సిద్దికి కప్పన్ కేసు: చార్జ్ షీట్ లో హాస్యాస్పద కారణాలు -ఇండియన్ ఎక్స్^ప్రెస్


Hathras

ద ఇండియన్ ఎక్స్^ప్రెస్ ఎడిటోరియల్  –02/10/2021

సిద్దికి  కప్పన్  అరెస్టు మరియు నిర్బంధం కొనసాగింపుకు హాస్యాస్పద కారణాలు చూపిన యూపి ఎస్‌టి‌ఎఫ్ చార్జ్ షీట్

దేశ ద్రోహం (సెడిషన్) చట్టంను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను జులై నెలలో విచారిస్తూ, ప్రభుత్వ సంస్ధలు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడం పట్ల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ ఆందోళన వ్యక్తం చేశారు. పౌరులు స్వేచ్ఛాయుతంగా మాట్లాడే హక్కుతో పాటు వివిధ పౌర స్వేచ్ఛా హక్కులను హరించే విధంగా రాజ్యం అంతకంతకూ ఎక్కువగా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నదన్న విమర్శలకు ఈ సుప్రీం కోర్టు పరిశీలన ద్వారా మరింత బలం చేకూరింది. ఈ పురాతన చట్టాన్ని బనాయించడంలో అవసరమైన ప్రక్రియ, తగినంత జాగ్రత్త, విచక్షణలను పాటించడం లేదని చెబుతూ కోర్టు ఇటీవలి కాలంలో చట్ట ప్రయోగంపై అవరోధం స్ధాయిని పెంచుతూ వస్తోంది. ఇటువంటి కేసులలో శిక్ష పడ్డవాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉన్న సంగతిని ఎన్‌సి‌ఆర్‌బి (నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో) గణాంకాల ప్రకారం ఈ చట్టం కింద కేసుల బనాయింపు 2016 నుండి అమాంతం పెరిగిపోయిన సంగతినీ ఎత్తి చూపింది. ఈ నేపధ్యంలో ఢిల్లీ నుండి పని చేసే విలేఖరి సిద్దిఖీ కప్పన్ కేసులో యూ‌పి ప్రత్యేక టాక్స్ ఫోర్స్ దాఖలు చేసిన 5000 పేజీల చార్జి షీటు, పౌర హక్కుల గ్రూపులు వ్యక్తం చేసిన భయాలు, ఆందోళనలు వాటికి అత్యున్నత న్యాయ స్ధానం నుండి లభించిన ఆమోదం సరైనవేనని ధృవీకరిస్తున్నది.

ఒక దళిత యువతి హత్య విషయాన్ని నివేదించడానికి యూ‌పి లోణి హత్రాస్ గ్రామానికి వెళుతున్న క్రమంలో సంవత్సరం క్రితం అరెస్టు అయిన సిద్ధిఖి కప్పన్ కు వ్యతిరేకంగా చార్జి షీటు అత్యంత హాస్యాస్పదమైన ఆరోపణలు ఎక్కు పెట్టుంది. అత్యంత కఠినమైన ఉపా (UAPA) చట్టాన్ని కప్పన్ పై నమోదు చేయడంతో పాటు దేశద్రోహం నేరం (ఐ‌పి‌సి సెక్షన్ 124 ఏ) కూడా బనాయించారు. అశాంతి, అల్లర్లు రెచ్చగొట్టే కుట్ర చేశాడని  -కప్పన్ “బాధ్యతాయుత” జర్నలిస్టుగా రాయలేదని, “ముస్లింలను రెచ్చగొట్టేందుకు కేవలం ముస్లింలను రెచ్చగొట్టేందుకు మాత్రమే వార్తలు నివేదించాడనీ, మావోయిస్టులు, కమ్యూనిస్టులకు సానుభూతిగా వ్యవహరించాడని చార్జి షీటు నేరారోపణ చేసింది. మలయాళంలో కప్పన్ -సి‌ఏ‌ఏ నిరసనల పైనా, ఈశాన్య ఢిల్లీ అల్లర్లపైనా, కోవిడ్ కాలంలో నిజాముద్దీన్ మర్కాజ్ లో జరిగిన ప్రార్ధనల పైనా- రాసిన 36 వ్యాసాల నుండి సేకరించిన భాగాలను చార్జి షీటులో సాక్ష్యంగా చేర్చారు. ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో సి‌ఏ‌ఏ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగినప్పుడు కప్పన్ రాసిన వ్యాసంపై చర్చించిన కేసు డెయిరీ నోట్ ను చార్జి షీటుకు జతపరిచారు. సదరు నోట్, “వ్యాసంలో ముస్లింలను బాధితులుగా (వారిని పోలీసులు కొట్టి పాకిస్తాన్ కి వెళ్లిపొండని వెక్కిరించారు) పేర్కొనబడింది” అని ఎత్తి చూపింది. తీవ్ర భావాలు కలిగిన ఇస్లామిక్ సంస్ధ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి‌ఎఫ్‌ఐ) కు “Think Tank” (మేధావి) గా కప్పన్ పని చేస్తున్నాడని ఆరోపించారు. ఈ “ఆరోపణలు” దేశ ద్రోహం కిందకు వస్తాయని చెప్పడమంటే వాటిని భరించలేనంతగా సాగదీయడమే కాగలదు. ప్రభుత్వంతో విభేదించినా, విమర్శించినా నేరమన్నట్లుగా ఈ నేరానికి నూతన నిర్వచనం ఇవ్వడానికి యూ‌పి ఎస్‌టి‌ఎఫ్ ప్రయత్నిస్తున్నదని స్పష్టం అవుతున్నది.

కప్పన్ కు వ్యతిరేకంగా దాఖలయిన చార్జి షీటు అత్యంత తీవ్ర స్ధాయిలో కలవరం కలిగించే పత్రం. దేశ ద్రోహ ప్రాధాన్యత తగ్గించి దాని దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సుప్రీం కోర్టు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఎక్కు పెట్టినట్లుగా ఉన్నది. అనిర్ధిష్టమైన పదజాలంతో రూపొందించిన చట్టాన్ని ఆయుధంగా చేబూని పరిపాలనా సంస్ధలు పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛలను హరిస్తూ, అసమ్మతిని నేరంగా మార్చివేస్తున్నారన్న కోర్టు భయాలను మరింతగా ఈ చార్జిషీటు పెంచుతోంది.

*****************************

ఈ సంపాదకీయానికి నేపధ్యమయిన హత్రాస్ దుర్ఘటన అందరూ ఎరిగినదే. సంవత్సరం క్రితం ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ గ్రామంలో దళిత యువతిపై అగ్రకుల దురహంకారంతో మదమెక్కిక యువకులు అత్యాచారం చేసి ప్రాణం పోయే విధంగా గాయపరచారు. తనపై అత్యాచారం చేశారని ఆ యువతి ఆసుపత్రిలో మరణ శయ్యపై మాటలు బలవంతంగా కూడబలుక్కుని చెప్పినప్పటికీ నిందితులను అరెస్టు చేసి విచారించడం మాని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ, పోలీసు బలగాలను నేరస్ధుల కోసం పని చేయడానికే దించింది.

అంతటితో ఆగకుండా చనిపోయిన యువతిని ఆమె కుటుంబ సభ్యుల కోరిక మేరకు వారి సమక్షంలో (అవివాహిత కనుక) ఖననం చేయాల్సి ఉండగా అలా చేయలేదు. పైగా కుటుంబ సభ్యులను దరిదాపుల్లో రాకుండా నిరోధించి గ్రామం నిండా పోలీసు బలగాలను నింపి బి‌జే‌పి ఎంతగానో కట్టుబడి ఉన్నట్లు చెప్పుకునే హిందూ సంప్రదాయాలకు బద్ధ వ్యతిరేకంగా రాత్రికి రాత్రి రెవిన్యూ, పోలీసు అధికారులే ‘కొరివి’ పెట్టి తగలబెట్టారు. పోలీసు పహారాలో తగలబడుతున్న యువతి మృతదేహం తాలూకు ఫోటోలను, వీడియోలను ప్రపంచం అంతా యూ‌పి అధికార వ్యవస్ధ తెంపరితనం పట్ల అత్యంత ఏహ్యభావంతో అనేకులు, హతాశులై కొందరు, భీతావహులై ఇంకొందరు, విస్తుపోయి మరికొందరు తిలకించారు.

యువతిపై జరిగిన అత్యాచార నేరానికి ఆమె కుటుంబం న్యాయం కొరకుండా నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేసిన ప్రయత్నాలను కూడా వీడియోల సాక్షిగా దేశం, ప్రపంచం చూశాయి. యువతి అత్యంత బాధతో పలికిన అంతిమ పలుకులను ఏమాత్రం సిగ్గు లేని విధంగా నిరాకరిస్తూ పోలీసు ఉన్నత అధికారులే అత్యాచారం జరగలేదని ప్రకటనలు ఇవ్వడం, డాక్టర్లు ఇచ్చిన నివేదికలకు కూడా తమ తమ సొంత భాష్యాలు, అర్ధాలు చెప్పడం ద్వారా నేరస్ధులకు ప్రభుత్వ యంత్రాంగం అండగా నిలబడింది.

ఇటువంటి దుర్భర పరిస్ధితులను, ప్రభుత్వ యంత్రాంగం తలపెట్టిన దళిత వ్యతిరేక నాటకాలను నివేదించడానికి సైతం వీలు లేకుండా హత్రాస్ చుట్టూ దిగ్బంధనం చేసి విలేఖరులపై ఆంక్షలు విధించారు. ఇటువంటి కఠిన పరిస్ధితుల్లో హత్రాస్ ఘటనపై సమాచారం సేకరించడానికి ఢిల్లీ నుంచి వెళ్ళిన కేరళ వాసియే సిద్దిఖీ కప్పన్. కప్పన్ ను యూ‌పి పోలీసులు ఒక టోల్ బూత్ వద్ద అరెస్టు చేసారు. ఎక్కడ నిర్బంధించినదీ చెప్పకుండా అనేక రోజులు గడిపారు. చివరికి అత్యంత కఠినమైన ఏ మాత్రం సంబంధం లేని ఉపా చట్టాన్ని, దేశ ద్రోహ చట్టాన్ని బనాయించారు.

ఉపా చట్టం అత్యంత హేయమైనది. పోలీసులకు విస్తృత అధికారాలు కల్పిస్తుంది. ఈ చట్టం కింద అరెస్టు అయితే బెయిల్ ఇవ్వడం సంవత్సరం వరకు కోర్టుల పరిధిలో కూడా లేకుండా పోతుంది. డిటెన్షన్ కు తగిన కారణాలు కూడా చూపనవసరం లేని అధికారాలు పోలీసులకు కల్పిస్తుంది ఈ చట్టం. ఇక సెడిషన్ చట్టం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. 2016 నుండీ అంటే బి‌జే‌పి కేంద్రంలో అధికారం చేపట్టినప్పటిన రెండేళ్ల నుండీ సెడిషన్ కింద నేరాలు మోపడం నిత్యకృత్యం అయింది. ద ఇండియన్ ఎక్స్^ప్రెస్ ఎడిటోరియల్ పైన చెప్పినట్లు సెడిషన్ నేరాల సంఖ్య అమాంతం పెరిగిపోయింది.

ప్రధాని, మంత్రులను విమర్శిస్తే దేశ ద్రోహం. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే దేశ ద్రోహం. ఆర్‌ఎస్‌ఎస్ ని విమర్శిస్తే దేశ ద్రోహం. బి‌జే‌పి రాజకీయాలను విమర్శిస్తే దేశ ద్రోహం. మతాన్ని విమర్శిస్తే దేశ ద్రోహం. సొంత రాజకీయ, మత, ఆర్ధిక అభిప్రాయాలను వ్యక్తం చేసినా బి‌జే‌పి-ఆర్‌ఎస్‌ఎస్ అభిప్రాయాలను విమర్శించినా దేశ ద్రోహమే. దేశంలో ప్రజాస్వామ్యం, సెక్యులరిజం అన్న భావాలకు, వ్యవస్ధాగత నిర్మాణానికి నిజమైన అర్ధం నిర్మూలించబడుతోంది. సరికొత్త అర్ధాలు, నిర్వచనాలను ప్రాధమిక తరగతుల నుండి పరిశోధనాంశాల వరకూ పాఠ్య పుస్తకాలలో నింపబడుతోంది. ఈ ప్రక్రియలను విమర్శించినా, వ్యతిరేకించినా దేశ ద్రోహమే.

ఇక భారత దేశంలో ముస్లింలు కావడం అతి పెద్ద దేశద్రోహంగా మారిపోయింది. ముస్లింలుగా మనడమే ప్రమాదంగా మారిపోయింది. అనేక చోట్ల ముఖ్యంగా ఉత్తర భారతంలో ముస్లిం వేష భాషలతో ఉనికిలో ఉండడం అత్యంత భయాందోళనలతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది. బంచ్ ఆఫ్ ధాట్స్ పుస్తకంలో లో ఆర్‌ఎస్‌ఎస్ గురువు నిర్దేశించినట్లుగా భారత దేశంలో ఉండదలుచుకుంటే హిందువులకు దాసులుగా వారు బతకాలన్న భావన దేశ భావజాలంలో కలిసిపోతోంది.

వారితో పాటు దళితుల హక్కులు మరింత చులకన అయిపోయాయి. భారత దేశంలో ముస్లింలు ఒకప్పటి హిందువులే అని ప్రస్తుత ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ అనేకమార్లు ప్రకటించినప్పటికీ విద్వేషం, ఆధిపత్య అహంకారం గూడుకట్టిన వర్గాలకు వినిపించడం లేదు. అణచివేత నుండి తప్పించుకునేందుకు దళితులు అనేకులు ముస్లిం మతంలోకి మారడం ఒక కఠిన వాస్తవం. వివేకా నంద నుండి అనేక హిందూ గురువులు, ఆచార్యులు, పండితులు పరమత సహనాన్ని, సోదర భావాన్ని ప్రభోదించినప్పటికీ అవేవీ ఎందుకు పని చేయవు? ఎందుకంటే మతము, రాజకీయాల మిశ్రమం ఒక విషపూరిత కాక్ టెయిల్. అది విరుగుడు కరువైన విషం. ఈ విషం ఎంతటి వ్యక్తినైనా విషపురుగుగా మార్చివేయగలదు. ఈ మిశ్రమానికి ఆర్ధిక ప్రయోజనాలు తోడైతే ఇక కాలకూట విషమే. ఈ కాలకూట విషయాన్ని గొంతులో బంధించేందుకు ఇప్పుడు పరమ శివులు ఎవరూ రారు. ప్రజలు, ముఖ్యంగా సామాన్య శ్రామిక ప్రజలే తగిన విరుగుడు కనిపెట్టి ప్రయోగించాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s