నటి సమంతపై కురుస్తున్న మగహంకార విద్వేషం


నటి సమంత, నటుడు నాగ చైతన్య అక్కినేని ఇటీవల విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తమ ప్రైవసీకి భంగం కలిగించరాదని వారిద్దరూ ఒక ఉమ్మడి ప్రకటనలో విన్నవించుకున్నారు. తాము కొత్త జీవితం ప్రారంభిస్తున్నామని చెబుతూ అందుకు తమను ఆశీర్వదించాలని వేడుకున్నారు.

వారి విన్నపంలో అర్ధం కాని అంశాలు ఏమీ లేవు. తమ ఏకాంతానికి భంగం కలిగించడం అంటే ఏమిటి అర్ధం? విడాకుల విషయంలో ఇప్పటికే బాధలో ఉన్న జంట తమ ప్రైవసీని తమకు వదిలేయండని కోరితే ఏమిటి అర్ధం?

ఎక్కడ కనపడితే అక్కడ మతిమాలిన ప్రశ్నలతో వేధించమనా? ఆమె తన ఇంటి పేరునుండి అక్కినేని ప్రీ-ఫిక్స్ నుండి తొలగించిందని నానా యాగీ చేయడమా? వారి వ్యక్తిగత జీవితాలలోకి తొంగి తొంగి తొంగి చూస్తూ చివరికి బ్యాలన్స్ కోల్పోయి వారి వారి జీవితాల్లో ఒక భాగమై తిష్ట వేయమనా?

గత కొన్ని రోజులుగా వివిధ న్యూస్ ఛానళ్ళు, యూ ట్యూబ్ ఛానెళ్లు, పత్రికలు విడాకులు ప్రకటించిన జంటపై పుట్టిస్తున్న పుకార్లు, ప్రచురిస్తున్న వార్తా విశేషాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా నాగ చైతన్యపై సానుభూతి కురిపిస్తూ, సమంతపై విద్వేషాన్ని విరజిమ్ముతూ రాస్తున్న రాతలను చూస్తే తమను తాము మేధావులుగా భావించుకుంటున్న డాక్టర్లు, లాయర్లు, విశ్లేషకులు ఎంతటి భావ దారిద్ర్యంలో మగ్గుతున్నారో వెల్లడించుకుంటున్నారని అర్ధం అవుతుంది.

ఏ కాస్తైనా బుద్ధి ఉన్నవాళ్లైతే సమంత మౌనాన్ని గమనించి విషయం ఎంత సున్నితమో గ్రహించి పిచ్చి పిచ్చి రాతలు రాయడం మానివేయాలి. తమకు తోచిన ఊహాగానాలు చేయడం ఆపాలి. కానీ సమంత మౌనమే అంగీకరంగా భావిస్తూ అమానుష రీతిలో మరిన్ని పుకార్లు, ఊహలు సృష్టించి తమ మెదళ్ళలో గూడుకట్టుకున్న పైత్యాన్నంతా కుప్పబోస్తున్నారు.

సమంతపై పుట్టిస్తున్న పుకార్లలో పురుష దురహంకారం, ప్రాంతీయ విద్వేషం అన్నింటినీ రంగరించి విరజిమ్మడం కొట్టవస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమెకు అఫైర్లు ఉన్నాయట. పిల్లలు పుట్టడం ఇష్టం లేదట. అవకాశవాదంతో కుటుంబ ప్రతిష్టను దెబ్బతీస్తోందట. అబార్షన్లు కూడా అయ్యాయట. ఒక ప్రఖ్యాత తెలుగు కుటుంబం పరువు బజారుకు ఈడ్చిందట! అక్కడికి విడాకుల్లో పురుషుడి పాత్ర లేనట్లు!

ఇటీవల ఒక డాక్టర్ ఒక యూ ట్యూబ్ చానల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ ఒక డాక్టర్ గా కూయలేని కూతలు కూశాడు. ఆయన గారి కూతల్లో ఏవీ వాస్తవాలు కావని సమంత స్నేహితులు రానున్న సినిమా శాకుంతలం సినిమా దర్శకులు నీలిమ గుణ, ద న్యూస్ మినిట్ తో చెప్పారు.

డాక్టర్ కూతల ప్రకారం సమంతకు రెండు అబార్షన్ లు అయిపోయాయట. సాక్ష్యాత్తూ శ్రీరాముడంతటి నాగ చైతన్య “మనకు ఇంత ఆస్తి ఉంది కదా, రెండో బేబీని అబార్షన్ చేయించుకోవడం ఎందుకు అని భార్యను వారించాడట. కానీ ఆమె వినలేదట. గర్భం ధరించడం ద్వారా తన అందాన్ని కోల్పోవడం సమంతకు ఇష్టం లేదట. చివరికి అందాన్ని కాపాడుకునేందుకు సరోగసీ ద్వారా బిడ్డలు కందాం అని కూడా సమంత వాదించారట.

ఇక చూడండి! ఈ సీనియర్ డాక్టర్ వీడియో పట్టుకుని పుట్టగొడుగుల్లా వెలిసిన యూ ట్యూబ్ చానెళ్లు విపరీతమైన భావాల్ని ప్రకటిస్తున్నారు. సమంత గుణ విశేషాలపై తీర్పులు ఇచ్చేస్తున్నారు. పనికిమాలిన మేధావుల్ని ఏరి కోరి ఎన్నుకుని వారి ఇంటర్వ్యూల్ని పబ్లిష్ చేస్తున్నారు.

వీరు చెప్పేదేమంటే అక్కినేని లాంటి అతి గొప్ప కుటుంబంలో కోడలుగా వెళ్ళడం సమంత అదృష్టం. అటువంటి గొప్ప ‘తెలుగు’ కుటుంబంలో స్ధానం సంపాదించిన ఆమె కేవలం అందం కోసం ఆ కుటుంబం నుంచి బైటికి రావడం పిచ్చితనం. తోటి నటుల వలె నాగ చైతన్యకు కూడా పిల్లలతో ఆడుకోవాలనీ, ఇంటికెళ్ళాక భార్యా బిడ్డలతో సేద తీరాలనీ వారితో ఎంజాయ్ చెయ్యాలనీ ఉంటుందని అలాంటి న్యాయమైన కోరికను నిరాకరించడం సమంతకు తగదని వాళ్ళు వాదిస్తున్నారు.

అసలు సమంత గురించిన పుకార్లను అటుంచితే ఆ పుకార్లకు వస్తున్న స్పందనల్లో వ్యక్తం అవుతున్న భావ దారిద్రాన్ని మొదట ప్రశ్నించాలి.

అక్కినేని అంత గొప్ప కుటుంబంలో కోడలిగా ప్రవేశించడం సమంత పూర్వజన్మ సుకృతమా? ఇందులో ఏమన్నా అర్ధం ఉందా? ప్రతి ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఏదో ఒక కుటుంబానికి కోడలుగా, భార్యగా, వదినగా… ఇంకా ఇతరేతర బంధువుగా అవుతుంది. వీళ్ళందరిలో కొన్ని కుటుంబాల్లోకి వెళ్ళడం పూర్వజన్మ సుకృతం అవడం అంటే మిగతా కుటుంబాల్లోకి వెళ్ళడం తక్కువ సుకృతం అవుతుందా? లేక పాపజన్మ సుకృతం అవుతుందా?

అందరూ అనుకునేదే… ఎవరికి ఉన్నది వాళ్ళు తింటారు అని. అలాంటిది అక్కినేని కుటుంబం అయినా, భీమనేని కుటుంబం అయినా కత్తివారి కుటుంబం అయినా వారి వారి స్ధాయిల్లో సంతోషంగా, సుఖంగా ఉండాలనే అందరూ కోరుకుంటారు. అక్కినేని కాకుండా ఇతర కుటుంబాలైతే శుభ్రంగా విడాకులు తీసుకుని బైటికి రావోచ్చు అన్నట్లుగా చెప్పడం అది కూడా ఒక ప్రఖ్యాత (అనుకుంటున్న) ఆడ లాయర్ చెప్పడం బొత్తిగా సమ్మతించలేని విషయం.

స్త్రీ, పురుష సమానత్వాన్ని ఐరాస నుండి స్ధానిక ప్రభుత్వాల వరకు ఊకదంపుడు ఉపన్యాసాలు, బోధనలు చేస్తున్న కాలమిది. రాష్ట్ర ప్రభుత్వాలు స్త్రీ అభ్యుదయం పేరుతో అనేక పధకాలు, వాస్తవ ఆచరణలో ఎలా ఉన్నప్పటికీ, ప్రకటిస్తున్న కాలం. మహిళలు, విద్యార్ధినులు, ఉద్యోగినులు అనేక రంగాల్లో ప్రవేశిస్తూ కుటుంబాలకు ఆర్ధిక మద్దతు అందిస్తున్న కాలం.

నటి సమంత అయితే అటు సినిమాలు, ఇటు ఓ‌టి‌టి సీరియళ్ళు, బాలీవుడ్ రంగం… ఇలా అన్నింటిలో ఆమెకు తగిన సంపాదన ఉన్న పరిస్ధితి. పైగా ఓ బేబీ లాంటి సినిమాల ద్వారా తన సామర్ధ్యాన్ని రుజువు చేసుకున్న నటి. ఇలాంటి కాలంలో ‘సాక్ష్యాత్తు శ్రీరాముడు లాంటి నాగ చైతన్యను వీడి విడాకులు ఇవ్వడమా’ అని సీనియర్ డాక్టర్, పేరు పొందిన మహిళా లాయర్ వాపోవడం భావ దారిద్రం తప్ప మరొకటి కాదు.

వీళ్ళ మెదళ్ళకు పట్టిన సనాతన బూజు, పురుష దురహంకార దాస్యం, ఒక భాష మహా గొప్పది అని తమకు తామే భావించే ప్రాంతీయ విద్వేషం తాలూకు మకిలి వదిలితేనే తప్ప విషయాన్ని విషయంగా చూడలేరు.

విషయాన్ని విషయంగా చూస్తే ఏం కనపడుతుంది. సమంత ఒక స్వతంత్ర వ్యక్తి. నాగ చైతన్య ఒక స్వతంత్ర వ్యక్తి. వారిద్దరూ ఒకే రంగంలో పని చేస్తూ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ళు కలిసి బ్రతికారు. ఆ క్రమంలో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. వారి విభేదాలు పరిష్కరించడానికి సహజంగానే వారి వారి కుటుంబాలు కొన్ని ప్రయత్నాలు చేశారు. ఇరువైపులా స్నేహితులు కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు. సలహాలు ఇచ్చారు.కానీ వారి మధ్య విభేదాలు క్రమేణా, అక్కినేని నాగార్జున మాటల్లో చెప్పాలంటే “పరిష్కరించడానికి వీలు లేని” (irreconcilable) స్ధాయికి చేరాయి. ఫలితంగా విడాకుల ప్రకటన వెలువడింది.

విడాకులతో ఇద్దరి జీవితాలు ముగియలేదు. ఎవరి సినిమాలు వారికి ఉన్నాయి. ఎవరి జీవితం వారికి ఉంటుంది. ఇష్టమైతే మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఎవరి జీవితం వారు బ్రతికేస్తారు. ఆ కష్టానష్టాలేవో వారే భరిస్తారు. అదంతా వారి వారి వ్యక్తిగతాలు. అప్పటి వరకూ వారి జోలి మరొకరికి అనవసరం. ఇష్టమైతే వారి సీనిమాలు చూస్తాం. లేదా మానేస్తాం.

ఈ అంశాన్ని ఇంతటితో పరిమితం చేయకుండా విషయాన్ని మరింత గెలికి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసేందుకు ప్రయత్నించి అది వీలు కాక తామే కొన్ని అబద్ధాలు, పుకార్లు, అభూత కల్పనలు సృష్టించి వాటి చుట్టూ స్టోరీలు క్రియేట్ చేసి, ఆ స్టోరీలపైన కూడా మరికొన్ని అభిప్రాయాలూ, సలహాలూ సేకరించి చిలవలు పలవలు చేయడం ఇప్పుడు కొన్ని వెబ్ పత్రికలు, యూట్యూబ్ ఛానళ్ళు చేస్తున్నది. ఇది ఖండనార్హం. నాగరిక ప్రపంచానికి తగని వ్యవహారం.

కాగా అబద్ధాలు, కల్పనల్లో సామాజిక సాంప్రదాయాలను, పురుష పెత్తనాన్ని, తెలుగు జాతి ప్రతిష్టను అక్కినేని కుటుంబ గౌరవాన్ని వెతికి, అది కనపడలేదని డిసైడ్ చేసుకుని దానికి నటి సమంతను బాధ్యురాలిని చేయడం తీవ్ర అభ్యంతరకరం. ఆ పనిని మేధోపుంగవులైన సీనియర్ డాక్టర్లు, మహిళా అడ్వొకేట్ చేయడం మహా వైపరీత్యం. నిజానికి వీళ్ళే తెలుగుజాతి అభివృద్ధికి ఆటంకపరులు. వీళ్ళే అక్కినిని కుటుంబ గౌరవం (అలాంటిది ఉంటే) కు పట్టిన చెదపురుగులు. వీళ్ళే బూజు పట్టిన సాంప్రదాయాలను, పురుష దురహంకారాలకు పోషకులు. ఆ విధంగా అభివృద్ధి నిరోధకులు. నటి సమంత కానే కాదు.

నిజానికి ఆస్తి పట్ల మమకారం లేకుండా (రు 200 కోట్లు పరిహారాన్ని వద్దని నిరాకరించిన వినికిడి నిజమైతే), రానున్న దాడులను లెక్క చేయకుండా తన వ్యక్తిత్వమే ఆలంబనగా తన జీవితాన్ని తాను నిర్ణయించుకున్న సమంత లాంటి ధైర్యవంతులు, వ్యక్తిత్వ సంపన్నులే ఏ జాతియైనా పురోగామి పధంలో నడిచేందుకు దోహదం చేయగలరు. వివిధ హింసలను భరిస్తూ కూడా ఇళ్ళల్లో పిరికివాళ్ళుగా, పురుష దురహంకార అణచివేతలో మగ్గుతున్న అనేకమంది మధ్యతరగతి యువతులకు సమంత లాంటి వాళ్ళే ధైర్యాన్ని ఇవ్వగలరు.

వారిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పత్రికలకు ఎక్కితే, అనగా పబ్లిక్ లోకి వస్తే అప్పుడు వ్యాఖ్యానించడానికి, సలహాలు ఇవ్వడానికి ఇతరులకు కాస్త అవకాశం ఉంటుంది. అది కూడా కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే. వ్యక్తిత్వ హననానికి పాల్పడకుండా సరికొత్త కధలు సృష్టించి జోడించకుండా సమస్య పరిష్కారానికి దోహద పడే విధంగా వ్యవహరిస్తే ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. పబ్లిక్ లోకి రాకపోతేనే ఇంత రాద్ధాంతం చేస్తున్న వాళ్ళు, పత్రికలకు ఎక్కితే వాళ్ళ విషకుంభవృష్టికి అంతం ఉంటుందా అన్నది అనుమానమే.

వాస్తవాలు

సమంత స్నేహితురాలు / శాకుంతలం సినిమా నిర్మాత నీలిమ గుణ టి‌ఎన్‌ఎం కు కొన్ని వాస్తవాలు వెల్లడి చేశారు. ఆమె ప్రకారం, ఫామిలి మేన్ 2 తర్వాత గర్భం దాల్చడానికి ఆమె నిర్ణయించుకున్నారు. శాకుంతలం సినిమా కోసం సమంతను కలిసినప్పుడు ఇదే చెబుతూ ఆమె సినిమాకు నో చెప్పారు. కధ తనకు నచ్చినప్పటికీ పీరియడ్ సినిమా కనుక ఎక్కువ కాలం సాగుతుందేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు. తాను అప్పటికే తల్లిని కావడానికి ప్లాన్ చేసుకుంది గనక రెండింటికీ క్లాష్ వస్తే తాను ఫ్యామిలీ జీవితానికే ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. తను నటించక తప్పదు అనుకుంటే గనక జులై/ఆగస్టు లోపల షూటింగ్ పూర్తి కావాలని షరతు విధించారు. అయితే సినిమాకు కావలసిన ఏర్పాట్లు, గౌండ్ వర్క్ అంతా అప్పటికే పూర్తయింది గనుక సమంత కోరుకున్న కాలం లోనే షూటింగ్ అయిపోతుందని నిర్మాత హామీ ఇచ్చారు.అప్పుడు మాత్రమే సమంత సినిమాకు ఓ‌కే చెప్పారు. ఆ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకోనున్న దృష్ట్యా, ఇదే ఆమెకు చివరి సినిమా అవుతుందని కూడా సమంత చెప్పారు.

ఈ వాస్తవాలకు ప్రచారంలో ఉన్న పుకార్లకు అసలు సంబంధమే లేదు. నిజానికి విడాకులకు అక్కినేని కుటుంబమే సమంతను బాధ్యురాలిని చేయడం లేదు. అసలు ఎవరిని బ్లేమ్ చేయాలన్న అంశమే చర్చాంశమ్ కాదు. ఒక వివాహిత జంట విడిపోతే పబ్లిక్ కి కావలసింది విడిపోవడం ఒక్కటే. వాళ్ళలో ఒకరైనా ఇద్దరైనా తప్పొప్పుల గురించి బైటపడనంతవరకు జనానికి ఆ విడాకులను గుర్తించడం తప్ప వారితో పనిలేదు. ఈ ప్రైవసీ సూత్రాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. క్లిక్ ల కోసం, టి‌పి‌ఆర్ ల కోసం వారి వ్యక్తిగత జీవితాలను సమస్యలమయం చేసి వ్యక్తిత్వ హననానికి పూనుకోవడం స్వార్ధపూరితం, క్రూరత్వం, వారిద్దరి ప్రైవసీ హక్కులకు భంగం కలిగించడం.

సినీ నటులు కూడా సాధారణ పౌరులే. అందరివలే వారికి భావోద్వేగాలు ఉంటాయి. ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. అవి గుట్టుగా ఉండాలని వారు కోరుకుంటారు. సినిమాల్లో చూసేది నటన మాత్రమే. నటనకు వాస్తవ జీవితానికి మధ్య తేడాలు గుర్తించకుండా అయోమయానికి గురై అభిమానాన్ని పెంచుకుని, దాన్ని దురభిమానంగా మార్చుకుని, చివరికి విద్వేషం స్ధాయికి దిగజార్చుకోవడం ఆయా వ్యక్తుల, సమూహాల సాంస్కృతిక వెనుకబాటుతనం. దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉన్నది.

గతంలో సినిమాల స్ధానంలో నాటకాలు ఉండేవి. నాటకాల కంటే సినిమా మరింత శక్తవంతం కావడానికి కారణం సాంకేతిక పరిజ్ఞానంలో జరిగిన అభివృద్ధి. నాటకం ప్రదర్శనకు అనేక పరిమితులు ఉంటాయి. హావభావాల కంటే వాచ్యమే అక్కడ ప్రధానం. వివిధ ఘటనలను నిజంగా జరిగినట్లు చూపే వెసులుబాటు నాటకాలకు లేదు. కత్తితో విలన్ ని నరికినా, ఫైటింగ్ చేసినా అవి నిజంగా జరిగినట్లు చూపించలేరు. హావ భావాలను స్టేజికి దగ్గర ఉన్నవాళ్ళు తప్ప దూరం ఉన్నవాళ్ళు చూడలేరు. సుదూర ప్రేక్షకుల కోసం నటులు గట్టిగా డైలాగ్ వల్లించాల్సి ఉండేది. చేతులు, కాళ్ళు దూరంగా కనపడేట్లు కూడా కదిలించాల్సి ఉండేది.

సినిమా ఈ పరిమితుల్ని అధిగమించింది. కెమెరా ట్రిక్కులతో నిజంగా జరిగినట్లు చూపించే సాంకేతిక పరిజ్ఞానం దీనిదినాభివృద్ధి చెందింది. ఇప్పుడు గ్రాఫిక్స్ సహాయంతో అసాధ్యాల్ని సుసాధ్యం చేస్తున్నారు. ఊహించడానికి కూడా వీలు లేని ఫైట్లు హీరోలు చేస్తున్నారు. ఇవన్నీ నిజమని భ్రమించేలా చేయగలుగుతున్నారు. దానితో ప్రేక్షకుల్లో వెర్రి అభిమానం కట్టలు తెంచుకుంటోంది. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, హీరోల కంటే ముందు తమకు ఏమాత్రం సంబంధం లేని కలెక్షన్ల గురించి కూడా వారు పట్టించుకుంటూ తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. పోటీలకు దిగుతున్నారు. పందేలు కాస్తున్నారు. సొంత కుటుంబాలని విస్మరిస్తున్నారు.

దీనికి తోడు దురభిమానం పెంచుకుని తమకు అక్కరలేని విద్వేషాన్ని సమంత లాంటి వారిపై ప్రదర్శిస్తున్నారు. పుకార్ల వ్యాప్తికి ఆలంబన అవుతున్నారు. పాతబడి, బూజుపట్టిన, సమాజ పురోగమనానికి విరుద్ధమైన దురహంకార భావజాలం పునరుద్ధరణకు వాహకులుగా మారుతున్నారు. సమాన పురోగమనానికి సకల మానవ సమానత్వం ఒక ముఖ్య ప్రాతిపదిక. జాతి, మత, కుల, లింగ, ప్రాంత విభేదాలను రద్దు చేసుకుంటూ అడుగులు వేస్తేనే సమాజం అందులోని కుటుంబాలు, మనుషులు ఆధునికం కాగలరు.

సంప్రదాయం పేరుతో, గతం గొప్ప పేరుతో, కుటుంబ-జాతి ప్రతిష్టల పేరుతో అభివృద్ధి నిరోధకత్వం మళ్ళీ కేంద్ర స్ధానం ఆక్రమించుకునేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తుంటుంది. అది ఒక్కోసారి రాజకీయాల్లోకి కూడా చొరబడుతుంది. సమంతపై జరుగుతున్న దాడి ఇందులో భాగమే. సమంత ఒక స్త్రీగా తన బ్రతుకు, భవిష్యత్తుకు సొంత మార్గం నిర్దేశించుకోవడం పురుషహంకార వ్యవస్ధకు నచ్చడం లేదు. అలాగైనా ఆమె నిశ్చయాన్ని నీరుగార్చడానికి, స్త్రీగా ఆమె స్వాతంత్రాన్ని అణచివేయడానికీ, స్వతంత్రంగా బతకడానికి అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నది.

ఆ ప్రయత్నాల్లో మీరు భాగస్వాములు కావద్దు. భాగస్వాములై అభివృద్ధి నిరోధకులు కావద్దు. స్త్రీ సమానాత్వానికి వ్యతిరేకులుగా మారవద్దు.

2 thoughts on “నటి సమంతపై కురుస్తున్న మగహంకార విద్వేషం

  1. ఒక నటుడు 3 పెళ్ళిళ్ళు చేసుకొన్నప్పుడు అడ్డురాని కుటుంబవిలువలు,ఒక నటి మొదటి సారి విడాకులు తీసుకొంటే గుర్తుకు రావడమే పురుషాధిపత్య దివాళాకోరుతనానికి నిదర్శనం!

  2. ఇది ఊర్లో విడాకులకి కుక్కల హడావిడి. సామంతా రెండు సినిమాల్లో అడల్ట్ సీన్స్‌లో నటించింది, దీనిపై నాగార్జున గారి అభిమానుల అభ్యంతరం. గతంలో నాగార్జున గారి యాజమాన్యంలోని మా టి.వి.లో మిడ్నైట్ మసాలా కార్యక్రమాలు వచ్చాయి, మహిళా సంఘాలు గొడవ చేస్తే ఆ కార్యక్రమాలు బంద్ చేసారు. వాళ్ళు మగవాళ్ళకి అవసరం లేని నీతి ఆడవాళ్ళకి ఉండాలనుకుంటున్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s