
Representative image
హైపర్ సోనిక్ మిసైల్ తయారీలో చైనా అనూహ్య రీతిలో పురోగతి సాధిస్తున్న వార్తలు అమెరికాకు చెమటలు పట్టిస్తున్నాయి. మొట్టమొదటి హైపర్ సోనిక్ మిసైల్ పరీక్షను చైనా విజయవంతంగా పరీక్షించిన సంగతి వెల్లడి అయింది. గత ఆగస్టు నెలలో జరిగిన ఈ పరీక్ష సంగతిని చైనా రహస్యంగా ఉంచడంతో అది ఎవరికీ తెలియలేదు.
చైనా జరిపిన హైపర్ సోనిక్ మిసైల్ అణు బాంబులను మోసుకెళ్లే సామర్ధ్యం కలిగినది. చైనా ఈ పరిజ్ఞానం కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసినప్పటికీ, ఆ ప్రయత్నాలు సఫలం అయినట్లు తెలియడం ఇదే మొదటిసారి. చైనా పరీక్షను అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలు పసిగట్టినట్లు ఫైనాన్సియల్ టైమ్స్ పత్రిక తెలియజేసింది. ఈ పరీక్ష సంగతి తెలిసి అమెరికా మ్రాన్పడిపోయిందని ఎఫ్‌టి తెలిపింది.
“చైనా మిలట్రీ హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్ ను మోసుకెళ్లగల రాకెట్ ని ప్రయోగించింది. తక్కువ ఎత్తులో ప్రయాణించిన ఈ రాకెట్ టార్గెట్ ని చేరలేదు. 27 కిమీ దూరంలో అది టార్గెట్ ని మిస్ అయింది” అని అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ ఎఫ్‌టి తెలిపింది. ” ఈ పరీక్షతో హైపర్ సోనిక్ ఆయుధాల తయారీలో అద్భుతమైన ప్రగతి సాధించిన సంగతి తేటతెల్లం అయింది. ఈ పరిజ్ఞానం అమెరికా అనుకున్నదాని కంటే చాలా మెరుగైన స్ధాయిలో ఉన్నట్లు పరీక్ష ద్వారా స్పష్టం అయింది” అని సదరు వర్గాలు చెప్పాయి.
ఎఫ్‌టి ప్రకారం కేవలం అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే హైపర్ సోనిక్ గ్లైడ్ వాహకాలను అభివృద్ధి చేస్తున్నాయి. వీటిని రాకెట్ ల ద్వారా ప్రయోగిస్తారు. అనంతరం అవి తమంతట తాముగా సొంత వేగంతో ప్రయాణించి భూమిని చుట్టేస్తాయి. బాలిస్టిక్ మిసైళ్ళ కంటే వీటి వేగం తక్కువే అయినప్పటికీ మిసైళ్ళ లాగా ఇవి పరావలయ (parabolic) మార్గంలో ప్రయాణించవు. టార్గెట్ ను తాకేవరకూ భూమికి తక్కువ ఎత్తులో ప్రయాణించడం వలన వీటిని మిసైల్ రక్షణ వ్యవస్ధలకు లేదా రాడార్ లకు గాని దొరకడం కష్టం. ఈ లక్షణం వాటిని ప్రత్యేకంగా నిలుపుతాయి.
మరో కారణం వల్ల కూడా చైనా హైపర్ సోనిక్ గ్లైడ్ లు ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఇవి దక్షిణ ధ్రువం మీదుగా భూమిని చుడతాయి. కానీ అమెరికాకు చెందిన మిసైల్ రక్షణ వ్యవస్ధలు అన్నీ ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించే మిసైళ్లను కనిపెట్టేందుకు కేంద్రీకరించబడి ఉన్నాయి. అందువలన చైనా హైపర్ సోనిక్ మిసైల్ అమెరికాకు పెద్ద సవాలు విసురుతోంది.
ఆగస్టు నెలలో పరీక్ష జరిపినప్పటికీ చైనా ఆ విషయాన్ని ప్రకటించలేదు. మార్చి నెలలో లాంగ్ మార్చ్ మిసైల్ ను 77వ సారి పరీక్ష చేయడం గురించి ప్రకటించిన తర్వాత ఆగస్టు చివరిలో 79వ పరీక్ష గురించి మాత్రమే అది ప్రకటించింది. 78వ పరీక్షను రహస్యంగా ఉంచింది. 2019 నాటి మిలట్రీ పెరేడ్ లో చైనా డిఎఫ్-17 పేరుతో తన హైపర్ సోనిక్ మిసైల్ ను ప్రదర్శించింది. తాజా పరీక్ష దానికంటే ఉన్నత స్ధాయి పరిజ్ఞానంతో కూడుకున్నదని తెలుస్తోంది.
తాము కూడా హైపర్ సోనిక్ మిసైల్ ను ప్రయోగించామని ఉత్తర కొరియా సెప్టెంబర్ 29 తేదీన ప్రకటించింది. అయితే ఇది ప్రారంభదశలో ఉన్నదని, ఈ మిసైల్ ను ప్రయోగించేందుకు మరింత కాలం పడుతుందని దక్షిణ కొరియా తెలిపింది. నిజానికి ఉత్తర కొరియా జరిపిన ప్రయోగం విఫలం అయిందని దక్షిణ కొరియా క్షిపణి నిపుణులు తెలిపారు.
అమెరికా 2013 తర్వాత మొదటిసారి సెప్టెంబర్ 27 తేదీన హైపర్ సోనిక్ మిసైల్ పరీక్ష జరపగా, రష్యా జులైలో ఈ తరహా పరీక్ష జరిపిందని రాయిటర్స్ వార్తా సంస్ధ గత నెలలో తెలిపింది. జిర్కాన్ పేరుతో ప్రయోగించిన రష్యా తన మిసైల్ తో పోటీ రాగలది మరొకటి లేదని ప్రకటించింది.
ప్రస్తుతం హైపర్ సోనిక్ ఆయుధాల అభివృద్ధి కోసం పెద్ద దేశాలు పోటీ పడుతున్నాయి. శతృదేశాల రాడార్ మరియు మిసైల్ రక్షణ వ్యవస్ధకు దొరకని ఈ మిసైళ్ళు వివిధ దేశాల మిలట్రీలకు పై చేయి సాధించేందుకు దోహదం చేస్తాయి. శబ్ద వేగానికి దాదాపు 5 రెట్లు వేగంతో తక్కువ ఎత్తులో ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించే ఈ మిసైళ్ళు మిలట్రీ వ్యవస్ధలకు ఆధిపత్యం సమకూర్చితే ప్రపంచ ప్రజలకు మాత్రం మరింత వినాశకర ప్రమాదాన్ని గ్యారంటీ చేస్తాయి. వీటి తయారీలో ప్రజల సొమ్ము పెద్ద మొత్తంలో ధారపోయడం వలన ప్రజా సంక్షేమానికి వెళ్లవలసిన సొమ్ము పెద్ద మొత్తంలో దారి మళ్లుతుంది.