భారత రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఆర్‌ఎస్‌ఎస్-బిజేపి సంస్ధల తరపున, జరిగిన చరిత్రను తిరగ రాసే ప్రయత్నం చేశారు. ప్రధాని మోడి మంత్రివర్గంలో కాస్తంత మౌనంగా, ఆర్‌ఎస్‌ఎస్ భావజాల ప్రచారాలకు, అబద్ధపు ఉల్లేఖనలకు దూరంగా ఉన్నట్లు కనిపించే ఆయన తాను సెపరేట్ కాదనీ, ఆ తానులో ముక్కనేనని గుర్తు చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్ పితామహుల్లో ఒకరైన వీర సావర్కార్ భారత దేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేయడానికి కృషి చేసిన తొలి తరం యువకుల్లో ఒకరు. ఫలితంగా అనేక మంది పోరాట వీరులకు మల్లేనే ఆయన్ను కూడా బ్రిటిష్ రాజ్యం జైలు శిక్షకు గురి చేసి అండమాన్ జైలుకు తరలించింది.
స్వాతంత్రం కోసం కృషి చేసిన అనేక మంది నాయకులు అనేక యేళ్ళ తరబడి జైళ్ళలో మగ్గారు. అయితే వీర సావర్కార్ జైలుకు వెళ్ళిన 6 నెలలకే బ్రిటిష్ ప్రభుత్వానికి దయా భిక్ష పెట్టమని వేడుకుంటూ పిటిషన్ పెట్టుకున్నారు. ఇది చరిత్రలో నమోదయిన సత్యం. ఒక మారు కాదు, 1911 నుండి 1920 వరకు 5 మార్లు ఆయన క్షమా భిక్ష పిటిషన్ లు పెట్టుకున్నారు. వాటిలో వేటికీ బ్రిటిష్ ప్రభుత్వం స్పందించలేదు. కేవలం సావర్కార్ అవసరం జైలు బయట ఉన్నట్లు బ్రిటిష్ పాలకులు గుర్తించినప్పుడు మాత్రమే 1924 లో ఆయనను విడుదల చేశారు.
సావర్కార్ జైలు లోపల ఉండగా బ్రిటిష్ వారిని ఎంతగా వేడుకున్నప్పటికీ జైలు బయట దేశంలో మాత్రం ఆయనను స్ఫూర్తిగా చేసుకుని, ఆయన శిష్యులుగా చెప్పుకుంటూ అనేకమంది యువకులు హింసాత్మక పోరాటాలను కొనసాగించడం ఒక వైచిత్రి.
ఈ నేపధ్యంలో బిజేపి ప్రభుత్వాధికారం చేపట్టిన నాటి నుండి సావర్కార్ ను గొప్ప స్వాతంత్ర సమర యోధుడుగా నిలపడానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఆర్‌ఎస్‌ఎస్ పత్రికలు, నాయకులతో పాటు ఇతర చిన్నా, చితకా హిందూత్వ సంస్ధలు కూడా లేని చరిత్రను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ సావర్కార్ క్షమాభిక్ష పిటిషన్ లు పెట్టలేదని కొందరు హిదూత్వ వాదులు వాదించారు. కానీ రాజ్ నాధ్ సింగ్ చేసిన వ్యాఖ్య అందుకు భిన్నంగా ఉంది.
“భారత చరిత్రకు ఆయన ఒక ఐకాన్ లాంటి వ్యక్తిగా ఉన్నారు, ఇక ముందూ కొనసాగుతారు. ఆయన గురించి అభిప్రాయ భేదాలు ఉండవచ్చు కానీ ఆయనను చిన్నచూపు చూడడం సరైనదీ, న్యాయమైనదీ కాదు. ఆయన స్వాతంత్ర సమర యోధుడు మరియు దృఢమైన జాతీయవాది. కానీ మార్క్సిస్టు లెనినిస్టు భావజాలం అనుసరించేవారు సావర్కార్ ను ఫాసిస్ట్ అని ఆరోపిస్తారు.
“పదే పదే సావర్కార్ గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. జైలు నుండి విడుదల చేయాలని కోరుతూ ఆయన అనేక పిటిషన్లు ఫైల్ చేశాడని ప్రచారం చేస్తున్నారు… కానీ క్షమాభిక్ష పిటిషన్లు ఫైల్ చేయమని ఆయనకు సలహా ఇచ్చింది మరెవరో కాదు, మహాత్మా గాంధీయే.” అని రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ వాకృచ్చారు.
ఇక్కడ రెండు, మూడు విషయాలు చెప్పాలి.
ఒకటి: వీర సావర్కార్ జైలుకు వెళ్లడానికి ముందు వరకు ఆయన గొప్ప సమర యోధుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే జైలు పాలయిన అనంతరం కూడా ఆయనను అనేక మంది స్ఫూర్తిగా తీసుకున్నారు. 50 యేళ్ళ జైలు శిక్షకు గురయిన సావర్కార్ అప్పటి యువకుల దృష్టిలో గొప్ప త్యాగమూర్తి అయ్యారు. కానీ ఆయన జైలుకి వెళ్ళాక అనుసరించిన తిరోగమన మార్గమే ఆయన అపఖ్యాతి పాలు కావడానికి కారణం అయింది.
రెండు: సావర్కార్ ఫాసిస్టు అనీ, మతవాది అనీ కేవలం మార్క్సిస్టు-లెనినిస్టులే అనడం లేదు. నాటి, నేటి లిబరల్ మేధావులు అందరూ సావర్కార్ ని అదే పదజాలంతో అభివర్ణిస్తారు. ఒక జరిగిన విషయాన్ని చెప్పడానికి ఇజాలతో పని లేదు. సావర్కార్ జైలు పాలయిన పూర్వం ఆయన చరిత్ర, జైలులో ఉండగా ఆయన అనుభవించిన టార్చర్, ఫలితంగా తనను విడుదల చేయడం గానీ, భారత జైళ్లకు మార్చడం గానీ చేయాలని విన్నవించుకున్న చరిత్ర, బ్రిటిష్ వారితో ఒప్పందం కుదుర్చుకుని జైలు నుండి విడుదలయిన చరిత్ర అన్నీ చరిత్ర పుటల్లో రికార్డ్ అయిన చరిత్ర. దీనిని ఎన్నిసార్లు ఉల్లేఖించినా ఒకే విధంగా చదవాలి తప్ప మరో విధంగా చదవలేము.
“సావర్కార్ క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు” అన్న వాక్యాన్ని మార్క్సిస్టు-లెనినిస్టులు అయినా, లిబరల్ వాదులైనా, హిందూత్వ వాదులైనా అలాగే చదవాలి. గత్యంతరం లేదు, చరిత్రను తాము ఊహించుకున్నట్లు తిరగరాస్తే తప్ప. కానీ వ్యక్తులు, సమూహాలు ఊహించుకున్నది చరిత్ర కాబోదు కదా.
ఇప్పుడు కూడా రాజ్ నాధ్ సింగ్ గారి సావర్కార్ గురించి తనకు తోచింది చెప్పగానే మొదట స్పందించింది కాంగ్రెస్ నేత జైరాం రమేష్, మరియు ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ. గాంధీ రాసిన లేఖకు రక్షణ మంత్రి సరికొత్త అర్ధాన్ని, భాష్యాన్ని చెబుతున్నారని వారు విమర్శించారు.
జైరాం రమేశ్, “మోడీ ప్రభుత్వంలో అతి కొద్దిమంది గౌరవనీయమైన గొంతుల్లో రాజ్ నాధ్ సింగ్ జీ ఒకరు. కానీ ఆయన కూడా చరిత్రను తిరగరాసే ఆర్‌ఎస్‌ఎస్ అలవాటు నుండి ఆయన కూడా స్వేచ్ఛగా లేనట్లు కనిపిస్తోంది. జనవరి 25 1920 తేదీన గాంధీ వాస్తవంగా రాసిన లేఖకు ఆయన కొత్త ట్విస్ట్ ఇచ్చారు… గాంధీ లేఖకు సందర్భ రహితంగా ప్రస్తావించారు. ఇందులో ఆశ్చర్యం లేదు. ఇది బిజేపి/ఆర్‌ఎస్‌ఎస్ మార్గానికి అనుగుణంగానే ఉంది ” అని విమర్శించారు.
జై రామ్ రమేష్ తో పాటు ఒవైసీ కూడా గాంధీ రాసిన లేఖ కాపీని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఒవైసీ, “రాజ్ నాధ్ సింగ్ గారూ, సావర్కార్ రాసిన తుచ్ఛమైన క్షమాభిక్ష పిటిషన్లు గాంధీ సూచన మేరకే జరిగాయని చెప్పారు. ఇదిగో (ఎన్ డి) సావర్కర్ కు గాంధీ రాసిన లేఖ. ఉపశమనం ఇవ్వమని, దయ చూపమని, బ్రిటిష్ క్రౌన్ కు విధేయుడైన సేవకుడిగా ఉంటానని పిటిషన్ పెట్టాలని గాంధీ రాసినట్లు లేఖలో ఎలాంటి ప్రస్తావన లేదు….” అని ట్విట్టర్ లో విమర్శించారు.
మూడు: ఓవైసీ, జైరాం రమేష్ పోస్ట్ చేసిన లేఖ ప్రకారం రాజ్ నాధ్ సింగ్ చెప్పింది నిజం కాదని ఇట్టే అర్ధం అవుతుంది. క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోమని గాంధీ సూచించినట్లు లేఖలో ఎలాంటి ఆధారమూ లేదు. తన కార్యకలాపాలు కేవలం రాజకీయపరమైనవని చెప్పాలని మాత్రమే గాంధీ సూచించారు. రాజకీయ ఆందోళన కారణాలకు అంతటి తీవ్ర శిక్ష న్యాయబద్ధం కాదు అని చెప్పాలనడం గాంధీ సూచనగా కనిపిస్తోంది.
నిజానికి పిటిషన్లు పెట్టడం అండమాన్ జైలు లేదా భారతీయ జైళ్ళలో ఖైదీలుగా, దొషులుగా ఉన్న పోరాట యోధులు ప్రభుత్వానికి పిటిషన్లు పెట్టడం సాధారణ విషయమే. సాధారణంగా జైలులో పరిస్ధితుల మెరుగు కోసం, వైద్య సౌకర్యాల కోసం, రాజకీయ ఖైదీల హక్కుల కోసం, జైలు సిబ్బంది చర్యలపై ఫిర్యాదుల కోసం పిటిషన్లు పెట్టేవారు. అనేకమార్లు జైలులోనే ఆందోళనలు చేసిన ఉదాహరణలు కోకొల్లలు. కానీ సావర్కార్ పిటిషన్ తన పరిస్ధితి మెరుగుపరచమని కోరడంతో పాటు తనను విడుదల చేస్తే రాజకీయాలు వదిలి ప్రభుత్వం విధించిన షరతులకు లోబడి ఉంటానని చెప్పడం, అనంతరం బ్రిటిష్ తో ఒప్పందం ద్వారానే ఆయన విడుదల కావడమూ అసలు విషయం.
గాంధీ లేఖను కింద చూడవచ్చు.