గల్ఫ్ లో భారత ప్రయోజనాలకు ‘అబ్రహాం ఎకార్డ్స్’ గండం!


(రెండవ భాగం తర్వాత….)

సైప్రస్ సమావేశంలో పాల్గొన్న నాలుగు దేశాలకూ టర్కీతో విభేదాలు ఉన్నాయి. యూ‌ఏ‌ఈ, ఇజ్రాయెల్ పాల్గొన్న ప్రతి సమావేశంలో ఇరాన్ గురించి తప్పనిసరిగా చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో టర్కీ విస్తరణ వాదంతో దూకుడుగా వ్యవహరిస్తుండడంతో ఇవి టర్కీతో మరింత జాగ్రత్త పడుతున్నాయి. ఇక టర్కీ దూకుడు అమెరికాకు అసలే గిట్టదు. సైనిక కుట్ర ద్వారా ఎర్దోగన్ ను పదవీచ్యుతుడిని చేసేందుకు జులై 2016లో విఫలయత్నం చేసింది. రష్యా గూఢచార సమాచారంతో ఎర్డోగన్ కుట్రనుండి బైట పడ్డాడు.

సైప్రస్ సమావేశాల్లోనే ఇజ్రాయెల్, గ్రీసులు అతి పెద్ద రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం ఇజ్రాయెల్ డిఫెన్స్ కంపెనీ ఎల్బిట్ సిస్టమ్స్, 22 సం.ల కాలం పాటు 1.65 బిలియన్ల డాలర్ల మేర హెలెనిక్ ఎయిర్ ఫోర్స్ (గ్రీసు వైమానిక బలగం) కు ట్రైనింగ్ సెంటర్లు నిర్వహిస్తుంది. ఇటలీ కంపెనీ ‘లియోనార్డో’ తయారు చేసిన M-346 శిక్షణ విమానాలు పదింటిని ఇందుకు వినియోగిస్తారు. ఇంకా గ్రీసుకు చెందిన T-6 విమానాలను ఇజ్రాయెల్ ఆధునీకరిస్తుంది (ది హిందూ, 18/04/2021).

ఇక గ్రీసు, యూ‌ఏ‌ఈలు నవంబర్ 2020 లోనే ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ ఒప్పందం చేసుకున్నాయి. తద్వారా విదేశీ విధానం. రక్షణ రంగంలో సహకరించుకోవాలని నిర్ణయించాయి. ఇది నేరుగా టర్కీకి వ్యతిరేకంగా ఉద్దేశించిందన్నది స్పష్టమే. 2018 నుండి గ్రీకు నేతృత్వంలో జరుగుతున్న మిలట్రీ డ్రిల్లులో అమెరికా, ఇజ్రాయెల్, సైప్రస్ లతో పాటు యూ‌ఏ‌ఈ పాల్గొంటోంది. ఉభయ సైప్రస్ ల విలీనం కావాలన్న గ్రీసు డిమాండ్ కు యూ‌ఏ‌ఈ మద్దతు ఇస్తోంది. టర్కీ, తూర్పు మధ్యధరా సముద్రంలో వేలు పెట్టడానికి వ్యతిరేకంగా సైప్రస్, గ్రీస్, ఫ్రాన్స్, ఈజిప్టుల ఉమ్మడి అవగాహనలో యూ‌ఏ‌ఈ భాగస్వామి అయింది. గ్రీసు సముద్ర, భూ, వాయు సరిహద్దుల్లోకి టర్కీ జరిపే చొరబాట్లను ఖండించింది. లిబియాలో టర్కీ మిలట్రీ జోక్యాన్ని ఖండించింది.

ఈ విధంగా గ్రీసు, ఇజ్రాయెల్, యూ‌ఏ‌ఈ దేశాల ప్రయోజనాలు టర్కీ విస్తరణవాదానికి వ్యతిరేకంగా ఐక్యం అవుతుండగా, దీనికి అమెరికా పూర్తి మద్దతు అందిస్తోంది. ఈ అమెరికా మద్దతు టర్కీకి మరింత కంటగింపు అవుతోంది. టర్కీ క్రమంగా రష్యావైపు జరిగేందుకూ, ఇరాన్, కతార్ లాంటి దేశాలతో ప్రతీకార కూటమి ఏర్పరిచేందుకు దోహదం చేస్తోంది.

ప్రభ కోల్పోతున్న సౌదీ అరేబియా

అబ్రహాం ఎకార్డ్స్ తర్వాత యూ‌ఏ‌ఈ, ఇజ్రాయెల్ ల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు చురుకయ్యాయి. యూ‌ఏ‌ఈ ఆర్ధిక మంత్రి అబ్దుల్లా బిన్ తావుక్ ఆల్ మ్యారి ఇలా చెప్పాడు, “మేము రాయబారుల్ని మార్చుకున్నాం. 60కి పైగా ఎం‌ఓ‌యూలపై సంతకాలు చేశాం. ద్వైపాక్షిక వాణిజ్యం 600-700 మిలియన్ డాలర్ల మేరకు జరుగుతోంది. బిలియన్ల డాలర్ల నిధులు వివిధ ప్రాజెక్టుల కోసం ప్రకటించాం. వచ్చే పదేళ్ళలో ట్రిలియన్ (లక్ష కోట్ల) డాలర్ల ఆర్ధిక కార్యకలాపాల సృష్టికి ప్రయత్నిస్తున్నాం.”

దుబాయ్ లోని ఇజ్రాయెల్ రాయబారి స్టారోస్టా ఇలా ప్రకటించాడు, “గత సం. కాలంలో 2 లక్షల మంది, కోవిడ్ ఉన్నా, ఇజ్రాయేలీయులు దుబాయ్ సందర్శించారు. యూ‌ఏ‌ఈ స్వేచ్ఛా వాణిజ్య మండళ్లలో 40 ఇజ్రాయెల్ కంపెనీలు విభాగాలు స్ధాపించాయి. వాణిజ్యం ఇప్పటికే $500 మిలియన్లు దాటింది.వచ్చే యేడు ఇది రెట్టింపు అవుతుంది. రానున్న పదేళ్ళలో ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం.

ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా ఉపసంహరణ నేపధ్యంలో ఇజ్రాయెల్, యూ‌ఏ‌ఈ లు రానున్న కాలంలో గట్టి మిలట్రీ భాగస్వాములు అయ్యే అవకాశం కనిపిస్తోందని విశ్లేషకుల అంచనా. సౌదీ అరేబియా నుండి కూడా తప్పుకుని (రియాద్ లోని వాయు రక్షణ వ్యవస్ధ –మిసైల్ రక్షణ వ్యవస్ధ- లను తొలగించాలని అమెరికా నిర్ణయించుకుంది) మధ్య ప్రాచ్యం పాక్షికంగా ఖాళీ చేసి ఇండో-పసిఫిక్ లో తిష్ట వేసేందుకు పావులు కదుపుతున్న అమెరికా పధకం కూడా ఇదే. తాను ప్రత్యక్షంగా లేని లోటుని సరికొత్త యూదు-అరబ్ స్నేహం ద్వారా పూరించే ప్రయత్నం చేస్తోంది.

బహ్రెయిన్, మొరాకో, సూడాన్ దేశాలు సైతం యూదు రాజ్యం ఇజ్రాయెల్ ను గుర్తించి యూ‌ఏ‌ఈ-ఇజ్రాయెల్ కూటమిలోనే తమ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు చూస్తున్నట్లు వార్తల ద్వారా తెలుస్తోంది. దానితో మధ్య ప్రాచ్యంలో నికరమైన మిత్రులను కోల్పోయి సౌదీ అరేబియా ఒంటరి అయింది. అమెరికా వాయు స్ధావరం తొలగింపు వలన యెమెన్ యుద్ధంలో బలహీనపడే పరిస్ధితి వచ్చింది. అందుకే హౌతీ తిరుగుబాటుదారులతో ఒప్పందానికి సిద్ధమయింది. బద్ధ శత్రువు ఇరాన్ తో సమంధాల మెరుగుదలకు ప్రయత్నాలు చేస్తోంది.

మక్కా, మదీనాల వలన సౌదీ అరేబియాకు మతపరమైన ప్రాముఖ్యత కొనసాగినప్పటికీ మునుపటి స్ధాయిలో భౌగోళిక రాజకీయాలను అటు ప్రాంతీయంగా గానీ, గ్లోబల్ గా గానీ ప్రభావితం చేయలేని పరిస్ధితికి సౌదీ అరేబియా చేరింది. దాని స్ధానాన్ని యూ‌ఏ‌ఈ భర్తీ చేస్తోంది. ఇప్పటివరకూ చూసినట్లు అందుకు అమెరికా, ఇజ్రాయల్ లు మద్దతు ఇస్తున్నాయి. అత్యాధునిక ఎఫ్-35 యుద్ధ విమానాలు సైతం అమెరికా, యూ‌ఏ‌ఈ కి ఇవ్వనున్నట్లు ప్రకటించడాన్ని బట్టి పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఈ విమానాలు ఇప్పటి వరకు ఇజ్రాయెల్ కు మాత్రమే అమెరికా ఇచ్చింది. (రష్యన్ తయారీ ఎస్-400 మిసైళ్లను టర్కీ కొనుగోలు చేయడంతో టర్కీకి ఎఫ్-35 సరఫరా ఒప్పందాన్ని అమెరికా రద్దు చేసింది.)

భారత వాణిజ్య ప్రయోజనాలకు గండి?!

అటు గల్ఫ్ దేశాలతో, ఇటు ఇరాన్ తో ఇండియా చారిత్రక సబంధాలు కలిగి ఉన్నది. హరప్పా-మొహంజొదారో నాగరికతకు మునుపు అక్కడికి ఇరాన్ ప్రాంతం నుండే వ్యవసాయ పరిజ్ఞానం తరలి రావడం నుండి ఇటీవలి సన్నిహిత వర్తక, వాణిజ్యాల వరకూ ఇరు పక్షాల మధ్యా బహుముఖంగా సంబంధాలు కొనసాగాయి. యూదు-అరబ్ ఘర్షణలో ఇప్పటికీ యూదు వలస ఆక్రమణలో మగ్గుతున్న పాలస్తీనాకు ఇండియా అంతర్జాతీయ వేదికలన్నింటా మద్దతు ఇచ్చింది. కానీ బి‌జే‌పి ప్రభుత్వాల హయాంలో జాత్యహంకార ఇజ్రాయెల్ తో మైత్రికి పునాది వేయడం ద్వారా పీడిత జాతుల పక్షాన నిలుస్తుందన్న ప్రతిష్టను ఇండియా కోల్పోయింది.

ఇరాన్ పై పశ్చిమ దేశాల ఆంక్షలకు తమ మద్దతు లేదని పైకి చెబుతూనే ఆచరణలో మాత్రం అమెరికా ఒత్తిడికి తల ఒగ్గి ఇరాన్ చమురు దిగుమతులను తగ్గించుకోవడం ఇండియా అనుసరించిన ద్వంద్వ నీతి. ఈ ద్వంద్వ నీతిని సో-కాల్డ్ లిబరల్ కాంగ్రెస్, హిందూత్వ బి‌జే‌పి రెండూ అనుసరించాయి. జి‌సి‌సి (గల్ఫ్) దేశాలతో ఇండియా చురుకైన వాణిజ్య, మానవ సంబంధాలు ఇప్పటివరకు కలిగి ఉన్నది. అయితే అబ్రహాం ఎకార్డ్స్, సైప్రస్ సమావేశాల దరిమిలా మారిన భౌగోళిక-రాజకీయాల పొందిక మధ్య ప్రాచ్యంలో భారత ప్రయోజనాలను దెబ్బ తీసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

గల్ఫ్ దేశాల్లో 80 లక్షల మండి భారతీయులు వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. వీరు ఏటా దాదాపు 50 బిలియన్ డాలర్లు (సుమారు రు. 3.75 లక్షల కోట్లు) ఇండియాకు రెమిటెన్సెస్ గా పంపుతున్నారు. భారత చమురు దిగుమతుల్లో మూడింట రెండు వంతులు గల్ఫ్ నుండి వస్తుంది (ది హిందూ, 22 సెప్టెంబర్, 2020). భారీ మొత్తంలో పెట్టుబడులు కూడా వస్తాయి. కనుక ఇక్కడ జరిగే భౌగోళిక-రాజకీయాలు భారత ఆర్ధిక వ్యవస్ధను ప్రభావితం చేయడం అనివార్యం.

యూ‌ఏ‌ఈ-ఇజ్రాయెల్ సంబంధాలను దౌత్యపరంగా ఇండియా ఆహ్వానించింది. ఇరు దేశాలు తనకు వ్యూహాత్మక మిత్రులేనని భారత ప్రభుత్వం సంతోషం ప్రకటించింది. మామూలుగానైతే ఇజ్రాయెల్-జి‌సి‌సి స్నేహం ఇండియాకు అనుకూలం కావాలి. మధ్యప్రాచ్యంలో మునుపటి పరిస్ధితి యధాతధంగా కొనసాగితేనే అలా జరుగుతుంది. కానీ ఇప్పుడు జి‌సి‌సి దేశాలే బహుళ శిబిరాలుగా ఉన్నాయి. ముందు చూసినట్లు అమెరికా-తాలిబాన్ శాంతి చర్చలకు దశాబ్ద కాలంగా ఆతిధ్యం ఇచ్చిన కతార్ పై సౌదీ అరేబియా కత్తి కట్టి ఉంది. తాలిబాన్ కు కతార్ దగ్గర కాగా సౌదీ అరేబియా ఇంకా ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. ఇక యూ‌ఏ‌ఈ సౌదీకి గట్టి పోటీదారుగా మారడం పైన చూశాం. ఇరాక్, ఇరాన్ పక్షాన చేరింది. అమెరికా సేనల ఉపసంహరణకు డిమాండ్ చేస్తోంది. ఉప్పు-నిప్పుగా ఉన్న సౌదీ-ఇరాన్ లు దగ్గరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇన్నాళ్లూ గల్ఫ్ దేశాల్లో వేలు పెట్టలేని ఇజ్రాయెల్ అబ్రహాం ఎకార్డ్స్ దరిమిలా ఏకంగా బహుముఖ సంబంధాలు పొందుతోంది. ఇజ్రాయెల్ చొరబాటుతో గల్ఫ్ దేశాల్లో రాజకీయార్ధిక నిర్మాణంలోనే భారీ అంతరాయం (disruption) చోటు చేసుకుంది. ఫలితంగా భారత పాలకులు వొళ్ళు దగ్గర పెట్టుకుని సంబంధాల పునర్నిర్మాణానికి పూనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గల్ఫ్ వాణిజ్యంలో వాటా చేజిక్కుంచుకునేందుకు ఇజ్రాయెల్ కు ఇప్పుడు దండిగా అవకాశాలు సమకూరాయి. కనుక గల్ఫ్ దేశాలకు ఇండియా చేసే ఎగుమతులకు ఇజ్రాయెల్ నుండి పోటీ అనివార్యం.  ఇండియా కంటే అమెరికా అనుంగు మిత్రుడైన ఇజ్రాయెల్ వైపే యూ‌ఏ‌ఈ, బహ్రెయిన్ ల శిబిరం మొగ్గు చూపితే ఇండియా బొక్కసానికి గండి పడుతుంది.

ఇజ్రాయెల్ ఎగుమతులకు యూ‌ఏ‌ఈ, బహ్రెయిన్ లు గేట్ వే గా మారే అవకాశం ఉన్నది. దుబాయ్ (యూ‌ఏ‌ఈ) నగరం అంతర్జాతీయ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ఒక ప్రధాన కేంద్ర అని మరువరాదు. ఇజ్రాయెల్ సరుకుల్లో రక్షణ (ఆయుధాలు), భద్రతా, గూఢచార పరికరాలు, పొడి నేలల వ్యవసాయం, సౌర విద్యుత్ పరిజ్ఞానం, ఉద్యాన (హార్టికల్చరల్) పంటల ఉత్పత్తులు, ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం, నగలు, రత్నాలు, ఔషధాలు ప్రధానమైనవి.

ఫార్మాస్యూటికల్ రంగానికి ఇండియా పేరెన్నిక గన్నది. అమెరికా, ఐరోపాలకు సైతం భారత ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి. యూ‌ఏ‌ఈ ప్రధాన నగరాల్లో స్ధానికుల కంటే విదేశీయుల సంఖ్య అనేక రెట్లు ఎక్కువగా ఉంటారు. వారిలో భారతీయులు, పాకిస్తానీయులు అధికం. వీరు అమెరికా ఔషధాలు కొనలేరు. భారత ఔషధాలే అందుబాటులో ఉంటాయి. ఈ కారణం వలన భారతీయ రిటైలర్, హోల్ సెల్ ఔషధ అమ్మకందారులు భారత ఔషధ దిగుమతులతో భారీ లబ్ది పొందుతారు. ఇజ్రాయెల్ ప్రవేశంతో భారత్ ఔషధ ఎగుమతులకు గండి పడే అవకాశం ఉంది.

రత్నాలు, నగల విషయంలో భారత కంపెనీలు ప్రపంచ ప్రసిద్ధి గాంచాయి. ప్రపంచ అవసరాల్లో దాదాపు 30 శాతం భారత కంపెనీలు తీరుస్తున్నాయి. పెట్రో డాలర్లతో విలసిల్లే యూ‌ఏ‌ఈ లో ఇజ్రాయెల్ ఈ రంగంలో పోటీకి వస్తే పరిస్ధితి ఏమిటన్నది భారత ప్రభుత్వం ఇప్పుడు ఆలోచించాలి. పోటీ న్యాయబద్ధంగా జరిగితే సమస్య ఉండదు. కానీ వాణిజ్య పోటీలో న్యాయానికి తావు ఉండదు. వివిధ రకాల భౌగోళిక-రాజకీయ, దౌత్య ఒత్తిళ్ళు వాణిజ్య ప్రయోజనాలను ప్రభావితం చేస్తాయని ఇరాన్-ఇండియా చమురు వాణిజ్యమే తెలియజేస్తుంది. దగ్గరుండి అబ్రహాం ఎకార్డ్స్ కు మార్గం సుగమం చేసిన అమెరికా, ఇజ్రాయెల్ తరపున ఒత్తిడి చేయకపోతే ఆశ్చర్యమే.

మానవ వనరుల సరఫరా లోనూ ఇజ్రాయెల్ ఇండియాతో పోటీకి వస్తుంది. జి‌సి‌సి దేశాలకు నైపుణ్య మరియు అర్ధ-నైపుణ్య శ్రమ శక్తిని సరఫరా చేయగల సామర్ధ్యం ఇజ్రాయెల్ కు ఉన్నది. ముఖ్యంగా అరబ్ భాష మాట్లాడగల సెఫార్డిమ్, మిజ్రాహీమ్ జాతుల ప్రజలు గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం పోటీ పడతారు. ఇజ్రాయెల్ లోని అరబ్ ప్రజలు కూడా గల్ఫ్ దేశాలలో కెరీర్ కోసం వరుస కడతారు.

స్టార్టప్ కంపెనీలకు ఇజ్రాయెల్ ప్రసిద్ధి. స్టార్టప్ నేషన్ అని కూడా ఇజ్రాయెల్ ను పిలుస్తారు. సిలికాన్ వ్యాలీ తర్వాత ఇజ్రాయెల్ దేశమే పరిపక్వ స్టార్టప్ కంపెనీల ప్రసిద్ధి.  ఈ రంగంలోని ఇజ్రాయెల్ కంపెనీలు సుంకాలు లేని ఇంక్యుబేటర్ లలో తేలికగా ప్రవేశించగలరు. ఇజ్రాయెల్ తో పోలిస్తే ఇండియా బలహీనంగా ఉంది. స్టార్టప్ కంపెనీలు పరిపక్వానికి రావడంలో ఇజ్రాయెల్ కంటే ఇండియా వెనుకబడి ఉంది. ఈ నేపధ్యంలో యూ‌ఏ‌ఈ నుండి వచ్చే స్టార్టప్ పెట్టుబడులు ఇక నుండి ఇండియా బదులు ఇజ్రాయెల్ వైపు మళ్లే అవకాశం మెండు.

ఇప్పటివరకు గల్ఫ్ దేశాల్లో శ్రమ శక్తి సరఫరా, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, రత్నాలు మరియు నగలు, తేలికపాటి ఇంజనీరింగ్ ఉత్పత్తులు రంగాల్లో ఇండియాకు గణనీయ వాటా కలిగి ఉంది. దుబాయ్ రియల్ ఎస్టేట్, టూరిజం, స్వేచ్ఛా ఆర్ధిక మండళ్ళలో కూడా ఇండియా భారీ వాటా కలిగి ఉన్నది. ఇప్పుడు ఈ వాటాకు ఇజ్రాయెల్ గండి కొట్టబోతోంది. ఇది అనివార్యం. అనివార్యమైన ఈ ఉత్పాతాన్ని భారత పాలకులు ఎలా ఎదుర్కొబోతున్నారు? హిందూత్వ సిద్ధాంతాలతో ముస్లిం ప్రజలపై నలువైపుల నుండి దాడులు చేస్తూ పొరుగునే ఉన్న మిత్రదేశం బంగ్లా దేశ్ చేత కూడా పరమత సహనంపై పాఠాలు చెప్పించుకునే స్ధాయిలో హిందూత్వ పాలకులు ఉన్నారు. ఇటువంటి పాలకులు మధ్యప్రాచ్యంలో ముఖ్యంగా జి‌సి‌సి లో నెలకొన్న క్లిష్ట పరిస్ధితులను ఏ విధంగా నెగ్గుకు రాగలరో చూడాల్సి ఉంది. కనీసం మునుపటి వాణిజ్యాన్ని, కార్మిక ఉపాధిని నిలుపుకోగలరా లేక లేని ప్రతిష్టకు పోయి రెంటికీ చెడ్డ రేవడి అవుతారా అన్నది పరిశీలించాలి.

ముగింపు

ప్రపంచంలో భౌగోళిక-రాజకీయ పరిస్ధితులు వేగంగా మారుతున్నాయి. 2008-09 నాటి ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం దరిమిలా ప్రారంభమయిన అమెరికా పతనం, చైనా ఉద్ధానం కొనసాగుతూ వచ్చి నేటికీ ఒక రూపం తీసుకుంటోంది. అయితే అమెరికా తీవ్రంగా ప్రతిఘటిస్తున్న నేపధ్యంలోనూ చైనా ఆర్ధిక వ్యవస్ధ కూడా స్వాభావికమైన వైరుధ్యాలతో పాటు దోపిడీ-అణచివేతలపై ఆధారపడి ఉన్న నేపధ్యం లోనూ బహుళ ధృవ ప్రపంచం స్పష్టమైన రూపం తీసుకుని స్ధిరపడుతుందా అన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నే.

కానీ అమెరికా అగ్రత్వం, ఆధిపత్యం, ప్రత్యేకత (exceptionalism) అన్నవి ఇక చరిత్రే. బహుళ ధృవ ప్రపంచం స్పష్టంగా ఏర్పడాలన్నా తీవ్ర మౌలిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధ మొదట ఏదో విధంగా కుదుట పడాల్సి ఉన్నది. వాస్తవంలో చైనాను కూడా పెట్టుబడిదారీ సంక్షోభపు ఊబి తనలోకి లాక్కుంటున్నదని ఇటీవలి ఎవర్ గ్రాండ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఋణ సంక్షోభం తెలియజేస్తున్నది.

కనుక భారత ప్రజలకు ముఖ్యంగా శ్రామిక ప్రజలకు పోరాటాల్లోకి సమీకృతులు కావటం తప్ప మరో దారి లేదు. శ్రామికులను వర్గ ఉద్యమాల్లోకి సమీకృతులను చేయవలసిన బాధ్యత శ్రామికవర్గ పార్టీలకు, కార్యకర్తలకు మరింతగా పెరిగింది.

(………………………అయిపోయింది)

3 thoughts on “గల్ఫ్ లో భారత ప్రయోజనాలకు ‘అబ్రహాం ఎకార్డ్స్’ గండం!

 1. హిందూత్వ సిద్ధాంతాలతో ముస్లిం ప్రజలపై నలువైపుల నుండి దాడులు చేస్తూ పొరుగునే ఉన్న మిత్రదేశం బంగ్లా దేశ్ చేత కూడా పరమత సహనంపై పాఠాలు చెప్పించుకునే స్ధాయిలో హిందూత్వ పాలకులు ఉన్నారు.
  ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను పై వ్యాఖ్యను పూర్వపక్షం చేస్తుందేమో?

 2. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు అక్కడి ప్రధాని వెంటనే స్పందించారు. ఎవరినీ వదిలి పెట్టొద్దని ఆదేశాలిచ్చారు. దుర్గా పూజా శిబిరంలో ఖురాన్ ని ఉంచింది ఎవరో కూడా కనిపెట్టి అరెస్ట్ చేశారు.

  హిందువులపై దాడులపై చర్యలు తీసుకోవాలన్న భారత మంత్రుల డిమాండ్ లకు సానుకూలంగా స్పందించిన బంగ్లా ప్రధాని అదే సమయంలో ఇండియాలో కూడా ముస్లింలపై దాడులను అరికట్టాలని కొరడమే కాక అసలు బంగ్లాలో దాడులు ఇండియాలో దాడులకు ప్రతీకారంగా జరుగుతున్నందున ముందు వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని హసీనా కోరారు.

  బంగ్లా ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన ఇక్కడి దాడులకు వ్యతిరేకంగా ఇండియా ప్రభుత్వం నుండి రాకపోగా బాధితులపైనే తిరిగి కేసులు పెట్టడం రివాజు అయింది.

  అందువల్ల పై వాక్యం మీరు చెప్పినట్లు పూర్వపక్షం చేయబోదని నా భావన.

  అలాగని బంగ్లాలో అంతా కరెక్ట్ గా జరుగుతోందని చెప్పలేం. కానీ స్పందనలో తేడా ఉండడం నిజం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s