విస్తరిస్తున్న రష్యన్ ప్రైవేట్ మిలట్రీ కార్యకలాపాలు


Wagner Group mercenaries in Syria

“నువ్వు రాళ్ళు విసిరితే చుట్టూ గోడ కట్టుకుంటా…” అంటూ సాగుతుంది ఒక కొటేషన్. ఉక్రెయిన్ సంక్షోభం దరిమిలా, అమెరికా ప్రపంచాధిపత్యాన్ని ఎదుర్కొనే క్రమంలో రష్యా ఈ సూత్రాన్నే పాటించింది. అమెరికా విసిరిన వ్యూహాన్ని ప్రయోగించి తన వరకు గోడ కట్టుకోవడంతో పరిమితం కాకుండా తన సహాయం అర్ధించిన ఇతర దేశాలకు కూడా గోడలు కట్టి ఇస్తోంది రష్యా. పనిలో పనిగా తన ప్రభావాన్ని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో సాపేక్షికంగా గణనీయంగా విస్తరించుకుంటోంది.

2014 వరకు ఉక్రెయిన్, రష్యా ప్రభావంలో ఉండేది. రష్యా సరిహద్దుల వరకు నాటో కూటమిని విస్తరించే వ్యూహంలో భాగంగా అమెరికా ఆ దేశంలో అంతర్గత ఘర్షణలను రెచ్చగొట్టింది. అమెరికాకు ఈ‌యూ తోడు నిలిచింది. అప్పటికి కొద్ది నెలల క్రితమే ప్రజాస్వామిక ఎన్నికల్లో నెగ్గిన అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ కి వ్యతిరేకంగా అల్లర్లను రెచ్చగొట్టింది. నయా-నాజీ గ్రూపుల సహాయంతో యూరోమైదాన్-ఆందోళనల పేరుతో రాజధాని కీవ్ లో పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహించింది. ఆందోళనల్లో అమెరికా సెనేటర్లు, విదేశాంగ అధికారి విక్టోరియా నూలంద్ లాంటి వాళ్ళు స్వయంగా పాల్గొని ఆహార పోట్లాలు, తుపాకులు పంచిపెట్టారు.

ఆందోళనల ఫలితంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యాకు పారిపోయాడు. ప్రమాదాన్ని పసిగట్టిన రష్యా దక్షిణాన నల్ల సముద్రం లోని కీలక ప్రాంతం క్రిమియాపై సైన్యాన్ని నడిపించి రష్యాలో కలిపేసుకుంది. అయితే రష్యాను ఆనుకుని ఉండే తూర్పు ఉక్రెయిన్ రిపబ్లిక్ లు డోనట్స్క్, లుగాన్స్క్ లు అమెరికా-ఐరోపా ప్రభావం లోకి వచ్చిన ఉక్రెయిన్ లో భాగంగా ఉండేందుకు నిరాకరించాయి. తమను తాము స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించుకున్నాయి. ఈ రెండింటి తిరుగుబాటు అణచివేసి తిరిగి వశం చేసుకునేందుకు ఉక్రెయిన్ తూర్పు రిపబ్లిక్కులపై యుద్ధం ప్రారంభించింది. డోనట్స్క్, లుగాన్స్క్ లు రిఫరెండం నిర్వహించుకుని తమను రష్యాలో కలుపుకోవాలని డిమాండ్ చేశాయి. రష్యా అందుకు అంగీకరించలేదు. అప్పటి నుండి ఉక్రెయిన్ కూ, తూర్పు ఉక్రెయిన్ రిపబ్లిక్ లకు మధ్య యుద్ధం కొనసాగుతూ వస్తోంది.

ఉక్రెయిన్, తూర్పు ఉక్రెయిన్ ఘర్షణలో కలుగజేసుకోవడానికి రష్యా నిరాకరించింది. అయితే తూర్పు ఉక్రెయిన్ లోని మెజారిటీ రష్యన్ భాషీయుల ప్రయోజనాలకు భంగం కలిగితే సహించేది లేదని హెచ్చరించింది. రష్యా జోక్యం లేకపోయినప్పటికీ డోనట్స్క్, లుగాన్స్క్ లను తిరిగి వశం చేసుకోవడం ఉక్రెయిన్ వల్ల కాలేదు. దానికి కారణం రష్యా నుండి వచ్చిన ప్రైవేటు మిలట్రీ బలగాలు.

అప్పటి వరకూ ప్రైవేట్ మిలట్రీ అన్న ఆలోచనే రష్యాలో లేదు. కానీ ఒక వైపేమో తన సరిహద్దునే ఉన్న, సోవియట్ రష్యాలో ఒకప్పటి భాగం అయిన ఉక్రెయిన్ అమెరికా-నాటో పరిష్వంగం లోకి వెళ్తున్న పరిస్ధితి. మరో వైపేమో క్రిమియా ఆక్రమించుకుంది అన్న వంకతో అమెరికా రష్యాపై వరసపెట్టి వాణిజ్య, దౌత్య ఆంక్షలు విధిస్తున్న పరిస్ధితి. డోనట్స్క్, లుగాన్స్క్ లు కూడా రష్యాలో కలిస్తే ఈ‌యూ-రష్యా సంబంధాలు కూడా దెబ్బతినే పరిస్ధితి ముంచుకొచ్చింది. కనుక తూర్పు ఉక్రెయిన్ లో జోక్యం చేసుకున్నట్లు కనిపించకూడదు. కానీ జోక్యం చేసుకోకపోతే తన పొరుగునే అమెరికా క్షిపణులు మోహరించే పరిస్ధితి రావచ్చు. ఈ సంకట పరిస్ధితిలో ప్రైవేట్ మిలట్రీ బలగాలకు రష్యా రూపం ఇచ్చింది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు సన్నిహితులైన సంపన్నులు ప్రైవేట్ మిలట్రీ కంపెనీలు (పి‌ఎం‌సి) స్ధాపించి వారిని తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటు బలగాలకు సహాయంగా పంపారు. వారికి కావలసిన ఆయుధ, ధన సహాయం రష్యన్ ప్రభుత్వం పరోక్షంగా అందించింది. మిలట్రీ శిక్షణ అందించింది. రష్యన్ పి‌ఎం‌సి బలగాల అండతో తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటుదారులు, అమెరికా ధన, ఆయుధ మద్దతుతో మీదికి వస్తున్న ఉక్రెయిన్ సైన్యాన్ని విజ్యవంతంగా నిలువరించారు.

అమెరికన్ మిలట్రీ కాంట్రాక్టర్లు, ప్రైవేటు బలగాలు ఉక్రెయిన్ సైన్యానికి మద్దతుగా నిలవగా రష్యన్ ప్రైవేట్ మిలట్రీ కంపెనీల బలగాలు తిరుగుబాటుదారులకు మద్దతుగా నిలిచారు. అప్పటి నుండి రష్యా, ఉక్రెయిన్ ల పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతూ వచ్చాయి. యుద్ధం కొనసాగుతూ వస్తోంది. ఆరంభంలో ఖార్కివ్, ఒడెసా రిపబ్లిక్ లలో కూడా రష్యా అనుకూల ఆందోళనలు జరిగినా వాటిని ఉక్రెయిన్ అణచివేయగలిగింది. డోనట్స్క్, లుగాన్స్క్ లు అమెరికా-నాటో విస్తరణ వ్యూహానికి పెద్ద అవరోధం అయ్యాయంటే దానికి కారణం రష్యన్ పి‌ఎం‌సి బలగాలు.

ఆ విధంగా ఉక్రెయిన్ లో అమెరికా ఎత్తులను చిత్తు చేసేందుకు పుట్టిన రష్యన్ ప్రైవేట్ మిలట్రీ కంపెనీలు ఇప్పుడు తమ కార్యకలాపాలను ప్రపంచ వ్యాపితంగా విస్తరించాయి. వాషింగ్టన్ కేంద్రంగా పని చేసే “సెంటర్ ఫర్ స్ట్రేటజిక్ ఇంటర్నేషనల్ స్టడీస్” (సి‌ఎస్‌ఐ‌ఎస్) సంస్ధ ప్రకారం రష్యన్ పి‌ఎం‌సి ల కార్యకలాపాలు ప్రస్తుతం 30 పైగా దేశాల్లో కొనసాగుతుండగా మోడ్రన్ వార్ ఇనిస్టిట్యూట్ (అమెరికా సంస్ధ) 27 దేశాలకు రష్యన్ పి‌ఎం‌సి ల ప్రాబల్యం విస్తరించింది. మరో అనధికారిక అంచనా ప్రకారం ఈ సంఖ్య 60కి పైనే.

అమెరికా నూతన భౌగోళిక-రాజకీయ వ్యూహానికి అనుగుణంగా వివిధ దేశాల నుండి తన మిలట్రీ బలగాలను ఉపసంహరిస్తోంది. అమెరికా ఖాళీ చేసిన ప్రాంతాలలో రష్యా తన పి‌ఎం‌సి లతో ఆయా దేశాల అవసరాలు తీర్చుతోంది. ఆఫ్రికాలో ఫ్రాన్స్ కూడా పాక్షిక సైనిక ఉపసంహరణలకు (ఉదా: మాలి) పాల్పడుతుండగా అక్కడ కూడా రష్యన్ పి‌ఎం‌సి లు ప్రవేశించి ఆయా దేశాల ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి.

రష్యా ప్రభుత్వం తనకూ రష్యన్ పి‌ఎం‌సి లకు సంబంధం లేదని ప్రకటిస్తుంది. తన పి‌ఎం‌సి లకూ ఇతర దేశాలకు మధ్య జరిగే ఒప్పందాల గురించి తమకు తెలుసని చెబుతున్నప్పటికీ ప్రభుత్వపరంగా వాటితో తమకు సంబంధం లేదని చెబుతుంది. ఆ విధంగా పి‌ఎం‌సి కార్యకలాపాల వల్ల ఎదురయ్యే చట్టపరమైన ఇబ్బందుల నుండి తనకు ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది.

రష్యన్ పి‌ఎం‌సి ల కార్యకలాపాలు ప్రధానంగా రెండు ప్రయోజనాలు అందజేస్తాయి: 1. ఆయా దేశాల సైన్యాలకు ఆయుధ శిక్షణతో సహా వివిధ శిక్షణలు ఇవ్వడం, సలహాలు ఇవ్వడం, యుద్ధాల్లో వాటికి తోడుగా ఉండడం. 2. భాగస్వామ్య దేశాల రాజకీయ నాయకులకు, ముఖ్య అధికారులకు భద్రత కల్పించడం. ఈ సేవలకు గాను తగిన రుసుమును పి‌ఎం‌సిలు వసూలు చేస్తాయి. పని ముగిశాక ఈ బలగాలు తిరిగి స్వస్ధలానికి వెళ్తాయని చెబుతారు. కానీ ఇప్పటి వరకు జరిగిన ఆచరణ చూస్తే వెనక్కి వెళ్ళడం తక్కువసార్లు మాత్రమే జరిగింది.

రష్యన్ పి‌ఎం‌సి ల అసలు లక్ష్యం వేరే ఉందని పశ్చిమ విశ్లేషకులు, అధ్యయన సంస్ధలు ఆరోపిస్తాయి. వాటి ప్రకారం: “రష్యా విస్తరణ వాదం అంతకంతకూ పెరుగుతోంది. ఆర్ధిక, భౌగోళిక-రాజకీయ మరియు సైనిక లాభాలు పెంచుకుంటోంది. రష్యన్ రాజ్యం తలపెట్టిన మిలట్రీ, భౌగోళిక-రాజకీయ లక్ష్యాలను రష్యన్ పి‌ఎం‌సి లు పరిపూర్తి చేస్తున్నాయి. వివిధ దేశాల్లో ముఖ్యంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో అత్యంత విలువైన ఖనిజ వ్నరులను, చమురు వనరులను వశం చేసుకుంటూ లబ్ది పొందుతోంది. వాణిజ్య ప్రయోజనాలు సాధిస్తోంది. ఈ క్రమంలో రష్యా, అమెరికాను ప్రధాన లక్ష్యంగా చేసుకుంది.”

నిజానికి ఇవన్నీ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు అనాదిగా అనుసరిస్తూ వచ్చిన వ్యూహం. వాటి ప్రధాన ప్రైవేటు కిరాయి బలగాలు వివిధ ముస్లిం టెర్రరిస్టు సంస్ధలే అన్నది దాచేస్తే దాగని సత్యం. ఆఫ్ఘనిస్తాన్ లో ముజాహిదీన్, ఆల్-ఖైదాలు, సిరియా, ఇరాక్, యెమెన్ లలో ఇస్లామిక్ స్టేట్, తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఆల్-షబాబ్, నైజీరియా, చాద్, నైజర్, కామెరూన్ లలో బోకో-హరామ్… ఇవన్నీ ఆయా సందర్భాల్లో అమెరికా, పశ్చిమ దేశాల వ్యూహాత్మక ఆధిపత్య ప్రయోజనాలను నెరవేర్చినవే. ఈ టెర్రరిస్టు కంపెనీలు అమెరికాకు వాడి పారేసే పరికరాలు లాంటివి. అవసరం ఉన్నంత కాలం ఉపయోగించుకుని అవసరం తీరాకనో లేదా తనకే ఎదురు తిరిగినప్పుడో డ్రోన్ దాడులతో చంపెయ్యడం రివాజు. ఒసామా బిన్ లాడేన్ అందుకు పెద్ద ఉదాహరణ. ఆఫ్ఘనిస్తాన్ లో రష్యాకు వ్యతిరేకంగా బిన్-లాడెన్ ను సకల సహాయాలు అందించి పోషించిన అమెరికా, తానే ఆఫ్ఘన్ దురాక్రమణకు దిగాక అవసరం తీరడంతో అర్ధరాత్రి పాక్ గగనతలంలోకి చొరబడి కాల్చి చంపింది.

ప్రచ్చన్న యుద్ధ కాలంలో కమ్యూనిస్టు భూతాన్ని చూపెట్టి అమెరికా స్వతంత్ర దేశాలను, ప్రజాస్వామిక దేశాలను స్వప్రయోజనాల కోసం కబళించింది. దేశాధ్యక్షులను చంపించింది. సైనిక కుట్రలు చేసి ప్రభుత్వాలను కూలద్రోసింది. క్యూబా, గ్రెనెడా లాంటి దేశాధ్యక్షుల నివాస భవనాలపై నేరుగా బాంబు దాడులు చేసింది. వెనిజులా, అర్జెంటినా దేశాల అధ్యక్షులపై అణుధార్మిక విషాలను ప్రయోగించి వైద్యానికి లొంగని క్యాన్సర్ జబ్బులకు గురి చేసి చనిపోయేలా చేసింది. ఇప్పుడు కమ్యూనిస్టు భూతం రద్దయిపోయింది. దానికి మారుగా  ‘ముస్లిం టెర్రరిజం’ భూతాన్ని తానే సృష్టించింది. అందుకు కావలసిన సాహిత్యం తానే ముద్రించి పంపిణీ చేసిన సంగతి రహస్యం కాదు. అమెరికా, యూరప్ లలో టెర్రరిస్టు దాడులు జరిగిన ప్రతిసారీ సదరు దాడులకు పాల్పడినవారిని ఆ దేశాల గూఢచార సంస్ధలే రిక్రూట్ చేసుకున్న సంగతి మళ్ళీ మళ్ళీ వెల్లడి అవుతూ వచ్చింది.

కనుక రష్యన్ పి‌ఎం‌సిల గురించి పశ్చిమ అధ్యయన సంస్ధలు చెబుతున్నవి తమ సొంత అనుభవం నుండి చెబుతున్నవి. అంతే కాక రష్యా తన ప్రభావ విస్తరణ కోసం పి‌ఎం‌సి లను తురుపు ముక్కగా వినియోగిస్తోన్న విషయం వాస్తవం కాకపోవడానికి అవకాశం చాలా తక్కువ. రష్యన్ రాజ్యం పులుకడిగిన ముత్యం ఏమీ కాదు. అది కూడా ఒక పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దేశం. దానికీ మార్కెట్ వనరులు కావాలి. ఖనిజాలు, నీరు, చమురు మొ.న సరుకులు ముడి వనరులుగా కావాలి. అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలి.

లెనిన్ బోధించినట్లు సామ్రాజ్యవాదమే యుద్ధం. లియోన్ టాల్ స్టాయ్ చెప్పినట్లు యుద్ధానికి యుద్ధానికి మధ్య విరామమే శాంతి. శాంతి కాలంలో సాధించిన ప్రయోజనాలను నిలుపుకోవడానికి, నిలుపుకుని విస్తరించుకోవటానికి సామ్రాజ్యవాద దేశాలు మళ్ళీ యుద్ధానికి దిగుతాయి. ఈ యుద్ధాల రొంపిలోకి దిగడం రష్యాకు ఇదే కొత్త కాదు. స్టాలిన్ మరణానంతరం సోషలిస్టు నిర్మాణాన్ని రద్దు చేసుకున్న సోవియట్ రష్యా 1960లలోనే అమెరికాతో ప్రపంచాధిపత్య పోటీకి తలబడి ప్రపంచాన్ని అశాంతికి గురిచేసిన శక్తులలో ఒకటిగా నిలిచింది. ఈ నాడు మళ్ళీ శక్తులను కూడదీసుకుని మరోసారి సామ్రాజ్యవాద విస్తరణకు పూనుకుంటోంది.

అయితే ఇప్పటివరకు చూస్తే రష్యన్ విస్తరణ వాదం బలప్రయోగానికి దిగడం లేదు. ఆధిపత్య పూరిత ఆంక్షలు, షరతులు విధించడం లేదు. అసమాన ఒప్పందాలను రుద్దడం లేదు. తానే ప్రైవేటు మిలట్రీ బలగాల మద్దతు అందజేస్తూ అందుకు ఫలితాన్ని కోరుతోంది. క్విడ్-ప్రొ-కో తరహాలో పి‌ఎం‌సి లను వినియోగిస్తోంది. ఈ తరహా ఎత్తుగడ ఎంతవరకు కొనసాగుతుందన్నది ప్రత్యర్ధి బలంపైన ఆధారపడి ఉంటుంది. అమెరికా పూర్తిగా బలహీనపడి, ఐరోపాతో సహకారం వృద్ధి చెందితే బలప్రయోగానికి రష్యా దిగబోదన్న గ్యారంటీ ఏమీ లేదు.

కానీ చైనా, ఐరోపా, జపాన్ లు తలా ఒక పక్కా, టర్కీ స్వంతగా మరో పక్కా ప్రపంచాన్ని లాగుతున్న పరిస్ధితుల్లో అమెరికా సాధించిన ఏకచ్ఛత్రాధిపత్యం మరో దేశం సాధించే పరిస్ధితి కనుచూపు మేరలో లేనే లేదు. ఇప్పుడు మళ్ళీ రష్యన్ పి‌ఎం‌సి ల విస్తరణను సోదాహరణంగా చూద్దాం.

ఉక్రెయిన్ లో రష్యన్ పి‌ఎం‌సి లు సత్తా చాటాక రష్యా వాటిని అనంతరం సిరియాలో ప్రయోగించింది. సిరియా దాదాపు పూర్తిగా ఇసిస్ చేతుల్లోకి వెళ్లిపోయిందని 2015 నాటికి దాదాపు అందరూ భావించారు. సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ త్వరలో చావడం ఖాయం అని భారత పత్రికలతో సహా ప్రపంచ మీడియా అంతా నిర్ధారించుకుంది. ఆ పరిస్ధితుల్లో అస్సాద్ విజ్ఞప్తితో రష్యా సైన్యం సిరియాలో ప్రవేశించింది. దానితో పరిస్ధితి పూర్తిగా మారిపోయింది. రష్యా వైమానిక దాడుల అండతో సిరియా ప్రభుత్వ బలగాలు, లేబనీస్ హెజ్బోల్లా, ఇరానియన్ మిలట్రీ కాంట్రాక్టర్లు సంయుక్తంగా ఒక్కో ప్రాంతాన్ని వశం చేసుకున్నాయి. దక్షిణం నుండి ఉత్తరానికి జైత్రయాత్ర సాగించి ప్రధాన నగరమైన అలెప్పో నగరం వశం కావడంతో సిరియా ప్రభుత్వం నిర్ణయాత్మకమైన విజయాన్ని ఇసిస్ తదితర టెర్రరిస్టు బలగాలపై సాధించింది. ఈ విజయంలో రష్యన్ పి‌ఎం‌సి లు భూతల యుద్ధంలో కీలక పాత్ర పోషించడం ద్వారా ప్రధాన భూమిక పోషించింది. ఇప్పుడు సిరియాలో యుద్ధం ఇడ్లిబ్ రాష్ట్రంలో కేంద్రీకృతం అయి ఉంది. కుర్డుల ఆధీనం లోని ఈశాన్య సిరియా, టర్కీ ఆధీనం లోని ఇడ్లిబ్, అమెరికా ఆధీనం లోని ఆల్-తన్ఫ్ మినహా మిగతా సిరియా అంతా సిరియా ప్రభుత్వం కిందికి వచ్చింది.

ఓ వైపు సిరియాలో పని చేస్తూనే రష్యన్ పి‌ఎం‌సి లు లిబియాలో ప్రవేశించి తిరుగుబాటు జనరల్ హఫ్తార్ కు మద్దతుగా పని చేస్తున్నాయి. అనంతరం సబ్-సహారా దేశాలకు కూడా రష్యన్ పి‌ఎం‌సి లు విస్తరించాయి. సూడాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (సి‌ఏ‌ఆర్), మొజాంబిక్, మడగాస్కర్, నైజర్, సెనెగల్, బొట్స్వానా, చాద్, ఈజిప్టు, యెమెన్ దేశాలకు రష్యన్ పి‌ఎం‌సి లు విస్తరించాయి. లాటిన్ అమెరికాలోని వెనిజులాలో అధ్యక్షుడు మదురోకు మద్దతుగా పని చేస్తున్నాయి. ఈ క్రమంలో వివిధ ఖనిజాలు, చమురు తవ్వకాలపై రష్యన్ కంపెనీలు కాంట్రాక్టులు సాధించినట్లు తెలుస్తోంది.

రష్యన్ పి‌ఎం‌సి లలో ప్రధానమైనది వ్యాగ్నర్ (Wagner) గ్రూప్. ఆ తర్వాత పాట్రియాట్, వెగసీ (Vegacy), ఈ‌ఎన్‌ఓ‌టి, వొస్తోక్ బెటాలియన్ గ్రూపులు ప్రముఖంగా వినిపించేవి. రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు సన్నిహితుడుగా పేరు పొందిన సంపన్నుడు యెవ్గెని ప్రిగోఝిన్ ప్రధాన పి‌ఎం‌సి అయిన వ్యాగ్నర్ గ్రూపును నడిపిస్తున్నాడని పశ్చిమ దేశాలు, పత్రికలు చెబుతాయి. అయితే వ్యాగ్నర్ తో తనకు సంబంధం లేదని ప్రిగోఝిన్ అనేకసార్లు ప్రకటించాడు. గత మే నెలలో తన బలగాల్లో సగం (2500) ను మాలి నుండి ఉపసంహరిస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రకటించడం, సెప్టెంబర్ లో మాలి తాత్కాలిక అధ్యక్షుడు రష్యా సందర్శించడం, వ్యాగ్నర్ తో మాలి ఒప్పందం కుదుర్చుకున్నట్లు రష్యా విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ ప్రకటించడంతో ప్రిగోఝిన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.

(…………………….. తరువాయి 2వ భాగంలో)

2 thoughts on “విస్తరిస్తున్న రష్యన్ ప్రైవేట్ మిలట్రీ కార్యకలాపాలు

  1. When I read about the PMC s of Russia in Syria, I felt shock about the consequences.usually America use its military mighty along with specific idealogy but now this instance may create utter chaos and mehem. What the world will see from this is unimaginable.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s