే కంగనా ప్రబోధిస్తున్న విముక్తి!

  1. 1857 సిపాయిల తిరుగుబాటులో బెంగాల్ రెజిమెంట్ ముగల్ చక్రవర్తి రెండవ బహాదుర్ షాహ్‌కి సపోర్ట్ ఇచ్చింది తప్ప హిందు రాజ్యాన్ని స్థాపించాలనుకోలేదు. అదే టైంలో మరాఠా రాజు నానా సాహెబ్ పేష్వా మరాఠా సామ్రాజ్యాన్ని పునరుద్ధరించాలనుకోవడం, రెండవ బహాదుర్ షాహ్ నానా సాహెబ్‌ని నమ్మకపోవడం వల్ల సిపాయిల తిరుగుబాటు ఓడిపోయింది. సిపాయిల తిరుగుబాటులో హిందు-ముస్లిం సైనికులు కలిసే పని చేసారు. వాళ్ళు అనుకున్నది బిజెపి అనుకున్న రాజ్య స్థాపన కాదు.

వ్యాఖ్యానించండి