ఆఫ్ఘన్ చుట్టూ తిరుగుతున్న అమెరికా ఆత్మ!


The US’ transit point in Kyrgyzstan, closed in 2014

బ్రతికున్నప్పుడు కోరికలు తీరని మనిషి చనిపోయాక దెయ్యమై అక్కడే తిరుగుతుంటాడని ప్రతీతి! ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించి అమెరికా వ్యవహారం అలానే ఉంది. టెర్రరిస్టు వ్యతిరేక పోరాటం పేరుతో ఆఫ్ఘన్ చుట్టుపక్కల దేశాలతో స్నేహ సంబంధాలు పెంచుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నదని తెలుస్తోంది.

20 యేళ్ళ పాటు ఆఫ్ఘనిస్ధాన్ ను దురాక్రమించి సాయుధంగా తిష్టవేసిన అమెరికా అక్కడి ప్రజలను నానా విధాలుగా పట్టి పల్లార్చింది.

70,000కు పైగా ఆఫ్ఘన్ పౌరులను బాంబుదాడులతో చంపేసింది. టెర్రరిస్టుల వేట పేరుతో అర్ధ రాత్రిళ్ళు ప్రజల ఇళ్ళల్లో దూరి మహిళలు, పసి పిల్లలు అని కూడా చూడకుండా చంపేసింది. 6294 మంది అమెరికా సైనికులు, కాట్రాక్టర్ల శవాలను వారి ఇళ్లకు పపింది. 51,191 మంది తాలిబాన్లు ప్రాణాలు కోల్పోయారు. 450 మంది వరకు సహాయ సంస్ధల సిబ్బంది, 70కి పైగా జర్నలిస్టులు చనిపోయారు.

ఆఫ్ఘనిస్తాన్ జాతీయ ఆర్ధిక వ్యవస్ధ సర్వనాశనమైంది. సహాయం పేరుతో అమెరికా విదిల్చిన నాలుగు ఎంగిలి మెతుకులతో కొద్ది మంది దళారీ నేతలు, ధనికులు సంపన్నులు కాగా సామాన్య ప్రజలు ఆకలితో, అర్ధాకలితో, వివిధ రోగాలతో దుర్భర దారిద్ర్యంలో జీవనం గడిపారు. కాగా యుద్ధాన్ని ఫైనాన్స్ చేసేందుకు ఆఫ్ఘన్ లో గంజాయి సాగు చేసి ప్రపంచానికి సరఫరా చేసింది. ఆఫ్ఘన్ ప్రజలు సైతం అనేకులు ఈ గంజాయి మత్తులో మునిగి జీవితాలను నాశనం చేసుకున్నారు.

ఆఫ్ఘన్ దురాక్రమణలో అమెరికా పెట్టిన ఖర్చు మొత్తం 2 ట్రిలియన్ డాలర్లకు పైనే అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ప్రకటించాడు. బ్రౌన్ యూనివర్సిటీ జరిపిన అధ్యయనం కూడా దీనిని ధృవీకరించింది. యుద్ధం కోసం చేసిన మిలట్రీ కొనుగోళ్ళు, తెచ్చిన అప్పులు, అప్పులపై వడ్డీలు, పాకిస్తాన్ ను దువ్వడానికి చేసిన ఖర్చు… ఇవన్నీ కలిపి 2 ట్రిలియన్ డాలర్లకు పైనే. ఇది దాదాపు 150 లక్షల కోట్ల రూపాయలకు సమానం.

వందగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానతో చచ్చ్చినట్లు, గాలివాన రాకపోయినా పీపీలికం సమానమైన తాలిబాన్ వెంట తరుముతుంటే యుద్ధ సామాగ్రి ఎక్కడివక్కడ వదిలేసి పారిపోయింది.

ఇప్పుడు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ చుట్టూ ఉన్న దేశాలలో డ్రోన్ ప్రయోగ స్ధావరాలు నెలకొల్పేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. “ఆఫ్ఘనిస్తాన్ లో కొన్ని చోట్ల పని చేస్తున్న ఐ‌ఎస్‌ఐ తీవ్రవాదులను మట్టు పెట్టేందుకు ఈ స్ధావరాలు అవసరం” అని అమెరికా నమ్మబలుకుతోంది.

సీనియర్ మిలట్రీ అధికారులు కొందరు అమెరికా సెనేట్ కమిటీ ముందు ఈ మేరకు సూచించినట్లు పత్రికలు వెల్లడించాయి. మరీ ముఖ్యంగా మధ్య ఆసియాలోని వివిధ దేశాలలో ఉన్న రష్యన్ సైనిక స్ధావరాలను ‘టెర్రరిస్టు వ్యతిరేక యుద్ధం’ కోసం వినియోగించుకునేందుకు ఆయా దేశాలతో బైడెన్ ప్రభుత్వం చర్చలు చేస్తున్నదని సెప్టెంబర్ లో మిలట్రీ అధికారులు కమిటీకి తెలిపారు. (స్పుత్నిక్ న్యూస్, అక్టోబర్ 6)

తజికిస్తాన్ ఉజ్బెకిస్తాన్, కిర్ఘిస్తాన్ తదితర మధ్య ఆసియా దేశాల ప్రభుత్వాలతో అమెరికా చర్చలు చేస్తున్నట్లు ఈ సమాచారం చెబుతోంది. అలాగే వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక సమాచారం ప్రకారం అమెరికా జాయిట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (JCS) ఛైర్మన్ జనరల్ మార్క్ మిల్లీ, రష్యన్ వైమానిక స్ధావరాలను వినియోగించుకునే విషయాన్ని రష్యన్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వ్యాలరీ గెరాసిమోవ్ తో సెప్టెంబర్ 22 తేదీన చర్చించాడు కూడాను. కానీ రష్యన్ జనరల్ ఇందుకు సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది.

గత మే నెలలోనే (ఆఫ్ఘనిస్ధాన్ తాలిబాన్ చేతుల్లోకి వెళ్ళక మునుపే) బైడెన్ ప్రభుత్వం తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వాలతో ఈ అంశమై చర్చలు చేసింది. జులై నెలలో జరపనున్న ‘టెర్రరిస్టు వ్యతిరేక దాడుల’ నిమిత్తం సదరు దేశాల సహకారాన్ని అమెరికా కోరింది. అమెరికా విదేశీ, రక్షణ విభాగాలు రెండూ ఈ చర్చల్లో పాల్గొన్నాయి. కానీ రష్యన్ నిరాకరణతో చర్చలు ముందుకు సాగలేదు.

అమెరికావి కబంధ హస్తాలు. అమెరికా స్నేహం దృత రాష్ట్రుని ఉక్కు కౌగిలితో సమానం. కౌగిలిలోకి ఆహ్వానించేప్పుడు దృతరాష్ట్రుడు అమిత ప్రేమను వ్యక్తం చేస్తాడు. కౌగిలిలో చేరాక ఉక్కు కౌగిలితో ఊపిరి ఆడకుండా హతం చేస్తాడు. అమెరికా స్నేహమూ అంతే.

టెర్రరిస్టు వ్యతిరేక సహకారం పేరుతో సెంట్రల్ ఆసియా దేశాలలో సైనిక స్ధావరాలను వినియోగించుకోవడం అంటే అక్కడ డ్రోన్ లు, యుద్ధ విమానాలు నిలిపి ఉంచేందుకు అనుమతించాలి. అందుకోసం ఒప్పందాలు జరుగుతాయి. ఒప్పందాలు కొనసాగుతూ పోతాయి. క్రమంగా అమెరికా సైన్యం అక్కడ తిష్ట వేస్తుంది.

మధ్య ఆసియా దేశాల్లో తిష్ట వేయడం అంటే రష్యా సరిహద్దు దేశాల్లో అమెరికా సైనిక బలగం వచ్చి చేరినట్లే, ఇది రష్యా భద్రతకు నేరుగానే ప్రమాదం తెచ్చిపెడుతుంది. తజకిస్తాన్, కిర్ఘిస్తాన్ లు రష్యా మిత్ర దేశాలు. ఉమ్మడి భద్రతా ఒప్పంద సంస్ధ (కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్) లో భాగస్వాములు. ఉజ్బెకిస్తాన్ తటస్ధతను పాటిస్తుంది. కానీ, ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్ధితి క్షీణిస్తున్న దృష్ట్యా, తజకిస్తాన్ లో ఉన్న రష్యన్ బలగాలతో కలిసి భద్రతా సహకారంలో పాలు పంచుకుంటుంది.

ఈ పరిణామాలు చెప్పేది ఒక్కటే. అమెరికాకు ఆఫ్ఘనిస్తాన్ తో అవసరం తగ్గిపోయినా, పూర్తిగా రూపుమాసిపోలేదు. రష్యా వ్యతిరేక లక్ష్యం, రష్యాను చుట్టుముట్టి అష్ట దిగ్బంధనం కావించడం, తద్వారా మధ్య ఆసియాలో రష్యా ప్రభావానికి తూట్లు పొడిచి తన ప్రపంచ ఆధిపత్య ప్రయోజనాలను పునరుద్ధరించుకుని శక్తివంతం చేసుకోవడం అమెరికా అవసరంగా కొనసాగుతోంది.

అమెరికా కింద పడింది గానీ ఇంకా పూర్తిగా ఓటమి చెందలేదు. తన వైభవ పునరుద్ధరణకు అది అన్ని ప్రయత్నాలు చేస్తుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s