మోడి క్లీన్ చిట్: మనస్సాక్షి ఉన్న జడ్జి ఈ సాక్షాన్ని విస్మరించరు!-2


Gulbarg Society remains

పిటిషనర్ జకీయా జాఫ్రీ తరపున సుప్రీం కోర్టు అడ్వకేట్ కపిల్ సిబాల్ వినిపిస్తున్న వాదనలు:

 • జైదీప్ పటేల్ మొబైల్ అసలు స్వాధీనమే చేసుకోలేదు. ఆయన అనేక ఫోన్ కాల్స్ చేసి ఉంటాడు. ఆయన ఫోన్ స్వాధీనం చేసుకోకపోతే మీరు (సిట్) ఏమి పరిశోధన చేసినట్లు?
 • 27 ఫిబ్రవరి, 2021 (గోధ్రా రైలు దహనం జరిగిన రోజు) తేదీకి ముందే బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, సంఘ్ పరివార్ సభ్యులు ఆయుధాలు, మందుగుండు నిలవ చేసుకున్నారని చెప్పే ఆధారాలు స్టింగ్ ఆపరేషన్ టేపుల్లో ఉన్నాయి. వీటితో పాటు డీసెల్ బాంబులు పైప్ బాంబులు సేకరించేందుకు కుట్ర జరిపిన ఆధారాలు ఉన్నాయి.
 • ఒక వి‌హెచ్‌పి సభ్యుడికి చెందిన క్వారీ నుండి డైనమైట్ బాంబులను అహ్మదాబాద్ కు స్మగుల్ చేసేందుకు కుట్ర జరిగినట్లు టేపులు సూచిస్తున్నాయి. ఈ అంశాలను సిట్ పరిశోధించలేదు.
 • తనకు ప్రమోషన్ ఇవ్వలేదన్న కారణంతో ఇచ్చిన సాక్షం అని చెప్పి శ్రీకుమార్ (గుజరాత్ అడిషనల్ డి‌జి‌పి) ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణించడానికి సిట్ నిరాకరించింది. ఆయన వాఙ్మూలం ఇతర అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలతో సరిపోలింది. కనుక దానిని నిరాకరించి ఉండకూడదు.
 • తర్వాత రాష్ట్ర ఇంటలిజెన్స్ నివేదిక… (అయోధ్య నుండి) తిరిగి వస్తున్న కర సేవకులు త్రిశూలాలు చేబూని ఉన్నారని, అక్కడ మతపరమైన ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయని చెప్పింది.
 • తగిన గౌరవంతో ఈ సంగతి చెబుతున్నాను మిలార్డ్స్. ఏ కోర్టూ, మేజిస్ట్రేట్ గానీ, హై కోర్టు గానీ, సుప్రీం కోర్టు గానీ పరిశోధన జరపకుండా కుట్ర జరిగిందా లేదా అన్న సంగతిని తేల్చడానికి వీలు లేదు.
 • పరిశోధన (ఇన్వెస్టిగేషన్) జరిపాలి. మా కేసు సారాంశం అదే. పరిశోధన జరపనట్లయితే ఇక సుప్రీం కోర్టు సిట్ ఏర్పాటు చేసి ఫలితం ఏమిటి?
 • నరోడా పాటియా కేసులో ఆ వ్యక్తిని ఈ స్టింగ్ టేపుల ఆధారంగానే దోషిగా నిర్ధారించారు. కానీ ఇతర కేసుల్లో ఈ టేపులను పరిగణనలోకి తీసుకోలేదు.
 • మేజిస్ట్రేట్ కోర్టు ముందు 64 పెట్టెల్లో పత్రాలను ఫైల్ చేశారు. మరే ఇతర కేసులోనూ ఇలా జరగలేదు. నరోడా కేసులో గానీ, గుల్బర్గా కేసులో గానీ ఫైల్ చేయలేదు. ఈ పత్రాలను ఇంకెక్కడా ఫైల్ చేయలేదు.
 • ఈ పెట్టెల్లోని పత్రాలను మాకు సరఫరా చేయాలని మేజిస్ట్రేట్ ని కోరాము. వాటిలో 80 శాతం మాకు ఇచ్చారు. ప్రాధమిక పరిశోధన పత్రాలను ఇవ్వలేదు. ఈ కోర్టుకు వచ్చాము. 17.01.2013 తేదీన ఈ కోర్టు ఆర్డర్ జారీ చేసింది. సాక్షుల వాంగ్మూలాలను (statements) మాకు ఇవ్వలేదు. అందుకే ఈ కోర్టుకు వచ్చాము.
 • ఈ statements ను 161 statements గా పరిగణించాలని 17.01.2013 నాటి ఆర్డర్ ఆదేశించింది. ఏ 161 స్టేట్మెంట్ అయినా ఎఫ్‌ఐ‌ఆర్ తో సంబంధం కలిగి ఉండాలి. ఇది ఫిర్యాదు ఆధారంగా సుప్రీం కోర్టు తీసుకున్న సూయి జెనెరిస్ ప్రక్రియ (ప్రొసీజర్). ఏ ఇతర కేసుకు సంబంధించినది కాదు, ఏ ఇతర కేసులో ఉపయోగించకూడదు. (సూయి జెనెరిస్ – దానికదే ప్రత్యేకమైనది).
 • సబర్మతి ఎక్స్^ప్రెస్ రైలు గోధ్రా స్టేషన్ చేరక ముందే వారికి తగినన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లు అందాయి. పోలీసు మాన్యువల్ నిర్దేశించిన ప్రకారం తగిన చర్యలు తీసుకుని ఉన్నట్లయితే, బహుశా ఇటువంటి జాతీయ ఉపద్రవం (సబర్మతిలో కర సేవకులు ఉన్న రైలు బోగీ దహనం) జరిగి ఉండేది కాదు.
 • గోధ్రా బాధితుల విగత దేహాలకు అత్యంత హడావుడిగా ఇచ్చేశారు. రైల్వే ప్లాట్ ఫారం మీదనే పోస్ట్ మార్టం జరిపారు. ఇలాంటిది ఎప్పుడూ వినలేదు… కానీ డాక్టర్ల ని ఎవరు పిలిచారు, పోస్ట్ మార్టం ని అంత హడావుడిగా ఎందుకు చేయవలసి వచ్చిందో ఈ డాక్టర్లను ప్రశ్నించి (examine) ఉండాల్సింది.
 • శవాలను శక్తివంతమైన వి‌హెచ్‌పి నాయకుడికి అప్పగించాలన్న నిర్ణయంపై పరిశోధన చేసి ఉండవలసింది. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? శవాలను వారి బంధువులకు మాత్రమే అప్పగించాలి. ఈ అప్పగింతపై విచారణ జరిపి ఉండాలి.
 • ఈ శవాలను ఫోటోలు తీసి ప్రచురించారు. ఈ ప్రచురణ తిరుగుబాటు (revolt), విరక్తి (revulsion) లతో కూడిన వాతావరణం ఏర్పడేందుకు కారణం అయింది. ఇతి అత్యంత ముఖ్యమైన సాక్ష్యం.
 • కరసేవకుల విగత దేహాలను పెరేడ్ చేయడం కూడా ‘భారీ కుట్ర’ (larger conspiracy) లో భాగమే… ఆ రోజు అహ్మదాబాద్ లో మధ్యాహ్నం 12:45 వరకు కర్ఫ్యూ విధించలేదు.
 • సిటిజన్స్ ట్రిబ్యూనల్ ఆఫ్ జస్టిస్ కి చెందిన జస్టిస్ వి ఆర్ కృష్ణయ్యర్, పి‌బి సావంత్ లు ఈ అంశాలను ప్రధానంగా గుర్తించారు.
 • కింది స్ధాయి అధికారి అయిన మామ్లత్ దార్ ని పట్టుకుని ఆయనే ఈ నిర్ణయం చేశారని చెప్పారు. మామ్లత్ దార్ పై ఎంక్వైరీ మొదలు పెడితే అది ఎక్కడికి చేరేను? ఒక జాతీయ ఉపద్రవం జరిగినప్పుడు శవాలను వి‌హెచ్‌పి కి అప్పగించాలని మామ్లత్ దార్ నిర్ణయం తీసుకుంటాడని మీరు ఎన్నదైనా ఊహించగలరా? బొత్తిగా అసాధ్యం!
 • తర్వాత, గోధ్రా అనంతరం హింసకు ఏర్పాట్లు. ఏయే ప్రసంగాలు చేశారు, ఎవరు ఆ ప్రసంగాలు చేశారు – ఇవన్నీ పరిశోధించాలి. ఈ ప్రసంగాలు ఏమిటన్న విషయమై నా దగ్గర ప్రత్యేక వాల్యూం ఉన్నది.
 • తెల్లవారు ఝాము 3 గంటలకు 3,000 మండి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు సమీకరించబడ్డారు. ఈ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు మెసేజ్ లు ఎవరు పంపారు? కాల్ రికార్డ్ లను పరిశీలిస్తే మీకు తెలిసిపోతుంది.
 • పి‌సి పాండేకు సమన్లు పంపి ప్రశ్నించి ఉండాలి. అసలు సిట్ ఏమి చేస్తున్నట్లు?
 • నిందితులను కాపాడేందుకే సిట్ ప్రయత్నిస్తున్నదా? సిట్ ను మీరే నియమించారు మిలార్డ్స్. అది సాక్ష్యాలు సేకరించాలి, స్టేట్మెంట్స్ రికార్డ్ చెయ్యాలి, తర్వాత ప్రాధమిక అంచనాకు రావాలి.

Relatives paying homage to victims

 • చట్టం నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం ప్రజలకు రక్షణ కల్పించాలని ఆర్టికల్ 21 చెబుతుంది. దాన్ని ఉల్లంఘిస్తే మీరు నిందితులే. వీటిలో దేన్నీ ఎందుకు చేయలేదో సిట్ వివరించాలి. మాకు మిగిలి ఉన్న ఒకే ఒక మార్గం ప్రొటెస్ట్ పిటిషన్.
 • వి‌హెచ్‌పి నేత ఆచార్య గిరిరాజ కిషోర్ కుట్రకు ప్రాణం పోసారని మేము చెబుతున్నాము. ఆయన్ను సోలా సివిల్ ఆసుపత్రికి పోలీసులే ఎస్కార్ట్ ఇచ్చి తెచ్చారు. యువర్ లార్డ్ షిప్స్ దీన్ని ఊహించగలరా? ఒక వి‌హెచ్‌పి నేతను పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి తేవడం!
 • చట్టం, శాంతి బద్రతలను కాపాడవలసిన పోలీసులు దానికి బదులు ఎవరైతే  మూకోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే 5000 మందితో కూడిన గుంపుతో ఉద్వేగాలు నిండిన ఊరేగింపులో వస్తున్నాడో అటువంటి వి‌హెచ్‌పి వ్యక్తిని ఎస్కార్ట్ తో తెచ్చారు.
 • హింస చోటు చేసుకునే స్ధాయికి మతపరమైన ఉద్రిక్తతలు చేరేలా అనుమతించరాదు. ఈ కేసు, కేవలం ఈ ఒక్క కేసు గురించి మాత్రమే కాదు, ఇది భవిష్యత్తు గురించిన కేసు.
 • మా వద్ద అనుభవాధార సాక్ష్యం (empirical evidence) ఉన్నది. వాళ్ళు సమన్వయంతో పని చేశారు. మత హింసలో ఎప్పుడూ జరిగినట్లుగానే పోలీసులు ఒక పక్షం వహించారు. మెసేజ్ లు పంపినా పోలీసులు స్పందించలేదు.
 • మాయా కొడ్నానిని నిర్దోషిగా విడుదల చేస్తూ హై కోర్టు తీర్పు ఇచ్చాక దాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉండగా సిట్ ఆ పని చేయలేదు. ఇక్కడే తెలుస్తోంది! (It shows!).
 • నిందితులు స్టేట్మెంట్స్ ని ఎలాంటి పరిశోధన లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ఆమోదించేపనైతే ఇక ఇన్వెస్టిగేషన్ ఎందుకు?
 • సోలా సివిల్ ఆసుపత్రి దగ్గర గుమి కూడిన 3000 మంది జనం అంతా స్వయం సేవక్ లు (ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు). చనిపోయినవారి బంధువులు ఆసుపత్రికి వస్తే నేను అర్ధం చేసుకోగలను. స్వయం సేవకులు ఎలా వచ్చారు? వారి తెల్లవారు ఝామునే రావాలని మెసేజ్ పంపవలసిన అవసరం ఏమిటి? వివరాలు ఏవీ లేవు.
 • అహ్మదాబాద్ లో కర్వ్యూ విధించకుండా ఇదంతా చేశారు. పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నట్లు?
 • మేజిస్ట్రేట్ ఏమి చేశారో దయచేసి గమనించండి. మరింత పరిశోధన చేయాలని సుప్రీం కోర్టు నుండి ఆదేశాలు లేవు అని ఆయన అంటారు. అక్కడితో ఆయన చేతులు కడిగేసుకున్నారు. ఆయన సొంతగా ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయనూ లేదు, మరింత పరిశోధనకు ఆదేశాలు జారీ చేయనూ లేదు.
 • నిజం ఏమిటి? అబద్ధాలు ఏమిటి? ఇవి తెలియాలంటే పరిశోధన జరగాలి. మేజిస్ట్రేట్ ఆ విషయం చూడలేదు. హై కోర్టు ఆ అంశాన్ని పట్టించుకోలేదు. హీన పక్షం చెప్పాలంటే నాకిది కలవరం కలిగిస్తోంది.
 • ఈ కుట్రలో కామన్ గా కనిపించే అంశం ఏమిటంటే “ఒక గుణ పాఠం నేర్పుదాం” అన్నది. పరిశోధన అంటే ఫోన్ లు సీజ్ చేయడం, వాటిని పరిశీలించడం, ఫోన్ రికార్డ్ లు పరిశీలించడం మొ.వి.
 • ఆర్మీని పిలవడం లో కూడా ఆలస్యం జరిగింది. మొదటి సారి ఆర్మీ కోసం అడగడం 01.03.2002 తేదీన జరిగింది. గోధ్రాకు ఆర్మీ 02.03.2002 తేదీన చేరుకుంది.
 • దీన్ని విశ్లేషించవలసింది సిట్. కానీ ఇదంతా మేమే చేయవలసి వచ్చింది. మేము చేశాక దాన్ని సిట్ కు కూడా ఇచ్చాము. కానీ వారి వైఖరి చూడండి. వారికి ప్రశ్నల రూపంలోనే ఇచ్చాము. అయినా సరే వారు ఏమీ చేయలేదు.
 • భావనగర్ లో ఒక అధికారి తనకు అందిన ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుని మదరసాల్లో ఉన్న పిల్లలను కాపాడారు. ఇతర చోట్ల కూడా ఇదే తరహాలో తగిన విధంగా నిరోధక చర్యలు తీసుకుని ఉన్నట్లయితే హింసను చాలావరకు నిరోధించగలిగేవారు.
 • మొదట మీకు అల్లర్లకు పిలుపు ఇస్తున్న వి‌హెచ్‌పి నేతలు కార్యకర్తలు ఉన్నారు. ఆ తర్వాత ప్రాసిక్యూటర్లుగా వి‌హెచ్‌పి వ్యక్తులనే నియమిస్తారు. స్పెషల్ ప్రాసిక్యూటర్ గా నియమించబడ్డ ఒక వి‌హెచ్‌పి మనిషి నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని ఏ విధంగానూ వ్యతిరేకించలేదు. ఏమి జరుగుతున్నదో కాస్త చూడండి!
 • దిలీప్ త్రివేదిని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించాక 55 మంది నిందితులు బెయిల్ పై విడుదల అయ్యారు. దయ చేసి ఈ సంగతి నోట్ చేయండి. ఈ అంశంపై పరిశోధన చెయ్యొద్దా? (బెయిల్ ని) మీరు ఎందుకు వ్యతిరేకించలేదు? వి‌హెచ్‌పి వ్యక్తులు గానీ, నిందితులు ఎవరైనా గానీ మీతో సంప్రదింపులు జరిపారా?
 • సిట్ ఈ ప్రశ్నల్ని అడిగి ఉండాల్సింది.
 • ఈ తరహా జాతీయ ఉపద్రవాలు జరిగినప్పుడు అనేకసార్లు ఏం జరుగుతుందంటే దోషులు ఒకరైతే బాధితులు ఇంకెవరో అవుతారు. 1947లో జరిగినదానికి ఇప్పటి జనాభాను నేను ఎలా టార్గెట్ చేసుకోగలను? అమాయక ప్రజలను ఎందుకు బాధించాలి?
 • న్యాయం గురించిన ఏ మాత్రం తెలివిడి (sense) ఉన్నా ఏ పరిశోధకుడూ ఈ సాక్ష్యాన్ని విస్మరించలేరు. మనస్సాక్షి ఉన్న ఏ జడ్జి అయినా ఈ సాక్ష్యాలను విస్మరించలేరు.

ఇక్కడితో 10/11/2021 తేదీన వాదనలు ముగిశాయి. ఈ వాదనలు మళ్ళీ 11/11/2021 తేదీన కొనసాగాయి.

(ఈ అంశాలను లైవ్ లా పోర్టల్ నుండి యధాతధంగా స్వీకరించాను. -విశేఖర్)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s