అబ్రహాం ఎకార్డ్స్: పశ్చిమాసియాలో నూతన భాగస్వామ్యాలకు తెరతీసిన అమెరికా -2


Middle East

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆతిధ్యంలో సెప్టెంబర్ 15, 2020 తేదీన నూతన అరబ్-యూదు శాంతి ఒప్పందానికి వైట్ హౌస్ వేదిక అయింది. అరబ్బు దేశాలు యూ‌ఏ‌ఈ, బహ్రయిన్ లు యూదు దేశం ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ‘అబ్రహాం ఎకార్డ్స్’ పేరుతో పిలవబడుతోంది. ఇది దాదాపు 26 సంవత్సరాల తర్వాత కుదిరిన మొట్టమొదటి అరబ్-యూదు శాంతి ఒప్పందం.

ఇది ఎకార్డ్ (అంగీకారం), అగ్రిమెంట్ (ఒప్పందం) కాదు. దీని ప్రకారం యూ‌ఏ‌ఈ, బహ్రయిన్ లు ఇజ్రాయెల్ లో ఎంబసీలు తెరవాలి. రాయబారులను నియమించాలి. టూరిజం, వాణిజ్యం, ఆరోగ్యం, భద్రతా రంగాలలో ఇజ్రాయెల్ తో కలిసి పని చేయాలి. ఎకార్డ్ లో పాలస్తీనా హక్కుల గురించి ఒక్క పొల్లు ప్రస్తావన కూడా లేదు. 

1967 నాటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత 1979లో మొదటిసారి ఇజ్రాయెల్-ఈజిప్టు మధ్య మొదటి అరబ్-యూదు శాంతి ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 1994లో ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం చేసుకున్న అరబ్ దేశం జోర్డాన్. ఈ వరుసలో అబ్రహాం ఎకార్డ్స్  ద్వారా యూ‌ఏ‌ఈ, బహ్రయిన్ లు ఇజ్రాయెల్ తో మూడవ అరబ్-యూదు శాంతి ఒప్పందం చేసుకున్నాయి. త్వరలో మరిన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్ తో స్నేహం చేయనున్నాయని అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సగర్వంగా ప్రకటించాడు.

అరబ్-యూదు శతృత్వానికి కారణం ఇజ్రాయెల్, పాలస్తీనా భూభాగాన్ని దురాక్రమించడం. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమాన్ సామ్రాజ్యం ఓటమి చెందాక సైక్స్-పికోట్ ఒప్పందం ద్వారా బ్రిటన్,ఫ్రాన్స్ లు ఒట్టోమాన్ రాజ్యాన్ని పంచుకున్నాయి. యూదులకు సొంత దేశం ఏర్పాటు చేస్తానని అప్పుడే బ్రిటన్ ప్రకటించి పాలస్తీనాను లీగ్ ఆఫ్ నేషన్స్ పెత్తనానికి అప్పగించింది. బ్రిటన్ ప్రకటనతో పశ్చిమాసియాలో అరబ్బు ప్రాంతాలు, రాజ్యాలు యూదు రాజ్యం ఏర్పాటుకు వ్యతిరేకంగా సంఘటితం అయ్యారు.

కానీ అరబ్బుల అంతఃకలహాలు, అనైక్యతలను ఉపయోగించుకుని 14 మే 1948లో యూదు రాజ్యం ఇజ్రాయెల్ ఏర్పాటు చేయడంలో పశ్చిమ రాజ్యాలు సఫలం అయ్యాయి. ఇజ్రాయెల్ ఏర్పాటుతో ప్రపంచం నలుమూలల నుండి యూదులు పాలస్తీనా చేరుకున్నారు. పశ్చిమ దేశాల సహాయంతో పాలస్తీనా ప్రజల భూములు, ఇళ్లను లాక్కొని వెళ్లగొట్టారు. పాలస్తీనా అరబ్బులు చుట్టుపక్కల అరబ్బు దేశాలకు శరణార్ధులుగా వలస వెళ్ళి ఇప్పటికీ అక్కడే శిబిరాల్లో తలదాచుకుని బ్రతుకుతున్నారు. తిరిగి తమ స్వంత భూములు చేరుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ నేపధ్యంలో అరబ్ దేశాలు, ఇజ్రాయెల్ మధ్య 3 యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల్లో అరబ్బు దేశాలు ఘోర ఓటమి పాలైనారు. క్రమంగా అమెరికా, పశ్చిమ ఐరోపా రాజ్యాల ఒత్తిడితో అరబ్బు దేశాలు ఒక్కొక్కటి ఇజ్రాయెల్-అమెరికా ప్రలోభాలకు తలొగ్గి పాలస్తీనా ప్రజలకు ద్రోహం చేస్తూ వచ్చాయి. ఫలితంగా బిల్ క్లింటన్ అధ్యక్షరికంలో అరబ్బు నేత యాసర్ అరాఫత్ అనేక పరిమితులతో, షరతులతో, పరిమిత భూభాగంతో (1967 నాటి సరిహద్దులతో కూడిన వెస్ట్ బ్యాంక్, గాజా)  “ఓస్లో ఒప్పందం” కుదుర్చుకున్నాడు. ఇజ్రాయెల్ ఆధిపత్యానికి లోబడి ‘పాలస్తీనా ఆధారిటీ’ పేరుతో పాలస్తీనా ప్రభుత్వం ఏర్పరిచాడు.

కానీ ఓస్లో ఒప్పందాన్ని మరుసటి రోజు నుండే ఇజ్రాయెల్ బుట్ట దాఖలు చేసింది. తూర్పు జెరూసలేం తో సహా, వెస్ట్ బ్యాంక్ లో భూములు, నివాసాలు, నీటివనరులు దురాక్రమించి యూదు సెటిల్మెంట్లు నిర్మిస్తూ వచ్చింది. మితవాద లికుడ్ పార్టీ పాలనలో, నెతన్యాహూ ప్రధాన మంత్రిత్వంలో యూదు దురహంకార వలసాధిపత్య పాలన అడ్డూ అదుపూ లేకుండా కొనసాగింది.  అయినప్పటికీ అరబ్బు దేశాల లొంగుబాటు కొనసాగుతూ పోయింది. 15 సెప్టెంబర్ 2020 నాటి ‘అబ్రహాం ఎకార్డ్స్’, అవడానికి ఇది అంగీకారమే అయినప్పటికీ ఈ సంవత్సర కాలంలో జరిగిన పరిణామాలు మాత్రం ‘ఒప్పందం’ స్ధాయిలో జరుగుతున్నాయి. కనుక అబ్రహాం ఎకార్డ్ ను అరబ్బు పాలకుల లొంగుబాటు పర్వంలో ఒక గుణాత్మక మలుపుగా పరిగణించవచ్చు.

అబ్రహాం ఎకార్డ్ దరిమిలా ఇజ్రాయెల్, యూ‌ఏ‌ఈల మధ్య సంబంధాలు బాల్య దశ నుండి వ్యూహాత్మక స్ధాయికి వేగంగా వృద్ధి చెందాయి. అబ్రహాం ఎకార్డ్ పాలస్తీనా భూములను మరింత ఆక్రమించకుండా నిరోధించడానికి ఉద్దేశించినది కాదనీ, పశ్చిమాసియా ప్రాంతంలో శక్తివంతమైన యూదు దేశంతో ఒప్పందాల ద్వారా సొంత వృద్ధిని పెంచుకోవడం, ఈ ప్రాంతంలో తన సొంత ప్రభావాన్ని పెంపొందించుకోవడం, అలాగే అంతర్జాతీయంగా తన ప్రతిష్టను వృద్ధి చేసుకోవడం యూ‌ఏ‌ఈ లక్ష్యమని త్వరలోనే స్పష్టం అయింది. ఆరంభంలో ఎకార్డ్ ను డొనాల్డ్ ట్రంప్ పి‌ఆర్ కాంపెయిన్ గానూ, ‘అవకాశం కోసం కుదిరిన పెళ్లి’ గానూ భావించిన విశ్లేషకులు అది అంతర్జాతీయ సంబంధాలలో, భౌగోళిక-రాజకీయాల్లో గణనీయ మార్పులకు దోహదం చేయనున్నదని గుర్తిస్తున్నారు.

మరోమాటలో చెప్పాలంటే అబ్రహాం ఎకార్డ్, పాలస్తీనా ప్రయోజనాలకు నేరుగా వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడింది. పాలస్తీనాకు మాత్రమే కాక ఇజ్రాయెల్ శాశ్వత శత్రువుగా భావించే ఇరాన్ కు వ్యతిరేకంగా, ఇటీవల కాలంలో ప్రాంతీయ ఆధిపత్యం కోసం పోటీ పడుతూ సిరియా, లిబియా, ఆఫ్ఘనిస్తాన్ లలో వేలు పెట్టిన టర్కీ వ్యూహాలకు వ్యతిరేకంగా, క్రమంగా అమెరికా విధానాల దరిమిలా దానికి దూరం అవుతూ రష్యాకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్న సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా అబ్రహాం ఎకార్డ్స్ ఎక్కుపెట్టబడింది అని స్పష్టం అవుతున్నది.

ఈ పరిణామం అబ్రహాం ఎకార్డ్స్ తో ఆగిపోలేదు. కొనసాగింపుగా ఏప్రిల్ 16, 2021 తేదీన జో బైడెన్ అధ్యక్షరికం ప్రోత్సాహంతో యూ‌ఏ‌ఈ, ఇజ్రాయెల్, గ్రీసు, సైప్రస్ దేశాల విదేశాంగ మంత్రులు పాఫోస్ (సైప్రస్) నగరంలో సమావేశం అయ్యారు. “ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం సభ్యత్వం అరేబియన్ గల్ఫ్ తీరాల నుండి మధ్యధరా, ఐరోపాల వరకు విస్తరించింది” అని ఇజ్రాయెల్ విదేశీ మంత్రి గాబి అష్కెనాజీ ప్రకటించగా, “మా సమావేశం  మధ్యప్రాచ్యం మారుతున్న ముఖానికి గుర్తుగా నిలుస్తుంది. ఇజ్రాయెల్ తో సంబంధాలు ప్రత్యామ్నాయ వ్యూహాత్మక దృక్పధానికి ప్రతీక” అని యూ‌ఏ‌ఈ ప్రతినిధి అన్వర్ గర్గాష్ ప్రకటించాడు (ద అరబ్ వీక్లీ, 17/04/2021).

Greece, UAE, Israel, Cyprus meeting -April 16, 2021

ఇక్కడ ఒక సంగతి గమనంలో ఉంచుకోవాలి. మధ్యధరా సముద్రం లోని సైప్రస్ ద్వీపం గ్రీసు, టర్కీల మధ్య గ్రీక్ సైప్రస్, టర్కిష్ సైప్రస్ లుగా విభజించబడి ఉంది. 1970ల మధ్యలో గ్రీసు ప్రోత్సాహంతో జరిగిన సైనిక కుట్రకు వ్యతిరేకంగా టర్కీ తన సైన్యాలను సైప్రస్ లోకి నడిపించి మూడవ వంతు తన నియంత్రణలోకి తెచ్చుకుంది. తూర్పు మధ్యధరా సముద్రంలోని అపారమైన చమురు నిల్వల కోసం గ్రీసు, టర్కీల మధ్య సైప్రస్ వివాదం కొనసాగుతోంది. సైప్రస్ ఏకీకరణకు గ్రీసు డిమాండ్ చేస్తుంటే, రెండు వేరు వేరు దేశాల ఉనికిని గుర్తించాలని టర్కీ డిమాండ్ చేస్తోంది.

నాటో సభ్య దేశమైనప్పటికీ టర్కీ, పశ్చిమ దేశాల ఆదేశాలను పెద్దగా లెక్క చేయదు. రెసిప్ తయ్యిప్ ఎర్దోగాన్ అద్యక్షరికంలో టర్కీ ప్రాంతీయ ఆధిపత్యం కోసం కృషి చేస్తూ సిరియా, లిబియాలకు తన సైన్యాన్ని పంపింది. ఇజ్రాయెల్ తోనూ అడపా దడపా ప్రకటనల యుద్ధం నడుపుతోంది. టెర్రరిస్టులకు, ఇరాన్ కు మద్దతు ఇస్తోందన్న సాకుతో 2017లో కతార్ పై సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలు దిగ్బంధనం ప్రకటించినప్పుడు టర్కీ కతార్ కు మద్దతుగా నిలిచింది. ఇది యూ‌ఏ‌ఈ కి కంటగింపు అయింది.

టర్కీ, కతార్ ల మద్దతుతో ఇస్లామిక్ సంస్ధ ‘ముస్లిం బ్రదర్ హుడ్’ ద్వారా తమ దేశాల్లో అసంతృప్తి రేపి తీవ్రవాదులు టెర్రరిస్టు చర్యలకు పాల్పడతారని గల్ఫ్ రాచరిక ప్రభుత్వాలు, ముఖ్యంగా యూ‌ఏ‌ఈ, భయపడుతున్నాయి. ఆఫ్ఘన్ నుండి అమెరికా సేనల ఉపసంహరణ సమయంలో కాబూల్ విమానాశ్రయాన్ని తన సైన్యం చేతుల్లోకి తీసుకోవడానికి విఫల యత్నం చేసింది. మరోవైపు అమెరికా ఆంక్షల వలనా, కోవిడ్-19 వలనా ఇరాన్ బలహీనపడినట్లు యూ‌ఏ‌ఈ నమ్ముతోందని ఆ దేశ అధికారుల ప్రకటనలు తెలియజేస్తున్నాయి.

ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్ తో పాటు యూ‌ఏ‌ఈ ని కూడా మధ్యప్రాచ్యంలో తన ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే మరో ప్రాంతీయ శక్తిగా యూ‌ఏ‌ఈ ని నిలిపేందుకు అమెరికా సైప్రస్ సమావేశాన్ని ఉద్దేశించింది. ఈ విధంగా పాత శతృత్వాలను, కొత్త మిత్రత్వాలను కలగలిపి నూతన భౌగోళిక-రాజకీయ వేదికకు అమెరికా అంకురార్పణ చేసింది. యూ‌ఏ‌ఈ, ఇజ్రాయెల్ లు ప్రాంతీయ ఆధిపత్యం కోసం, అమెరికా ప్రపంచాధిపత్యం పునరుద్ధరణ కోసం ఈ నూతన వేదికలో భాగం అవుతున్నాయి.

(………………………….. తరువాత 3వ భాగంలో)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s