విస్తరిస్తున్న రష్యన్ ప్రైవేట్ మిలట్రీ కార్యకలాపాలు -2


Spread of Russian PMCs

అనధికారికంగానే అయినా రష్యన్ పి‌ఎం‌సి లు రష్యాకు చెందిన పలు వ్యూహాత్మక, ఆర్ధిక, రాజకీయ లక్ష్యాలను నెరవేరుస్తున్న సంగతి కాదనలేనిది. ఈ ప్రయోజనాలు:

1. విదేశీ విధానం:. పి‌ఎం‌సిల ద్వారా రష్యా ప్రభావం విస్తరిస్తోంది. ముఖ్యంగా భద్రతా రంగంలో. దానితో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వేతర శక్తులతోనూ స్నేహ సంబంధాలు పెంపొందుతున్నాయి.

2. మిలట్రీ ప్రయోజనాలు: ప్రత్యేక బలగాల (స్పెషల్ ఫోర్సెస్) ద్వారా శిక్షణ పొందిన ప్రైవేటు బలగాలు ప్రత్యేకమైన నైపుణ్యం, సామర్ధ్యం కలిగి ఉంటాయి. ఈ బలగాల ప్రవేశం ద్వారా పరోక్షంగా రష్యన్ మిలట్రీ విస్తరణ జరుగుతోంది. ఓ పక్క తమకు సంబంధం లేదని చెబుతూనే వివిధ ఘర్షణల్లో తలదూర్చడం ద్వారా సదరు ప్రాంతంలో తన భాగస్వాములను బలపరిచి తద్వారా మిలట్రీ శక్తి సమతూకంలో తనకు అనుకూల మార్పులు చేయగల అవకాశం పరిమితంగానైనా రష్యాకు లభిస్తోంది. ప్రైవేటు బలగాలు చనిపోతే రష్యా ప్రజల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు.

3. గూఢచార సమాచార సేకరణ: ప్రైవేటు మిలట్రీ బలగాలలో కొంతమంది ప్రభుత్వ మిలట్రీలో పని చేసి ఉంటారు. శిక్షణ ఇచ్చేది కూడా మిలట్రీయే. కనుక భౌగోళికంగా కీలకమైన ప్రాంతాల్లో గూఢచార సమాచారం సేకరించే వీలు కలుగుతోంది. ఈ సమాచారం రష్యా ప్రభుత్వ దౌత్య, రక్షణ, రాజకీయ నిర్ణయాలకు సహాయకారి అవుతుంది.

4. ఆర్ధిక ప్రయోజనాలు: పి‌ఎం‌సిలకు తరచుగా ఇంధనం, మైనింగ్, రవాణా, భద్రతా కంపెనీలు నిధులు సమకూర్చుతాయి. కార్పొరేట్ బహుళజాతి కంపెనీలు తమ వాణిజ్య ప్రయోజనాల సంరక్షణ కోసం ప్రైవేటు సైన్యాన్ని పోషించడం కొత్త విషయం కూడా కాదు. కనుక రష్యన్ పి‌ఎం‌సి లు అనివార్యంగా ఖనిజాలు, చమురు, గ్యాస్ వనరులతో పాటు రవాణా రంగంలో కాంట్రాక్టుల కోసం లాబీయింగ్ జరుపుతాయి. ఆ విధంగా ఆర్ధిక రష్యా ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చు. అమెరికా, ఐరోపాలు ఉక్రెయిన్ సాకుతో రష్యాపై ఆంక్షలు విధించిన నేపధ్యంలో ఇది రష్యా అవసరం కూడా. ఆర్ధిక ప్రయోజనాలు ఉన్న చోట రాజకీయ, ద్రవ్య ప్రయోజనాలు వెంట వస్తాయి.

5. మీడియా: Embedded Journalism అన్నది పశ్చిమ రాజ్యాలు ఆఫ్ఘన్, ఇరాక్, సిరియా, లిబియా దురాక్రమణ దాడుల సమయంలో ప్రాచుర్యంలోకి తెచ్చిన అలవాటు. యుద్ధంలోని సైనికులతో పాటు విలేఖరులు కూడా కలిసి పని చేస్తూ అనుకూలమైన వార్తలు -ఉన్నవీ, లేనివీ- ప్రచారంలో పెట్టడం ద్వారా యుద్ధం ఎంత అవసరమో ప్రపంచానికి చెబుతారు. అసలు నిజాలు బైటికి వెళ్ళేలోపే జరిగిన ఘటనలను సానుకూలంగా మలిచి ప్రచారంలో పెడతారు. రష్యన్ పి‌ఎం‌సి లు ఈ వ్యూహాన్ని ఎంచుకుని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. పి‌ఎం‌సిలతో కలిసి యుద్ధరంగంలో లేకపోయినా సదరు కంపెనీలే వార్తల పోర్టల్స్ ను స్ధాపించి నడుపుతున్నాయి. నిజానికి పశ్చిమ కార్పొరేట్ ఛానెళ్లు, పత్రికలు అన్నీ దాదాపు ఈ పనిలో పండిపోయాయి. పి‌ఎం‌సి ల ద్వారా రష్యా ఈ కార్యాన్ని సులువుగా నిర్వర్తిస్తోంది.

ముందే చూసినట్లు ఉక్రెయిన్ లో మొదట రష్యన్ పి‌ఎం‌సి లు 2014లో కార్యకలాపాలు ప్రారంభించాయి. 2015లో తూర్పు ఉక్రెయిన్, ఉక్రెయిన్ ల మధ్య ఘర్షణ తీవ్ర స్ధాయికి చేరేనాటికి వాగ్నర్ గ్రూపు 2,500 నుండి 5,000 వరకు బలగాలను తూర్పు ఉక్రెయిన్ కు సహాయంగా పంపినట్లు ఒక అంచనా. ఉక్రెయిన్ ను అస్ధిరీకరించడానికి రష్యన్ పి‌ఎం‌సి లు పని చేశాయని అమెరికా, యూ‌కే, ఫ్రాన్స్ లు ఆరోపిస్తాయి. కానీ వాస్తవానికి ఉక్రెయిన్ లో చిచ్చు పెట్టింది అమెరికాయే. ఎన్నికల్లో నెగ్గిన విక్టర్ యనుకోవిచ్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు నయా నాజీ శక్తులతో ఆందోళనలు రెచ్చగొట్టి వారికి సహాయంగా ప్రైవేటు కిరాయి సైనికులను దించింది. వారి చేతుల్లో చనిపోవలసిన యనుకొవిచ్ తృటిలో తప్పించుకుని రష్యా చేరాడు.

సిరియా

ఉక్రెయిన్ అనంతరం రష్యన్ పి‌ఎం‌సి లు సిరియాలో ప్రవేశించి యుద్ధాన్ని పూర్తిగా మలుపు తిప్పాయి. రష్యన్ వాయు సేనలు, యుద్ధ విమానాలతో సహా, సిరియా ఘర్షణలో పాల్గొన్నప్పటికీ నిర్ణయాత్మక పాత్ర పోషించింది భూతల బలగాలే. పి‌ఎం‌సి బలగాల పర్యవేక్షణలో సిరియా ప్రభుత్వ బలగాలు, సిరియన్ వాలంటరీ మిలిషియాలు, ఇరాన్-హిజ్బోల్లాలకు చెందిన షియా బలగాలు లెక్కకు మిక్కిలిగా అరబ్ దేశాల నుండి వచ్చిన టెర్రరిస్టు సంస్ధలతో తలపడి విజయం సాధించాయి. పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా యుద్ధ గమనాన్ని బట్టి టెర్రరిస్టు సంస్ధల పేర్లు మార్చుతూ, మోడరేట్ టెర్రరిస్టులు అన్న పేరుతో ఆయుధాలు అందిస్తూ, శిక్షణ ఇస్తూ అనేక ఎత్తుగడలు వేసినప్పటికీ సిరియా-రష్యా-ఇరాన్-హిజ్బోల్లాలు సమర్ధవంతంగా టెర్రరిస్టులను పారద్రోలారు.

Wagner Group mercenaries in Syria

సిరియాలో చమురు క్షేత్రాలను, రిఫైనరీలను, గ్యాస్ పైప్ లైన్లను స్వాధీనం చేసుకుని ప్రభుత్వపరం చేయడంలో రష్యన్ పి‌ఎం‌సి లది ప్రధాన పాత్ర. రష్యా ప్రవేశం ముందు వరకు ఇసిస్ బలగాలు సిరియా చమురు తవ్వి తీసి టర్కీకి రవాణా చేసింది. ఆ చమురుని టర్కీ అమ్ముకుని సొమ్ము చేసుకుంది. ఆ సొమ్మునే తిరిగి టెర్రరిస్టు బలగాలకు టర్కీ ఉపయోగపెట్టింది. ఈ చమురులో కొంతభాగం అమెరికా, ఐరోపా దేశాలకు కూడా చేరినట్లు ఆరోపణలు ఉన్నాయి. సిరియా యుద్ధంలో వ్యాగ్నర్ తో పాటు వొస్తోక్ బెటాలియన్ లాంటి ఇతర రష్యన్ పి‌ఎం‌సి లు 1,000 నుండి 3,000 వరకు బలగాలు దింపాయని అంచనా. బి‌బి‌సి ప్రకారం ఈ సంఖ్య 2,500కు పైనే. ఇరాక్ యుద్ధంలో అమెరికా ప్రైవేటు మిలట్రీ కాంట్రాక్టర్లను పెద్ద ఎత్తున దించిందని కూడా బి‌బి‌సి చెప్పడం గమనార్హం (బి‌బి‌సి, 23 ఫిబ్రవరి 2018).

సిరియా యుద్ధం ద్వారా రష్యన్ పి‌ఎం‌సిలు అనేక అనుభవాలు, పాఠాలు నేర్చుకుని రాటుదేలాయి. సిరియాలోని ప్రసిద్ధ చారిత్రాత్మక నగరం పామీరా ను రెండు సార్లు ఇసిస్ ఇతర టెర్రరిస్టుల నుండి స్వాధీనం చేసుకోవడంలో వ్యాగ్నర్ ముఖ్య పాత్ర పోషించింది. అలాగే ఫిబ్రవరి 2018లో డేర్-ఆజ్-జార్ పట్నంలోని కొనొకో ఫ్యాక్టరీ స్వాధీనంలో పి‌ఎం‌సిలది ముఖ్య పాత్ర. టి4 వైమానిక స్ధావరాన్ని 2017లో పి‌ఎం‌సి లు స్వాధీనం చేసుకున్నాక అదే ఇప్పటి వరకు రష్యన్ బలగాలకు ప్రధాన స్ధావరంగా పని చేస్తోంది. ఇక్కడి నుండే రష్యా, సిరియాలోని వాయు, భూతల, గూఢచార కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. “మొదట పి‌ఎం‌సి బలగాలు టెర్రరిస్టు ఆక్రమణలో ఉన్న ప్రాంతానికి వెళ్తాయి. తర్వాత రష్యన్ రెగ్యులర్ సైన్యం అక్కడికి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత సిరియా ప్రభుత్వ సేనలు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తెచ్చుకుంటాయి” అని వ్యాగ్నర్ అధికారి ఒకరిని ఉటంకిస్తూ బి‌బి‌సి తెలిపింది.

అయితే తూర్పు, ఈశాన్య సిరియాలోని ముఖ్యమైన చమురు క్షేత్రాలు, రిఫైనరీలు కుర్దు బలగాల (సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ -ఎస్‌డి‌ఎఫ్) చేతుల్లో కొనసాగుతున్నాయి. సిరియా-ఇరాక్ సరిహద్దులోని ఆల్-తన్ఫ్ లో తిష్ట వేసిన అమెరికా సైన్యం (వీరి సంఖ్య 2,000 నుండి 2,500 వరకు ఉంటుందని అంచనా) ఎస్‌డి‌ఎఫ్ కు పూర్తి మద్దతు ఇస్తోంది. టర్కీ కూడా ఎస్‌డి‌ఎఫ్ ను తరిమేసి ఈశాన్య సిరియాను వశం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. సిరియాలో అమెరికా సైన్యాలను పూర్తిగా ఉపసంహరిస్తానని 2018లో డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. పెంటగాన్ అభ్యంతరాలతో ఉపసంహరణ వాయిదా పడుతూ వస్తోంది. తాజా అధ్యక్షుడు బైడెన్ సిరియా ఉపసంహరణ గురించి ఏమీ చెప్పడం లేదు. పరిశీలకుల విశ్లేషణలు బట్టి సిరియా ఉపసంహరణ ఉద్దేశం బైడెన్ కు లేదు. ఇడ్లిబ్ పూర్తిగా సిరియా వశం అయితే అమెరికా ఉపసంహరణ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

లిబియా

సిరియా అనుభవాలతో రష్యన్ పి‌ఎం‌సిలు లిబియాలో జనరల్ ఖలీఫా హఫ్తార్ కు మద్దతుగా ప్రవేశించాయి. జనరల్ హఫ్తార్ నేతృత్వంలోని లిబియన్ నేషనల్ ఆర్మీ (ఎల్‌ఎన్‌ఏ) లిబియా అంతర్యుద్ధంలో ఒక బలమైన శక్తి. తూర్పు లిబియాలో మధ్యధరా సముద్ర తీర పట్టణం తబ్రూక్ కేంద్రంగా నడుస్తున్న తిరుగుబాటు ప్రభుత్వం ఈయనను ఫీల్డ్ మార్షల్ గా నియమించింది. గడ్డాఫీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినవారిలో ఈయన ఒకరు. గద్దాఫీ సైన్యంలో అధికారిగా హఫ్తార్ పనిచేశాడు. సోవియట్ లో శిక్షణ పొందిన గడ్డాఫీ సైన్యాధికారుల్లో హఫ్తార్ ఒకరు.

General Khalifa Haftar -The Hindu

1980లో లిబియా-చాద్ యుద్ధంలో బందీగా దొరికాక హఫ్తార్ తో సంబంధాలను గడ్డాఫీ త్యజించాడు. దానితో ఆయన సి‌ఐ‌ఏ వశంలోకి వెళ్ళి 2011 వరకు అమెరికాలో గడిపాడు. అరబ్ వసంతం సందర్భంగా లిబియా తిరిగి వచ్చి గడ్డాఫీ సేనలపై యుద్ధం చేశాడు. గడ్డాఫీ హత్య తర్వాత లిబియాలో అనేక ప్రాంతాలు టెర్రరిస్టు గ్రూపుల చేతుల్లోకి వెళ్ళాయి. టెర్రరిస్టుల పాలనలో లిబియా కుక్కలు చింపిన విస్తరి అయింది. టెర్రరిస్టులను వ్యతిరేకిస్తూ తూర్పు నగరం బెంఘాజీ కేంద్రంగా సొంత బలగాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఐరాస (అమెరికా, పశ్చిమ దేశాలు అని చదువుకోవాలి) గుర్తించిన ట్రిపోలి ప్రభుత్వం టెర్రరిస్టులతో మిలాఖత్ అయిందని ఆరోపిస్తూ 2014లో దానిపై యుద్ధం ప్రకటించాడు.

ట్రిపోలీ ప్రభుత్వం ఏకశిలా సదృశం కాదు. అనేక మిలీషియా గ్రూపులు, రాజకీయ గుంపులు ఇందులో కలిసి ఉన్నాయి. వారిలో ముస్లిం బ్రదర్ హుడ్ లిబియా విభాగం ఒకటి. ముస్లిం బ్రదర్ హుడ్ ని యూ‌ఏ‌ఈ, ఈజిప్టు, సౌదీ అరేబియాలు టెర్రరిస్టు గ్రూపుగా గుర్తిస్తాయి. అమెరికా, పశ్చిమ రాజ్యాలు ఈజిప్టులో ముస్లిం బ్రదర్ హుడ్ ని టెర్రరిస్టు సంస్ధగా ప్రకటిస్తుంది. కానీ లిబియాలో అదే ముస్లిం బ్రదర్ హుడ్ ప్రభుత్వాన్ని న్యాయమైన ప్రభుత్వంగా గుర్తిస్తుంది. 2019 ఏప్రిల్ త్రిపోలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనరల్ హఫ్తార్ ఆపరేషన్ ప్రారంభించి లిబియా ఏకీకరణ తన లక్ష్యంగా ప్రకటించాడు. యూ‌ఏ‌ఈ, ఈజిప్టు, సౌదీ అరేబియాలు ఆయనకు మద్దతు ప్రకటించాయి.

ఈ నేపధ్యంలో రష్యన్ పి‌ఎం‌సి బలగాలు జనరల్ హఫ్తార్ కు మద్దతుగా లిబియాలో ప్రవేశించాయి. ప్రచ్చన్న యుద్ధ కాలంలో సోవియట్ రష్యా – లిబియాల మధ్య కొనసాగిన స్నేహ సంబంధాలు, జనరల్ హఫ్తార్ సోవియట్ లో మిలట్రీ శిక్షణ పొందడం… ఇవి రష్యా పి‌ఎం‌సిల మద్దతు కొరేందుకు తోడ్పడ్డాయి. రష్యా ప్రైవేట్ బలగాల మద్దతుతో 2019 చివరి నాటికి హఫ్తార్ సేనలు పురోగమించాయి. దక్షిణ లిబియాతో పాటు పశ్చిమ లిబియాలో అనేక ప్రాంతాలను వశం చేసుకున్నాయి. ఈ తరుణంలో టర్కీ లిబియాలో సైనిక జోక్యానికి తెగబడింది. ట్రిపోలి మద్దతుగా రంగంలోకి దిగింది.

ముస్లిం బ్రదర్ హుడ్ కు టర్కీ సంపూర్ణ సహకారాలు అందిస్తుంది. మధ్య ప్రాచ్యంలో దాని పోషకుల్లో టర్కీ ఒకటి. ముస్లిం యువతను సమీకరించి వివిధ టెర్రరిస్టు గ్రూపులుగా తయారు చేయడంలో టర్కీ ది అందె వేసిన చేయి. ఈ గ్రూపులను తన అవసరానికి అనుగుణంగా అమెరికా, ఐరోపా (ప్రధానంగా బ్రిటన్, ఫ్రాన్స్) లు శిక్షణ ఇచ్చి, ఆయుధాలు సరఫరా చేసి ఉపయోగించుకుంటాయి. ముస్లిం బ్రదర్ హుడ్ కు మద్దతు ఇచ్చే దేశాల్లో కతార్ మరో ముఖ్య దేశం. (2013లో ముస్లిం బ్రదర్ హుడ్ నేతృత్వంలో ఈజిప్టు ప్రభుత్వాన్ని అక్కడి మిలట్రీ కూలదోశాక బ్రదర్ హుడ్ నేతలు, కార్యకర్తలు టర్కీ, కతార్ లకు పారిపోయి శరణు తీసుకున్నారు.) టర్కీ సేనల ప్రవేశంతో జనరల్ హఫ్తార్ సేనల పురోగమనం ఆగిపోయింది. 2020 నుండి ఇరు పక్షాల మధ్య యుద్ధం స్తంభించిపోయింది.

అయితే రష్యన్ పి‌ఎం‌సి ల ఉనికి లిబియాలో కొనసాగుతోంది. లిబియాలో చమురు వనరులు అటు టర్కీ, పశ్చిమ దేశాలకు, ఇటు రష్యా కి ఆకర్షణీయమైన సరుకు. లిబియాలో ప్రవేశం ద్వారా యూ‌ఏ‌ఈ, సౌదీ అరేబియా, ఈజిప్టులతో సత్సంబంధాల పునరుద్ధరణకు రష్యాకు అవకాశం వచ్చింది. ఈ నేపధ్యం లోనే యూ‌ఏ‌ఈ, ఇజ్రాయెల్, బహ్రయిన్ లను కూడదీసుకుని అబ్రహాం ఎకార్డ్ కు అమెరికా తెర లేపింది. ఆధిపత్య దేశాల ఎత్తులు పై ఎత్తులతో మధ్య ప్రాచ్యం ఆధునిక చరిత్ర యావత్తూ రక్త సిక్తం కావడమే అసలు విషాధం. వీరి దురాక్రమణ యుద్ధాల వల్ల అరబ్ దేశాలు స్ధిరమైన అభివృద్ధికి నోచుకోలేకపోయాయి. తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం అరబ్ ప్రజల అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తూ మళ్ళీ వారినే అనాగరికులుగా, మూర్ఖులుగా, నిరక్షర కుక్షులుగా పశ్చిమ దేశాలు నిందిస్తాయి. హేళన చేస్తాయి.

జనరల్ హఫ్తార్ తన ఆపరేషన్ ను ఇంకా ముగించలేదు. కనుక రష్యన్ పి‌ఎం‌సి ల అవసరం లిబియాలో కొనసాగుతోంది.  పెంటగాన్ ఇనస్పెక్టర్ జనరల్ ప్రకారం 2020 సెప్టెంబర్ నాటికి వ్యాగ్నర్ గ్రూపుకు చెందిన 3,000 బలగాలు లిబియాలో పని చేస్తుండగా టర్కీ తరలించిన సిరియన్ టెర్రరిస్టు బలగాలు 5,000 నుండి 18,000 వరకు పని చేస్తున్నారు (సౌత్ ఫ్రంట్ న్యూస్, 23/09/2020). తాజా వార్తల ప్రకారం హఫ్తార్ తో ఒప్పందం కోసం వీలుగా ట్రిపోలి ప్రభుత్వంలో నాయకత్వంలో మార్చి 2021లో మార్పులు చేశారు. ఈ మార్పుల ద్వారా GNA (గవర్న్^మెంట్ ఆఫ్ నేషనల్ ఎకార్డ్) కూ, ఎల్‌ఎన్‌ఏ కూ మధ్య ఐక్యతా ఒప్పందం కుదరాలని ఐరాస ఆశిస్తోంది.

ఐక్యతా ప్రయత్నాలకు రష్యా, యూ‌ఏ‌ఈ, ఈజిప్టు, టర్కీలు కూడా మద్దతు ఇవ్వడం ఒక విశేషం. వీరి మద్దతు ఉన్నప్పటికీ ఎల్‌ఎన్‌ఏ, జి‌ఎన్‌ఏ లు వైరి పక్షాలుగా కొనసాగుతున్నాయి. యూనిటీ ప్రభుత్వం పేరుతో ఏర్పడిన కొత్త ప్రభుత్వం జి‌ఎన్‌ఏ వరకే పరిమితం అయింది. అమెరికా, రష్యాలు మాత్రం మధ్యవర్తిత్వం వహించడానికి పోటీ పడుతున్నాయి. ఇరు పక్షాల ఘర్షణలో భాగంగా చమురు ఉత్పత్తి కార్యకలాపాలు ముందుకు సాగకుండా ఒక పక్షాన్ని మరొక పక్షం ఆటంకపరుస్తున్నాయి. ఫలితంగా లిబియా ప్రజలు ఉపాధి, ఆదాయం లేక దరిద్రంతో గడుపుతున్నారు. వారికి ఇప్పుడు ఉన్న ఒకే ఉపాధి ఇరు పక్షాల సైన్యంలో చేరడం లేదా చమురు ఉత్పత్తి జరిగినప్పుడు కాస్త ఉపాధి పొందడం.

(………………… తరువాయి 3వ భాగంలో)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s