
Oxford-Astrazeneca vaccine
ఇండియా ప్రతీకార చర్యలతో యూకే దిగి వచ్చింది. వ్యాక్సిన్ డోసులు పూర్తిగా వేసుకున్న భారత ప్రయాణీకులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇండియాతో పాటు మరో 47 ఇతర దేశాలపై కూడా ఆంక్షలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 10, సోమవారం నుండి గతంలో విధించిన నిబంధనలను భారత ప్రయాణీకులు పాటించనవసరం లేదని యూకే ప్రభుత్వ ఒక ప్రకటనలో తెలిపింది. (లైవ్ మింట్, అక్టోబర్ 8)
దీని ప్రకారం స్ధానికంగా ఉత్పత్తి చేసిన కోవి షీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేసుకున్న భారత్ ప్రయాణీకులు 10 రోజుల నిర్బంధ క్వారంటైన్ పాటించనవసరం లేదు. కోవిడ్ 19 సంబంధించి నంతవరకు అటువంటి వారిని వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న యూకే పౌరులతో సమానంగా చూస్తారు. అయితే వారు ప్రయాణానికి 10 రోజుల ముందు వరకూ యూకే రెడ్ జాబితాలో ఉన్న దేశాలలో నివసించడం గానీ, సందర్శించడం గానీ చేసి ఉండకూడదు.
రెడ్ జాబితాలో ఇండియా పేరు చేర్చుతూ యూకే ప్రకటించాక భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం తెలిపింది. కోవి షీల్డ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నప్పటికి భారత్ ప్రయాణీకులను వ్యాక్సిన్ వేసుకోని వారీగా పరిగణించడం రెసిజమే నని భారత ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. బ్రిటన్ కంపెనీ ఆక్స్^ఫర్డ్-ఆస్ట్రజెనెకా లైసెన్స్ తో తయారైన కోవిషీల్డ్ ను గుర్తించకపోవడం ఏమిటని విదేశీ మంత్రి జై శంకర్ ప్రశ్నించాడు.
ఈ నిర్ణయాన్ని సవరించుకోకపోతే ప్రతీకార చర్యలు తప్పవని భారత్ హెచ్చరించింది. బ్రిటన్ నుండి సానుకూల స్పందన లేకపోవడంతో ప్రతీకార చర్యలు ప్రకటించింది.
బ్రిటన్ చర్యకు భారత విదేశీ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇండియా-యూకే ప్రయాణ నిబంధనల సమస్యకు ముందే పరిష్కారం వెతికి ఉంటే బాగుండేదని ప్రకటించింది. “యూకే అధికారులతో వివిధ స్ధాయిల్లో ఈ సమస్యను చర్చించాం. కానీ ఫలితం లేకపోయింది. అందుకే అక్టోబర్ 4 నుండి యూకే ప్రయాణీకులపై ప్రతి చర్యలు ప్రారంభించాం.” అని విదేశీ శాఖ తెలిపింది.
ఇండియా వ్యాక్సిన్ సర్టిఫికేషన్ జారీ ప్రక్రియ తోనే తమకు సమస్య అని చెప్పిన యూకే ఆరోగ్య శాఖ, ఆ సమస్య ఎందుకో వివరించలేదు.