
CJI N V Ramana
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు శుక్రవారం తలంటు పోసింది. పోలీసులు విచారణ సాగిస్తున్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం “మాటలు చెప్పడం వరకే పరిమితం అయింది. చేతల్లో చూపడం లేదు” అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ పరుషంగా వ్యాఖ్యానించారు. “రాష్ట్ర ప్రభుత్వం చర్యల పట్ల మేము సంతృప్తి చెందలేదు” అని ఆయన కుండ బద్దలు కొట్టారు.
మోడి కేబినెట్ లోని సహాయ మంత్రి, బిజేపి ఎంపి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు చెందిన కారు ఆందోళనలో పాల్గొని వెనక్కి వస్తున్న రైతులపై నుండి కారు వేగంగా పోనివ్వడంతో 4గురు రైతులతో పాటు 9 మంది చనిపోయారు.
యూపి పోలీసులు ఆశిష్ మిశ్రాపై హత్య కేసు నమోదు చేసినప్పటికీ ఆయన్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. కేవలం విచారణకు హాజరు కావాలని సమన్లు పంపి మిన్నకుండి పోయారు. నేడు శుక్రవారం ఉదయం 11 గంటలకు పోలీసుల ముందు హాజరు కావలసి ఉన్నప్పటికీ ఆయన పత్తా లేడు. వెంటనే ఆయన కోసం వెతుకులాట మొదలు పెట్టవలసి ఉండగా పోలీసు ఉన్నతాధికారులు ఆయన కోసం ఎదురు చూసి చూసి చివరికి విచారణ రేపటికి వాయిదా వేశారు.
ఇద్దరు అడ్వకేట్లు రాసిన లేఖను పిఐఎల్ కింద చేపట్టిన సుప్రీం కోర్టు అక్టోబర్ 7, 8 తేదీల్లో విచారణ జరిపింది. ప్రభుత్వ చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ రోజుకు వాయిదా వేసిన ధర్మాసనం, విచారణ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. యూపి ప్రభుత్వ విచారణా తీరుకు ఈ వ్యాఖ్యలు అద్దం పట్టాయి.
ఈ రోజు విచారణలో యూపి ప్రభుత్వం తరపున ప్రముఖ సుప్రీం కోర్టు లాయర్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. లైవ్ లా డాట్ ఇన్ వెబ్ సైట్ ప్రకారం విచారణ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.
*** *** ***
సిజేఐ ఎన్‌వి రమణ: మేము కేసు మెరిట్స్ గురించి ఇప్పుడు మాట్లాడ్డం లేదు. ఆరోపణ సెక్షన్ 302 (హత్య కేసు) కు సంబంధించినది. ఇతర కేసుల్లో ఇతరుల మాదిరిగానే ఇతని పట్ల కూడా మీరు వ్యహరించాలి.”
హరీష్ సాల్వే: రేపు 11 గంటలకు హాజరు కావాలని పోలీసులు ఆశిష్ మిశ్రాకు సమన్లు పంపారు. అతను హాజరు కాకపోతే చట్టం తన పని తాను చేస్తుంది.
సిజేఐ: ఇతర కేసుల్లో నిందితులతో కూడా ఇలాగే మీరు వ్యవహరిస్తారా? నోటీసు పంపి….”
సాల్వే: పోస్ట్ మార్టం నివేదికలో బులెట్ గాయాలు లేవని తేలింది.అందువలన సెక్షన్ 160 సిఆర్‌పిసి కింద మొదట నోటీసు పంపాము.
సిజేఐ: మేము ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాము. హత్య, తుపాకి గాయం లాంటి తీవ్ర ఆరోపణలు ఉన్నప్పుడూ… దేశంలోని ఇతర ప్రాంతాల్లో నిందితులతో ఎలా వ్యవహరిస్తారు? దయ చేసి రండి, దయ చేసి చెప్పండి అని అడుగుతూ నోటీసు పంపిస్తారా? దయ చేసి చెప్పండి.
సాల్వే: నేను ఈ విషయం పోలీసుల్ని అడిగాను. కాల్పులు జరిపిన ఆరోపణలు ఉన్నప్పటికీ పోస్ట్ మార్టం నివేదికలో బులెట్ గాయం ఉన్నట్లు చెప్పలేదని వారు చెప్పారు.
సిజేఐ: తుపాకి కాల్చిన గాయం ఉన్నట్లు పోస్ట్ మార్టం చూపకపోవడం… ఇదీ ఒక కారణమేనా?… ఇంతకంటే ఎక్కువ చెప్పాలని నేను భావించడం లేదు.
సాల్వే: ఇది తీవ్రమైన విషయమే.
సిజేఐ: తీవ్ర విషయం అయితే వారు విచారించవలసిన రీతిలో విచారించలేదని మేము భావిస్తున్నాము. కేవలం మాటల్లోనే తప్ప చేతల్లో ఏమీ జరగనట్లు కనిపిస్తోంది.
సాల్వే: వాళ్ళు అవసరమైన విధంగా చేసి ఉండాల్సింది.
జస్టిస్ హిమ కోహ్లి: మిస్టర్ సాల్వే. సామెత చెప్పినట్లు ‘ఆహారం రుచిగా ఉన్నదీ లేనిదీ తినే తీరే చెప్తుంది’ (The proof of pudding is in eating).
సిజేఐ: మనం ఏం సందేశం పంపుతున్నాం? సాధారణ పరిస్ధితుల్లో సెక్షన్ 302 కింద కేసు రిజిస్టర్ అయితే పోలీసులు ఏం చేస్తారు? వెళ్ళి నిందితుడిని అరెస్టు చేయండి.
జస్టిస్ సూర్య కాంత్: “ఇది 8 మందిని కిరాతకంగా హత్య చేసిన కేసు. కేసులో ఎవరు ఉన్నా చట్టం తగిన విధంగా పని చేయాల్సి ఉంది.
సాల్వే: ఏమేమి అవసరమో అన్నీ చేస్తాము.
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సభ్యులందరూ స్ధానిక పోలీసు అధికారులే ఉన్న సంగతిని సిజేఐ ఎత్తి చూపారు.
సిజేఐ: సభ్యులందరూ స్ధానిక అధికారులే అయినప్పుడు ఇలాగే జరుగుతుంది.
సాల్వే: ఇప్పుడు అంతా మీ చేతుల్లో ఉంది మీ లార్డ్స్. ఒక సూచన చేయవచ్చా.. కేసును సెలవుల అనంతరం వరకూ (వాయిదా వేసి) ఉంచండి. ఈ లోపు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.
సిజేఐ: మిస్టర్ సాల్వే. మీపై మాకు గౌరవం ఉంది. అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాము. కేసు సున్నితత్వం దృష్ట్యా మేము వ్యాఖ్యలు ఏమీ చేయడం లేదు….
….. సిబిఐ విచారణ కూడా పరిష్కారం కాబోదు. ఇందుకు కారణాలు ఏమిటో మీకూ తెలుసు… (కేసులో ఉన్న) వ్యక్తుల దృష్ట్యా… మరో మార్గాన్ని మీరు వెతకవలసి ఉంటుంది. సెలవుల ముగిసిన వెంటనే విచారణ చేపడతాం.
యూపి పోలీసులు కేసు విచారణను నాశనం చేశారని (Done a hash) సాల్వే అంగీకరించారు.
ఆదేశాలు డిక్టేట్ చేసిన అనంతరం సిజేఐ నేతృత్వం లోని ధర్మాసనం విచారణను అక్టోబర్ 20 తేదీకి వాయిదా వేసింది.
నేపధ్యం
ఉత్తర ప్రదేశ్ లో అనేక హత్యలు, దాడులు జరుగుతున్నప్పటికీ తమ రాష్ట్రంలో శాంతి బధ్రతలు గత ప్రభుత్వంలో కంటే మెరుగుపడ్డాయని ముఖ్యమంత్రి ప్రకటిస్తూ ఉంటారు. యూపిలో పాలన భేషుగ్గా ఉన్నదని ప్రధాన మంత్రి సైతం ప్రశంసిస్తారు. ఆచరణలో అక్కడ హిందూత్వ కనిపెట్టిన వివిధ కారణాలు (గోహత్య, గోమాంసం రవాణా, లవ్ జిహాద్, దేశ ద్రోహం మొ.వి) చూపుతూ గూండా మూకలు ముస్లింలపై దాడులు చేయడం, చితకబాదడం, హత్యలు చేయడం మామూలు అయింది. వీటిలో కొన్ని పత్రికలు ఎక్కుతుండగా అనేక ఘటనలు వెలుగులోకి రావడం లేదు.
చివరకు బాధితుల పైనే కేసులు నమోదు చేస్తూ దోషుల తరపున పోలీసులే ప్రతీకార చర్యలకు పాల్పడుతుండడంతో బాధితులు తమపై జరుగుతున్న దాడుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడం అటుంచి కనీసం పైకి చెప్పుకోలేని పరిస్ధితికి నెట్టబడుతున్నారు.
కాగా తమ సమస్యలపై ఆందోళనలు చేసే ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా దుర్మార్గమైన కేసులు నమోదు చేయడం మామూలు విషయం అయింది. నరేంద్ర మోడి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీల కోసం యేడాది క్రితం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా, ముఖ్యంగా ఉత్తర భారతంలో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ఇవి ఉత్తర ప్రదేశ్ కు ముఖ్యంగా పశ్చిమ ఉత్తర ప్రదేశ్ కు సైతం వ్యాపించాయి.
మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో అనేక చోట్ల పంజాబ్, హర్యానా, రాజస్ధాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల రైతులతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు శిబిరాలు నెలకొల్పి సంవత్సర కాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనల వలన ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని, రోడ్డు ఆక్రమించే హక్కు రైతులకు లేదని, ఇతర ప్రజల హక్కులకు భంగం కలిగించరాదని సుప్రీం కోర్టుతో సహా వివిధ మేధావులు విమర్శలు చేయడం ఒక విషయం అయితే ఆందోళనకు విస్తృత మద్దతు లభిస్తుండడం ఒక వాస్తవం.
ఈ నేపధ్యంలో అజయ్ మిశ్రా సొంత గ్రామం బన్బీర్ పూర్ లో ఓ పాఠశాలలో జరుగుతున్న ఫంక్షన్ కు ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య హాజరు కావలసి ఉంది. వ్యవసాయ చట్టాలపై ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు మౌర్య మరియు కేంద్ర మంత్రి అజయ్ ల సందర్శనను అడ్డుకోవాలని, చట్టాలపై తమ నిరసన తెలియ జేయాలని నిర్ణయించారు. ఇందుకోసం తికూనియా గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు వారు చేరుకున్నారు. అక్కడ కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రాలు ఉన్నారని రైతులు చెబుతున్నారు.
అయితే ఆందోళన సంగతి తెలిసిన ఉప ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా కాకుండా రోడ్డు మార్గంలో రావాలని నిర్ణయించుకున్నారు (ఇండియా టుడే, అక్టోబర్ 4). ఈ సంగతి తెలుసుకున్న రైతులు హెలిపాడ్ నుండి తిరుగుముఖం పట్టారు. రైతు నాయకుడు తెజీందర్ సింగ్ విర్క్ వారికి నాయకత్వం వహించారు.
హెలిపాడ్ వద్ద ఉన్న ఆశిష్ మిశ్రా మూడు జీపుల కాన్వాయ్ తో తిరిగి వస్తూ రోడ్డుపై నడిచి వెళ్తున్న రైతులను వేగంగా ఢీ కొట్టాడు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసిందేనని సంఘటనపై విడుదలయిన వీడియో చూసినవారికి ఎవరికైనా అర్ధం అవుతుంది. దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరి కొంత మంది గాయపడ్డారని వివిధ పత్రికలు తెలియజేశాయి. రైతు నేత తెజీందర్ సింగ్ విర్క్ తీవ్రంగా గాయపడ్డాడు.

Lakhimpur deaths
రైతులను ఢీ కొట్టిన కారు మరికొన్ని గజాలు ప్రయాణించి అదుపు తప్పి బోల్తాపడటంతో ఆగ్రహంగా ఉన్న రైతులు దాన్ని చుట్టుముట్టారు. రైతుల కధనం బట్టి కారులో ఉన్న ఆశిష్ మిశ్రా తప్పించుకుని పొలాల్లోకి పరుగెత్తుతూ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ రైతుకు తలలో బులెట్ తగిలి మరణించాడు (స్క్రోల్ డాట్ ఇన్). రైతుల దాడిలో బిజేపి కార్యకర్తలు ముగ్గురు చనిపోయారు. మరొక విలేఖరి కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయన కారు ఢీకొట్టి చనిపోయాడని విలేఖరి కుటుంబం, కాదూ రైతుల దాడిలో చనిపోయాడని బిజేపి చెబుతున్నాయి.
ఆ తర్వాత ఇరు పక్షాల నుండి పరస్పర విరుద్ధ ప్రకటనలు వెలువడ్డాయి. రైతులు కాన్వాయ్ పై రాళ్ళతో దాడి చేశారని రాయి కారు డ్రైవర్ కు తగిలి అతను స్పృహ కోల్పోయాడని దానితో కారు అదుపు తప్పిందని అజయ్ మిశ్రా ఆరోపించాడు. తన కుమారుడు ఆశిష్ అసలు అక్కడ లేనే లేడని, జిల్లా కేంద్రం (లఖింపూర్) లో వేరే కార్యక్రమంలో ఉన్నాడని వాదించాడు. అందుకు తమ వద్ద రుజువులు ఉన్నాయని చెప్పాడు. ఇంతవరకు ఈ రుజువులు ఏవీ బైటపెట్టలేదు. కాన్వాయ్ చూసిన రైతులు మాత్రం ఢీ కొట్టిన కారులో ఆశిష్ మిశ్రా ఉన్నాడని, కాల్పులు జరిపాడని ఘటాపధంగా చెబుతున్నారు.
హెలిపాడ్ నుండి వెనక్కి తిరిగి వస్తుండగా రైతు నేత తెజీందర్ ఒక చానల్ విలేఖరికి ఇంటర్వ్యూ ఇస్తూ నడిచాడు. ఈ వీడియోలో కారు వేగంగా రైతులను ఢీ కొట్టిన దృశ్యం స్పష్టంగా నమోదు కావడంతో అజయ్ మిశ్రా చేసిన వాదనలు చాలా వరకు తేలిపోయాయి.
రైతు సంఘాలు మృతులకు కోటి రూపాయలు పరిహారం డిమాండ్ చేశారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కోరారు. డిమాండ్లు నెరవేరే వరకు అంతిమ సంస్కారాలు జరపబోమని ఆందోళన చేపట్టారు. గ్రామం వద్దకి రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆందోళన తీవ్రమై రైతులు ఆగ్రహం పెరిగిపోవడంతో యూపి ప్రభుత్వం బికేయూ నేత రాకేశ్ తికాయత్ సహాయం కోరింది.
ఇండియన్ ఎక్స్^ప్రెస్ పత్రిక ప్రకారం యూపి ప్రభుత్వంలో అత్యున్నత స్ధాయి అధికారులతో రాకేశ్ తికాయత్ కు గత పరిచయాల రీత్యా సాన్నిహిత్యం ఉన్నది. ఈ సాన్నిహిత్యం యూపి ప్రభుత్వానికి అక్కరకు వచ్చింది. పలు దఫాలుగా అనేక గంటల పాటు చర్చలు జరిగాక మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రు 45 లక్షల పరిహారం, కుటుంబ సభ్యులు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, గాయపడిన వారికి రు 10 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. ఆశిష్ మిశ్రాపై హత్య కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అనంతరం రైతులు ఆందోళన విరమించారు.
అయితే హత్య కేసు నమోదు చేసినప్పటికీ అరెస్టులు జరగలేదు. దానితో యూపి కి చెందిన ఇద్దరు అడ్వకేట్లు సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. చట్టం ప్రకారం, జరగవలసిన రీతిలో విచారణ జరగడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ లేఖను ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం’ గా నమోదు చేయాలని చీఫ్ జస్టిస్ ఆదేశాలు ఇచ్చారు. కానీ సమాచార లోపంతో రిజిస్ట్రీ దానిని సుమోటో కేసుగా నమోదు చేసింది.
పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం యూపి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ శుక్రవారానికి (అక్టోబర్ 8) వాయిదా వేసింది.
అన్ని వివరాలతో సమగ్రంగా రాశారు.
The proof of pudding is in eating అనే సామెతను… ‘ఆహారం రుచిగా ఉన్నదీ లేనిదీ తినే తీరే చెప్తుంది’ అంటే మెరుగ్గా ఉంటుంది.
అవునా. ఆ సామెత వినడం ఇదే మొదటిసారి. మీరు చెప్పినట్లు సవరిస్తాను.