రాఫెల్ డీల్: లంచం సాక్ష్యాలున్నా సి‌బి‌ఐ దర్యాప్తు చేయలేదు!


Rafale Aircraft

ఫ్రాన్స్ యుద్ధ విమానాల కంపెనీ దాసో ఏవియేషన్ (Dassault Aviation), భారత దేశానికి రాఫేల్ యుద్ధ విమానాలు సరఫరా చేసిన సంగతి తెలిసిందే. యూ‌పి‌ఏ హయాంలోనే 125 విమానాల సరఫరాకు ఒప్పందం కుదిరినా అంతిమ ఒప్పందం సాగుతూ పోయింది. నరేంద్ర మోడి అధికారం చేపట్టిన వెంటనే ఈ ఒప్పందాన్ని పరుగులు పెట్టించాడు. ఒప్పందాన్ని ప్రభుత్వం-ప్రభుత్వం ఒప్పందంగా మార్చి 36 రాఫేల్ జెట్ విమానాలు సరఫరాకు ఒప్పందం పూర్తి చేశాడు.

ఈ ఒప్పందంలో లంచం చేతులు మారాయని ఫ్రెంచి పరిశోధనా వార్తల పోర్టల్ “మీడియాపార్ట్” ఆరోపిస్తోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్/యూ‌పి‌ఏ హయాంలో కొనుగోలు చేసిన అగాస్టా వెస్ట్ ల్యాండ్ వి‌వి‌ఐ‌పి చాపర్ కుంభకోణంలో దళారీగా లంచాలు వసూలు చేశాడని ఆరోపించి మోడి ప్రభుత్వం అరెస్టు చేసిన సుషేన్ గుప్తా యే రాఫేల్ డీల్ లోనూ దళారీగా లంచాలు వసూలు చేశాడని మీడియా పార్ట్ తాజాగా వెల్లడి చేసింది.

అంతే కాదు. సుషేన్ గుప్తాకు  దాసో ఏవియేషన్ కంపెనీ కనీసం (గరిష్టం ఎంతో తెలీదు) 7.5 మిలియన్ యూరోలు లంచంగా చెల్లించిందని మీడియా పార్ట్ తెలిపింది. 2007 నుండి 2012 వరకు విడతల వారీగా ఈ మొత్తం గుప్తాకు ముట్టిందని, ఇందుకు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ విచారణ చేసేందుకు సి‌బి‌ఐ మొగ్గు చూపడం లేదని మీడియా పార్ట్ ఆరోపిస్తోంది.

మోడి ప్రభుత్వం 2018లో 36 రాఫేల్ జెట్ విమానాల సరఫరాకు 7.87 బిలియన్ యూరోలు (అప్పటి మారకపు రేటు ప్రకారం రు 59,000 కోట్లు) చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది. జులై 29, 2020 నుండి రాఫేల్ యుద్ధ విమానాలు దేశానికి చేరడం మొదలయింది. ఇప్పటి దాకా 26 విమానాలు సరఫరా కాఫా 10 విమానాలు ఇంకా రావలసి ఉంది.

సహజంగా యుద్ధ విమానాలు తదితర యుద్ధ పరికరాల సరఫరా హంగామా లేకుండా దేశంలోకి సరఫరా అవుతాయి. కానీ మోడి ప్రభుత్వం హయాంలో రాఫేల్ యుద్ధ విమానాలు వస్తుండగా జనం వాటిని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నానా హాంగామా చేసారు. తుమ్మినా, దగ్గినా వాటినీ పి‌ఆర్ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం బి‌జే‌పి ప్రభుత్వాలకు ఒక అలవాటు అయింది.

7.5 మిలియన్ యూరోలు అంటే దాదాపు 64 కోట్ల రూపాయలకు సమానం. 1980ల చివర్లో దాదాపు ఇంతే మొత్తం బోఫోర్స్ తుపాకుల ఒప్పందంలో లంచాలు ముట్టినట్లు ఆరోపణలు రావడంతో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీవ్రంగా అప్రతిష్ట పాలయ్యింది.

మధ్యవర్తి సుషేన్ గుప్తా కు దాసో ఏవియేషన్ కంపెనీ ఐ‌టి కాంట్రాక్టులకు అసలు కంటే ఎక్కువ మొత్తం చెల్లించడం ద్వారా రాఫేల్ లంచం మొత్తాన్ని చేరవేసిందని ఫ్రెంచి పోర్టల్ మీడియా పార్ట్ వెల్లడించింది. సదరు ఐ‌టి కాంట్రాక్టులు పొందిన కంపెనీలు కేవలం పేపర్ కంపెనీలే తప్ప నిజమైనవి కావు. సరిగ్గా ఇదే పద్ధతిలో మారిషస్ లో స్ధాపించిన ఇంటర్ స్టెల్లార్ లిమిటెడ్ అనే పేపర్ కంపెనీ ద్వారానే అగాస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో సుషేన్ గుప్తా లంచాలు వసూలు చేశాడని సి‌బి‌ఐ ఆరోపించడం విశేషం.

అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో లంచాలు చేతులు మారేందుకు మధ్యవర్తిగా పని చేసినందుకు విచారణ జరిపి గుప్తాను అరెస్ట్ చేసిన సి‌బి‌ఐ రాఫేల్ కుంభకోణంలో విచారణ ఎందుకు చేపట్టడం లేదు? నిజానికి చెల్లింపులు జరిగిన కాలం 2007-2012 కూడా యూ‌పి‌ఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది. డబ్బు చేతులు మారిన పత్రాలు అక్టోబర్ 2018 నుండి సి‌బి‌ఐ కి అందుబాటులో ఉన్నాయని మీడియా పార్ట్ చెబుతోంది. అదే నిజమైతే సి‌బి‌ఐ రాఫేల్ లంచాలపై విచారణ ఎందుకు చేపట్టలేదు? మోడి ప్రభుత్వం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంది.

Dassault Aviation

“న ఖావూంగీ, న ఖానే దూంగీ” అన్నది ప్రధాని నరేంద్ర మోడి 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం. కానీ మోడి ప్రభుత్వం హయాంలో ప్రధాన అవినీతి విచారణ సంస్ధలన్నీ మాటా పలుకూ లేకుండా మూగవ్రతం పట్టాయి. లోక్ పాల్ పైన ఉద్యమాలు సైతం నడిపి ఇంతవరకు నియమించలేదు. అంబానీ విద్యుత్ కంపెనీపై విచారణకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశించిన తోడనే ఢిల్లీ ఏ‌సి‌బి ని ఢిల్లీ ప్రభుత్వం నుండి కేంద్రం లాగేసుకుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సి‌వి‌సి) ఏం చేస్తున్నారో తెలియదు. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) చడీ చప్పుడు చేయడం లేదు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ప్రధాన మంత్రిని పొగడటం తోనే సరిపోతోంది. లేదా బి‌జే‌పి యేతర ప్రభుత్వాల పైకి విచారణ బృందాలు పంపడం తప్ప మానవ హక్కుల హరణపై వస్తున్న ఫిర్యాదుల గురించి పట్టించుకోవడం లేదు.

మీడియా పార్ట్ ప్రకారం మారిషస్ కు చెందిన అటార్నీ జనరల్ కార్యాలయం అక్టోబర్ 11, 2018 తేదీన సి‌బి‌ఐ డైరెక్టర్ కు రాఫేల్ లంచాల తాలూకు పత్రాలను పంపింది. చాపర్ ఒప్పందం గురించిన వివరాలను కోరుతూ సి‌బి‌ఐ పంపిన విజ్ఞప్తి మేరకే దాసో ఏవియేషన్ పత్రాలను సైతం అందజేసింది. సరిగ్గా అప్పటికి వారం క్రితం అక్టోబర్ 4, 2018 తేదీన సుప్రీం కోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్, ఎన్‌డి‌ఏ మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరిలు రాఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగిందని చెబుతూ విచారణ చేయాలని సి‌బి‌ఐ కి ఫిర్యాదు చేశారు.

“… ఆయన (సుషేన్ గుప్తా) మారిషస్ కంపెనీ ఇంటర్ స్టెల్లార్ 2007-2012 మధ్య కాలంలో ఐ‌టి కాంట్రాక్టుల నిమిత్తం దాసో కంపెనీ నుండి అధిక మొత్తం రూపంలో 7.5 మిలియన్ యూరోలు అందుకుంది. అందులో అధిక మొత్తం తప్పుడు ఇన్వాయిస్ రూపంలో మారిషస్ కు వచ్చింది. ఇందులో కొన్ని ఇన్వాయిస్ లలో దాసో కంపెనీ స్పెల్లింగ్ ను తప్పుగా కూడా రాశారు. (Dassault బదులు Dassult)” అని మీడియా పార్ట్ తెలిపింది (ద హిందూ, 08/11/2021).

“భారత డిటెక్టివ్ లు సంపాదించిన ఇతర పత్రాల ప్రకారం 2015లో, రాఫేల్ ఒప్పందం అంతిమ చర్చల సందర్భంగా సుషేన్ గుప్తా భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుండి ఒప్పందానికి సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను సంపాదించాడు. ఇందులో ఒప్పందంపై భారత్ తరపున చర్చల్లో పాల్గొన అధికారులు ఎలాంటి అభిప్రాయాలను కలిగి ఉన్నదీ వివరాలు ఉన్నాయి. ముఖ్యంగా యుద్ధ విమానాల ధరను వారు ఏ విధంగా లెక్క గట్టిందీ వివరాలు ఉన్నాయి. దాసో కంపెనీ ఈ పత్రాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. సుషేన్ గుప్తా ను కూడా మీడియా పార్ట్ సంప్రదించింది. ఆయన కూడా ఏమీ స్పందించలేదు” అని మీడియా పార్ట్ వెల్లడి చేసింది.

రాఫేల్ జెట్ ను పోలిన రిప్లికా నమూనాలను 50 తయారు చేయాలని కోరుతూ దాసో కంపెనీ గుప్తా కుటుంబానికి చెందిన డెఫ్ సిస్ కంపెనీకి 1 మిలియన్ యూరోలు చెల్లించిందని మీడియా పార్ట్ ఏప్రిల్ 2021లో వెల్లడి చేసింది. రాఫేల్ ఒప్పందంపై విచారణ చేసేందుకు ఫ్రెంచి జడ్జి నిర్ణయించాడని జులై లో అదే పోర్టల్ తెలిపింది. ఈ విచారణకు ఫ్రెంచి జాతీయ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్ కార్యలయం ఆదేశించినట్లు తెలుస్తోంది.

కానీ భారత ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందనా లేదు.

పంజరంలో చిలుక సి‌బి‌ఐ తన యజమాని చెప్పమన్న మాటలనే చెబుతుంది. కనుక ప్రస్తుత యజమాని మోడి ప్రభుత్వం మీడియా పార్ట్ ఆరోపణల్లో వాస్తవం ఏమిటో దేశ ప్రజలకు తెలియజేయాల్సి ఉంది. రిపబ్లిక్ టి‌వి చీఫ్ ఎడిటర్ మాటల్లో చెప్పాలంటే

“THE NATION WANTS TO KNOW!”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s