ఉత్తర ఖండ్ లో 4 రోజుల పాటు కురిసిన అతి భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగి పోర్లాయి. ఎప్పటిలాగే పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా నీట మునిగాయి. వంతెనలు తెగిపోయాయి. కొన్ని చోట్ల అవి కూలిపోయి కొట్టుకుపోయాయి. కడపటి వార్తలు అందేసరికి 52 మంది మరణించారు. కొండల మీద నుండి రాళ్ళు, భారీ మట్టి పెళ్ళలు జారిపడి రోడ్లను కప్పేసాయి. కొండ చరియలు విరిగిపడి రోడ్డు మార్గాలను తెంపేశాయి.
ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వరదల వల్ల భారీగా నష్టపోయిన కుమావ్ లాంటి ప్రాంతాలను చుట్టి వచ్చారు. డిజిపితో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదల వల్ల రాష్ట్రవ్యాపితంగా భారీ నష్టం జరిగిందని ప్రకటించారు. తాత్కాలికంగా 10 కోట్ల రూపాయల సాయం విడుదల చేశామని చెప్పారు. చనిపోయినవారికి రు 4 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు.
నైనిటాల్, డెహ్రాడూన్ లాంటి నగరాల్లో వర్షాలకు రోడ్లు నదుల్లా మారాయి. జాతీయ విపత్తు సహాయక బలగాలు (ఎన్‌డిఆర్‌ఎఫ్) రంగంలోకి దిగి పలు పట్టణాలు, నగరాల్లో కూడా పడవల్లో వెళ్ళి నీట మునిగిన కాలనీల నుండి ప్రజలను సహాయ శిబిరాలకు తరలించవలసి వచ్చింది. అనేక చోట్ల నీట మునిగిన గ్రామాలకు కూడా ఆహార సరఫరాలను అందించాయి. కొండల్లో ఎత్తైన ప్రాంతాల్లో చిక్కుకుపోయిన టూరిస్టులను, ఇతర ప్రజలను హెలికాప్టర్ల ద్వారా రక్షించారు. కోసి నది తీర ప్రాంతాలు భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది.
ఉత్తరఖండ్ వరదలను ప్రకృతి ప్రకోపానికంటే మానవ తప్పిదంగానే పలువురు విశ్లేషకులు, వాతావరణవేత్తలు, పత్రికలు విశ్లేషిస్తున్నారు. ఉత్తర ఖండ్ తో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్ లను కూడా భారీ వర్షాలు నష్టపరిచాయి. నైరుతి ఋతుపవనాలు ఉపసంహరించుకుంటున్న సమయంలో కురిసిన ఈ భారీ వర్షాలు, వరదలకు కేరళ, ఉత్తరఖండ్ లు మునిగిపోవడం, నష్టపోవడం ఇదేమీ కొత్త కాదు.
ఉత్తరఖండ్, కేరళ రెండూ పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైనవి. ఉత్తర ఖండ్ హిమాలయ సానువుల్లో ఉంటే కేరళ అత్యంత వైవిధ్యభరితమైన జీవజాలానికి నిలయమైన పశ్చిమ కనుమలను సరిహద్దుగా కలిగి ఉన్నది. ఇక్కడ ఆధునిక నిర్మాణాలు చేయడం, ముఖ్యంగా టూరిజం ఆదాయం పెంచుకునే పేరుతో పెద్ద పెద్ద రిసార్టులు, హోటళ్లు కట్టడం, వాటి చుట్టూ రకరకాల వ్యాపార సముదాయాలు వెలవడం, వ్యర్ధాలు పెరుకుపోవడం, అంతిమంగా నీరు, గాలి లాంటి సహజ ప్రాకృతిక అంశాలు స్వేచ్ఛగా ప్రయాణించకుండా ఆటంకాలు కలిగించడం ఒక నిరంతర కార్యక్రమంగా కొనసాగుతోంది.
ఈ కట్టడాలు, నిర్మాణాలు, మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతి పొందిక, సమతూకం దెబ్బతిని జీవ వైవిధ్యం నశించడం వల్ల అంతిమంగా మానవ జీవనానికే ప్రమాదం వాటిల్లుతుందని ఎన్ని హెచ్చరికలు చేసినా పాఠాలు నేర్చుకోవడం లేదు. ఇలా పాఠాలు నేర్చుకోనివారు ప్రజలు కాకుండా ప్రభుత్వాలు, వారిని నడిపే ధనిక వర్గాలు కావడమే అసలు విషాధం.
కొండ ప్రాంతాల్లో సహజంగానే కొండ చరియలు విరిగి పడేందుకు అవకాశం ఉంటుంది. అడవుల నరికివేత, క్వారీయింగ్, రోడ్ల నిర్మాణం తదితర భూ వినియోగ మార్పులు పర్యావరణంలో మార్పులు కొనితెస్తున్నాయి. అందువలన కేరళ, ఉత్తర ఖండ్ లాంటి చోట్ల మౌలిక నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సంపూర్ణ అధ్యయనాలు చేసాకే పనిలోకి దిగాలని నిపుణులు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉన్నారు.
ఉదాహరణకి 2011లో నియమించబడిన మాధవ్ గాడ్గిల్ కమిటీ గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల పొడవునా 1,30,000 చదరపు కి.మీ మేర ఉన్న పశ్చిమ కనుమలను పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతంగా ప్రకటించాలని సిఫారసు చేసింది. ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులపై ఖచ్చితమైన నియంత్రణ పాటించాలని చెప్పింది. కానీ ఈ ఆరు రాష్ట్రాల్లో ఏదీ ఆ కమిటీ సిఫారసులను అంగీకరించలేదు. మైనింగ్, నిర్మాణ కార్యకాలాపాలపై నిబంధనలు విధించడాన్ని, జల విద్యుచ్చక్తి ప్రాజెక్టులపై నిషేధం విధించడాన్ని కేరళ గట్టిగా వ్యతిరేకించింది.
కె కస్తూరి రంగన్ కమిటీ అయితే గాడ్గిల్ కమిటీ సూచించిన పర్యావరణ పరమైన సున్నిత ప్రాంతాన్ని సగానికి తగ్గిస్తూ సిఫారసు చేసింది. ఈ సిఫారసు కూడా పశ్చిమ కనుమలు ఉన్న రాష్ట్రాల ఆమోదం పొందలేదు. ఈ అనామోదం వెనుక నిర్మాణరంగ కంపెనీల స్వార్ధ ప్రయోజనాల ఒత్తిళ్ళు ప్రముఖ పాత్ర వహిస్తున్న సంగతి దాచేస్తే దాగని సత్యం. అభివృద్ధి పేరుతో మానవ జాతి భవిష్యత్తును వినాశనం వైపుకు తీసుకెళ్ళడం, దానికి ప్రభుత్వాలే మంత్రసానిగా పని చేస్తుండడం గర్హనీయం.

Composed by Reuters