కంగనా రనౌత్ తెలిసి మాట్లాడతారా లేక…!?


Kangana Ranaut was awarded the Padma Shri

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి మరో వివాదంలో కేంద్ర బిందువుగా నిలిచారు. ఏకంగా భారత దేశ స్వాతత్ర్య దినం పైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారామె. ఆర్ణబ్ గోస్వామి కేకలకు, పెడబొబ్బలకు గతంలో అవకాశం ఇచ్చిన టైమ్స్ నౌ చానెల్ నిర్వహించిన ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి.కొందరు బి‌జే‌పి నేతలు కూడా ఆమె అవగాహనా రాహిత్యాన్ని తిట్టిపోస్తున్నారు.

గురువారం జరిగిన ఈవెంట్ లో ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆమె “ఇండియాకు 1947 వచ్చింది స్వాతంత్ర్యం కాదు. అది కేవలం భిక్ష. మనకు నిజమైన స్వాతంత్ర్యం 2014లో వచ్చింది” అని ఆమె వ్యాఖ్యానించారు. తాను మాట్లాడిన మాటలకు అర్ధం ఏమిటో నిజంగా ఈవిడకు తెలుసా లేదా అన్నది ఒక అనుమానం.

కంగనా రనౌత్ ఇటీవల (నవంబర్ 8 తేదీన) రాష్ట్రపతి రామ్ నాధ్ కొవింద్ నుండి పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు. పద్మ అవార్డులను దేశంలోని పౌరులకు భారత ప్రభుత్వం అందించే అత్యున్నత గౌరవంగా పేరుంది. ఒక్కోసారి ఈ అవార్డు కోసం ఎంపిక చేసే వ్యక్తులను బట్టి ప్రభుత్వాలపై విమర్శలు రావడం కూడా కద్దు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కూడా చాలా సార్లు పద్మ అవార్డులకు ఎంపిక చేసిన వ్యక్తుల వల్ల విమర్శలు ఎదురయ్యాయి.

కానీ కంగనా రనౌత్ ప్రత్యేకత ఏమిటంటే పద్మ శ్రీ అవార్డు అందుకున్న తర్వాత మూడు రోజులకే ఆమె ఆ అవార్డుకు అనర్హురాలిని అని నిరూపించుకున్నారని విమర్శలు రావడం. అవార్డు అందుకున్న ఆనందంలో  తనను అవార్డుకు ఎంపిక చేసినందుకు మోడి ప్రభుత్వం పట్ల కృతజ్ఞత చాటాలని భావించారో ఏమో తెలియదు గానీ ఆమె మోడి నేతృత్వంలో బి‌జే‌పి అధికారంలోకి వచ్చిన 2014 లో మాత్రమే భారత దేశానికి స్వాతత్ర్యం వచ్చిందని ఆమె ప్రకటించేశారు.

స్వాతంత్ర్యం అన్నది సాధారణ పదం కాదు. ఆ పదం వెనుక భారత ప్రజలు దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉన్నది. కోట్లాది మంది చేసిన పోరాటాలు ఉన్నాయి. లక్షల మంది పోరాట వీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన త్యాగం ఉన్నది. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లాంటి యువకులు వీరోచితంగా తమ ప్రాణాలను ఊరికొయ్యలకు వేళ్లాడదీసిన ధైర్య సాహసాలు ఉన్నాయి. చంద్ర శేఖర్ ఆజాద్ లాంటి సాహసికులు ఒంటి చేత్తో చివరి క్షణం వరకు బ్రిటిష్ సాయుధ మూకలను మట్టుబెట్టడమే కాకుండా ఇక పట్టుబడడం తప్పదు అని తెలిసాక తనను తాను కాల్చుకుని భారత మాతకు తన రక్తాన్ని తర్పణం కావించిన కసి, పట్టుదల, త్యాగశీలత ఉన్నాయి. జలియన్ వాలాబాగ్ మారణకాండకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన దరిమిలా శరీరం నిండా సల సల కాగే ఉష్ణ రక్త కాసారాలను 20 యేళ్ల పాటు కాచుకుని జనరల్ డయ్యర్ ని వారి దేశంలోనే తుదముట్టించిన సర్దార్ ఉద్ధం సింగ్ లాంటి కార్యశీలుర శౌర్య పరాక్రమాలు ఉన్నాయి. 

2014లో వీటిలో ఏమి జరిగాయని ఆ సంవత్సరమే భారత దేశానికి స్వతంత్రం వచ్చిందని కంగనా రనౌత్ భావిస్తున్నారో అర్ధం కానీ విషయం. కంగనా రనౌత్ ప్రధాని నరేంద్ర మోడీకి వీరాభిమాని. అందులో తప్పు లేదు. మోడికి దేశంలో చాలామంది అభిమానులు ఉన్నారు. పిచ్చి అభిమానులూ ఉన్నారు. వీరాభిమానులూ ఉన్నారు. కానీ కంగనా వ్యక్తం చేస్తున్న అభిమానం ఏమని వర్ణించాలి?

2014 ఎన్నికల్లో బి‌జే‌పి అధికారంలోకి వచ్చింది. 1999 ఎన్నికల్లో కూడా బి‌జే‌పి మొదటిసారి అధికారం చేపట్టింది. కంగనా అభిప్రాయంలో 1999 లో కూడా దేశానికి స్వతంత్రం రాలేదు. బహుశా ఆనాటి ప్రధాని నరేంద్ర మోడి కానందు వల్ల అప్పుడు స్వతంత్రం రాలేదని కంగనా భావిస్తున్నారా? ఆ సంగతి కాసేపు పక్కన బెడదాం.

బి‌జే‌పి మాతృ సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్ధలన్నీ కలిసి అయోధ్యలో రాముడి గుడి కట్టాలని, కృష్ణ జన్మస్ధలంలో ఆయనకు గుడి కట్టాలని, కాశీ, మధురల్లో ఇంకేవో తప్పిదాలను సరి చేయాలని… ఇలా రక రకాల డిమాండ్లతో ఉద్యమాలు చేశాయి. మత కొట్లాటలు రేపాయి. ఈ కొట్లాటల్లో వేల మంది చనిపోయారు. అనేక చోట్ల చెదురు ముదురుగా చిన్నా, పెద్దా ఘర్షణలను సృష్టించి, ఉన్నవాటిని పెద్దవి చేసి మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి వాటిని సొమ్ము చేసుకోవడం ద్వారా మాత్రమే బి‌జే‌పి అధికారం సాధించింది తప్ప ప్రజా సమస్యలపై పోరాడిన చరిత్ర, సదరు ప్రజా పోరాటాల ద్వారా ప్రజాభిమానం సంపాదించి అధికారం సంపాదించిన చరిత్ర బి‌జే‌పి-ఆర్‌ఎస్‌ఎస్ లకు లేదు. అలాంటి బి‌జే‌పి అధికారం లోకి వస్తే స్వాతంత్రం వచ్చినట్లు కంగనా గారు పరిగణించడం ఏమిటి? అసలు ఆవిడ లెక్క ఏమిటి?

కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు. ఇంకా వాస్తవాల లోతుల్లోకి వెళితే ఆర్‌ఎస్‌ఎస్ దాని అనుబంధ సంస్ధల పోరాట చరిత్ర సున్నా అని తెలుస్తుంది. సున్నా కూడా కాదు, నెగిటివ్ కింద పరిగణించాలి. ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర ఆర్‌ఎస్‌ఎస్ సంస్ధకు లేకపోగా, తమ సభ్యులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో పాల్గొనవద్దని పిలుపు ఇచ్చిన చరిత్ర ఆర్‌ఎస్‌ఎస్ కి ఉన్నది.

1929 లాహోర్ కాంగ్రెస్ లో ప్రతి జనవరి 26 తేదీన త్రివర్ణ పతాకం ఎగరేయాలంటూ అప్పటి కాంగ్రెస్ ఇచ్చిన పిలుపును ఆర్‌ఎస్‌ఎస్ నేత హెడ్గేవార్ వ్యతిరేకించిన సంగతి చరిత్రలో రికార్డ్ అయి ఉన్నది. త్రివర్ణ పతాకం బదులు కాషాయ జెండా ఎగరవేయాలని 21 జనవరి 1930 తేదీన ఆయన ఆర్‌ఎస్‌ఎస్ శాఖలకు ఆదేశాలు ఇవ్వడమూ చరిత్రే. (Book titled “Dr. Hedgesar: Patrroop Veyaktidarshan, published in 1981).

1947 ఆగస్టు 14-15 రాత్రి ఎర్ర కోటపై నెహ్రూ త్రివర్ణ పతాకం ఎగరవేస్తుండగా చూడడం కోసం జనం ఓ పక్క ఎదురు చూస్తుంటే ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక ఆర్గనైజర్ 14 ఆగస్టు 1947 నాటి సంచికలో ఇలా ప్రకటించింది “… హిందువులు దీనిని ఎన్నడూ గౌరవించరు, సొంతం చేసుకోజాలరు. మూడు అన్న సంఖ్య దానికదే చెడ్డది (evil), మూడు రంగులు కలిగిన జండా ఖచ్చితంగా చాలా చెడ్డ మానసిక ప్రభావాన్ని కలిగిస్తుంది. అది దేశానికి ప్రమాదకరమైనది. (“…never be respected and owned by Hindus. The word three is in itself an evil, and a flag having three colours will certainly produce a very bad psychological effect and is injurious to [the] country”).

సి‌పి భిషికార్ రాయగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రచురించిన డాక్టర్ హెడ్గేవార్ బయోగ్రఫీలోనే ఆయన సత్యాగ్రహంలో పాల్గొనవద్దని ఆర్‌ఎస్‌ఎస్ శాఖలకు పిలుపు ఇచ్చిన సంగతి ఉన్నది. హెచ్‌వి శేషాద్రి రాసిన మరో హెడ్గేవార్ బయోగ్రఫీలో డా. హెడ్గేవార్ ఖిలాఫత్ ఉద్యమానికి అనుకూలంగా ఉద్రేకభరితమైన ప్రసంగం చేసినందుకు సంవత్సరం పాటు కఠిన కారాగార శిక్ష విచించిన సంగతి ఉన్నది. (ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ నేతలు ఖిలాఫత్ ఉద్యమాన్ని జీహాద్ గా తిట్టిపోయడం ఒక విచిత్రం). సంవత్సరం పాటు ‘కఠిన కారాగార శిక్ష అనుభవించిన అనంతరం 12 జులై 1922 న విడుదలైన హెడ్గేవార్ 11 కిలోలు బరువు పెరిగారని అందుకు కారణం ఆయన బ్రిటిష్ జైలర్ సర్ జాతర్ తో అత్యంత స్నేహపూర్వకంగా మెలగడమే అని 1981 లో ప్రచురితమైన బయోగ్రఫీ చెబుతోంది.

కాంగ్రెస్ కార్ర్యకర్తగా సత్యాగ్రహంలో పాల్గొని రెండోసారి అరెస్ట్ అయిన హెడ్గేవార్ బ్రిటిష్ వ్యతిరేకతలో భాగంగా కాకుండా తాను స్ధాపించబోయే ఆర్‌ఎస్‌ఎస్ గురించి జైలులో కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రచారం చేసి మలుచుకునేందుకు అరెస్ట్ అయ్యారని భిషికర్ రాసిన బయోగ్రఫీ చెబుతోంది. 1925లో ఆర్‌ఎస్‌ఎస్ స్ధాపించాక హెడ్గేవార్ ఏనాడూ (బ్రిటిష్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క వ్యాఖ్యా చేయలేదని భిషికర్ అంగీకరించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నప్పుడు వ్యక్తిగానే పాల్గొన్నాడు తప్ప ఆర్‌ఎస్‌ఎస్ నేతగా కాదు. అలాగే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు కూడా వ్యక్తులుగా పాల్గొనడానికి అనుమతించారు తప్ప ఆర్‌ఎస్‌ఎస్ గా పాల్గొనమని చెప్పలేదు. పైగా ఆర్‌ఎస్‌ఎస్ పేరుతో పాల్గొనవద్దని ఆదేశించారు.

స్వాతంత్ర పోరాటం సాగుతున్న సందర్భంలో కాంగ్రెస్ నేతలపై తీవ్ర నిర్బంధం అమలైన సందర్భాల్లో పలువురు కాంగ్రెస్ నేతలు ఆర్‌ఎస్‌ఎస్ నేతల ఇళ్ళల్లో దాక్కునేవారు. ఈ సంగతి ఆర్‌ఎస్‌ఎస్ నేతలు చెబుతూ దాన్ని కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొనడంగా చెబుతారు. నిజం ఏమిటంటే ఆర్‌ఎస్‌ఎస్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనటానికి వ్యతిరేకం అని బ్రిటిష్ ప్రభుత్వానికి తెలుసు. అందువలన ఆర్‌ఎస్‌ఎస్ నేతల ఇళ్లపై నిఘా ఉండేది కాదు. అందుకే కాంగ్రెస్ నేతలు వారి ఇళ్ళల్లో ఉండడం సురక్షితం అని భావించారు.

ఇలాంటి చరిత్ర ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ లో భాగమైన బి‌జే‌పి అధికారంలోకి వచ్చిన 2014 లో భారత దేశానికి స్వతంత్రం వచ్చిందని కంగనా రనౌత్ ఎందుకు భావిస్తున్నట్లు? అసలు ఆమె దృష్టిలో స్వతంత్రం రావడం అంటే అర్ధం ఏమిటి?

One thought on “కంగనా రనౌత్ తెలిసి మాట్లాడతారా లేక…!?

  1. బ్రిటిష్‌వాళ్ళు ఇండియాని రాజులు, జమీందార్ల సహాయంతో పరిపాలించారు. ఈ రాజులు, జమీందార్లు అందరూ భారతీయులే. అందువల్ల ఆర్.ఎస్.ఎస్. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడలేదు. ఒరిస్సాలోని మా ఊరి ఆదివాసులకి 1950 వరకు ప్రభుత్వం అంటే ఏమిటో తెలియదు. వాళ్ళు రాయగడ (పితామహల్) జమీందార్‌నే రాజు అనుకునేవాళ్ళు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s