ఫ్రాన్స్-బ్రిటన్ మధ్య తీవ్రమైన చేపల తగాదా: ఆకస్ పుణ్యం?


Cornelis was ordered into the port of Le Havre

ఆస్ట్రేలియా, యూ‌కే, అమెరికాలు కలిసి ఇండో-పసిఫిక్ ప్రాంతం లక్ష్యంగా ‘ఆకస్’ కూటమి ఏర్పడిన నేపధ్యంలో ఫ్రెంచ్, బ్రిటిష్ దేశాల మధ్య చేపల వేట తగాదా మరింత తీవ్రం అయింది. డిసెంబర్ 31, 2020 నాటితో బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయినప్పటి నుండి అడపా దడపా ఇరు దేశాల ఫిషింగ్ బోట్లు చేపల వేట హక్కుల విషయమై తగాదా పడుతూ వచ్చాయి. నేడు ఆ తగాదా ఫ్రెంచి ప్రభుత్వమే ప్రత్యక్ష చర్య తీసుకునే వరకూ వెళ్లింది.

ఆకస్ ఏర్పాటు ఫలితంగా ఆస్ట్రేలియాకు డజను ఫ్రెంచి సబ్-మెరైన్లు సరఫరా చేసే భారీ మిలట్రీ ఒప్పందం రద్దు కావడంతో ఫ్రాన్స్ ఇప్పటికే అమెరికా, ఈ‌యూలపై చిరచిర లాడుతున్న విషయం తెలిసిందే. ఆకస్ ఏర్పాటు తర్వాత మూడవ రోజుకే యూ‌కే ఫిషింగ్ లైసెన్స్ ల జారీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ త్వరలో ప్రత్యక్ష చర్యలకు పాల్పడవలసి ఉంటుందని హెచ్చరించింది.

హెచ్చరించినట్లుగానే అక్టోబర్ 27 తేదీన ఫ్రెంచి జలాల్లోకి ప్రవేశించిన రెండు యూ‌కే ఫిషింగ్ బోట్లను ఫ్రాన్స్ ప్రభుత్వం పట్టి తన పోర్ట్ లో బంధించింది. సరైన లైసెన్స్ లు లేకుండా తమ జలాల్లోకి ప్రవేశించిన ఈ పడవలు చేపలవేట సాగిస్తున్నాయని ఫ్రాన్స్ ఆరోపించింది. ఒక పడవను హెచ్చరించి వదిలి పెట్టింది. ‘కార్నెలిస్’ అనే పేరు గల రెండవ పడవను ‘లీ హావ్రే’ పోర్టులో బంధించి ఉంచింది. మ్యాక్ డఫ్ షెల్ ఫిష్ అనే చేపల వ్యాపారి ఈ పడవకు యజమాని అని తెలుస్తోంది. తన పడవకు అవసరమైన లైసెన్స్ లు అన్నీ ఉన్నాయని మ్యాక్ డఫ్ చెబుతుండడం గమనార్హం.

బ్రెగ్జిట్ కి పూర్వం కామన్ ఫిషరీస్ పాలసీ (సి‌ఎఫ్‌పి ప్రకారం ఈ‌యూ సభ్య దేశాల మధ్య చేపల వేట హక్కుల పంపకం జరిగేది. ఈ పాలసీ ప్రకారం ఈ‌యూ సభ్య దేశాలకు చెందిన ఎక్స్ క్లూజివ్ ఎకనమిక్ జోన్ (ఈ‌ఈ‌జెడ్) లో ఈ‌యూ సభ్య దేశాలు చేపల వేట సాగించవచ్చు. సముద్ర తీరానికి 200 నాటికల్ మైళ్ళ దూరం లోపల ఉన్న సముద్ర జలాలు ఈ జోన్ కిందికి వస్తాయి. అయితే తీర ప్రాంతం గల దేశాలకు 12 నాటికల్ మైళ్ళ లోపలి జలాలు కేవలం ఆ దేశానికే చెందుతాయి. అనగా 12 నుండి 200 నాటికల్ మైళ్ళ పరిధిలోని జలాలు సి‌ఎఫ్‌పి కిందికి వస్తాయి.

French fishing vessels

బ్రెగ్జిట్ తర్వాత బ్రిటిష్ జలాలపై ఈ‌యూ దేశాలకు సి‌ఎఫ్‌పి ద్వారా సంక్రమించిన హక్కు రద్దయింది. అప్పటి నుండి లైసెన్స్ పద్ధతి ప్రకారం చేపల వేట సాగించాలని బ్రెగ్జిట్ ఒప్పందంలో అంగీకారానికి వచ్చారు. అయితే బ్రిటన్ ఫిషింగ్ ఆదాయం దాని జాతీయ ఆదాయంలో 0.1 శాతం కంటే తక్కువే. అందువలన బ్రిటన్ ఫిషింగ్ అంశం కంటే ఇతర అంశాలపై ప్రధాన దృష్టి పెట్టింది. దీనివల ఫిషింగ్ అంశంలో సమగ్ర ఒప్పందం జరగలేదని దరిమిలా తరచూ తగాదాలు వస్తున్నాయని విశ్లేషకులు చెబుతునారు.

ఫ్రాన్స్ ప్రకారం తమకు చెందవలసిన లైసెన్స్ లలో సగం పడవలకు మాత్రమే లైసెన్స్ లు వచ్చాయి. ఇంకా సగం పడవలకు యూ‌కే లైసెన్స్ ఇవ్వలేదు. యూ‌కే ఇది సరికాదని చెబుతోంది. లైసెన్స్ ల జారీ ప్రక్రియ కొనసాగుతోందని ఈ‌యూ కూటమి దేశాలకు తాము ఒప్పందం ప్రకారం ఇచ్చిన కమిట్మెంట్ లో 98 శాతం పూర్తి చేశామని యూ‌కే చెబుతోంది. ఫ్రాన్స్ మాత్రం యూ‌కే, 90 శాతం కమిట్మెంట్ మాత్రమే యూ‌కే పూర్తి చేసిందని మిగిలిన 10 శాతం లైసెన్స్ లు తమ పడవలవే అని ఫ్రెంచి అధికారులు చెబుతున్నారు. (ఇండియన్ ఎక్స్ ప్రెస్, 27, అక్టోబర్ 2021)

ఫ్రెంచి ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు చూపాలని యూ‌కే ఎన్విరాన్మెంట్ సెక్రటరీ జార్జి యూస్టిస్ డిమాండ్ చేశాడు. “డిసెంబర్ 31, 2020 నుండి మా ఈ‌ఈ‌జెడ్ లో చేపల వేటకు 1673 ఈ‌యూ పడవలకు లైసెన్స్ ఇచ్చాం. అందులో 736 పడవలు ఫ్రాన్స్ కి చెందినవి. ఇది కాక బ్రిటిష్ కి చెందిన 6-12 నాటికల్ మైళ్ళ పరిధి జలాల్లో చేపలు పట్టుకునేందుకు 103 ఫ్రెంచి పడవలకు లైసెన్స్ ఇచ్చాం” అని జార్జి తెలిపాడు (స్కై న్యూస్, 29 అక్టోబర్ 2021).

యూ‌కే సముద్ర జలాల్లో చేపలు సమ్దృద్ధిగా లభిస్తాయని ప్రతీతి. అనేక రకాల చేపలు యేడాది పొడవునా లభించే యూ‌కే జలాలు బ్రెగ్జిట్ అనంతరం సహజంగానే వివాదాలకు కేంద్రం అయింది. ‘ఆకస్’ ద్వారా ఫ్రాన్స్ ఆయుధ వాణిజ్యానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో ఫ్రాన్స్ మరింత చురుకుగా చేపల తగాదాను కుడుపుతోంది.

ఫ్రాన్స్ సముద్ర శాఖ మంత్రి అన్నిక్ గిరాడిన్ చేపల తగాదా ను “ఇది వార్ కాదు ఫైట్” అని అభివర్ణించింది. “ఫ్రెంచ్ జాలర్లకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఈ హక్కులపై కుదిరిన ఒప్పందాలను గౌరవించాల్సి ఉంది” అని ఆమె ప్రకటించింది. “జాలర్ల హక్కులను మనం పరిరక్షించుకుని తీరాలి. మనం పరిరక్షించుకుంటామ్ కూడా” ఆమె దృఢంగా ప్రకటించింది.

The scallop vessel Cornelis seized by French at Le Havre

“మేము ఆశించిన మొత్తంలో లైసెన్స్ ల జారీ జరగక పోయినట్లయితే వచ్చే నెల నుండి క్రమంగా ప్రతీకార చర్యలు తీసుకుంటాం” అని ఆమె హెచ్చరించారు. ఫ్రెంచి ప్రభుత్వం నవంబర్ 2 తేదీని డెడ్ లైన్ గా ప్రకటించింది. ఆ తర్వాత వివిధ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఫ్రాబ్స్ ప్రతిపాదించిన చర్యలు ఇలా ఉన్నాయి:

  • కొన్ని ఫ్రెంచి పోర్ట్ లలో బ్రిటిష్ చేపల పడవలు ప్రవేశించకుండా నిషేదించడం
  • కస్టమ్స్ మరియు పరిశుభ్రతకు సంబంధించిన నియంత్రణలను కఠినతరం చేయడం
  • బ్రిటిష్ పడవలపై నిరంతరం చెకింగ్ లు జరపడం
  • యూ‌కే నుండి వచ్చే మరియు యూ‌కే కు పోయే లారీలను నిత్యం తనిఖీ చేస్తూ వాటిపై నియత్రణలు కఠినం చేయడం

బ్రిటన్ కు సరఫరా చేసే విద్యుత్ పై ఆంక్షలు విధించే విషయాన్ని కూడా తాము పరిశీలిస్తున్నామని ఫ్రెంచి వ్యవసాయ మంత్రి జులియెన్ డినార్మండీ ఫ్రాన్స్-2 టి‌వి చానల్ తో మాట్లాడుతూ హెచ్చరించారు (స్పుత్నిక్ న్యూస్, 27 అక్టోబర్ 201). దీనితో వాతావరణం మరింత వేడెక్కింది. యూ‌కేకు సరఫరా అయ్యే విద్యుత్ లో 95 శాతం ఫ్రాన్స్ నుండి అండర్ గ్రౌండ్ కేబుల్స్ ద్వారా సరఫరా అవుతుంది. విద్యుత్ టారిఫ్ పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని సముద్ర మంత్రి చెప్పారు.

“మిత్రుల నుండి ఇలాంటి చర్యలను ఊహించరానివి” అని యూ‌కే ఈ హెచ్చరికలపై వ్యాఖ్యానించింది. ఆకస్ ఏర్పాటు అనంతరం ఫ్రాన్స్ సబ్-మెరైన్ ఒప్పందం రద్దయినట్లు వెల్లడి అయిన తర్వాత అమెరికా, యూ‌కే లను ఉద్దేశిస్తూ ఫ్రాన్స్ కూడా సరిగ్గా ఇదే వ్యాఖ్య చేసింది “మిత్రుల నుండి ఇలాంటి చర్యలు ఊహించరానివి” అని.

“ఫ్రాన్స్ ప్రకటించిన చర్యలు ఈ‌యూ-యూ‌కే ల మధ్య కుదిరిన ట్రేడ్ అండ్ కో-ఆపరేషన్ అగ్రిమెంట్ కు వ్యతిరేకం. అంతర్జాతీయ చట్టాలకు కూడా ఇవి వ్యతిరేకం. వీటిని అమలు చేస్తే సరైన రీతిలో బదులిస్తాం” అని బ్రిటిష్ మంత్రి యూస్టిస్ హెచ్చరించారు. గత మే నెలలో యూ‌కే రాణి పాలన కింద ఉండే జెర్సీ ద్వీపంపై ఫ్రాన్స్ పడవలు దిగ్బంధనం కావించనున్నాయని సమాచారం అందడంతో రెండు బ్రిటిష్ రాయల్ నేవీ నౌకలు హుటా హుటిన జెర్సీకి వచ్చి కాపలాగా నిలిచాయి. జెర్సీతో పాతో మరో ద్వీపం స్వంతగా ఫిషింగ్ లైసెన్స్ లు ఇస్తాయి.

2022 ఏప్రిల్ నెలలో ఫ్రెంచి అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఫ్రాన్స్ ఈ అంశంలో ఉద్రిక్తతలు రెచ్చగొడుతోందని కొన్ని బ్రిటిష్ పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదీ కాక బ్రిటన్, ఫ్రాన్స్ ల మధ్య వైరం అనాదిగా ఉన్నదే.

తాజా ఘర్షణలో ఈ‌యూ కూటమి పూర్తిగా ఫ్రాన్స్ పక్షం వహిస్తోంది. యూ‌కే ఒప్పందం ప్రకారం లైసెన్స్ లు ఇవ్వాల్సిందేనని ఈ‌యూ స్పష్టం చేసింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s