
Ballistic missile path (Green) & Hypersonic missile path (RED)
హైపర్ సోనిక్ మిసైల్ ను తాము పరీక్షించామంటూ వచ్చిన వార్తలు నిజం కాదని చైనా ప్రకటించింది. “అది అంతరిక్ష వాహకం, మిసైల్ కాదు” అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ సోమవారం విలేఖరుల ప్రశ్నలకు బదులు ఇస్తూ చెప్పాడు.
తాము హైపర్ సోనిక్ వాహకాన్ని ప్రయోగించి పరీక్షించామే తప్ప హైపర్ సోనిక్ మిసైల్ ని పరీక్షించలేదని ఝావో వివరించాడు. “అది కూడా ఫైనాన్షియల్ టైమ్స్ చెప్పినట్లు ఆగస్టులో కాదు, జులైలో ఆ పరీక్ష జరిగింది” అని ఆయన స్పష్టం చేశాడు.
అమెరికా ఇంటలిజెన్స్ సంస్ధలకు చెందిన 5గురు అధికారులు ఇచ్చిన సమాచారాన్ని ఉటంకిస్తూ ఎఫ్‌టి శనివారం చైనా హైపర్ సోనిక్ మిసైల్ పరీక్ష జరిపినట్లు నివేదించింది. హైపర్ సోనిక్ మిసైల్ టెక్నాలజీ అభివృద్ధిలో చైనా అత్యంత వేగంగా పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం పట్ల అమెరికా గూఢచార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు కూడా ఎఫ్‌టి తెలిపింది.
కొన్ని పత్రికలు చైనా పరిజ్ఞానం అమెరికా పరిజ్ఞానాన్ని మించిపోయినట్లు కూడా తెలిపాయి.
ఇవేవీ నిజం కాదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రకటన చెబుతోంది. అయితే మిలట్రీ పరిజ్ఞానం అభివృద్ధి స్ధాయి పట్ల ఆయా దేశాలు గోప్యత పాటించడం కొత్తేమీ కాదు. ఉత్తర కొరియా లాంటి అవసరం ఉన్న దేశాలు (వారి భద్రతా అవసరాల రీత్యా) తప్ప పెద్ద దేశాలు తమ ఆయుధ పరిజ్ఞానం పై రహస్యాన్ని పాటిస్తాయి. తద్వారా తమ వ్యూహాత్మక ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాయి. మళ్ళీ వ్యూహాత్మక ప్రయోజనాలే డిమాండ్ చేసినప్పుడు తప్ప వాస్తవాలను వెల్లడి చేయడానికి ఇచ్చగించవు. చైనా అదే తరహా గోప్యతను పాటిస్తున్నదా అన్న విషయం మళ్ళీ గూఢచర్యం ద్వారానే వెల్లడి కావాలి తప్ప మరో విధంగా తెలిసే అవకాశం లేదు.
తాము ప్రయోగించిన వాహకం దానిని పదే పదే ఉపయోగించవచ్చా లేదా అన్న సంగతిని తెలుసుకునేందుకు పరీక్షించామని, తద్వారా ఖర్చు తగ్గించుకోవడం తమ లక్ష్యమని చైనా ప్రతినిధి లిజియాన్ చెప్పాడు. ఇది కేవలం శాంతియుత ప్రయోజనాలకు, మానవ ప్రయోజనాలకు ఉద్దేశించినదని తెలిపాడు.
ఇక్కడ గమనీచవలసిన విషయం ఏమిటంటే రాయిటర్స్ సంస్ధ ఎఫ్‌టి రిపోర్ట్ ని ఉటంకిస్తూనే రెండు రకాలుగా చైనా పరీక్ష గురించి చెప్పటం.
శనివారం ప్రచురించిన వార్తలో మొదటి పెరాలో “చైనా అణు సామర్ధ్యం కలిగిన హైపర్ సోనిక్ మిసైల్ ని ఆగస్టులో పరీక్షించింది” అని రాసింది.
అదే వార్తలో రెండవ పేరాలో “చైనా మిలట్రీ హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్ ను మోసుకుపోగల రాకెట్ ని ప్రయోగించింది” అని రాసింది.
మొదటి పేరాలో మిసైల్ అనీ, రెండవ పేరాలో వెహికల్ అనీ రాసింది. రెండవ పేరాలో రాసినదే కరెక్ట్ అని చైనా ప్రకటన తెలియజేస్తోంది. ఈ రెండింటికీ తేడాను ఎఫ్‌టి, రాయిటర్స్, ఇంకా అనేక పశ్చిమ మరియు భారతీయ పత్రికలు గుర్తించలేదా లేక వాటికి తెలియదా అన్నది తెలియకున్నది. లేక గ్లైడ్ వెహికల్ అంటే మిసైల్ అనే అర్ధమా?!
ఇండియా కూడా…!
ఇండియా కూడా హైపర్ సోనిక్ మిసైల్ పరీక్షను విజయవంతంగా పరీక్షించినట్లు గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో DRDO ప్రకటించింది. ఈ మేరకు DRDO బృందాన్ని అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోడి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇది అచ్చంగా దేశీయ పరిజ్ఞానంతో తయారైందని పత్రికలు చెప్పాయి.
భారత్ తలపెట్టిన హైపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అభివృద్ధిలో రష్యా పరిజ్ఞానం పాత్ర ఉన్నది. ఇండియా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్-II మిసైల్ తయారీ రష్యా మద్దతుతో తయారు చేసిన సంగతి అధికార వర్గాలకు తెలిసిన విషయమే. ఇది సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్.
అయితే సెప్టెంబర్ 2020లో DRDO పరీక్షించిన మిసైల్ ‘హైపర్’ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అనీ ఇది శబ్ద వేగానికి 6 రెట్లు వేగంతో ప్రయాణించిందని DRDO సంస్ధ ప్రకటించింది. ఒడిశా తీరానికి దగ్గరలోని ద్వీపం నుండి జరిపిన హైపర్ సోనిక్ మిసైల్ ప్రయోగంలో అన్నీ వ్యవస్ధలూ సక్రమంగా, అనుకున్నది అనుకున్నట్లుగా పని చేశాయని DRDO అధికారులు చెప్పారు.
ఆ విధంగా హైపర్ సోనిక్ మిసైల్ టెక్నాలజీలో అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన ఇండియా చేరిందని భారత ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది.
భారత ఆర్ధిక వ్యవస్ధ అమెరికా, చైనాలతో సరితూగేది కాదు. ఈ రెండు దేశాలతో వేటితో పోటీ పడినా అది అంతిమంగా భారత ఆర్ధిక వ్యవస్ధకు భారమే అవుతుంది.
భారత రక్షణ పరిజ్ఞానం అభివృద్ధి ప్రధానంగా పాకిస్తాన్, చైనా లను లక్ష్యంగా చేసుకుని జరుగుతుంది. చైనా, పాక్ లు రెండూ మనకు పొరుగు దేశాలే. ఈ రెండింటితో మనకు సరిహద్దు ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ సరిహద్దు తగాదా ఇండియాకు బ్రిటిష్ వాళ్ళు మనకు అంటగట్టిపోయిన సమస్య.
సరిహద్దు తగాదాలు ఎప్పటికైనా ఆయా దేశాలు స్నేహ పూర్వక చర్చలు జరపడం ద్వారా మాత్రమే పరిష్కారం చేసుకోగలవు. ఒకరినొకరు తిట్టుకుంటూ, సవాళ్ళు విసురు కుంటూ, నువ్వు గొప్పా నేను గొప్పా అని పోట్లాడుకుంటూ ఉన్నంత కాలం తగాదాలు పెరిగి పెద్దవి కావడమే కాకుండా ఆ పేరుతో జరిగే ఆయుధ పోటీ వల్ల ఇరు దేశాల ఖజానాలకు పెద్ద పెద్ద చిల్లులు పడి ప్రజా సంక్షేమం కాస్తా మూలన పడుతుంది.
దానికి బదులు చర్చల ద్వారా సరిహద్దులు నిర్ణయించుకుని ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా ఒప్పందాలు చేసుకుని వాటికి కట్టుబడి ఉన్నట్లయితే ఆయుధ పోటీలో శక్తియుక్తులు ధారపోసే బదులు దేశాభివృద్ధిలో అనగా ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధిలో శక్తియుక్తులను కేంద్రీకరించే అద్భుత అవకాశం లభిస్తుంది.
కానీ ఆయుధాల పోటీపై ఆధారపడి బతికే పరాన్నభుక్త పెట్టుబడిదారీ వర్గాలు ఆ అవకాశాన్ని ప్రజలకు ఇవ్వరు. ముఖ్యంగా భారత్, పాక్ లాంటి దేశాల మధ్య తగవులు రెచ్చగొట్టి తమ ఆయుధాలు అమ్ముకునే అమెరికా, ఐరోపా లాంటి దేశాలు అసలే ఊరుకోవు. భారత పాలకులకు ఈ సంగతి తెలియనిదీ కాదు.
Hi Visekhar garu. I am a regular follower of your blog since 2012. I have been checking your blog from time to time for new posts but could find any . I am very happy to see you posting content again. Hope you are doing well.
Hi Sekhar, Yeah, my health was disturbed. Now I am fine. Thanks for your concern.