బ్రిటన్ పై ఇండియా ప్రతీకార చర్య


Covishield Jab

భారత దేశం బదులు తీర్చుకుంది. యూ‌కే నుండి వచ్చే యూ‌కే పౌరులు ఇండియాకు వస్తే గనక వారు తప్పనిసరిగా 10 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ లో ఉండే విధంగా నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు అక్టోబర్ 4 తేదీ నుండి అమలులోకి రానున్నాయి.

బ్రిటన్ పౌరులు వాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా, దేశంలోకి వచ్చిన తోడనే తప్పనిసరిగా 10 రోజుల క్వారంటైన్ లో ఉండడంతో పాటు మొదట ఆర్‌టి-పి‌సి‌ఆర్ పరీక్ష చేయించుకోవాలని ఇండియా నిర్దేశించింది. అలాగే వచ్చిన 8 వ రోజు మరోసారి ఆర్‌టి-పి‌సి‌ఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఇండియా రావడానికి 72 గంటల ముందు ఆర్‌టి-పి‌సి‌ఆర్ పరీక్ష చేయించుకుని ఉండాలి

ఉదాహరణకు బ్రిటన్ పౌరుడు నెల రోజుల పాటు ఉండేందుకు ఇండియా వచ్చాడనుకుందాం. విమానం దిగిన వెంటనే మొదట ఆర్‌టి-పి‌సి‌ఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ తర్వాత 10 రోజులు హోమ్ క్వారంటైన్ లో గడపాలి. క్వారంటైన్ లో ఉండగానే 8వ రోజు మళ్ళీ పరీక్ష చేయించుకోవాలి. 

ఒకవేళ 30 లో 10 రోజులు క్వారంటైన్ లో గడిపేస్తే మిగిలిన 20 రోజులు తన పనికి సరిపోని పరిస్ధితి ఉంటే 40 రోజుల పర్యటనకు ప్లాన్ చేసుకోవాలి. తద్వారా 10 రోజులు పోను తనకి కావలసిన 30 రోజులు తన పనికి మిగులుతాయి.

ఇండియాలో తయారయ్యే కోవిడ్ వ్యతిరేక కోవిషీల్డ్ వాక్సిన్ వేసుకున్న భారతీయులు బ్రిటన్ వస్తే వారిని వాక్సిన్ వేసుకోనివారుగా గుర్తించి తప్పనిసరి క్వారంటైన్ నిబంధనలు విధించే ప్రోటోకాల్ ను యూ‌కే ప్రకటించడమే ఈ భారత్ చర్యకు కారణం. యూ‌కే నిబంధనలు కూడా అక్టోబర్ 4 నుండే అమలులోకి వస్తాయి.

వివిధ దేశాల వ్యాక్సిన్లు గుర్తిస్తూ ఒక జాబితాను యూ‌కే కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. సదరు జాబితాలో ఉన్న వ్యాక్సిన్లు రెండు డోసులు వేసుకున్నవారు మాత్రమే ఎలాంటి షరతులు లేకుండా బ్రిటన్ లో ప్రవేశించవచ్చు. జాబితాలో ఉన్న వ్యాక్సిన్ వేసుకున్నట్లు సర్టిఫికేట్ చూపిస్తే దానిని ‘వ్యాక్సిన్ పాస్ పోర్ట్’ పరిగణిస్తూ ప్రవేశం అనుమతిస్తారు. ఇతరులు తప్పనిసరిగా 10 రోజుల క్వారంటైన్ లో గడపాలి.

కానీ ఈ జాబితాలో భారత దేశంలో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసి సరఫరా చేస్తున్న ‘కోవిషీల్డ్’ లేదు. అంటే కోవిషీల్డ్ వేసుకున్నప్పటికీ వ్యాక్సిన్ వేసుకోనివారుగా భారత ప్రజలను బ్రిటన్ పరిగణించి సంబంధిత ప్రయాణ నిబంధనలు అమలు చేస్తుంది.

బ్రిటన్ ప్రకటనతో ఇండియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇది రెసిజంతో సమానమని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. నిజానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎవరిదో కాదు. బ్రిటన్-స్వీడన్ దేశాల బహుళజాతి ఫార్మా కంపెనీ తయారు చేసిన ఆక్స్^ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కు ప్రతిరూపమే. ఆక్స్^ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కంపెనీ నుండి లైసెన్స్ తీసుకుని భారత కంపెనీ ఎస్‌ఐ‌ఐ కోవిషీల్డ్ పేరుతో ఇండియాలో ఉత్పత్తి చేస్తున్నది.

అయినప్పటికీ విచిత్రంగా కోవిషీల్ట్ ని గుర్తించేందుకు బ్రిటన్ కు చెందిన “ఔషధాలు మరియు ఆరోగ్య సంరక్షణ నియంత్రణ సంస్ధ” (MHRA) కోవి షీల్డ్ ను గుర్తించేందుకు నిరాకరించింది. డిపార్ట్^మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్ (ఆరోగ్య మరియు సామాజిక సంరక్షణ విభాగం) అందుకు సాంకేతిక అంశాలను కారణంగా చూపుతోంది.

ఇంకా చెప్పాలంటే భారత కంపెనీ ఎస్‌ఐ‌ఐ (సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా) కోవి షీల్డ్ వ్యాక్సిన్ ను ఆరంభంలో 50 లక్షల డోసులు యూ‌కే కు పంపించింది. సదరు డోసులను యూ‌కే శుభ్రంగా తన పౌరులకు వేసింది కూడాను. 

భారత దేశం బ్రిటన్ జాబితాకు తీవ్ర అభ్యంతరం తెలిపింది. ప్రతీకార చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. విదేశీ మంత్రి జయ శంకర్ ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేయడమే కాక బ్రిటన్ విదేశీ మంత్రితో చర్చలు జరిపారు. కొన్ని రోజుల పాటు మల్లగుల్లాలు పడిన బ్రిటన్ మరో అభాస కు తెరతీసింది.

ఈసారి కోవిషీల్డ్ ను ఆధారపడ్డదగ్గ వ్యాక్సిన్ జాబితాలో చేర్చింది. అయితే కోవిషీల్డ్ రెండు డోసులు వేసుకున్నట్లు భారత ప్రయాణీకులకు భారత ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్ లను మాత్రం గుర్తించేది లేదని ప్రకటించింది. అంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని గుర్తిస్తుంది గాని ఇండియా ఆ వ్యాక్సిన్ ని వేయడాన్ని మాత్రం గుర్తించదన్నమాట!

ఈ మెలిక ఏమిటో బొత్తిగా అర్ధం కాలేదు. ఇండియన్ ఎక్స్^ప్రెస్ పత్రిక సెప్టెంబర్ 22 తేదీన (అప్పటికి ఇంకా బ్రిటన్ జాబితాలో కోవిషీల్డ్ చేరలేదు) రాసిన ఎడిటోరియల్, ‘తప్పుడు సమాచారం’ వల్ల MHRA ఈ విధంగా కోవిషీల్డ్ గుర్తింపుకు నిరాకరిస్తున్నదనీ దాన్ని సవరించుకోవాలనీ రాసింది. ఆ తప్పుడు సమాచారం ఏమిటన్నదీ పత్రిక చెప్పలేదు. విదేశీ మంత్రి దౌత్య ప్రయత్నాలు చేసి సరైన సమాచారం MHRA కు అందజేస్తే సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొంది.

కానీ దౌత్య ప్రయత్నాలు కేవలం కోవిషీల్డ్ వ్యాక్సిన్ గుర్తింపు వరకు పనిచేశాయి గానీ కోవిషీల్డ్ వేసినట్లు ఇండియా ఇచ్చే సర్టిఫికేట్ ను గుర్తించడానికి మాత్రం పని చేయలేదు. ఫలితంగా ఈ రోజు ఇండియా ప్రతీకార చర్యలు ప్రకటించింది.

ఇంతకీ బ్రిటన్ ఆరోగ్య విభాగం పేర్కొన్న సాంకేతిక కారణాలు ఏమై ఉంటాయి? గతంలో బ్రెజిల్ లాంటి దేశాలతో పాటు కొన్ని ఇతర పశ్చిమ దేశాల ఆరోగ్య సంస్ధలు చెప్పిన అభ్యంతరాలను ఈ సందర్భంగా స్ఫురణకు తెచ్చుకోవచ్చు.

ఇండియాలో వ్యాక్సిన్ ల తయారీ ప్రపంచ స్ధాయి వ్యాక్సిన్ తయారీ ప్రమాణాలకు అనుగుణంగా లేవని సదరు సంస్ధలు గతంలో అభ్యంతరం చెప్పాయి. వ్యాక్సిన్ తయారీ ఫ్యాక్టరీ పరిసరాలు శుభ్రంగా లేవనీ, వ్యాక్సిన్ నిల్వ సౌకర్యాలు ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా లేవనీ కారణాలు చెప్పారన్న వార్తలు వెలువడ్డాయి. రష్యా తయారు చేసిన స్పుత్నిక్-V వ్యాక్సిన్ ని కూడా ఇవే కారణాలు చెప్పి గుర్తించేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిరాకరించింది.

మొదట్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న ప్రయాణీకులను అనుమతించని ఐరోపా దేశాలలో 17 దేశాలు ఇప్పుడు తమ నిర్ణయాన్ని సవరించుకున్నాయి. కోవిషీల్డ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేశాయి. కానీ యూ‌కే మాత్రం కోవిషీల్డ్ వ్యాక్సిన్ కీ, కోవిషీల్డ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ కీ మధ్య తేడా చూపిస్తూ విచిత్రంగా వ్యవహరిస్తోంది.

భారత ప్రతీకార చర్యతో యూ‌కే దిగివస్తుందా లేదా అన్నది చూడాలి. కాగా బ్రిటన్ లాంటి పశ్చిమ దేశంపై భారత్ ప్రతీకార చర్యకు దిగడం బట్టి, బహుళ ధృవ ప్రపంచంలో భారత పాలకులకు బేరసారాల శక్తి పెరిగిన సంగతిని తెలియజేస్తున్నది.

One thought on “బ్రిటన్ పై ఇండియా ప్రతీకార చర్య

  1. పింగ్‌బ్యాక్: దిగొచ్చిన యూ‌కే, ఇండియాపై కోవిడ్ ఆంక్షలు తొలగింపు | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s