ఆసియాలో ఇండియా సభ్య దేశంగా మరో ‘క్వాడ్’ కూటమి


S Jaishankar in Jerusalem on Oct 18, 2021

చైనా, రష్యాలకు వ్యతిరేకంగా… ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేస్తున్న వ్యూహాత్మక కూటముల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతం లోని ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ లతో కలిపి ‘క్వాడ్’ కూటమిని తయారు చేసిన అమెరికా ఇప్పుడు పశ్చిమాసియా కేంద్రంగా మరో క్వాడ్ కూటమిని ఏర్పాటు చేసింది. ఇందులో అమెరికా, ఇండియాలతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూ‌ఏ‌ఈ), ఇజ్రాయెల్ లు సభ్య దేశాలుగా ఉన్నాయి.

గత సంవత్సరం సెప్టెంబర్ లో అమెరికా ఆశీస్సులతో వైట్ హౌస్ వేదికగా ఇజ్రాయెల్, యూ‌ఏ‌ఈ, కింగ్^డమ్ ఆఫ్ బహ్రయిన్ దేశాల మధ్య ‘అబ్రహాం ఎకార్డ్స్’ పేరుతో ఒప్పందం కుదిరిన దరిమిలా గల్ఫ్ ప్రాంతంలో ఇండియా ప్రయోజనాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలోనే ఇజ్రాయెల్-యూ‌ఏ‌ఈ ల మధ్య దౌత్య, వాణిజ్య, రాజకీయ సంబంధాలు వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఫలితంగా గల్ఫ్ దేశాలతో చారిత్రక సంబంధాలు కలిగి ఉన్న భారత్ ప్రయోజనాలకు గండి పడుతూ వచ్చింది.

బహుశా భారత్ అసంతృప్తిని చల్లార్చి, బుజ్జగించడానికా అన్నట్లు ఇజ్రాయెల్, యూ‌ఏ‌ఈ లతో ఇండియాను కలిపి నూతన క్వాడ్ కూటమికి అమెరికా అంకురార్పణ చేసినట్లు కనిపిస్తోంది. భారత్ అసంతృప్తిని చల్లార్చడంతో పాటు తాను స్వయంగా సభ్య దేశంగా చేరడం ద్వారా పశ్చిమాసియాలో తన ప్రాముఖ్యత తగ్గకుండా చూసుకునే ఏర్పాటును అమెరికా చేసుకుందన్నది సుస్పష్టం.

ఇజ్రాయెల్ తో ద్వైపాక్షిక చర్చల నిమిత్తం 5 రోజుల పర్యటనకు ఇండియా విదేశీ మంత్రి జైశంకర్ ఇజ్రాయెల్ సందర్శించారు. ఇజ్రాయెల్ ప్రత్యామ్న్యాయ ప్రధాన మంత్రి యాయిర్ లఫెడ్ తో సమావేశాలు జరిపిన అనంతరం చతుర్భుజ కూటమి దేశాల (అమెరికా, ఇజ్రాయెల్, యూ‌ఏ‌ఈ) విదేశాంగ మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. అమెరికా సమక్షంలో ఇజ్రాయెల్-యూ‌ఏ‌ఈల మధ్య గత యేడు కుదిరిన అబ్రహాం ఎకార్డ్స్ పునాదిగా తాజా చతుర్భుజ కూటమి ఏర్పాటయిందని ది హిందూ పత్రిక విశ్లేషించింది.

సమావేశంలో యూ‌ఏ‌ఈ విదేశీ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్, అమెరికా విదేశీ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) ఆంటోని బ్లింకెన్, ఇజ్రాయెల్ విదేశీ మంత్రి యాయిర్ లఫెడ్, ఇండియా విదేశీ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. భారత విదేశీ మంత్రి యూ‌ఏ‌ఈ మీదుగానే ఇజ్రాయెల్ వెళ్ళడం గమనార్హం. గతంలో యూ‌ఏ‌ఈ, ఇజ్రాయెల్ మధ్య రాకపోకలు లేవు. దౌత్య సంబంధాలూ లేవు. అబ్రహాం ఎకార్డ్స్ అనంతరం ఇరు దేశాలు విమాన రాకపోకలు అభివృద్ధి చేసుకున్నాయి. దౌత్య కార్యాలయాలు ఏర్పాటు చేశాయి.

ప్రాంతీయంగా, గ్లోబల్ స్ధాయిలో పరస్పరం సహకారం చేసుకునే అవకాశాలపై చర్చలు జరిపినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. “వాణిజ్యం, పర్యావరణ మార్పులను ఎదుర్కోవడం, ఇంధన సహకారం, నావికా ప్రయాణ భద్రతల ద్వారా సహకరించుకోవడంతో పాటు ఆర్ధిక, రాజకీయ రంగాలలో ఉమ్మడి కృషిని విస్తృతం చేసుకునే దిశలో చర్చలు జరిగాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లోనూ, కోవిడ్-19 మహమ్మారికి సంబంధించి ప్రపంచ ప్రజల ఆరోగ్య భద్రతకు మద్దతు ఇవ్వడంలోనూ ప్రజలు-ప్రజల మధ్య సంబంధాలు పెంపొందించే అంశాన్ని కూడా చర్చించాము” అని అమెరికా విదేశీ ప్రతినిధి సోమవారం సాయంత్రం సమావేశాల అనంతరం పత్రికలకు తెలిపాడు.

ఇండియాతో సమావేశానికి మునుపే అమెరికా, ఇజ్రాయెల్, యూ‌ఏ‌ఈ లు అక్టోబర్ 13 తేదీన వాషింగ్టన్ లో వేరుగా సమావేశం కావడం గమనార్హం. ఇందులో త్రైపాక్షిక సహకారం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భిన్నమతాల సహజీవనం మరియు నీరు-ఇంధనం అంశాలపై రెండు వర్కింగ్ గ్రూపులు కూడా ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఆ తర్వాతనే ఇండియాతో ఇజ్రాయెల్ లో సమావేశమై చతుర్భుజ కూటమిని ప్రకటించారు. ఈ నేపధ్యంలో నూతన క్వాడ్ కూటమిలో ఇండియాకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటా అన్నది ఒక ప్రశ్నగా మారింది.

Abraham Accords: Bahrain FM, Israel PM, The USA Pres, UAE FM on Sept 15, 2020

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఏర్పాటు చేసిన క్వాడ్ కూడా ఇండియా విషయంలో ఇదే తరహా ప్రశ్న తలెత్తింది. దశాబ్ద కాలం పాటు తర్జన భర్జనలు జరిపి అమెరికా-జపాన్-ఇండియా-ఆస్ట్రేలియా లతో క్వాడ్ ఏర్పాటయిందని ప్రకటించారు. ఆ వెంటనే ఉరమని పిడుగులాగా అమెరికా-యూ‌కే-ఆస్ట్రేలియాలతో ‘ఆకస్’ పేరుతో మిలట్రీ కూటమి ఏర్పడిందని ప్రకటించడమే కాకుండా ఆస్ట్రేలియాకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన అణు ఇంధనం ఆధారిత సబ్ మెరైన్ లు సరఫరా చేస్తున్నట్లు అమెరికా, యూ‌కే లు ప్రకటించాయి. ఆకస్ ప్రకటన వెలువడ్డాక అమెరికా దృష్టిలో ఇండియా కు (ఆ మాటకొస్తే జపాన్ కు కూడా) ఉన్న ప్రాముఖ్యత అలంకార ప్రాయమే అన్న అభిప్రాయం స్ధిరపడింది.

నిజానికి అమెరికా దృష్టిలో క్వాడ్ కూ, ఆకస్ కూ వైరుధ్యం ఏమీ లేదు. ఏ దేశాన్ని ఎలా, ఎంతవరకు వాడుకోవాలో అమెరికాకు ఒక అవగాహన ఉంటుంది. ఈ రెండు కూటముల ఏర్పాటులో అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్య ప్రయోజనమే గైడింగ్ ఫోర్స్. కానీ ఇండియా వైపు నుండి చూసినప్పుడు తన ప్రయోజనాల రీత్యా తన ప్రాధామ్యాలు ఏమిటో ఇండియాయే నిర్ణయించుకోవాలి. తనకు ప్రాధామ్యం లేని క్వాడ్ లో ఉండడమా, మానడమా లేదా తన ఆర్ధిక, వాణిజ్య, భద్రతా ప్రయోజనాలు, అవసరాల రీత్యా తానే చొరవ తీసుకుని ప్రాంతీయ కూటములు ఏర్పాటు చేసుకోవడమా అన్నది ఇండియా నిర్ణయించుకోవాలి.

కానీ అలాంటి ఆలోచన భారత పాలకులు స్వతంత్రంగా ఉన్నప్పుడే చేయగలరు. గుడ్డిగా అమెరికానో, రష్యానో అనుసరించి పోతున్నప్పుడు ఇండియా ప్రయోజనాలు ఎప్పుడూ ఆధిపత్య దేశాలకు సెకండరీగా లోబడే ఉండక తప్పదు. ఇండో-పసిఫిక్ క్వాడ్ లో గానీ, పశ్చిమాసియా క్వాడ్ లో గాని ఇండియాకు గల ప్రాధామ్యం ఏమిటో ఈ అంశమే నిస్సందేహంగా నిరూపిస్తోంది.

అబ్రహాం ఎకార్డ్స్ దరిమిలా యూ‌ఏ‌ఈ, ఇజ్రాయెల్ మధ్య దౌత్య, వాణిజ్య సమబంధాలు ఏర్పడ్డాక గత యేడాది కాలంగా ఇండియా-ఇజ్రాయెల్-యూ‌ఏ‌ఈ దేశాలలోని వాణిజ్య కంపెనీల గ్రూపులు వివిధ వేదికలపై చర్చలు జరిగిన మాట వాస్తవమే. కానీ ఈ చర్చలు ఇంకా యూ‌ఏ‌ఈ, ఇజ్రాయెల్ లకు లాభించినంతగా ఇండియాకు  ఆచరణలో ఒనగూరింది ఏమీ లేదు. ఇండియాకు ఒనగూరే ప్రయోజనం ఏమిటో అంచనాలతోనే ఆగిపోయింది.

ఉదాహరణకి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండో-ఇజ్రాయెలీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ (IFIIC) ప్రకారం ఇజ్రాయెల్ నూతన ఆవిష్కరణలు, యూ‌ఏ‌ఈ నిధులు, ఇండియా మాన్యుఫాక్చరింగ్ రంగ పునాది… ఈ మూడింటి కలయిక ద్వారా 2030 లోపు 100 బిలియన్ డాలర్ల మేర వాణిజ్యం జరిగే అవకాశం ఉన్నది. ఇదొక అంచనా. ఇందులో ఇండియాకు లభించే వాటా ఏమిటో తెలియదు. అయితే ఇండియాలో మాన్యుఫాక్చరింగ్ పునాది కలిగిన ఇజ్రాయెలీ కంపెనీ Ecoppia ద్వారా రోబోటిక్ సోలార్ (పానెల్) క్లీనింగ్ టెక్నాలజీ అభివృద్ధికై యూ‌ఏ‌ఈ ఒక ప్రాజెక్టు తలపెట్టినట్లు తెలుస్తోంది.

అయితే ఈ కంపెనీలో వాటాలన్నీ అమెరికన్ ఇజ్రాయెలీల కంపెనీలు మరియు బిలియనీర్లకు సొంతం. కనుక ఈ ప్రాజెక్టు లబ్దిదారులు అంతిమంగా అమెరికా, ఇజ్రాయెల్, యూ‌ఏ‌ఈ ల బిలియనీర్లే తప్ప భారత ప్రజలు కాదు. ఈ కంపెనీలో మొత్తం ఉద్యోగులే 150 మంది. దరిమిలా ఇండియాకు లభించే ఉపాధి నామ మాత్రం.

కానీ గల్ఫ్ లో భారత పాలకుల సహకారంతో ఇజ్రాయెల్ చొరబాటు వల్ల భారత్ కు కలిగే నష్టం భారీగా ఉండబోతున్నదని పరిశీలకుల అంచనా. మొట్టమొదట ఈ కూటమి వల్ల ఇజ్రాయెల్ ఆధిపత్య పూర్వక ఆక్రమణలో ఉన్న పాలస్తీనా ప్రజల ప్రయోజనాలకు బద్ధ విరుద్ధం. ఈ కూటమి ద్వారా ఇండియా, యూ‌ఏ‌ఈలు జాత్యహంకార ఇజ్రాయెల్ కు ఆమోదనీయతను సమకూర్చి పెట్టాయి.

పాలస్తీనా ప్రయోజనాలకు మద్దతుగా అరబ్బు దేశాలకు దౌత్య పరమైన సహకారం, మద్దతు ఇవ్వడం ఇన్నాళ్లూ ఇండియా అనుసరించిన విదేశాంగ విధానం. బి‌జే‌పి అధికారం చేపట్టాక 1999-2004 లోనూ 2014 అనంతరమూ ఇండియా బహిరంగంగానే ఇజ్రాయెల్ అనుకూల విధానం అనుసరిస్తోంది. పాలస్తీనా ప్రజల వ్యవసాయ భూములనూ, నివాస ప్రాంతాలను, నీటి వనరులనూ కబళించి వేస్తూ వారికి నిలువ నీడ లేకుండా చేస్తున్న ఇజ్రాయెల్ చర్యలపై వీసమెత్తు నిరసన కూడా ఇండియా తెలపడం లేదు.

ఇప్పుడు పాలస్తీనా ప్రయోజనాలతో పాటు మధ్య ప్రాచ్యం మరియు గల్ఫ్ ప్రాంతంలో తన సొంత ప్రయోజనాలకు కూడా ఇండియా స్వయంగా గండి కొట్టుకుంటోందని భారత విశ్లేషకులతో పాటు, గ్లోబల్ పరిణామాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఈ సంగతి వివరంగా తరువాతి భాగంలో చూద్దాం.

…………. మిగతా రెండో భాగంలో

2 thoughts on “ఆసియాలో ఇండియా సభ్య దేశంగా మరో ‘క్వాడ్’ కూటమి

  1. ఏమిటి సర్ మీ లెక్కలేనితనం!
    మీకు వినికిడి సమస్య ఉందని అది బెంగళూరు హాస్పిటల్ వల్ల పరిష్కరించబడింది అని ఒక వ్యాసం రాసారు. దాన్ని నమ్మి చాలాసార్లు మెయిల్ పంపితే ఏమిటి మీ నిర్లక్ష్యం. సమాధానం లేదు.

  2. సత్తిబాబు గారూ, మెయిల్ నేను చూడలేదు. నా బ్లాగ్ ని కూడా 3 యేళ్ళు తర్వాత మొన్ననే చూశాను.

    ఇంతకీ మీ మెయిల్ సారాంశం ఏమిటి? మెయిల్ వెతికాను గానీ మీ పేరుతో ఏ మెయిలూ నాకు రాలేదు.

    నేను చెప్పిన హాస్పిటల్ లో మెయిన్ డాక్టర్ గారు 4 సం.ల క్రితం చనిపోయారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s