ఆకస్: సుదృఢం అవుతున్న బహుళ ధృవ ప్రపంచం! -3


 

 

నాటోకు కాల దోషం?

అప్పటికే ఆఫ్ఘనిస్తాన్ సైనిక ఉపసంహరణ విషయమై నాటో కూటమి లోని ఈ‌యూ సభ్య దేశాలు అసంతృప్తిగా ఉన్నాయి. నాటో కూటమితో సంప్రదించకుండా, ఈ‌యూతో ఏకీభావం సాధించకుండా ఆఫ్ఘన్ నుండి సైనిక బలగాలను ఆగస్టు 31 లోపు ఉపసంహరిస్తున్నామని బైడెన్ ఏకపక్షంగా ప్రకటించడం ఈ‌యూ దేశాలకు గాని నాటో కూటమికి గానీ మింగుడు పడలేదు. అత్యంత పెద్దదయిన నాటో ‘ఉమ్మడి’ మిలట్రీ స్ధావరం అయిన బాగ్రం వైమానికి స్ధావరాన్ని జులైలో ఖాళీ చేసేప్పుడు కూడా అమెరికా సమాచారం పంచుకోలేదు.

అంత అర్జెంటుగా బలగాల ఉపసంహరణకు ప్రేరేపించిన సమాచారం లేదా పరిణామం ఏమై ఉంటుందని ఇతర నాటో దేశాలూ, వారి ఇంటలిజెన్స్ సంస్ధలూ జుట్టు పీక్కున్నారు. అమెరికా ఇంటలిజెన్స్ సంస్ధలు అతి ముఖ్యమైన సమాచారం ఇస్తే తప్ప అమెరికా ఇంత తొందరపడదని అవి భావిస్తున్నట్లు సమాచారం. ఆ సమాచారాన్ని తమతో పంచుకోకపోవడం పుండు మీద కారం రాసినట్లయింది.

అమెరికా పౌరులను, తాలిబాన్ వల్ల అపాయం ఉన్న ఆఫ్ఘన్ పౌరులను (20 యేళ్ళ పాటు అమెరికాకు ఇళ్ళల్లో, ఆఫీసుల్లో, మిలట్రీ స్ధావరాల్లో, సెక్యూరిటీ విభాగంలో వివిధ సేవలు అందజేసిన ఆఫ్ఘన్లు) మొదట ఖాళీ చేయించి ఆ తర్వాత సైనికుల ఉపసంహరణ ప్రకటించడం చేయవలసి ఉండగా ఎవరికీ సమాచారం లేకుండా ఆఫ్ఘన్ నుండి దాదాపు పారిపోయినంత పరిస్ధితికి అమెరికా దిగజారడమే కాకుండా ఇతర నాటో రాజ్యాలకు కూడా ఆ పరిస్ధితి కల్పించడం ఈ‌యూకి బొత్తిగా మింగుడు పడలేదు.

అప్పటికీ ఉపసంహరణకు తగిన గడువు కావాలని ఆగస్టు 31 గడువు పొడిగించాలనీ బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ అమెరికాను అభ్యర్ధించాడు. కానీ తాలిబాన్ ససేమిరా అనడంతో యుద్ధ సామాగ్రి (ట్యాంకులు, హెలికాప్టర్లు మొ.వి) ఎక్కడివక్కడ వదిలేసి పారిపోయారు. ఈ పరిస్ధితి అమెరికా పట్ల ఈ‌యూ కూ, ఇతర నాటో దేశాలకూ ఉన్న నమ్మకం, భయం, గౌరవం (ఏమన్నా ఉంటే) అన్నీ అమాంతం పడిపోవడానికి కారణం అయింది.

అమెరికా దృష్టిలో యూరోపియన్ యూనియన్ తో పాటు నాటో కూటమి కూడా ప్రాసంగికత (relevance) కోల్పోతున్నాయని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నార్డ్ స్ట్రీమ్ ను ఇటీవలి వరకూ తీవ్రంగా వ్యతిరేకించిన అమెరికా చివరికి ఉక్రెయిన్ కి నష్టపరిహారం ఇచ్చే విధంగా జర్మనీని ఒప్పించి రష్యన్ గ్యాస్ సరఫరాకు ఓ‌కే చెప్పడం కూడా గమనార్హమైన పరిణామం. (అంతకు ముందు ఉక్రెయిన్ గుండా వెళ్ళే పైప్ లైన్ ద్వారా రష్యన్ గ్యాస్ సరఫరా జరిగేది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉక్రెయిన్ కు అద్దె ముట్టేది.)

అమెరికా కేంద్రీకరణ ఐరోపా నుండి ఆసియా, పసిఫిక్ ప్రాంతాలకు నిర్ణయాత్మకంగా తరలిపోయిందని పశ్చిమ రాజ్యాల విశ్లేషకులు కూడా ధృవీకరిస్తున్నారు. ఈ కారణం వల్లనే నార్డ్ స్ట్రీం పై విధించిన నిబంధనలను ఎత్తివేయడం, ఆఫ్ఘన్ ఉపసంహరణ లాంటి ముఖ్యమైన అంశాల్లో కూడా ఇతర నాటో దేశాలతో సమన్వయం చేసుకునే బాధ్యతను విస్మరించడం జరిగిందని వారు విశ్లేషిస్తున్నారు. కమ్యూనిస్టు విప్లవ సంస్ధలు ఈ పరిణామాన్ని (అమెరికా కేంద్రీకరణ లేదా ప్రపంచ ఘర్షణల/యుద్ధ కేంద్రం ఐరోపా నుండి ఆసియాకు మారుతున్న పరిణామం) దశాబ్దం క్రితమే అంచనా వేసిన సంగతి ఈ సందర్భంగా చెప్పుకోదగినది.

అకస్మాత్తుగా జరిగిన ఆఫ్ఘన్ ఉపసంహరణ 20 యేళ్ళ పాటు నాటో చేసిన ఆఫ్ఘన్ యుద్ధం తాలూకు ప్రతిష్టను పశ్చిమ దేశాల ప్రజల్లోనూ, పశ్చిమ రాజ్యాల అభిమానుల్లోనూ క్షీణింప జేయగా నూతనంగా ఏర్పడ్డ ఆకస్ కూటమి అమెరికాకు ఐరోపాను మరింత అక్కరలేనిదిగా మార్చనుంది.

అమెరికాతో సంబంధం లేకుండా ఐరోపా దేశాలు స్వతంత్రంగా భద్రతా వ్యవస్ధను నిర్మించుకోవాలని ఫ్రాన్స్ కొద్ది యేళ్లుగా ప్రతిపాదిస్తున్నది. ఆఫ్ఘన్ ఉపసంహరణ, నార్డ్ స్ట్రీం, ఆకస్ తదితర పరిణామాలు “వ్యూహాత్మక ఐరోపా స్వతంత్ర ప్రతిపత్తి” ఆలోచనను సాకారం చేసుకునేందుకు దోహదం చేస్తున్నాయి. అలాగే అమెరికా వైపు నుండి చూసినా తన విధానాలు ప్రపంచ పరిస్ధితులకు అనుగుణంగా మార్చుకోవాలని భావించడం సహజం. తన సొంతం అని అమెరికా భావిస్తున్న ఆధిపత్యం కొనసాగాలంటే,  చైనాతో పెరుగుతున్న పోటీ, వైరంల రీత్యా, తన యుద్ధ, దౌత్య, రాజకీయ, ఆర్ధిక వనరులను తూర్పు ఆసియా, ఇండో-పసిఫిక్ ప్రాంతాలలో కేంద్రీకరించాలి. కనుక ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో చేసినట్లుగా యూరోపియన్ అవసరాలను తీర్చడం తనకు సాధ్యం కాదని అమెరికా భావిస్తోంది. అప్పటివలే పశ్చిమ దిశగా సోవియట్ రష్యా విస్తరిస్తున్న భయం ఇప్పుడు లేదు. కాగా ఇరు చోట్లా తన వనరులను పంచగల ఆర్ధిక శక్తి అమెరికాకు ఇప్పుడు లేదు. ఈ పరిస్ధితికి అనుగుణంగానే జో బైడెన్ ప్రభుత్వం అమెరికా విధానాలను సంబంధాలను పునర్నిర్వచిస్తోంది.

ఈ పునర్నిర్వచనంలో ఐరోపాకు స్ధానం లేదు. నిజానికి ఫ్రాన్స్-ఆస్ట్రేలియాల భారీ సబ్-మెరైన్ సరఫరా ఒప్పందం కేవలం వాణిజ్యపరమైనదే కాదు. భౌగోళిక-రాజకీయ ప్రయోజనాల రీత్యా కూడా పసిఫిక్, హిందూ మహా సముద్రాలలో ఫ్రాన్స్ మిలట్రీ శక్తి మరింత పరిపుష్టం చేయడానికి కూడా ఇది దోహదం చేస్తుందని ఫ్రాన్స్ ఆశించింది. 2016 లో ఫ్రాన్స్-ఆస్ట్రేలియాల మధ్య కుదిరిన “ఫ్రాన్స్-ఆస్ట్రేలియా ఇండో-పసిఫిక్ భద్రతా భాగస్వామ్య ఒప్పందం” లో భాగంగానే సబ్ మెరైన్ సరఫరాకు ఫ్రాన్స్ అంగీకరించింది. చైనా తన మిలట్రీ స్ధావరాలు నెలకొల్పాలని భావిస్తున్న మూడు ద్వీపదేశాలకు సమీపంలోనే ఫ్రెంచి నియంత్రిస్తున్న ద్వీపాలు ఉన్నాయి. ఉదాహరణకి న్యూ కెలడోనియా ద్వీపంలో ఫ్రెంచి మిలట్రీ స్ధావరం ఉన్నది. ఇక్కడ నికెల్ లోహం దండిగా లభిస్తుంది. ఫ్రెంచి పాలినేసియా (తహితి) లో అణు పరీక్షలు జరుపుతుంది. వాలిస్, ఫుటూనా ద్వీపాలు వ్యూహాత్మకంగా కీలక స్ధానంలో ఉన్నాయి. కనుక ఫ్రాన్స్ కు జరిగిన నష్టం తక్కువ కాదు. ఫ్రాన్స్ భవిష్యత్ వ్యూహంలో ఒక ముఖ్య భాగానికి హఠాత్తుగా పునాది లేకుండా పోయింది.

అమెరికా లెక్క ప్రకారం చైనాను ఎదుర్కొనేందుకు ఈ‌యూ నమ్మదగిన భాగస్వామి కాదు. అమెరికాకు అలాంటి అనుభవాలనే ఈ‌యూ రుచి చూపింది. అమెరికా వారిస్తున్నా వినకుండా ప్రపంచ బ్యాంకుకు పోటీగా 2015లో చైనా ప్రారంభించిన ఆసియా ఇన్ఫ్రా^స్ట్రక్చర్ ఇన్వెస్ట్^మెంట్ బ్యాంక్ లో సభ్యులుగా చేరేందుకు ఈ‌యూ దేశాలు క్యూ కట్టాయి. గత సంవత్సరమే (డిసెంబర్ 2020) అమెరికా అభ్యంతరాలను పక్కన పెట్టి చైనాతో ‘సమగ్ర పెట్టుబడి ఒప్పందం’ (CAI – Comprehensive Agreement on Investment) ఈ‌యూ కుదుర్చుకుంది. ఈ‌యూ సభ్య దేశాలతో చైనాకు విడివిడిగా ఉన్న 25 ఒప్పందాలకు బదులు ఈ‌యూ మొత్తానికి ఈ ఒప్పందం వర్తిస్తుంది. చైనాలో ఆరోగ్య, ద్రవ్య (ఫైనాన్స్) సేవలు, విద్యుత్ వాహనాల రంగాలలో ఈ‌యూకు దీని ద్వారా ప్రవేశం లభిస్తుంది. అమెరికా ఈ‌యూలు తలపెట్టిన ట్రాన్సట్లాంటిక్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్^మెంట్ పార్టనర్షిప్ (TTIP)’ ఒప్పందాన్ని సి‌ఏ‌ఐ పూర్వపక్షం చేస్తుంది. కనుక అమెరికాకు ఈ ఒప్పందం ఇష్టం ఉండదు. ఐనా ఈ‌యూ లెక్క చేయలేదు. AIIB, CAI లకు ఆకస్ ద్వారా అమెరికా బదులు తీర్చుకున్నట్లయింది. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఈ పోటీలో నాటో ఉనికి ప్రశ్నార్ధకం కావడం.

మారుతున్న పరిస్ధితికి అనుగుణంగా చైనాతో పోటీకి సై అనగల నమ్మకమైన మిత్రులు అమెరికాకి కావాలి. పశ్చిమ, తూర్పు ఐరోపా దేశాల నుండి, ఆగ్నేయాసియా, ఇండియాల వరకు వివిధ చర్యలు, చర్చలు, దౌత్య-వాణిజ్య ఒప్పందాల ద్వారా అది వెతుకులాట సాగించింది. మరోవైపు అమెరికాకు అతీతంగా తన ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి ఈ‌యూకు అవసరం తరుముకొచ్చింది. దీనర్ధం చైనాతో సమస్యలు లేవని ఈ‌యూ భావిస్తున్నట్లు కాదు. లేదా అమెరికాకు వ్యతిరేకంగా చైనాతో జట్టు కట్టేందుకు ఈ‌యూ సిద్ధపడుతున్నట్లు కాదు. అమెరికాతో పాటుగా ఆర్ధిక-వాణిజ్య రంగంలో చైనాతో ఈ‌యూ క్కూడా అనేక సమస్యలున్నాయి. వివిధ ప్రాంతాల్లో జర్మనీ, ఫ్రాన్స్ ఇతర ధనిక ఈ‌యూ దేశాల ల మార్కెట్లను సైతం చైనా కబళిస్తున్న పరిస్ధితి ఉన్నది. అయితే ఘర్షణలకు, ఉద్రిక్తతలకు, మిలట్రీ పోటీతో మార్కెట్ సంరక్షణకు పూనుకునేందుకు ఈ‌యూ సుముఖంగా లేదు.”చైనా ప్రధాన సవాలు ఏమీ కాదు” అని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అనేకసార్లు ప్రకటించింది. చైనాను వ్యతిరేకించవలసిన అవసరం నాటో కు లేదు అని కూడా ఆమె వ్యాఖ్యానించింది. ఈ‌యూ ఇటీవల ప్రకటించిన “ఇండో-పసిఫిక్ వ్యూహాత్మక పత్రం” కూడా ఈ విషయాన్నే చెప్పింది.

ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న పరిస్ధితులు ముఖ్యంగా నాటోలో నెలకొన్న సంక్షోభం నిజానికి గత కొన్నేళ్లుగా అమెరికా, ఈ‌యూ లు తమ తమ వ్యూహాలలో, సంబంధాలలో చేస్తూ వచ్చిన మార్పుల తాలూకు ప్రతిబింబం మాత్రమే. వారి వారి ప్రయోజనాల రీత్యా చైనాతో గల సంబంధాలలో అమెరికా-ఈ‌యూ మధ్య పొత్తు కుదరని పరిస్ధితి స్వాభావికంగానే దాగి ఉన్నది. ప్రపంచాధిపత్య పోటీ ప్రధానంగా ఆసియా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నెలకొన్నందున ఆ ప్రాంతం నుండే నాటో సంక్షోభం, ఈ‌యూ-అమెరికాల సంబంధాల సంక్షోభం బద్దలు కావడం ఊహాతీతం కాదు.

ఈ పరిణామాల పర్యవసానంగా నాటో కూటమి రద్దవుతుందని, విచ్ఛిన్నం అవుతుందని భావించ వలసిన పని లేదు. పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నట్లుగా చైనాకు వ్యతిరేకంగా నాటో పోషించవలసిన పాత్ర ఏమీ లేదన్నది సుస్పష్టం. కనుక నాటో ప్రాసంగికత కొనసాగింపుకు తగిన వనరులను సరఫరా చేయవలసిన అవసరం అమెరికాకు లేదు. ఐరోపాలో కొంత భాగంగా ఉన్న రష్యా విషయంలో నాటోకు ఎంతో కొంత పాత్ర ఉందన్న విషయంలో ఈ‌యూకు విభేదం లేదు. కానీ అమెరికా పోటీ పడుతున్నది రష్యాతో కాదు, చైనాతో. రష్యాతో అమెరికా వైరం కొనసాగుతున్నప్పటికీ అది ప్రచ్ఛన్న యుద్ధం స్ధాయిలో లేదని గ్రహించాలి. నార్డ్ స్ట్రీమ్ నేపధ్యంలో ఈ‌యూ-రష్యా బంధం క్రమంగా మెరుగై దృఢమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదే జరిగితే అమెరికా-ఈ‌యూల మైత్రికి పూర్తిగా కాలం చెల్లినట్లే.

క్రమంగా అమెరికా, ఈ‌యూలు ఎవరికి వారు తమ స్వంత అభివృద్ధి పంధాలను ఏర్పరుచుకునే అవకాశం ఎంతో దూరంలో లేదు. మరో మాటలో చెప్పాలంటే బహుళ ధృవ ప్రపంచం దృఢం అయ్యేందుకు కావలసిన పరిస్ధితులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రపంచ భౌగోళిక-రాజకీయ వ్యవస్ధ పొందికలో ఐక్యత-ఘర్షణల స్వభావంలో మార్పు వచ్చే అవకాశం మెండుగా ఉన్నది.

ఇండియా పరిస్ధితి?

ఆకస్ ఆవిర్భావ ప్రకటనతో ఇండియా పరిస్ధితి ఏమిటన్న ప్రశ్న ఉదయించింది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా దేశాలు క్వాడ్ కూటమిలో సభ్యులు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు ప్రత్యామ్నాయ శక్తిగా ఇండియా ఆవిర్భవించాలని అమెరికా దశాబ్ద కాలంగా కోరుతున్న సంగతి తెలిసిందే. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని గత జనవరి (2021)లో అరమరికలు లేకుండా ప్రకటించాడు. “శక్తివంతమైన ఇండియా చైనాకు పోటీ శక్తి కాగలదు. కనుక న్యూ ఢిల్లీ ఈ ప్రాంతంలో (ఇండో-పసిఫిక్) ఇండియా “నాయకత్వ పాత్ర” పోషించాలి” అని ఆయన అన్నాడు. ఆకస్ ఏర్పాటుతో క్వాడ్ ను అమెరికా వెనక్కి నెట్టివేసిందని, ఇండియా జపాన్ లకు ప్రాధాన్యత ఇక లేదని ఇండియా, జపాన్ లు మౌనంగా ఆక్రోశిస్తున్నట్లు వ్యాఖ్యానాలు వెలువడ్డాయి.

అయితే సైనిక పాత్ర పోషించడానికి ఇండియా బహిరంగంగా నిరాకరిస్తూ వస్తోంది. అసలు క్వాడ్ అన్నది సైనిక కూటమి కాదు అని భారత విదేశీ మంత్రి జై శంకర్ అనేకసార్లు నొక్కి చెప్పాడు. తైవాన్-చైనా ఘర్షణలో, ఆ మాటకొస్తే దక్షిణ చైనా సముద్రంలోనైనా అమెరికా తరపున తమ మిలట్రీకి పాత్ర కల్పించేది లేదని భారత పాలకులు ప్రకటించారు. అంతేకాక ఇండియా క్వాడ్ తో పాటు చైనా, రష్యాల నేతృత్వం లోని ఎస్‌సి‌ఓ (షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్), BRICS కూటములలోనూ ఇండియా సభ్యురాలు కనుక ఆకస్ ఏర్పాటుతో తమ ప్రాధాన్యత తగ్గినట్లు కాదని భారత విశ్లేషకులు నచ్చజెపుతున్నారు.

భారత పాలకులు క్వాడ్ పాత్రపై ఎన్ని భాష్యాలు చెప్పుకున్నా ఇండియాను చైనాతో పోటీలో భాగస్వామిగా అమెరికా స్వీకరించిందన్నది స్పష్టమే. తమకు అనుకూలమని భారత పాలకులు చెప్పుకుంటున్న బ్రిక్స్, ఎస్‌సి‌ఓ ల సభ్యత్వం నిజానికి ఇండియాను ఆడకత్తెరలో పోక చెక్కలా ఇరకాటంలో పడేసేదే తప్ప మరొకటి కాదు. పరస్పరం ఘర్షణ పడే ప్రయోజనాలతో కూడిన వివిధ భోగోళిక-రాజకీయ శక్తుల మధ్య తటస్ధంగా ఉంటూ అన్ని శక్తుల నుండీ ప్రయోజనం పొంద గలగడం భారత పాలకులు చెబుతున్నంత తేలికైన విషయం కాదు.

అలీన విధానానికి నేతృత్వం వహించినట్లుగా చెప్పుకున్న నెహ్రూ హయాం లో కూడా ఇండియా నిజమైన ఆచరణాత్మక తటస్ఢత ను పాటించలేకపోయింది. ఆర్ధిక వనరులతో పాటు నీరు, గాలి, ఇంధనం లాంటి సహజ వనరులు కూడా తరిగిపోవడమో, కలుషితం కావడమో జరిగిన నేటి పరిస్ధితుల్లో తటస్ఢత, సమానదూరం లాంటి సిద్ధాంతాలకు స్ధానం లేదు. అలాంటి స్ధానం ఇచ్చేవారు కూడా లేరు. చాటుగానో, బహిరంగంగానో ఏదో వైపు చేరడమో లేదా దేశ వనరులను విదేశాలకు తాకట్టు పెట్టడం మానుకుని ఇరాన్, వెనిజులా దేశాల వలే తెగించి స్వతంత్ర అభివృద్ధి పంధా ఎంచుకోవడమో చేయడం వినా మరో మార్గం లేదు. అందుకు తగిన జనాభా వనరులు, ఖనిజ వనరులు ఇండియాకు దండిగా ఉన్నాయి. ప్రజలను ఆ వైపు నడిపించే చేవగల శక్తులే లేవు. భారత ఆధిపత్య వర్గాలకు ఆ చేవ ఎలాగూ లేదు. శ్రామిక ప్రజలే అందుకు పూనుకోవాలి.

………… సమాప్తం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s