కరోనా వైరస్ బయోవెపన్ కాదు -అమెరికా ఇంటలిజెన్స్


SARS-COV-2 -The Economist

కరోనా వైరస్ ను చైనా ఉద్దేశ్యపూర్వకంగా తయారు చేసిన జీవాయుధం అని చెప్పడం పూర్తిగా అశాస్త్రీయం (unscientific) అని అమెరికాకు చెందిన 17 గూఢచార సంస్ధలు నిర్ధారించాయి. కరోనా వైరస్ జీవాయుధం అని చెప్పేందుకు తగిన శాస్త్రీయ ఆధారాలు లేవని, అటువంటి వాదనలు శాస్త్రీయ పరీక్షలకు నిలబడవని అమెరికా ఇంటలిజెన్స్ ఏజన్సీలు స్పష్టం చేశాయి.

అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు అమెరికా గూఢచార ఏజన్సీలు పరిశోధన చేసి నివేదిక సమర్పించాయి. సదరు నివేదిక సారాంశాన్ని గత ఆగస్టులో వెల్లడి చేశాయి. పూర్తి నివేదికను శుక్రవారం ఓ‌డి‌ఎన్‌ఐ (Office of Director of National Intelligence) వెల్లడి చేసిందని ది గార్డియన్ పత్రికతో పాటు అనేక పత్రికలు తెలిపాయి.

“కోవిడ్-19 వైరస్ జీవాయుధంగా అభివృద్ధి చేయబడిందన్న ఆరోపణలు శాస్త్రపరంగా చెల్లనేరవు. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నవారు వాస్తవంలో తప్పుదోవ పట్టించే సమాచారం మాత్రమే” అని అమెరికా ఇంటలిజెన్స్ సంస్ధలు తమ నివేదికలో పేర్కొన్నాయి (ది గార్డియన్, 29 అక్టోబర్, 2021).

కోవిడ్-19 వైరస్ జన్యు పరివర్తనం ద్వారా తయారు చేసిన జీవాయుధం కాదనడంలో 17 అమెరికన్ గూఢచార సంస్ధలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. అయితే వైరస్ జంతువు నుండి మనిషికి సంక్రమించడం ద్వారా వ్యాప్తి చెందిందా లేక ప్రయోగశాల పరీక్షల సందర్భంగా ప్రమాదవశాత్తూ బైటికి విడుదల అయిందా అన్న విషయంలో అమెరికా ఇంటలిజెన్స్ సంస్ధల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని వివిధ పత్రికలు (స్పుత్నిక్ న్యూస్, ది గార్డియన్, ఆల్ జజీరా మొ.వి) తెలిపాయి.

అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన పలువురు సెనేటర్లు హౌస్ సభ్యులు చైనాపై ఆరోపణలు చేయడంలో అగ్రభాగాన ఉన్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చైనాపై దుమ్మెత్తి పోస్తూ చైనాయే వైరస్ ను సృష్టించి ప్రపంచం మీదికి వదిలిందని ఆరోపించాడు. కరోనా వైరస్ ను ‘చైనా వైరస్’ అని సంబోధిస్తూ కాక పుట్టించాడు. చైనా నుండి ఆగ్రహపూరితమైన ప్రతిస్పందనలు ఎదుర్కొన్నాడు. సాక్ష్యాలు చూపాలని చైనాతో పాటు ఇతర సంస్ధలు కోరినప్పటికీ పెడచెవిన పెట్టి ఆరోపణలు కొనసాగించాడు. చైనాతో డబల్యూ‌హెచ్‌ఓ కుమ్మక్కు అయిందని చెబుతూ సంస్ధ నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాడు.

నిజానికి అమెరికా గూఢచార సంస్ధలు చెప్పిన సంగతి కొత్తది కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ కూడా ఇదే విషయాన్ని గతంలో చెప్పింది. చైనా వూహాన్ ల్యాబ్ నుండి ప్రమాదవశాత్తూ వైరస్ బైటికి వచ్చింది అనడానికి ఆధారాలు లేవని చెప్పింది. అసలు సార్స్-కొవ్-2 వైరస్ పై వూహాన్ ల్యాబ్ పరిశోధన జరిపిన ఆధారాలు కూడా లేవని కూడా డబల్యూ‌హెచ్‌ఓ చెప్పింది. ఇదే విషయాన్ని అమెరికా ఇంటలిజెన్స్ సంస్ధలు ఇప్పుడు ధృవీకరించడం విశేషం.

“సార్స్-కోవ్-2 జీవాయుధం అన్న ఆరోపణలకు ఆధారాలు లేవు. ఎందుకంటే ఆ వాదనలు పూర్తిగా అశాస్త్రీయ అంశాలపై ఆధారపడి చేస్తున్నారు. సదరు వాదనల ప్రతిపాదకులకు వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంస్ధతో ఏ విధంగానూ నేరుగా ప్రవేశం లేదు. లేదా సదరు సిద్ధాంత ప్రతిపాదకులు తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మేము అనుమానిస్తున్నాము” అని అమెరికా ఇంటలిజెన్స్ సంస్ధల నివేదిక స్పష్టం చేసింది (ది గార్డియన్).

నివేదిక ఇంకా ఇలా పేర్కొంది, “వైరస్ ఏ విధంగానూ మానవ నిర్మితం కాదు. ఈ సంవత్సరం ఆగస్టు వరకు జరిపిన పరిశోధన, అందిన సమాచారం ప్రకారం చూస్తే జెనెటిక్ ఇంజనీరింగ్ జరిగింది అని చెప్పేందుకు సాధారణంగా లభించే గుర్తులు ఏవీ లభించలేదు.” అయితే ఈ నిర్ధారణకు తక్కువ నమ్మకం (lower confidence) స్కేల్ అను ఆపాదించాయని తెలుస్తోంది. దానికి కారణం అకడమిక్ అధ్యయనాల ప్రకారం కొన్ని రకాల జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతులను పాటించినప్పుడు సహజంగా ఏర్పడే వైరస్ లకు జన్యు పరివర్తనం ద్వారా ఏర్పడ్డ వైరస్ లకు తేడా కనిపెట్టడం కష్టం అవుతుందని తెలియడమే.

వైరస్ జంతువుల నుండి మనుషులకు సంక్రమించి ఉండవచ్చని 4 ఇంటలిజెన్స్ సంస్ధలు భావిస్తున్నాయి. కొత్త వైరస్ బైటపడినప్పుడు వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సిబ్బంది ఆశ్చర్యానికి లోనై దానిని గుర్తించడానికి ఉరుకులు పరుగులు పెట్టిన విషయాన్ని అమెరికన్ గూఢచార సంస్ధలు పరిగణనలోకి తీసుకున్నాయి. “ఒక ల్యాబ్ వర్కర్ ఏదైనా గుర్తు తెలియని జంతువు శాంపిల్ సేకరించేటప్పుడు సదరు వైరస్ సంక్రమణకు గురై ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉన్నదని ల్యాబ్ అధికారులు గుర్తించారు. జంతువులతో తరచుగా, సహజంగా సంబంధం లోకి వచ్చే అనేకమంది వేటగాళ్ళు, రైతులు, వ్యాపారులు లేదా ఇతరులు ఇన్ఫెక్షన్ కు గురి కావడం ద్వారా కంటే ల్యాబ్ వర్కర్ శాంపిల్ సేకరిస్తున్నప్పుడు అనుకోని విధంగా ఇన్ఫెక్షన్ కు గురయి ఉండేందుకే ఎక్కువ అవకాశం ఉందని ల్యాబ్ అధికారులు గుర్తించారు” అని నివేదిక పేర్కొంది.

“వూహాన్ ల్యాబ్ గతంలో చిమేరా లేదా సార్స్ తరహా జీవులను సృష్టించిన ఉదాహరణలు ఉన్నాయి కానీ ఈ సమాచారం బట్టి సార్స్-కొవ్-2 వైరస్ ను జన్యు పరివర్తనం ద్వారా సృష్టించారని చెప్పడం సాధ్యం కాదు” అని నివేదిక స్పష్టం చేసింది.

“వైరస్ ను బయో వెపన్ గా తయారు చేయలేదు. అత్యధిక గూఢచార సంస్ధలు సార్స్-కొవ్-2 వైరస్ జన్యు పరివర్తనం ద్వారా తయారు చేయలేదని భావిస్తున్నాయి. అయితే రెండు సంస్ధలు అటు సహజసిద్ధంగా పుట్టిండా లేకా జన్యు పరివర్తనం ద్వారా తయారు చేశారా అన్న రెండింటికీ తగిన ఆధారాలు లేవని భావిస్తున్నాయి. అంతిమంగా ఇంటలిజెన్స్ కమ్యూనిటీ (ఐ‌సి), కోవిడ్-19 మొదటగా వ్యాప్తి చెందడానికి ముందు దాని గురించిన ఎలాంటి ముందస్తు సమాచారం చైనా అధికారుల వద్ద లేదు అని నిర్ధారించింది” అని స్పుత్నిక్ న్యూస్ తెలిపింది.

చైనాయే సార్స్-కొవ్-2 సృష్టికర్త అని ఇండియాలో కూడా కొంతమంది నమ్ముతున్నారు. వారికి శాస్త్రీయ ఆధారాల కంటే చైనాపై వ్యతిరేకత వ్యక్తం చేయడంలో ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు వారి వ్యాఖ్యలు తెలియజేస్తాయి. చైనాతో ఉన్న సరిహద్దు తగదా వలన, ఇటీవలి గాల్వాన్ లోయ ఘర్షణ వలనా చైనాకు వ్యతిరేకంగా వచ్చే ఎలాంటి వార్త అయినా నమ్మాలని అనిపిస్తుంది. ఇలాంటి ధోరణుల వల్ల నిజాలు మరుగున పడిపోయి డొనాల్డ్ ట్రంప్ లాంటి స్వార్ధ ప్రచారకుల అబద్ధాలు నిజాలుగా ప్రచారం పొందుతాయి. తస్మాత్ జాగ్రత్త!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s