రష్యన్ పి‌ఎం‌సిలు: సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల్లో తిష్ట -3


Yevgeny Prigozhin (Left) with Putin in Nov 2011 -Reuters

సబ్-సహారా ఆఫ్రికా

సబ్ సహారన్ ఆఫ్రికా దేశాలు సంపద్వంతమైన ఖనిజ వనరులకు నిలయం. సహారా ఎడారికి దక్షిణాన ఉన్న దేశాలను సబ్-సహారా ఆఫ్రికా గా పరిగణిస్తారు. ఉత్తరాన సహారా ఎడారి దేశాలు, దక్షిణాన అడవులతో నిండిన ఇతర ఆఫ్రికా దేశాలకు మధ్య అటు పూర్తిగా ఎడారి కాకుండా, ఇటు పూర్తిగా పంటలు సమృద్ధిగా పండేందుకు వీలు లేకుండా ఉన్న ప్రాంతాన్ని సహేలి ప్రాంతం అంటారు. పశ్చిమాన సెనెగల్ నుండి తూర్పున సోమాలియా వరకు ఒక బెల్ట్ లాగా ఈ ప్రాంతం విస్తరించి ఉంటుంది.

2014 నుండే కాంగోలో కాలు మోపిన రష్యన్ పి‌ఎం‌సిలు ఉక్రెయిన్, సిరియా, లిబియాలలో కార్యకలాపాలు ప్రారంభించాక కాంగోలో కూడా తమ కార్యకలాపాలు విస్తరించాయి. అనంతర కాలంలో సూడాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (సి‌ఏ‌ఆర్), మొజాంబిక్, మడగాస్కర్ దేశాలకు విస్తరించాయి. ఒక్కో దేశంలో ఒక్కో అవసరాన్ని తీర్చే రష్యన్ పి‌ఎం‌సిలు మొత్తంగా చూస్తే మిలట్రీ మరియు భద్రతా సేవలు అందజేస్తూ ఆర్ధిక ఫలితాలు పొందడం, ఐరాస లాంటి చోట్ల రాజకీయ ప్రయోజనాలు సాధించడం వాటి కార్యక్రమంగా చెప్పవచ్చు.

సూడాన్: అప్పటి అధ్యక్షుడు ఒమర్ ఆల్-బషీర్ కు మిలట్రీ మరియు రాజకీయ మద్దతు అంద జేయడం కోసం వ్యాగ్నర్ గ్రూప్ బలగాలు సూడాన్ లో ప్రవేశించాయి. ప్రతిఫలంగా బంగారు గనుల తవ్వకంలో రష్యా కంపెనీలు కొన్ని రాయితీలు పొందాయి. సూడాన్ లో అడుగు పెట్టడం ద్వారా ఎర్ర సముద్రం లో మిలట్రీ స్ధావరం నెలకొల్పేందుకు రష్యా ప్రయత్నిస్తోందని అమెరికా, పశ్చిమ దేశాలు ఆరోపిస్తాయి. కానీ ఆ వైపుగా ప్రయత్నాలు రష్యా నుండి లేవు.

నవంబర్ 2017లో ఎం ఇన్వెస్ట్ కంపెనీ సూడాన్ లో మైనింగ్ ఒప్పందాలు సంపాదించింది. డిసెంబర్ 2017లో మైనింగ్ ప్రయోజనాల పరిరక్షణ కోసం దిగిన వ్యాగ్నర్ బలగాలు స్ధానిక బలగాలకు మిలట్రీ శిక్షణ ఇవ్వడం ప్రారంభించాయి. అధ్యక్షుడు బషీర్ కు వ్యతిరేకంగా వివిధ గ్రూపులు, మిలీషియాలు ఆందోళనలు చెలరేగిన సందర్భంగా అధ్యక్షుడికి పరిమిత రక్షణ కల్పించాయి.

ప్రచ్చన్న యుద్ధ కాలంలోనూ సూడాన్, సోవియట్ రష్యాలు మధ్య సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. మొదటి సివిల్ వార్ (1955-1972) లో, రెండవ సివిల్ వార్ (1983-2005) లో రష్యన్ బలగాలు ప్రభుత్వం పక్షాన రక్షణ అవసరాలు తీర్చాయి. 1991లో ప్రచ్చన్న యుద్ధం అంతం అయ్యాక ప్రత్యక్ష సంబంధాలు, సహకారం నెమ్మదించినా ప్రైవేటు సంబంధాలు కొనసాగాయి. డార్ఫర్ తిరుగుబాటు అణచివేత సందర్భంగా ఐరాస తీర్మానాన్ని ఉల్లంఘిస్తూ బషీర్ ప్రభుత్వానికి ఆయుధాలు సరఫరా చేసినట్లు అమెరికా ఆరోపించింది. భౌగోళిక-రాజకీయ ప్రయోజనాల లక్ష్యంతో చేసే ఈ తరహా ఆరోపణలు నిజం కావచ్చు, కాకపోనూవచ్చు. వాటికి చట్టబద్ధమైన విలువ ఆపాదించలేము.

అమెరికా, పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని తిరస్కరించిన ఆల్-బషీర్ నేతృత్వంలోని సూడాన్ ను  అంతర్జాతీయంగా ఆ దేశాలు ఒంటరిని చేశాయి. ఈ ఒంటరితనం నుండి రష్యా సూడాన్ ను బైటపడవేసిందని చెప్పవచ్చు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో బషీర్ ను విచారించాలన్న తీర్మానాన్ని రష్యా అనేకమార్లు వీటో చేసింది. ప్రతిగా జార్జియా-రష్యా యుద్ధం (2008), క్రిమియా పునరైక్యం (2014) సందర్భంగా సూడాన్ ఐరాసలో రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది.

2017లో బషీర్ రష్యా సందర్శించినప్పుడు సూడాన్ ఎర్ర సముద్ర తీరంలో నౌకా స్ధావరం ఏర్పాటు చేయవలసిందిగా రష్యాను ఆహ్వానించాడు. 2018 లోనూ ఆహ్వానాన్ని పునరుల్లేఖించాడు. కానీ నౌకా స్ధావరం ఏర్పాటు బాగా ఖర్చుతో కూడుకున్నది. ఖర్చుకు తగిన లబ్ది పొందే పరిస్ధితులు ఇప్పుడు లేవు. పైగా సూడాన్ లో, చుట్టూ పక్కల దేశాల్లో చైనా చమురు ప్రయోజనాలతో, టర్కీ స్నేహ ప్రయోజనాలతో వైరుధ్యం తలెత్తే అవకాశం ఉంది. దానితో సూడాన్ ఆహ్వానాన్ని రష్యా స్వీకరించలేదు.

సూడాన్ లో రష్యన్ పి‌ఎం‌సి లు ప్రధానంగా రష్యా వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణలో, బషీర్ బలగాలకు శిక్షణ ఇవ్వడంలో, ప్రభుత్వ అధికారులు, నాయకులకు రక్షణ కల్పించడంలో పాల్గొన్నాయి. అయితే ఏప్రిల్ 2019లో జరిగిన కుట్రలో ఆల్-బషీర్ పదవీచ్యుతుడై జైల్లో బందీ అయ్యాడు. బషీర్ అనంతరం రష్యా ప్రయోజనాలు అక్కడ చెక్కుచెదరలేదు గానీ పి‌ఎం‌సిల పాత్ర ఏయే రంగాలలో కొనసాగుతున్నదో బైటికి రాలేదు. నూతన ప్రభుత్వం మొదట బషీర్ ను ఐ‌సి‌సి కి అప్పగించేందుకు నిరాకరించింది. ఇప్పుడు అందుకు సమ్మతిస్తోంది. కొత్త పాలకులకు ఈజిప్టు, యూ‌ఏ‌ఈ, సౌదీ అరేబియా, చైనా, టర్కీ, రష్యాల మద్దతు కొనసాగుతోంది. దీనర్ధం పశ్చిమ దేశాలు సూడాన్ కు దూరంగానే ఉన్నట్లు.

Central African Republic

సి‌ఏ‌ఆర్ – సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్: సి‌ఏ‌ఆర్ లో 2017 నుండి వ్యాగ్నర్, ప్యాట్రియాట్ కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. జనవరి 2018 లో వాటి కార్యకలాపాలు నిర్దిష్టంగా మిలట్రీ శిక్షణ, భద్రతా కల్పనగా మొదలయ్యాయి. ముఖ్యంగా అధ్యక్షుడు ఫాస్టిన్ ఆర్చాంజ్ టువాడెరా కు వ్యక్తిగత భద్రత కల్పిస్తున్నాయి. ప్రతిఫలంగా బంగారం యురేనియం, వజ్రాలు గనుల తవ్వకాల్లో రష్యన్ కంపెనీలకు వాటా లభించినట్లు తెలుస్తోంది.

సి‌ఏ‌ఆర్ ఖనిజ వనరులు ఉన్నప్పటికీ అత్యంత పేద దేశం. 2012 నుండి తెగల పోరాటాలు, మత ఘర్షణలతో సతమతమవుతోంది. 2016 లో అధ్యక్షుడుగా ఎన్నికయిన టువాడేరా జాన్ 2017లో సెయింట్ పీటర్స్ బర్గ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొని రష్యాతో మిలట్రీ సహకారం అర్ధించాడు. సి‌ఏ‌ఆర్ పై భద్రతా సమితి విధించిన ఆయుధ నిషేధం ఎత్తివేతలో రష్యా సహాయం కోరాడు. రష్యా ఒత్తిడితో భద్రతా సమితి సి‌ఏ‌ఆర్ కు ఆయుధాలు, మిలట్రీ శిక్షకులు రష్యాకు డిసెంబర్ 2017లో తీర్మానం 2127 ద్వారా అనుమతి ఇచ్చింది.

సి‌ఏ‌ఆర్ సమాచార విభాగం డెప్యూటీ డైరెక్టర్ ఆర్టిమ్ కొఝిమ్ రష్యాతో ఒప్పందం గురించి ఇలా ప్రకటించాడు. “బంగుయి (సి‌ఏ‌ఆర్ రాజధాని) కి ఉచితంగా మిలట్రీ-సాంకేతిక సహాయం అందించేందుకు రష్యా నిర్ణయించింది. సి‌ఏ‌ఆర్ సహజ వనరులను పరస్పరం ప్రయోజనకరంగా ఉండే విధంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తోంది.” ఈ ఒప్పందం మేరకు రష్యా 170 మండి సివిల్ కాంట్రాక్టర్లను స్ధానిక మిలట్రీకి శిక్షణ ఇచ్చేందుకు పంపింది. టువాడేరా కు జాతీయ భద్రతా సలహాదారుగా కూడా రష్యా మిలట్రీ అధికారినే (వ్యాలరీ ఝకరోవ్) నియమించుకున్నాడు.

రష్యన్ కంపెనీ ఎం-ఇన్వెస్ట్ ఎండస్సిమా ప్రాంతంలో బంగారు గనుల తవ్వకం కాంట్రాక్టు చేజిక్కించుకుంది. ఈ ప్రాంతం ముస్లిం తిరుగుబాటుదారులకు కేంద్రంగా ఉండేది. రష్యా పి‌ఎం‌సి లు వారిని తరిమేసి తవ్వకాలు జరుపుతున్నాయి. రష్యా బలగాల ప్రవేశానికి ఐరాస అనుమతి ఉండడం రష్యాకు ప్లస్ అయింది. బంగారం, వజ్రాలు తవ్వకంలో రష్యన్లు నిమగ్నం అయినట్లు చెబుతున్నప్పటికీ వాస్తవంగా సి‌ఏ‌ఆర్ లో సదరు తవ్వకాలకు పెద్దగా ప్రాధ్యాన్యత లేదని తెలుస్తోంది. సి‌ఏ‌ఆర్ లో తిష్ట వేయడం ద్వారా ఉత్తరాన సూడాన్ పైనా దక్షిణాన అంగోలాపై దృష్టి సారించవచ్చన్నది రష్యా ఎత్తుగడగా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో వలస కాలం నుండి బలమైన ఉనికి కలిగిన ఫ్రాన్స్ ప్రయోజనాలకు రష్యా ప్రవేశం చైనాతో పాటు పెద్ద సవాలు విసురుతోంది. ఫ్రాన్స్ తన పట్టు నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ అది క్రమంగా బలహీనం కావడం స్పష్టంగా కనిపిస్తోంది.

Mozambique

రిపబ్లిక్ ఆఫ్ మొజాంబిక్: మొజాంబిక్ లోని క్యాబో డెల్గాడో రాష్ట్రంలో ఇస్లామిక్ తిరుగుబాటుదారులు సాయుధ ఘర్షణలకు పాల్పడుతున్నారు. ఈ రాష్ట్రంలో సహజ వాయువు లభిస్తుంది. రష్యన్ పి‌ఎం‌సి వ్యాగ్నర్ నుండి మిలట్రీ మద్దతు ఆహ్వానించడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న ప్రయోజనాన్ని మొజాంబిక్ ఆశించింది. తిరుగుబాటుదారులను పారద్రోలడం, సహజ వాయువును వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించడం.

సెంప్టెంబర్ 2019 లో వ్యాగ్నర్ కిరాయి బలగాలు మొజాంబిక్ లో ప్రవేశించాయి. అయితే నిర్దేశిత కార్యకలాపానికి అవి సంసిద్ధంగా లేకపోవడం, స్ధానిక బలగాలతో సమన్వయం కొరవడడంతో గణనీయ నష్టాలను చవిచూసినట్లు తెలుస్తోంది. రెండు నెలలకే దక్షిణాన నకాలా ప్రాంతానికి రష్యన్ పి‌ఎం‌సి లు మళ్ళాయి. అక్కడ పునఃసమీకరణ కావించుకుని ఫిబ్రవరి, మార్చి 2020 ల్లో అదనపు యుద్ధ సామాగ్రి, బలగాలతో ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయాయి. దానితో ఏప్రిల్ 2020 లో రష్యన్ పి‌ఎం‌సి ల స్ధానంలో దక్షిణాఫ్రికా పి‌ఎం‌సి డైక్ అద్వైజరీ గ్రూప్ ను మొజాంబిక్ ఆహ్వానించింది.

అంగోలాతో పాటు మొజాంబిక్ కూడా సోవియట్ రష్యా, ఆ తర్వాత రష్యాలతో గట్టి సంబంధాలు కలిగి ఉన్నాయి. 2015లో సాంకేతిక-మిలట్రీ సహకార ఒప్పందం కుదిరాక సంబంధాలు చురుకయ్యాయి. ఆగస్టు 2019లో అధ్యక్షుడు ఫిలిప్ జసింతో తిరిగి ఎన్నికయ్యాక సంబంధాలు మరింత దృఢం అయ్యాయి.

ఇందుకు రెండు కారణాలు పని చేశాయి. ఒకటి: పశ్చిమ చమురు, గ్యాస్ కార్పొరేషన్ లు రుద్దిన అసమాన ఒప్పందాలతో అసంతృప్తి చెంది ఉన్న మొజాంబిక్ రాజకీయ, వాణిజ్య వర్గాలు రష్యా కంపెనీ రోస్ నేఫ్ట్ ఆహ్వానించడానికి మొగ్గు చూపారు. ఇంధనం తవ్వకాలను వైవిధ్యీకరించాలన్న రాజకీయ నిర్ణయం ఇందుకు తోడ్పడింది. రెండు: సహజవాయువు సంపన్న రాష్ట్రంలో వేళ్లూనుకున్న టెర్రరిస్టులతో, ఇస్లామిక్ సంస్ధలతో తలపడడం ప్రభుత్వ బలగాలకు సమర్ధత కరువైంది.

ఉక్రెయిన్, సిరియా, లిబియాలలో టెర్రరిస్టులతో సమర్ధవంతంగా తలపడినట్లు రష్యా పేరు సంపాదించడంతో మొజాంబిక్ నేతలకు రష్యా సహజ ఎంపిక అయింది. అయితే మొజాంబిక్ నమ్మకాన్ని రష్యా నిలబెట్టుకోలేకపోయింది. బాషాపరమైన అడ్డంకి వలన సమన్వయం కుదరకపోవడమే రష్యన్ పి‌ఎం‌సి ల వైఫల్యానికి కారణమని తెలుస్తోంది. రష్యన్ పి‌ఎం‌సి లు ఇంకా అక్కడ కొనసాగుతున్నదీ లేనిదీ ఇదమిద్ధంగా తెలియరాలేదు.

కాంగో (డి‌ఆర్‌సి – డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో): ఆఫ్రికా ఖండంలో దాదాపు మధ్యలో ఉండే విస్తారమైన దేశం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. దీని పేరు గతంలో రిపబ్లిక్ ఆఫ్ జైరే లేదా జైరే. 1971 ముందు కూడా డి‌ఆర్‌సి పేరుతో ఉన్న ఈ దేశం 1971 నుండి 1997 వరకు జైరే పేరుతోనే ఉన్నది. ఈ దేశంలో రష్యన్ పి‌ఎం‌సిల కార్యకలాపాల గురించి సరైన సమాచారం అందుబాటులో లేదు.

కాంగో ప్రతిపక్ష నేత క్రిస్టియన్ మలంగా 2019లో చేసిన వ్యాఖ్య ఆఫ్రికాలో నెలకొన్న భౌగోళిక-రాజకీయ పరిస్ధితికి అద్దం పడుతుంది. ఆయన ప్రకారం “ఆఫ్రికాలో నూతన అమరిక ఏర్పడే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. చైనా డబ్బు బలంతో వస్తుంటే రష్యా కండ బలంతో వస్తోంది. కొన్ని ఆర్ధిక ప్రతిఫలాలు, ఇతర రాయితీలు పొందుతూ బదులుగా మిలట్రీ-సాంకేతిక సేవలను కొన్ని ఆఫ్రికా దేశాలకు రష్యా సమకూర్చవచ్చు. ఆఫ్రికాలో పశ్చిమ శక్తులు క్రమంగా బలహీనపడుతున్న నేపధ్యంలో ఇది అనివార్యంగా కనిపిస్తోంది.”

Madagaskar

మడగాస్కర్ కు 2018 వసంత కాలంలో ఒక చిన్న రాజకీయ విశ్లేషకుల బృందాన్ని వ్యాగ్నర్ గ్రూపు మడగాస్కర్ కు పంపింది. అధ్యక్షుడు హెరి రాజేనేరియంపినీనా ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తున్న సందర్భంగా ఆయన తిరిగి ఎన్నిక కావడానికే ఈ గ్రూపు లక్ష్యమని పశ్చిమ దేశాలు ఆరోపించాయి. ఫలితంగా క్రోమైట్, బంగారం, చమురు తవ్వకాలలో, వ్యవసాయ రంగంలో, అలాగే తోమాసినా రేవు పట్నంలో భాగస్వామ్యం పొందటం రష్యా లక్ష్యం అని వారి ఆరోపణ. ఎన్నికల్లో జోక్యం అన్న ఆరోపణ పశ్చిమ దేశాలు తరచుగా పాడే పాట. ఎన్నికల్లో హెరీ ఓటమి చెందినందున ఇది అనుమానాస్పదం. 

2018 ఏప్రిల్ లో మిలట్రీ శిక్షణ కోసం అదనపు బలగాలు మడగాస్కర్ కు వచ్చాయి. ఈ శిక్షణలో రష్యన్ ఇంటలిజెన్స్ సంస్ధ జి‌ఆర్‌యూ అధికారులు పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. హెరీ ఓటమి చెందినప్పటికీ పదవి దిగే లోపు రష్యాతో ఒప్పందాలు పూర్తి చేశాడు. ఒప్పందం మేరకు రష్యన్ కంపెనీ ఫెర్రమ్ మైనింగ్ మడగాస్కర్ లో కార్యకలాపాలు ప్రారంభించింది. కానీ కార్మికుల సమ్మెతో కంపెనీ పనులు ముందుకు సాగలేదు.

లాటిన్ అమెరికా దేశం వెనిజులాతో రష్యా సంబంధాలకు పరిచయం అవసరం లేదు. హ్యూగో చావేజ్ రేడియో ధార్మిక పదార్ధం పోలోనియమ్ ప్రయోగం ద్వారా హత్యకు గురయ్యాక ఆయన సూచనతో వెనిజులా ప్రజలు మదురో ను అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. ఆయన్ను పదవి నుండి దింపడానికి, హత్య చేయడానికి అమెరికా, పశ్చిమ దేశాలు చేయని ప్రయత్నం లేదు. చమురు వాణిజ్యంపై ఆంక్షలు, పశ్చిమ దేశాల తొత్తులైన ధనిక వర్గాలతో కూడిన ప్రతిపక్షాలతో హింసాయుత అల్లర్లు రెచ్చగొట్టడం, వాటికి తిరిగి మడురోనే బాధ్యుడిని చేయడం… చాలా చేశాయి. అయితే ప్రజా మద్దతు వలన ఆ ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి.

ఈ నేపధ్యంలో రష్యన్ చమురు కంపెనీ రోస్ నేఫ్ట్ కు చమురు, సహజవాయువు తవ్వకాలను వెనిజులా అప్పగించింది. స్ధానిక వెనిజులా కంపెనీలు ఉన్నప్పటికీ అవి మదురోకు సహకరించకుండా విద్రోహ కార్యకలాపాలకు దిగడంతో వెనిజులా రష్యా సహాయం కోరింది. అమెరికా మరియు వెనిజులా సంపన్న వర్గాల కుట్రలను తిప్పి కొట్టాలంటే రష్యా చమురు కంపెనీకి సాయుధ మద్దతు తప్పనిసరి అవసరం. ఆ విధంగా 2017 నుండి రష్యన్ పి‌ఎం‌సి లు వెనిజులాలో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నాయి. అధ్యక్షుడు నికోలస్ మదురో కు రక్షణ కల్పించడం, ప్రత్యేక భద్రతా బలగాలకు శిక్షణ ఇవ్వడం, గూఢచార కార్యకలాపాలు నిర్వహించడం, సైబర్ సెక్యూరిటీ సేవలు అందజేయడం.. మొ.న కార్యకలాపాల్లో రష్యన్ పి‌ఎం‌సి లు పని చేస్తున్నాయి.

రష్యా ప్రభుత్వ బలగాలైనా, పి‌ఎం‌సి లైన సరే వెనిజులా స్వతంత్ర మనుగడకు ప్రస్తుత పరిస్ధితుల్లో అత్యవసరంగా మారాయి. ఇందులో రష్యా భౌగోళిక-రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్నప్పటికీ వెనిజులా కు మరో గత్యంతరం లేదు. ముఖ్యంగా వెనిజులా సామాన్య ప్రజల ప్రయోజనాలను అమెరికా దుర్మార్గ దాడుల నుండి కాపాడేందుకు రష్యన్ మిలట్రీ, పి‌ఎం‌సి ల సహాయం, సహకారం అనివార్యం.

ముగింపు:

ఇప్పటివరకు చూసినదాన్ని బట్టి రష్యన్ పి‌ఎం‌సి లు తమ ఉనికి ఉన్న అన్నీ చోట్లా అచ్చంగా రష్యా బౌగోళిక-రాజకీయ ఆధిపత్య ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయడం లేదు. రష్యా వాణిజ్య ప్రయోజనాల విస్తరణ, అమెరికా-పశ్చిమ రాజ్యాల నుండి ముప్పేట (మిలట్రీ చుట్టివేత, వాణిజ్య ఆంక్షలు, రాజకీయ వెలివేత) ఎదురవుతున్న దాడుల నుండి రష్యా దౌత్య-రాజకీయ సంబంధాలను కాపాడుకుని విస్తరించుకోవడం వాటి ప్రధాన లక్ష్యంగా ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల ఆధిపత్య ప్రయోజనాలు బలహీనపడితే తానే ఆధిపత్యం చెలాయించగల పరిస్ధితి వస్తే రష్యన్ పి‌ఎం‌సి లు ఆ వైపుగా రష్యా తరపున కృషి చేయబోవు అన్న గ్యారంటీ లేదు.

ఈ వ్యాసంలో ముందే చెప్పుకున్నట్లు సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం. భౌగోళిక రాజకీయ రంగంలో, సాంకేతిక రంగంలో, మిలట్రీ ఆవిష్కరణల రంగంలో వేగంగా జరుగుతున్న మార్పులు వివిధ శక్తుల బలాబలాలను సీసా బల్ల తరహాలో మార్పులకు గురి చేస్తున్నాయి. ఒక చోట బలం కోల్పోయిన శక్తి మరోచోట బలం పుంజుకుంటోంది. వివిధ దేశాల మధ్య సంబంధాలు వివిధ చోట్ల ఒకే సమయంలో ఒకే విధంగా లేవు. ఒకే చోట కూడా వివిధ కాలాల్లో ఒకే విధంగా ఉండడం లేదు. త్వరితగతిన మార్పులు జరుగుతున్నాయి.

ఆకస్ ఒప్పందం ద్వారా అమెరికా-ఫ్రాన్స్ సంబంధాలు తీవ్రంగా దెబ్బ తిన్నప్పటికీ మరికొద్ది వారాల్లోనే ఇరువురూ చర్చించుకుని సంబంధాలు బాగుపడినట్లు ప్రకటించారు. టర్కీ-రష్యాలు సిరియాలో కొంతకాలం సహకరించుకున్నాయి. ఇప్పుడు ఘర్షణ పడుతున్నాయి. యూ‌ఏ‌ఈ, ప్రాంతీయ ఆధిపత్యం కోసం సౌదీ అరేబియాతో పోటీ పడుతూనే మరో చోట (సూడాన్) అదే దేశంతో ఉమ్మడి అవగాహన కలిగి ఉన్నది.

ఐరోపా దేశాలు చమురు, సహజవాయువు వాణిజ్యంలో రష్యాతో సహకరించుకుంటూ మిలట్రీ రంగంలో నాటో వేదికగా ఘర్షణకు దిగుతున్నాయి. రష్యాతో స్నేహం-ఘర్షణ విషయంలో ఈ‌యూ దేశాల మధ్యనే వైరుధ్యాలు తలెత్తుతున్నాయి. ఈరోజు వైరుధ్యం సమసి పోయినట్లు కనిపిస్తే మరుసటి రోజు ఘర్షణ తీవ్రం అయినట్లు సూచించే ఘటనలు జరుగుతున్నాయి.

ఈ పరిస్ధితికి కారణం వివిధ శక్తులు అనుకూల-ప్రతికూల శక్తులకై సాగిస్తున్న అన్వేషణ. ఆధిపత్య సామ్రాజ్యవాద శక్తుల బలాబలాల పొందికలో వస్తున్న మార్పుల నేపధ్యంలో నమ్మకమైన మిత్రుల కోసం అన్ని రాజ్యాలూ అన్వేషిస్తున్నాయి. వీరిలో శక్తివంతమైన దేశాల అన్వేషణ ఒక స్ధాయిలో లేదా ఒక తలంలో కొనసాగుతుండగా ఆధీన దేశాల అన్వేషణ మరో తలంలో, మరో లక్ష్యంతో (నమ్మకమైన లాభసాటి యజమాని కోసం) కొనసాగుతున్నాయి. ఆధీన దేశాల నమ్మకం చూరగొనేందుకు ఆధిపత్య రాజ్యాలు అనేక ఎత్తులు, పై ఎత్తులు ప్రయోగిస్తున్నాయి. ఒక చోట ఓడుతూ మరో చోట గెలుస్తున్నాయి. ఈ సంధికాలం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పడానికి మరో లెనిన్ లాంటి కార్మిక వర్గ మేధావి పుట్టవలసిందే.

(……………………….. అయిపోయింది)

2 thoughts on “రష్యన్ పి‌ఎం‌సిలు: సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల్లో తిష్ట -3

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s