మీ దాష్టీకం యూ‌పిలో చెల్లవచ్చేమో, ఇక్కడ కాదు -యూ‌పి పోలీసుల్తో ఢిల్లీ హై కోర్టు


Delhi High Court

ఉత్తర ప్రదేశ్ పోలీసులకి ఢిల్లీ హై కోర్టు గడ్డి పెట్టింది. మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా అత్యంత అప్రజాస్వామిక చట్టం చేయడమే కాకుండా సదరు చట్టం పేరుతో విచక్షణారహితంగా వివాహితులను వారి కుటుంబ సభ్యులను అరెస్టులు చేసి జైళ్ళలో తోస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న యూ‌పి ప్రభుత్వానికి కూడా ఢిల్లీ హై కోర్టు పరోక్షంగా జ్ఞాన బోధ చేసింది.

“ఇక్కడ ఢిల్లీలో మీ చర్యలు చెల్లబోవు. ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలైనా సరే చెల్లవు. ఢిల్లీ నుండి జనాన్ని పట్టుకెళ్ళి షామిలీ (యూ‌పి) నుండి పట్టుకెళ్ళాం అని చెప్పడం, అక్కడి నుండే అరెస్ట్ చేశామని చెప్పడం… ఇలాంటి వాటివి ఇక్కడ జరగడం మేము అనుమతించబోము” అని ఢిల్లీ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ముక్తా గుప్తా తమ ఆదేశాల మేరకు కోర్టులో హాజరైన షామిలీ పోలీసులతో చెప్పారు.

ఆ యువతి వయసు 21 యేళ్ళు. ఆమె వయసున పుట్టిన తేదీ ధృవపత్రం స్పష్టంగా చెబుతోంది. యూ‌పికి చెందిన ఆ యువతిని ఢిల్లీ కి చెందిన యువకుడొకరు ప్రేమించాడు. ఇరువురు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్ళికి యువతి తల్లి దండ్రులకు ఇష్టం లేదు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు షామిలీ పోలీసులు యువకుడి పైనా, అతని కుటుంబ సభ్యులపైనా కిడ్నాప్ కేసు నమోదు చేశారు.

ఆగస్టు 6, 7 తేదీల మధ్య రాత్రి షామిలీ పోలీసులు ఢిల్లీ వచ్చారు. యువకుడి ఇంటికి వెళ్లారు. అక్కడ ఉన్న యువకుడి తండ్రిని, సోదరుడిని ఎత్తుకెళ్ళిపోయారు. అనంతరం వారిని సెప్టెంబర్ 9 తేదీన షామిలీ బస్టాండ్ లో అరెస్ట్ చేశామని కధ అల్లారు.

ఢిల్లీ పోలీసులు హై కోర్టుకు ఇచ్చిన సమాచారం ప్రకారం యువతి తల్లి ఫిర్యాదు మేరకు ఐ‌పి‌సి సెక్షన్ 366 కింద సెప్టెంబర్ 6 తేదీన కేసు నమోదు చేసిన యూ‌పి పోలీసులు ఇద్దరు పురుషులను అరెస్ట్ చేసినట్లు యూ‌పి పోలీసులు చెప్పారు. షామిలీ జిల్లాలోని కుధన బస్ స్టాండ్ నుండి సెప్టెంబర్ 8 తేదీన వారిని తాము అరెస్టు చేశామని యూ‌పి పోలీసులు తెలియజేశారు.

అయితే ఢిల్లీ హై కోర్టు ఢిల్లీ-షామిలీ రూట్ లోని సి‌సి‌టి‌వి ఫుటేజీ అన్నింటిని చెక్ చేసి నిజా నిజాలు తెలుసుకుంటామని గట్టిగా హెచ్చరించడంతో యువకుడి సోదరుడు, తండ్రిలను ఢిల్లీ లోని వారి ఇంటి నుండే పట్టుకెళ్లామని ఒప్పుకోక తప్పలేదు. “మీరు ఖుదాన లో అరెస్టు చూపించారు. నేను మొత్తం సి‌సి‌టి‌వి ఫుటేజీలను తెప్పించుకుని చూస్తాను. షామిలీ పోలీసులు ఢిల్లీ వచ్చారని తేలితే గనక మీ అందరిపైనా డిపార్ట్^మెంటల్ ఎంక్వైరీ మొదలు పెట్టిస్తాను” అని జస్టిస్ ముక్తా హెచ్చరించారు. ఢిల్లీ నుండి వారిని తీసుకెళ్లేటప్పుడు తమకు యూ‌పి పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు హై కోర్టుకు స్పష్టం చేశారు.

యువతి వయస్సును విచారించకుండా ఎకాఎకిన కేసులు పెట్టి అరెస్టు చేయడం పట్ల ఢిల్లీ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. “యువతి మేజరా, కదా అని మీరు విచారించారా? ఆమె మేజర్ అయినట్లయితే ఆమె తల్లిదండ్రుల కంటే ఆమె అభిప్రాయానికే ప్రాధాన్యత ఉంటుందా, ఉండదా? విచారణ జరిపేటప్పుడు ఫిర్యాదుదారులను వయసు సంగతి అడగరా? నిందితులను అరెస్ట్ చేసేస్తారా?” అని ఢిల్లీ హై కోర్టు యూ‌పి పోలీసులను ప్రశ్నించింది. అసలు యువతి, ఆమె భర్తలను వాకబు చేయకుండా నేరుగా అతని సోదరుడు, తండ్రిలను అరెస్టు చేయడం పట్ల కూడా న్యాయమూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పెళ్ళి చేసుకున్నాక వారికి యువతి కుటుంబం నుండి పదే పదే బెదిరింపులు వచ్చాయి. దానితో వారు రక్షణ కోసం జులై 1, 2021 తేదీన పిటిషన్ దాఖలు చేశారు. తమకు బెదిరింపులు వస్తున్నాయని తమ తండ్రి, సోదరుడిని ఎత్తుకెళ్ళిపోయారనీ, నెలన్నర రోజుల నుండి వారి ఆచూకీ తెలియడం లేదని వారు పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హై కోర్టు షామిలీ స్టేషన్ హౌష్ ఆఫీసర్ ను కేసు ఫైల్ తో సహా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

Justice Mukta Gupta

ఎఫ్‌ఐ‌ఆర్ కాపీ లోనే యువతి వయసు 21 సం.లు అని ఫిర్యాదుదారు అయిన యువతి తల్లి చెప్పిన సంగతిని కోర్టు గుర్తించి యూ‌పి పోలీసులను మందలించింది. “మీకు, మీ పరిశోధనాధికారికి ఫైల్ ఎలా చదవాలో తెలియకపోతే దానికి నావద్ద పరిష్కారం ఏమీ లేదు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను అరెస్టు చేయడానికి కావలసిన సమాచారం అంతా మీకు అందుతుంది, కానీ విషయ పరిశోధన చేయడానికి మాత్రం సమాచారం లభించదా?” అని షామిలీ ఎస్‌హెచ్‌ఓను కోర్టు ప్రశ్నించింది.

వెంటనే యువతి నుండి స్టేట్^మెంట్ రికార్డ్ చేయాలని కోర్టు ఆదేశించింది. కానీ యువ దంపతులు ఇద్దరినీ ఢిల్లీ నుండి తీసుకెళ్ళడానికి మాత్రం తాము అనుమతించేది లేదని స్పష్టం చేసింది. యువతిని వెతకడానికి ఏయే ప్రయత్నాలు చేసిందీ, వారు ఢిల్లీ వస్తే ఢిల్లీ పోలీసుల అనుమతి తీసుకున్నది లేనిది సమస్త వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని యూ‌పి పోలీసులను ఆదేశించింది.

“పిటిషనర్ నెంబర్ 1 (యువతి) మేజర్ అయినప్పటికీ ఆమె తనకై తాను ఇష్ట పూర్వకంగానే తల్లిదండ్రుల ఇంటి నుండి బైటికి వచ్చి పిటిషనర్ నెంబర్ 2 ను వివాహం చేసుకున్నప్పటికీ (ఐ‌పి‌సి) సెక్షన్ 366 కింద అనంతరం సెక్షన్ 368 కిందా నేరాన్ని ఎలా నమోదు చేయగలరో ఎవరికీ అర్ధం కానీ విషయం. పిటిషనర్ నెంబర్ 1 మేజరా, మైనరా అన్నది విచారించకుండా, నిజానిజాలు ఏమిటో ఆమెను విచారించి తెలుసుకోకుండా సదరు ఎఫ్‌ఐ‌ఆర్ కింద అరెస్టులు ఎలా చేసేస్తారో కూడా తెలియకుంది” అని కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ కేసు మొదలూ కాదు, చివరా కాదు. బలవంతపు మాటమార్పిడిలకు వ్యతిరేకంగా అని చెబుతూ మతాంతర వివాహాలపై ముఖ్యంగా ముస్లిం యువతీ, యువకులపై పచ్చి ద్వేషంతో వివాహ చట్టానికి యూ‌పి ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసింది. ఆర్‌ఎస్‌ఎస్-బి‌జే‌పి గణాలు కనిపెట్టిన లవ్ జిహాద్ ను అరికట్టే పేరుతో యువతి యువకుల ప్రేమ వివాహాలపై, ముఖ్యంగా మతాంతర వివాహాలపై వివిధ రాష్ట్రాల్లోని బి‌జే‌పి ప్రభుత్వాలు కత్తి గట్టి ప్రజలను భీతావహులను చేస్తున్నాయి.

ఈ క్రమంలో యోగి ఆదిత్యనాధ్ నేతృత్వం లోని యూ‌పి ప్రభుత్వ పోలీసులు  ఇప్పటికే వందలాది మండి యువతీ యువకులను అరెస్టు చేసి జైళ్ళలో కుక్కుతున్నారు. ప్రభుత్వం నుండి వస్తున్న మద్దతుతో ఇతర రాష్ట్రాల్లోకి కూడా జొరబడి ముస్లిం యువకులను, వారి బంధువులను బలవంతంగా పట్టుకెళ్లి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. యూ‌పి హై కోర్టు సైతం కొన్ని సార్లు మేజర్లయిన యువతీ యువకులకు తమ వివాహాలపై సొంత నిర్ణయం తీసుకునేందుకు రాజ్యాంగం హక్కు ఇచ్చిందని తీర్పులు ఇచ్చినా యూ‌పి ప్రభుత్వ అనాగరిక ధోరణికి అడ్డూ అదుపూ ఉండడం లేదు.

అదే సమయంలో మరి కొందరు హై కోర్టు న్యాయమూర్తులు స్వయంగా ఈ తరహా మోరల్-పోలీసింగ్ కి అనుకూలంగా తీర్పులు ప్రకటిస్తూ తమ ఆజ్ఞానాన్ని, సాంస్కృతిక వెనుకబాటు తనాన్ని నిస్సిగ్గుగా చాటుకుంటున్నారు.

యూ‌పి తో పాటు వివిధ బి‌జే‌పి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా చేసిన చట్ట సవరణలపై వివిధ హై కోర్టుల్లో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. అవి ఎప్పటికీ విచారణకు వస్తాయో, ఎప్పటికీ తీర్పులు వస్తాయో తెలియదు. ఈ లోపు వందలాది మంది యువతి యువకులు హిందూత్వ శక్తుల స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు సమిధలుగా ఆహుతి కావడం కొనసాగనుండడం పెను విషాదం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s