భారతీయ జనతా పార్టీ (బిజేపి) నేతల ధోరణి మరీ విడ్డూరంగా కనిపిస్తోంది. కేంద్రంలో ప్రభుత్వాధికారం ఉన్నది బిజేపి చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లోని అత్యంత శక్తివంతమైన విచారణ సంస్ధలన్నీ బిజేపి ప్రభుత్వం నియంత్రణలో ఉన్నాయి. కాబట్టి రాఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో కమీషన్ చేతులు మారినట్లు వచ్చినట్లు ఆరోపణలపై విచారణ చేయవలసిన బాధ్యత బిజేపి పైనే ఉన్నది, అధికారం కూడా వారి చేతుల్లోనే ఉన్నది.
అలాంటిది ఫ్రెంచి పరిశోధనా వార్తల పోర్టల్ మీడియా పార్ట్ తాజాగా వెల్లడి చేసిన అంశాలపై స్పందించాలని బిజేపి ప్రతినిధులు (spokesmen) రాహుల్ గాంధీ ని డిమాండ్ చేయడం ఏమిటి? ఆయన స్పందించినా స్పందించకపోయినా విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాల్సింది బిజేపి ప్రభుత్వమే కదా? విచారణ సంగతి మాట్లాడకుండా ప్రతిపక్షాల స్పందనను డిమాండ్ చేయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి.
మధ్యవర్తి/మిడిల్ మ్యాన్ గా పని చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సుషేన్ మోహన్ గుప్తా కు దాసో ఏవియేషన్ కంపెనీ నుండి 2007-2012 మధ్య కాలంలో పలు విడతలుగా 7.5 మిలియన్ యూరోలు ముట్టజెప్పింది అని ఫ్రెంచి పోర్టల్ మీడియాపార్ట్ తన పరిశోధనాత్మక కధనంలో పేర్కొంది. ఈ కాలంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ నేతృత్వం లోని యూపిఏ ప్రభుత్వమే. సందేహం లేదు. కానీ కమిషన్ కు సంబంధించిన పత్రాలను సిబిఐ విజ్ఞప్తి మేరకు మారిషస్ ప్రభుత్వ అటార్నీ జనరల్ కార్యాలయం అక్టోబర్ 11, 2018 తేదీనే సిబిఐ డైరెక్టర్ కి పంపింది కదా? వాటి ఆధారంగా సిబిఐ విచారణ ఎందుకు చేపట్టలేదు? పోనీ ఇప్పుడైనా విచారణ ఎందుకు మొదలుపెట్టకూడదు?
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రా వీళ్ళంతా “ఐ నీడ్ కమిషన్” (ఐఎన్‌సి – ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) అనడం వల్లనే యూపిఏ హయాంలో రాఫెల్ ఒప్పందం విఫలం అయిందని మీడియా పార్ట్ తాజా కధనం ద్వారా స్పష్టం అయ్యిందని దీనికి రాహుల్ సమాధానం చెప్పాలని బిజేపి ప్రతినిధి సంబిత్ పాత్రా ఈ రోజు డిమాండ్ చేశారు. విచిత్రం ఏమిటంటే ఈ పాత్రా గారు అసలు విషయాన్ని వదిలి పెట్టి కొసరు విషయాన్ని పట్టుకుని వేళ్లాడ్డం. నిజానికి ఆ కొసరుని పాత్రా గారు తానే సృష్టించి మరీ ప్రశ్నలు సంధిస్తున్నారు.
సరే, రాహుల్ గాంధీ స్పందన కోసం ఎదురు చూద్దాం గానీ, మీరు లేదా మీ ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలను మీడియాపార్ట్ కధనం చాలానే దేశం ముందు ఉంచింది.
ఒకటి: రాఫెల్ విమానాల కొనుగోలుపై మోడి ప్రభుత్వం నియమించిన భారత చర్చల బృందం జరిపిన చర్చల తాలూకు రహస్య పత్రాలను రక్షణ మంత్రిత్వ శాఖ నుండి మధ్యవర్తి గుప్తా సంపాదించాడు. ముగింపు చర్చల్లో భారత బృందం సభ్యులు రాఫెల్ కొనుగోళ్లపై ఏ అభిప్రాయంతో ఉన్నదీ ఈ పత్రాల్లో ఉన్నది. ముఖ్యంగా విమానాల ధరను ఈ బృందం ఏ విధంగా లెక్కించింది వివరాలు ఉన్నాయి. ఈ వివరాలు దాసో ఏవియేషన్ కంపెనీకి అందడం వల్ల చర్చల్లో ఇండియా బృందంపై దాసో కంపెనీ పై చేయి సాధించగలిగింది. అధిక ధర పొందగలిగింది. ఇండియా నష్టపోయింది. మీడియా పార్ట్ వెల్లడి చేసిన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణ చెయ్యాలా వద్దా? ఈ ప్రశ్నకు కేంద్రం, లేదా బిజేపి ప్రతినిధి సమాధానం ఇవ్వాలా లేదా?
రెండు: ఈ కేసులో సాక్ష్యాలు మొదట బిజేపికి చెందిన మాజీ నేతలు, మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ సౌరీ, యశ్వంత్ సిన్హాల ద్వారా వెల్లడి అయ్యాయి. అక్టోబర్ 4, 2018 తేదీన వారు సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ కు సాక్ష్యాలతో కూడిన ఒక ఫైల్ ను అందజేశారు. అక్టోబర్ 11, 2018 తేదీన మారిషస్ నుండి గుప్తా పాత్ర గురించిన పత్రాలు సిబిఐ కి అందాయి. ఆనాడే సిబిఐ గుప్తా పాత్ర, కమిషన్ లపై విచారణ ఎందుకు చేయలేదు?
మూడు: మీడియా పార్ట్ కధనంపై ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందించింది. “రాఫెల్ అవినీతిని అనుసరిస్తూ పోతే అది నేరుగా ప్రధాని మోడి ఇంటి ముంగిటికే దారి తీస్తుంది” అని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించాడు. ఓ పక్క రక్షణ శాఖ రాఫేల్ కొనుగోళ్లపై చర్చలు చేస్తుండగానే మరో పక్క ప్రధాని కార్యాలయం సమాంతర చర్చలు చేసిందని దానివల్ల చర్చల్లో భారత్ సామర్ధ్యం బలహీనపడిందని రక్షణ శాఖ నోట్ పెట్టింది. ప్రధాని మోడి 2015 ఏప్రిల్ లో ఫ్రాన్స్ వెళ్ళి 36 రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు. జూన్ 2015లో 126 రాఫెల్ విమానాల కొనుగోలుకు యూపిఏ హయాం నుండి జరుగుతున్న చర్చలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా మీడియా పార్ట్ కధనం ద్వారా ఇండియా రాఫెల్ కొనుగోళ్లలో రు 41,000 కోట్లు నష్టపోయిందని పవన్ ఖేరా ఆరోపించారు.
సిబిఐ వర్గాల నుండీ, పిఎంఓ వర్గాల నుండి రాఫేల్ ఒప్పందంపై సమాచారం సేకరించిన సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ విచారణలో భాగంగా పిఎంఓ కార్యాలయంపై రైడింగ్ కి సిద్ధం అయ్యారని అందుకే సిబిఐ అదనపు డైరెక్టర్, డైరెక్టర్ అలోక్ వర్మ ల మధ్య వివాదాన్ని అడ్డం పెట్టుకుని అలోక్ వర్మను పదవి నుంచి తప్పించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మీడియా పార్ట్ తాజా కధనం దీనిని ధృవీకరిస్తున్నదని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై బిజేపి ప్రభుత్వం స్పందన ఏమిటి?
నాలుగు: జూన్ 24, 2014 తేదీన గుప్తా దాసో ఏవియేషన్ కంపెనీకి ఒక నోట్ పంపాడు. భారత్ కు చెందిన “పోలిటికల్ హై కమాండ్” తో కంపెనీ ప్రతినిధులకు సమావేశం ఏర్పాటు చేస్తానని ఈ నోట్ ద్వారా గుప్తా కంపెనీకి సమాచారం ఇచ్చాడు. మార్చి 26, 2019 తేదీన ఈడి (ఎన్ఫోర్స్^మెంట్ డైరెక్టరేట్) గుప్తా ఇంటిపై దాడి చేసి స్వాధీనం చేసుకున్న పత్రాల్లో ఈ నోట్ కూడా ఒకటని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా వెల్లడి చేశాడు. “ఈ సమావేశం జరిగిందా లేదా? మధ్యవర్తితో పోలిటికల్ హై కమాండ్ సమావేశం జరపడం జాతీయ భద్రతకు భంగమా కాదా? ఇది దేశద్రోహం కాదా? ‘అధికార రహస్యాల చట్టాన్ని ఇది ఉల్లంఘించి నట్లు కాదా?” అన్న ప్రతిపక్షాల ప్రశ్నకు సమాధానం?
ఐదు: బిజేపి రాజకీయ ప్రత్యర్ధులపై పదే పదే దాడులు చేస్తున్న ఈడి గుప్తా ఇంటి నుండి లభించిన ముఖ్యమైన రహస్య పత్రాలపై విచారణ ఎందుకు చేయడం లేదు?
ఆరు: రాఫెల్ ఒప్పందం నుండి అవినీతి వ్యతిరేకంగా చేర్చిన -నో బ్రైబరి, నో గిఫ్ట్, నో ఇన్ఫ్లూయెన్స్, నో కమిషన్, నో మిడిల్ మెన్- అన్న క్లాజులను బిజేపి ప్రభుత్వం తొలగించింది. (ఇండియా టుడే, ఫిబ్రవరి 29). అవినీతి నిర్మూలనకు కంకణం కట్టుకున్న మోడి ప్రభుత్వం ఈ తొలగింపుకు ఎందుకు పూనుకుంది?
రక్షణ పరికరాలు, ఆయుధాల కొనుగోళ్లలో మధ్యవర్తుల పాత్ర సర్వ సాధారణం అనీ, మధ్యవర్తుల పాత్ర లేకుండా ప్రపంచంలో ఎక్కడా మిలట్రీ కొనుగోళ్ళు జరగవనీ అనేక మంది రిటర్ట్ ఆర్మీ, నేవీ అధికారులు అనేకమార్లు కుండబద్దలు కొట్టారు. ఆయుధ కంపెనీలు ఒకదానికొకటి పోటీ పడే క్రమంలో కాంట్రాక్టులు గెలవడానికి మధ్యవర్తులను నియమించుకోవడం తప్పనిసరిగా భావిస్తాయని, ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం అని వారు చెప్పారు.
కనుక రక్షణ కొనుగోళ్లలో అవినీతి జరిగింది అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అదేమీ సంచలనం కాదు. ఎటొచ్చీ సాక్ష్యాధారాలతో దొంగలు దొరకడమే సంచలనం. ఈ కమీషన్ల దోపిడీకి పాలక పార్టీల్లో ఏ పార్టీ అతీతం కాదు. అంతమాత్రాన తమ అవినీతికి ఈ పార్టీలు ప్రజలకు జవాబుదారీ కాకుండా పోవు. కనుక కనీసం బైటపడ్డ సాక్ష్యాల వరకైనా ఈ పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలి. అది బోఫోర్స్ అయినా, ఆగస్టా వెస్ట్ ల్యాండ్ అయినా, రాఫేల్ యుద్ధ విమానాలైనా…! అదంతా ప్రజల సొమ్ము కనుక జవాబు చెప్పాలి. జవాబు చెప్పాల్సిన ప్రధాన బాధ్యత పాలక ప్రభుత్వంపైనే ఉంటుంది. ప్రతిపక్షాలపై ప్రత్యారోపణలు చేస్తే చేయవచ్చు గానీ తాము చెప్పాల్సిన సమాధానాలు మాత్రం పాలక బిజేపి చెప్పకుండా తప్పించుకోవడం ప్రజా ద్రోహమే అవుతుంది. అధికారంలో ఉన్న బిజేపి ప్రభుత్వం తక్షణమే రాఫేల్ అవినీతిపై అది కాంగ్రెస్ నేతలు చేసినా, బిజేపి నేతలు చేసినా విచారణ జరిపించాలి.