నెమ్మదిగా పురోగమిస్తున్న బ్రిక్స్ బ్యాంక్


13th BRICS summit held virtually

సెప్టెంబర్ 9, 2021 తేదీన భారత దేశం నేతృత్వంలో (Chairship) 13వ బ్రిక్స్ సమావేశాలు ఆన్-లైన్ పద్ధతిలో జరిగాయి. మిగతా నాలుగు దేశాల నేతలు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొని చర్చలు జరిపారు. “బ్రిక్స్ సభ్య దేశాల అంతర్గత సహకారం కొనసాగింపు, స్ధిరీకరణ, ఏకాభిప్రాయం” అనే అంశం కేంద్రంగా ఈ సమావేశాలు జరిగాయి.

ఈ సమావేశం నాటికి బ్రిక్స్ ఏర్పడి 15 సంవత్సరాలు పూర్తవడం విశేషం. మూడు మూల స్తంభాల ప్రాతిపదికన బ్రిక్స్ దేశాల మధ్య సహకారం పెంపొందించడానికి తాము కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ డిక్లరేషన్ పేర్కొంది. ఆ మూడు స్తంభాలు: 1) రాజకీయ మరియు భద్రత (political and security), 2) ఆర్ధిక మరియు ద్రవ్య (economical and financial), 3) సాంస్కృతిక మరియు ప్రజల నుంచి ప్రజలకు సంబంధాలు (cultural and people-to-people exchanges).

ముఖ్యంగా “మరింత కలుపుకొని పోయే, సమానత్వం ప్రాతిపదిక గల, ఐక్య రాజ్య సమితి కేంద్రంగా సకల దేశాలకూ ప్రాతినిధ్యం వహించగల బహుళ-ధృవ ప్రపంచాన్ని ప్రోత్సహించేందుకు ప్రతిన బూనుతున్నట్లు బ్రిక్స్ డిక్లరేషన్ ప్రకటించింది.

అయితే భారత దేశం అనుసరిస్తున్న విధానం మాత్రం బ్రిక్స్ డిక్లరేషన్ కు అనుగుణంగా ఉందా లేదా అన్న అనుమానాలు కొనసాగుతున్నాయి. ఓ పక్క చైనా నేతృత్వంలోని ఎస్‌సి‌ఓ కూటమిలో కొనసాగుతూనే అ మెరికా నేతృత్వంలోని క్వాడ్ కూటమిలో క్రియా శీలకంగా పాల్గొంటోంది. ఆరంభంలో క్వాడ్ కూటమిలో చేరేందుకు వెనకా ముందూ ఊగిసలాడినప్పటికీ చివరికి అమెరికాతో వ్యూహాత్మక ఒప్పందంలో చేరడం, క్వాడ్ కూటమికి ఆమోద ముద్ర వేయడం జరిగిపోయింది.

బహుళ-ధృవ ప్రపంచం ఆవిర్భావాన్ని సమర్ధిస్తున్న పలువురు విశ్లేషకులకు ఇండియా విధానం మింగుడు పడడం లేదు. రెండు పడవల్లో కాలు పెట్టడం బదులు ఏ పడవలో వెళ్లాలో ఇండియా నిశ్చయించుకోవాలని వారు సలహా ఇస్తున్నారు. అయితే ఇండియా ఇప్పటికే అమెరికా శిబిరంలో చేరిపోయిందన్న సంగతి వీరికి ఇంకా చేరినట్లు లేదు.

13వ బ్రిక్స్ సమావేశాల డిక్లరేషన్

భౌగోళిక-రాజకీయ పోకడలు ఎలా ఉన్నప్పటికీ కొన్ని ముఖ్య ఒప్పందాలు 14వ సమావేశంలో జరిగాయి. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ కూటమిపై బ్రిక్స్ సహకార ఒప్పందం, కస్టమ్ అంశాలలో బ్రిక్స్ సహకారం మరియు పాలక వ్యవస్ధల పరస్పర సహాయం చేసుకునే ఒప్పందం సెప్టెంబర్ సమావేశాల్లో కుదిరాయి. మానవ వినియోగానికై ఉపయోగపడే మెడికల్ ఉత్పత్తుల నియంత్రణలో సహకారం కోసం ఒక ఎం‌ఓ‌యూ విషయంలో చర్చలు ప్రారంభం అయ్యాయి. బ్రిక్స్ టెర్రరిజం వ్యతిరేక యాక్షన్-ప్లాన్ పై ఒక ఒప్పందానికి వచ్చినట్లు డిక్లరేషన్ పేర్కొంది.

వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణలలో సహకారం కోసం యాక్షన్ ప్లాన్ 2021-2024 ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇప్పటికే అమలులో ఉన్న వివిధ మంత్రివర్గ సమావేశాలు, వర్కింగ్ గ్రూపుల ద్వారా 2021-25 బ్రిక్స్ ఆర్ధిక భాగస్వామ్యంను అమలు చేసేందుకు నిబద్ధులై ఉన్నామని ప్రకటించింది. బ్రిక్స్ వ్యవసాయ పరిశోధనా వేదికను ప్రారంభించారు. డిజిటల్ ప్రజోపయోగ సరుకుల నిమిత్తం బ్రిక్స్ వేదిక ఏర్పాటు చేసేందుకు చర్చలు కొనసాగుతున్నట్లు డిక్లరేషన్ తెలిపింది.

బ్రిక్స్ బ్యాంక్ – బంగ్లా దేశ్

బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేసిన న్యూ డవలప్^మెంట్ బ్యాంకు  ఉపయోగం రాను రానూ పెరుగుతోంది. ప్రపంచ బ్యాంకు, పారిస్ క్లబ్, లండన్ క్లబ్ తదితర పశ్చిమ దేశాల్ల ఋణ వితరణ నిర్మాణాలకు పోటీగా ఏర్పాటు చేసిన ఎన్‌డి‌బి వల్ల ఏమీ కాదని పశ్చిమ దేశాలు మొదట్లో విమర్శలు గుప్పించాయి. ఇదంతా ఆరంభ శూరత్వమే అని వెక్కిరించాయి.

ఐతే గత రెండు దశాబ్దాలలో తలసరి ఆదాయం మూడు రెట్లు వృద్ధి నమోదు చేసి ఆర్ధికాభివృద్ధి విజయగాధతో ప్రశంసలు అందుకుంటున్న బంగ్లా దేశ్ ఇప్పుడు బ్రిక్స్ బ్యాంకులో సభ్య దేశంగా చేరడం ఎన్‌డి‌బి విస్తరణకు సానుకూల శకునంగా విశ్లేషకులు భావిస్తున్నారు. పేద దేశం స్ధాయి నుండి మధ్య ఆదాయ దేశంగా బంగ్లాదేశ్ అవటించింది. ఎన్‌డి‌బి విస్తరణ అంటే అది అంతిమంగా ప్రపంచ బ్యాంకు ప్రాధామ్యం కోల్పోవడానికి బాటలు వేస్తుంది.

ప్రపంచ బ్యాంకు, ప్యారిస్ క్లబ్ లు షరతులతో కూడిన అప్పుల ద్వారా మూడవ ప్రపంచ దేశాలను ఉద్ధరించడానికి బదులు అప్పుల కుప్పలుగా మార్చివేసి ఏటా వడ్డీలు చెల్లించే క్లయింటు దేశాలుగా పశ్చిమ దేశాలకు మారిపోయిన సంగతి సర్వ విదితమే. పశ్చిమ ఋణ సంస్ధల దురశాపూరిత దోపిడీ లక్ష్యంగా పని చేసిన ప్రపంచ బ్యాంకు, ఇతర ఋణ సంస్ధలకు భిన్నంగా సభ్య దేశాల అభివృద్ధికి ఎన్‌డి‌బి కృషి చేస్తుందని బ్రిక్స్ కూటమి ప్రకటించింది. బంగ్లాదేశ్ తో పాటు యూ‌ఏ‌ఈ, ఉరుగ్వే లను కూడా ఎన్‌డి‌బి లో చేర్చుకునేందుకు బ్రిక్స్ సమ్మతి తెలిపింది.

ఉరుగ్వే అమెరికా పెరటి దొడ్డిగా భావించే దక్షిణ అమెరికా ఖండంలోనిది. యూ‌ఏ‌ఈ అమెరికా మిలట్రీ స్ధావరానికి ఆతిధ్యం ఇస్తున్న దేశం. అంతేకాక వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత కలిగిన చమురు సంపన్న ప్రాంతం లోనిది కూడా. ఇక బంగ్లాదేశ్ అమెరికా తనకు సరికొత్త పోటీ క్షేత్రంగా మార్చుకున్న ఇండో-పసిఫిక్ ప్రాంతం లోనిది. చైనాకు అత్యంత సమీపం లోనిది.

బంగ్లా దేశ్ కు స్వాతంత్రం సిద్ధించి 50 యేళ్ళు పూర్తవుతూ ఉండగా ఎన్‌డి‌బిలో చేరింది. ఎన్‌డి‌బి సభ్యత్వం తమ దేశానికి మలుపు అవుతుందని బంగ్లాదేశ్ ప్రకటించింది. రవాణా, జలవనరులు, శానిటేషన్, క్లీన్ ఎనర్జీ, డిజిటల్ రంగంలో మౌలిక నిర్మాణాలు, సామాజిక రంగంలో మౌలిక నిర్మాణాలు, పట్టణాభివృద్ధి మొ.న రంగాలలో పెట్టుబడి సమకూర్చే ఎన్‌డి‌బి ద్వారా బంగ్లా దేశ్ నిజమైన అభివృద్ధి బాట పడుతుందా లేక మరో ప్రపంచ బ్యాంకు లాగా చైనాకు బందీని చేస్తుందా అన్నది వేచి చూడాలి. సుదూరంగా ఉన్న వివిధ ప్రాంతాల్లోని మూడు దేశాలకు విస్తరించడం ఎన్‌డి‌బి కి పబ్లిక్ రిలేషన్స్ పరంగా ఒక విజయం. ఒక దశాబ్దం క్రితం ప్రపంచ బ్యాంకుకు పోటీగా వెలసిన మరో నిర్మాణంలో మూడో ప్రపంచ దేశం చేరడం ఊహించడానికి కూడా వీలు లేని విషయం.

బ్రిక్స్ సహాయం ద్వారా మరింత అభివృద్ధిని బంగ్లాదేశ్ నమోదు చేస్తే అది ఎన్‌డి‌బికి ప్రపంచ బ్యాంకు, ప్యారిస్ క్లబ్ తదితర వ్యవస్ధల విశ్వసనీయతను దెబ్బ తీస్తుంది. గత 80 యేళ్లలో డబల్యూ‌బి, ఐ‌ఎం‌ఎఫ్ లు సాధించలేని సహాయ అభివృద్ధిని ఎన్‌డి‌బి సాధిస్తే అది పశ్చిమ వాణిజ్య, ఆర్ధిక ప్రయోజనాలకు తీవ్ర విఘాతం అవుతుంది.

100 బిలియన్ డాలర్ల ఆరంభ పెట్టుబడితో మొదలయిన ఎన్‌డి‌బి ఇప్పటికే సభ్య దేశాలన్నింటిలో 80 ప్రాజెక్టులకు నిధులు సమకూర్చినట్లు బ్రిక్స్ ప్రకటన పేర్కొంది. ఇందుకోసం 30 బిలియన్ డాలర్లు సమకూర్చింది. ప్రస్తుతానికి ఇది చిన్నమొత్తమే. మరిన్ని చర్యల ద్వారా ఎన్‌డి‌బి తన విశ్వసనీయతను పెంచుకునే అవకాశం ఎప్పుడూ ఉన్నది.

అంతర్యుద్ధాలలో తలదూర్చకుండా, విచక్షణ లేకుండా దురాశాపూరిత దోపిడీకి పాల్పడకుండా పరస్పర ప్రయోజనాలు, సమానత్వం ప్రాతిపదికన అందించే రుణాలు తప్పనిసరిగా అభివృద్ధికి దోహదం చేస్తాయి. అయితే ఇలాంటి చర్యలకు ఎన్‌డి‌బి పూనుకుంటే అమెరికా, పశ్చిమ దేశాలు చేతులు ముడుచుకు కూర్చోవు. తమ దురాశలు సంతృప్తిపరిచే వనరులకు చిల్లి పడుతుంటే చేష్టలుడిగి నిలబడవు. ఈ ప్రమాదాన్ని ఎన్‌డి‌బి, బ్రిక్స్ కాచుకోక తప్పదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s