క్యూబా వాక్సిన్ రెడీ: ఫార్మా కంపెనీల గుండెల్లో గుబులు


Cuba vaccine despite the US’ embargo -Carlos Latuff, Argentina

కోవిడ్ 19 (సార్స్-కోవ్-2) వ్యాధి నిర్మూలనకై పశ్చిమ దేశాలకు చెందిన బడా కార్పొరేట్ ఫార్మా కంపెనీలు అనేక వ్యాక్సిన్ లు తయారు చేశాయి. అవసరమైన 3 దశల పరీక్షలు జరిపినట్లు చెప్పాయి. ఇక వైరస్ చచ్చినట్లే అని నమ్మబలికాయి. ఆ మేరకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రియా, జర్మనీ తదితర ధనిక దేశాల అధిపతులు కూడా తమ తమ కంపెనీల తరపున సగర్వ ప్రకటనలు జారీ చేశారు.

కానీ వైరస్ ఇంకా విస్తరిస్తూనే ఉన్నదని గణాంకాలు చెబుతున్నాయి. తయారైన వ్యాక్సిన్ లు మాత్రం తగిన మొత్తంలో తయారు కావడం లేదు. ప్రతి రోజూ అనేక వేల మంది చనిపోతున్నా ఈ కంపెనీలు వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేయడం లేదు. దానికి కారణం ఒకటే…! కంపెనీలు కోరుకున్న మొత్తంలో చెల్లింపులు చేసేందుకు వివిధ ప్రభుత్వాలు తగిన ఒప్పందాలు చేసుకోకపోవడమే. తాము డిమాండ్ చేసిన మొత్తం ముట్టజెప్పడానికి ఒప్పందం కుదిరితే తప్ప అవి వ్యాక్సిన్ ల తయారీ వేగవంతం చేయబోవు.

మరో కారణం కూడా ఉన్నది. తయారవుతున్న వ్యాక్సిన్ లు అన్నింటినీ ధనిక దేశాలే గంప గుత్తగా కొనుగోలు చేసి నిలవ చేసుకుంటున్నాయి. పైకి వ్యాక్సిన్ డిప్లొమసీ అనీ, వ్యాక్సిన్ సహకారం అనీ, డబల్యూ‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో కోవాక్స్-COVAX (WHO ఆధ్వర్యంలో ధనిక, పేద దేశాలన్న తేడా లేకుండా అందరికీ సమానంగా వ్యాక్సిన్ అందాలన్న ఆశయంతో ఏర్పాటు చేసిన వ్యవస్ధ. దీనికి ప్రధానంగా ధనిక దేశాలే వ్యాక్సిన్ లు కొనుగోలు చేసి సరఫరా చేయాలి. తద్వారా ఆటంకాలు లేకుండా కడు పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ అందేలా చూడాలన్నది లక్ష్యం అని ప్రకటించారు) ఏర్పడిందనీ చెప్పినప్పటికీ అవేమీ ఆచరణలో అమలు కావడం లేదు. ధనిక దేశాలు హామీ ఇచ్చినట్లుగా వ్యాక్సిన్ లను COVAX కు ఇవ్వడం లేదని WHO, UNICEF లు కూడా మొత్తుకుంటున్నాయి. వాళ్ళ మొర వినేవారే లేరు.

ఇండియా సొంతగా తయారు చేసిన వ్యాక్సిన్ కోవాక్సిన్ (భారత్ బయోటెక్ తయారు చేసింది). కానీ ఇప్పటిదాకా జరిగిన వ్యాక్సినేషన్ లో కోవాక్సిన్ వాటా 10 శాతం లోపే. దానికి ముడి పదార్ధాలు పశ్చిమ దేశాల నుండే రావాలి. అమెరికా, ఐరోపాలు తగినంత మొత్తంలో ముడి పదార్ధాలను సరఫరా చేసేందుకు సిద్ధంగా లేవు. ఫలితంగా బ్రిటన్-స్వీడన్ లు తయారు చేసిన ఆస్ట్రజెనెకా వ్యాక్సిన్ నే  ఇండియాలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇండియాకూ ప్రధాన దిక్కయింది.

ఈ నేపధ్యంలో అతి చిన్న దేశం క్యూబా (జనాభా కేవలం 1.1 కోట్లు) తానూ వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్లు మార్చి 2020లో ప్రకటించింది. ఇటీవల 3వ దశ పరీక్షలను 1.5 లక్షల మందిపై విజయవంతంగా పూర్తి చేసింది. అంతే కాదు, ఇప్పటికే వివిధ దేశాలకు సరఫరా చేసేందుకు ప్రాధమిక ఒప్పందాలు కూడా చేసేసుకుంది. ఇప్పటికి ఇండియా, వెనిజులా, ఇరాన్, పాకిస్తాన్, వియత్నాం దేశాలు క్యూబా వ్యాక్సిన్ పట్ల సుముఖంగా ఉన్నాయి.

క్యూబా వ్యాక్సిన్ పేరు స్పానిష్ భాషలో ‘Soberana 2 (సొబ్రానా 2)’. ఆంగ్లంలో Sovereign 2 (సావరిన్ 2). ఈ వ్యాక్సిన్ ప్రకటనతో బడా ఫార్మా కార్పొరేట్ కంపెనీల్లో గుబులు పుట్టింది. ఎందుకంటే అధిక ధర కోసం క్యూబా పట్టుబట్టే అవకాశం లేదు. క్యూబా జనాభా 1.1 కోట్లు కాగా కేవలం ఇతర దేశాల కోసమే 100 మిలియన్లు లేదా 10 కోట్ల వ్యాక్సిన్ లు ఉత్పత్తి చేస్తామని క్యూబా ప్రకటించింది. అదే జరిగితే బడా కంపెనీల లాభాల ఆశలకు తగిన మొత్తం లోనే కళ్ళెం పడుతుంది.

కోవిడ్ వల్ల టూరిజం సందర్శకులు తగ్గిపోయిన నేపధ్యంలో ఇక నుండి క్యూబా వస్తే తయారీ ధరకు వ్యాక్సిన్ అందిస్తామని క్యూబా చెబుతోంది. అందువల్ల బడా కంపెనీల వ్యాక్సిన్ లను పక్కనపెట్టి టూరిజంతో పాటు క్యూబా వ్యాక్సిన్ కూడా కలిసొస్తుందని టూరిస్టులు భావించే అవకాశం ఉన్నది.

క్యూబా వైద్యులకు ప్రపంచంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. లాటిన్ అమెరికా దేశాల్లో ఎప్పుడు అవసరం వచ్చినా సహాయం కోసం క్యూబాను అర్ధించడం చాలా సర్వ సాధారణం. కోవిడ్ వ్యాప్తి విషయంలో కూడా అనేక మార్లు క్యూబా డాక్టర్ల బృందం అనేక లాటిన్ దేశాలకు పర్యటించి వైద్య సామాగ్రి, ఇతర పరికరాలు అందించిన ఘటనలు చాలా జరిగాయి. అంతెందుకు ధనిక ఐరోపా దేశం ఇటలీలో 2020లో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నప్పుడు ఆ దేశం క్యూబా సహాయాన్ని అర్ధించింది. వెంటనే క్యూబా తన డాక్టర్ల బృందాన్ని ఇటలీ పంపి ఇటాలియన్ల అభిమానాన్ని చూరగొంది.

ఆ సమయంలోనే అనేక ఐరోపా దేశాల్లో కోవిడ్ తీవ్రంగా వ్యాప్తి చెందితే అమెరికా సహాయాన్ని అర్ధించాయి. అమెరికా ‘మీ చావు మీరు చావండి’ అని చేతులు దులుపుకుంది. తూర్పు, పశ్చిమ ఐరోపా దేశాలు రెండూ అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని దుమ్మెత్తి పోశాయి. చివరికి వాళ్ళు చైనా, రష్యా, క్యూబాల సహాయం తీసుకున్నాయి.

మార్చి 2020 నుండి క్యూబా ద్వీపం 39 దేశాలకు తన డాక్టర్ల బృందాలను కోవిడ్ సహాయం నిమిత్తం పంపింది. 3,700 మంది నిపుణులైన వైద్యులతో కూడిన 53 బృందాలు ఈ దేశాలకు వెళ్ళి వైద్య సహాయం అందించాయి. క్యూబా వైద్య సహాయం ‘వెళ్ళాం, వచ్చాం’ అన్నట్లు ఉండదు. ఖచ్చితమైన ప్రణాళికతో, సంపూర్ణ స్ధాయిలో వివిధ ప్రోటోకాల్స్, వైద్య శిక్షణ, వైద్య సేవల శిక్షణ, పరిసరాల పరిరక్షణ జ్ఞానం… ఇవన్నీ వారు అందిస్తారు. అది కూడా అత్యంత చౌక ఖరీదుకు.

క్యూబా వైద్య సహాయానికి 60 యేళ్ళ చరిత్ర ఉన్నది. 1960 లో అతి శక్తివంతమైన వాల్దీవియా (చిలీ) భూకంపం సంభవించినప్పటి నుండి అది మొదలై ఇప్పటికీ కొనసాగుతోంది. 9.5 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం వల్ల సునామీ కూడా విరుచుకుపడి జపాన్ వరకూ వేలమంది మరణించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 2 బిలియన్ల మందికి (200 కోట్లు) క్యూబా వైద్య సహాయం అందినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ సహాయాల్లో 14 మిలియన్ల సర్జికల్ ఆపరేషన్లు జరాగ్గా 8.7 మిలియన్ల మండి ప్రాణాపాయం నుండి బైటపడ్డారు.

ఇప్పటిదాకా ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే 10 నుండి 15 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయగలిగాయి. చాలా చోట్ల అది కూడా ఒక డోసు మాత్రమే. అమెరికా, ఐరోపాలలో ఉన్నట్లుగా గ్లోబల్ సౌత్ దేశాల్లో (స్ధూలంగా – కొన్ని పరిమితులతో, భూమధ్య రేఖకు దక్షిణాన అనగా దిగువన ఉన్న దేశాలు: ఆసియాలో కొన్ని, ఆఫ్రికా, లాటిన్ అమెరికా మొ.వి.) పేటెంట్ చట్టాలు అమెరికా, ఐరోపాలలో వలె కఠినంగా ఉండవు. మేధో సంపత్తి హక్కుల (IPR) పేరుతో మితిమీరిన లాభాలు సంపాదించే వీలు ప్రైవేటు కంపెనీలకు కల్పించే చట్టాలు ఇక్కడ బలహీనం. కనుక క్యూబా లాంటి దేశాలు తయారు చేసే వ్యాక్సిన్ లు తేలికగా చౌకగా గ్లోబల్ సౌత్ కు లభిస్తాయి. కనుక పశ్చిమ కార్పొరేట్ కంపెనీల వ్యాక్సిన్ లకు మార్కెట్ సగానికి సగం పడిపోతుంది. అందుకే వాటికి గుబులు బయలుదేరింది.

“క్యూబా నుండి విజయవంతమైన వ్యాక్సిన్ వెలువడితే గనక అమెరికా, ఐరోపాల బడా ఫార్మాస్యూటికల్ కంపెనీలకు మార్కెట్ పై ఉన్న పట్టు బద్దలు చేయడానికి తోడ్పడుతుంది” అని ఆంటిగువా-బార్బడా కు చెందిన రాయబారి సర్ రోనాల్డ్ శాండర్స్ గత మార్చి నెలలో వ్యాఖ్యానించడానికి (మింట్ ప్రెస్ న్యూస్) కారణం అదే.

వ్యాక్సిన్ తయారీ, పంపిణీలపై బడా కార్పొరేట్ ఫార్మా కంపెనీల ఉడుం పట్టు బద్దలు కొడితే ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు లబ్ది పొందడం ఖాయం. క్యూబా అమెరికా ఆధిపత్యం నుండి బైటపడి స్వతంత్ర మనుగడ ప్రారంభించిన నాటి నుండి ఆ దేశంపై సవాలక్ష ఆంక్షలు విధించి అష్ట దిగ్బంధనం కావించినప్పటికీ అనేకానేక పరిమితులు, అవరోధాల మధ్య పురోగామిస్తూ వచ్చిన క్యూబా కు ఉన్న ఒకే ఒక అడ్డుగోడ అమెరికా. గతంలో వలే ఆ దేశానికి వ్యాక్సిన్ తయారీ ముడి పదార్ధాలు చేరకుండా ఆటంకాలు కళించకుండా ఉంటే క్యూబా వ్యాక్సిన్ ‘సావరిన్ 2’ ప్రపంచ ప్రజలకు ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల పేద దేశాల ప్రజలకు గొప్ప రక్షణ కవచం కాగలదు.

2 thoughts on “క్యూబా వాక్సిన్ రెడీ: ఫార్మా కంపెనీల గుండెల్లో గుబులు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s