అమెరికా ప్రతీకారం: కరెన్సీ సమస్యతో అల్లాడుతున్న ఆఫ్ఘన్ ప్రజలు


Currency dealer

తాలిబాన్ పాలనపై అమెరికా పాల్పడుతున్న ప్రతీకార చర్యలు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను తీవ్ర సంక్షోభం లోకి నెట్టివేస్తున్నాయి. పశ్చిమ దేశాల నుండి ఇప్పటిదాకా అందుతూ వచ్చిన సహాయాన్ని నిలిపివేయడంతో పాటు ఆఫ్ఘన్ దేశానికి చెందిన సెంట్రల్ రిజర్వ్ బ్యాంకు రిజర్వు నిధులను కూడా అందకుండా నిషేధం విధించడంతో ఉన్నత స్ధాయీ ప్రభుత్వాధికారుల నుండి అత్యంత కడపటి పౌరుడు సైతం తిండికి, ఇతర కనీస సౌకర్యాలకు కటకటలాడుతున్నారు.

తాలిబాన్ డబ్బు సమస్య ప్రధానంగా అమెరికా ట్రెజరీ విభాగం స్తంభింపజేసిన ఆఫ్ఘన్ రిజర్వ్ నిధుల వల్ల ఉత్పన్నం అయింది. అమెరికా కార్పొరేట్ ద్రవ్య సంస్ధలలో (ఇన్వెస్ట్^మెంట్ బ్యాంకులు, డెట్ ఫండ్ లు, ట్రెజరీ బాండ్లు మొ.వి) ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంకుకు చెందిన 9.5 బిలియన్ అమెరికన్ డాలర్లు పడి మూలుగుతున్నాయి. న్యూయార్క్ లోని ఫెడరల్ రిజర్వ్ లో కూడా ఈ నిధులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నిధులు ఆఫ్ఘన్ ప్రభుత్వానికి తద్వారా ఆఫ్ఘన్ ప్రజలకు ఎప్పటికీ అందుతాయో ఎవరికీ అంతుబట్టడం లేదు. అమెరికా ఇంతవరకూ ఆ విషయాన్నే ప్రస్తావించలేదు. అమెరికా టెర్రరిజం సంబంధిత షరతుల జాబితాలో నుండి తాలిబాన్ నేతలను తప్పించేవరకూ నిధులపై స్తంభన ఎత్తివేస్తారా లేదా అన్న సంగతి కూడా ఎవరూ చెప్పడం లేదు. దేశానికి చెందిన మొత్తం అంతర్జాతీయ రిజర్వులలో 0.1% నుండి 0.2% వరకు మాత్రమే తాలిబాన్ ప్రభుత్వానికి అందుబాటులో ఉందని Da Afghan Bank మాజీ గవర్నర్ (ఇప్పుడీయన ప్రవాసంలో ఉన్నాడు) అజ్మల్ అహ్మది చెప్పినట్లు ఆసియా టైమ్స్ వెల్లడించింది.

అమెరికాతో పాటు అంతర్జాతీయ సంస్ధలు కూడా ఆఫ్ఘన్ సొమ్మును స్తంభింపజేశాయి. ఐ‌ఎం‌ఎఫ్ లో ఆఫ్ఘనిస్తాన్ కు ఎస్‌డి‌ఆర్ (స్పెషల్ డ్రాయింగ్ రైట్స్) నిధులు $460 మిలియన్లు ఉన్నాయి. స్విట్జర్లాండ్ లోని బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ లో ఆఫ్ఘన్ సొమ్ము $700 మిలియన్ల వరకూ ఉన్నది. ఈ నిధులను కూడా ఆయా సంస్ధలు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి అందకుండా స్తంభింపజేశాయి. ఈ చర్యకు తాలిబాన్ కు వ్యతిరేకంగా చేపట్టినవిగా అనుకున్నప్పటికీ అంతిమంగా బలవుతున్నది మాత్రం ఆఫ్ఘన్ ప్రజలే. ద్రవ్య స్ధంభనతో ఆఫ్ఘన్ కరెన్సీ (ఆఫ్ఘనీ) విలువ వేగంగా పడిపోతోంది. ఆహార ధరలు పెరిగి ద్రవ్యోల్బణం జడలు విప్పింది.

ప్రపంచ బ్యాంకు ప్రతినిధి ప్రకారం తాలిబాన్ అధికారానికి ముందు ఆఫ్ఘనిస్ధాన్ అవసరాల్లో 75 శాతం అంతర్జాతీయ సహాయ నిధి గ్రాంట్ల ద్వారానే తీరుతూ వచ్చింది. విదేశీ జమలు ఆఫ్ఘన్ ఆర్ధిక వ్యవస్ధలో 4% వరకూ ఉండేవి. ఇవి ప్రధానంగా ఇస్తాంబుల్ (టర్కీ), లండన్, దోహా (కతార్) ల నుండి అందేవి. మనీగ్రామ్, వెస్ట్రన్ యూనియన్ లాంటి డబ్బు బదిలీ సేవల (Cash Transfer Services) సంస్ధల ద్వారా అందేవి. కానీ ఈ రెండూ అమెరికా కంపెనీలే కావడాన వాటిని కూడా అమెరికా ఆఫ్ఘనిస్ధాన్ కు అందుబాటులో లేకుండా మూసేసింది.

హవాలా మార్గంలో నిధులు తెప్పించుకోవాలన్నా దేశంలో వాస్తవ కరెన్సీ నిల్వలు పడిపోవటాన ఆ మార్గం ఇరుకై పోయింది. హవాలా రూట్ లో డబ్బు అందాలంటే ముందు డబ్బు అందుకునే వారి దేశంలో కరెన్సీ అందుబాటులో ఉండాలి. అప్పుడే సంబంధిత విలువ కరెన్సీ రూపంలో ముడుతుంది. గ్రామీణ ఆఫ్ఘన్ ప్రజలకు ఇటీవలి వరకూ హవాలా రూట్ లోనే ప్రధానంగా డబ్బు బదిలీ జరిగేది. అమెరికా అమలు చేస్తున్న దిగ్బంధనం పుణ్యాన గ్రామీణ ప్రజల పరిస్ధితి దుర్భరంగా మారింది. కేవలం 5 శాతం ఆఫ్ఘన్ కుటుంబాలకు మాత్రమే ఇప్పుడు ఆహారం అందుబాటులో ఉన్నదని ఐరాస వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం చెప్పడం బట్టి పరిస్ధితి ఎంత దుర్భరంగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.

ఇక బ్యాంకుల సంగతి సరేసరి. కూలిపోయేందుకు అవి సిద్ధంగా ఉన్నాయి. సెప్టెంబరు మధ్య నాటికే బ్యాంకుల్లో డాలర్లు నిండుకున్నాయి (రాయిటర్స్, సెప్టెంబర్ 15, 2021). నిధులు ఇస్తే తప్ప తాము తలుపులు మూసుకోవడమే అని బ్యాంకులు తాలిబాన్ కు మొరపెట్టుకున్నాయి. వారానికి $200 మాత్రమే విత్ డ్రా చేసుకోవచ్చని ఇప్పటికే కస్టమర్లపై అవి నిబంధన విధించాయి.

తాలిబాన్ ప్రభుత్వ పెద్దలు మాత్రం బ్యాంకుల్లో డబ్బు ఉందని చెబుతున్నాయి. మాజీ అధికారుల నుండి సీజ్ చేసిన బంగారం దిమ్మలు, డాలర్ల కట్టల ఫోటోలు విడుదల చేయడం ద్వారా ప్రజలకు హామీ ఇచ్చారు. తద్వారా డబ్బు కోసం బ్యాంకుల వద్ద తొక్కిడి లేకుండా నివారించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ హామీలు పెద్దగా పని చేయడం లేదు.

ఆఫ్ఘన్ ఆర్ధిక పరిస్ధితిని పర్యవేక్షిస్తున్న అంతర్జాతీయ సంస్ధల అధికారులు దేశంలో లిక్విడిటీ సంక్షోభం నెలకొన్నదని స్పష్టం చేస్తున్నారు. ఈ సంక్షోభం వలన సప్లై చెయిన్ లు నిలిచిపోయి సరుకులు, డబ్బు కదలిక స్తంభించిందనీ, అనేక వ్యాపారాలు, ట్రేడర్లు, సరఫరాదారులు అంతర్జాతీయ చెల్లింపులు చేయలేకపోతున్నారనీ ఫలితంగా సరుకుల దిగుమతి ఆగిపోయిందని ప్రకటించారు. ఎన్‌జి‌ఓ లు కూడా తమ సిబ్బందికి వేతనం చెల్లించలేకపోతున్నారని వెల్లడించారు.

నిజానికి గత ప్రభుత్వం పడిపోయే సమయానికి సెంట్రల్ బ్యాంకులో డాలర్లు తక్కువగా ఉన్నాయని తెలిసి బ్యాంకులు షాక్ తిన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే కేంద్ర బ్యాంకు వద్ద తగిన నిల్వలు ఉన్నాయని అప్పటివరకూ బ్యాంకులు గట్టి నమ్మకంతో ఉన్నాయి. దీన్ని బట్టి గత అధ్యక్ష్డు అష్రాఫ్ గాని పెద్ద మొత్తంలో డాలర్లు, బంగారంతో పారిపోయిన మాట నిజమేనని భావించవలసి వస్తోంది. అష్రాఫ్ ఘనీ నాలుగు కార్లు, ఒక హెలికాప్టర్ ల నిండా డబ్బు, బంగారంతో పారిపోయాడని కాబూల్ లోని రష్యా రాయబారి ధృవీకరించడం గమనార్హం. ఇంకా ఖాళీ లేక పారిపోయే తొందరలో కొంత డబ్బు అక్కడే పెట్టి పోయాడని ఆయన చెప్పినట్లు రష్యన్ వార్తా సంస్ధ ఆర్‌ఐ‌ఏ తెలిపింది. ఈ వార్తలని ఘనీ ఖండించడం వేరే సంగతి.

ఐరాస ప్రస్తుతానికి 1 బిలియన్ డాలర్ల సాయం అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇది ప్రభుత్వానికి కాకుండా ఎన్‌జి‌ఓ ల ద్వారా అందజేయనున్నట్లు తెలిపింది. ఎవరి ద్వారా అందజేసినా అది ఆఫ్ఘన్ ప్రజలకు చేరడమే ఇప్పుడు కావలసింది. ఎన్‌జి‌ఓ ల పేరుతో మధ్యవర్తులు, సంపన్న తాబేదారులు దారిమళ్ళించకుంటే మేలు.

Checking at Af-Pak border

కాగా ఆఫ్ఘన్ సంక్షోభం ప్రభావం పాకిస్తాన్ పైనా పడుతున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు గుండా పాకిస్తాన్ కరెన్సీ ఆఫ్ఘనిస్ధాన్ కు ఆఫ్ఘన్ ప్రజలు తీసుకెళ్తుండడంతో పాకిస్తాన్ లో కరెన్సీ కొరత ఏర్పడుతోందని, విలువ క్షీణిస్తున్నదనీ కొన్ని పత్రికలు తెలిపాయి. దానితో ఆఫ్-పాక్ సరిహద్దులో గట్టి చెకింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.

One thought on “అమెరికా ప్రతీకారం: కరెన్సీ సమస్యతో అల్లాడుతున్న ఆఫ్ఘన్ ప్రజలు

  1. ప్రధాన వర్తాస్రవంతి తాలిబన్ల దుశ్చర్యలను ప్రధానంగా చూపిస్తుంటే, అక్కడి ప్రజలు ఆమెరికా దురాగతాల వలన పడుతున్న ఇబ్బందులను గురించి మీలాంటి వారు తెలియజేయడం మీ పాఠకులకు ఆనందాన్ని ఇస్తుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s