దూరం అవుతున్న యూఎస్, ఈయూ
ఈ అంశాన్ని కాస్త వివరంగా చూద్దాం.
రెండో ప్రపంచ యుద్ధానంతరం సోషలిజం విస్తరించనున్నదన్న భయంతో అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు ఉమ్మడిగా పని చేయడం ప్రారంభించాయి యుద్ధంలో జర్మనీ, జపాన్, ఇటలీల ఫాసిస్టు కూటమిని ఓడించడానికి ఏర్పడిన నాటో కూటమి యుద్ధం ముగిశాక సోషలిజం నిర్మూలన లక్ష్యంగా పని చేయడం ప్రారంభించింది. ప్రధాన భౌగోళిక-రాజకీయ పరిణామాలన్నింటిలో యూఎస్, ఈయూ లు నాటో వేదికగా పరస్పరం సంప్రదించుకుని పాల్గొన్నాయి. సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా ప్రచ్చన్న యుద్ధంలో భాగం పంచుకున్నాయి. ఇరువురి సంబంధాల్లో అమెరికాది పెద్దన్న పాత్ర అయినప్పటికీ ఈయూ దేశాలు అభ్యంతరం చెప్పలేదు. నమ్మకమైన స్నేహితులుగా, అనుచరులుగా అమెరికాను అనుసరించాయి.
అమెరికా సాగించిన దురాక్రమణ యుద్ధాలకు, బాంబు దాడులకు, దేశాధినేతల హత్యలకు సహకరించాయి. పాల్గొన్నాయి. పాల్గొనని చోట బేషరతు మద్దతు అందించాయి. స్వతంత్రంగా వ్యవహరిస్తున్న దేశాలకు వ్యతిరేకంగా అమెరికా జరిపిన కుట్రలలో భాగం పంచుకున్నాయి. మూడో ప్రపంచ దేశాలపై రుద్దిన అసమాన వ్యాపార, వాణిజ్య ఒప్పందాలలో భాగస్వామ్యం వహించాయి. ప్రతిఘటించిన దేశాలపై ఉమ్మడిగా అనేక అమానుషమైన వాణిజ్య, రవాణా ఆంక్షలు విధించి అక్కడి ప్రజలు దరిద్రంలో మగ్గేట్లు చేశాయి. అమెరికా సైనిక స్ధావరాలకు అనుమతించాయి.
ఐరాస, భద్రతా మండలి. డబల్యూటిఓ, జి20, ఓఈసిడి మొదలైన అంతర్జాతీయ వేదికలపై తమ ప్రయోజనాలే పరమావధిగా ఉమ్మడి పెత్తనం చేశాయి. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, లిబియా లాంటి చిన్న దేశాలపై భారీ మిలట్రీ కూటములు కట్టి ఆ దేశాలను సర్వనాశనం చేశాయి. చేస్తున్నాయి. ప్రచ్చన్న యుద్ధ కాలంలో సోషలిజం బూచిని చూపడంలో, అనంతరం ఇస్లాం ఉగ్రవాదం బూచిగా చూపడంలో అనేక వక్ర భాష్యాలను, తాలు-తప్ప సిద్ధాంతాలను సృష్టించి ప్రచారంలో పెట్టడంలో పరస్పరం సహకరించుకున్నాయి. రష్యాపై పోలాండ్, ఉక్రెయిన్ లను ఉసిగొల్పడంలో, చైనాపై ఆగ్నేయాసియా దేశాలను రెచ్చగొట్టడంలో కలిసి పని చేశాయి. హామీలను ఉల్లంఘించి రష్యా పశ్చిమ సరిహద్దు దేశాలలో అత్యాధునిక ఆయుధాలు, మిసైళ్లను మోహరించడంలో కలిసి పని చేశాయి.
అయితే ఈ స్నేహం రోజులు బాగున్నంతవరకేనని రుజువవుతోంది. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్ధ స్వాభావికంగానే అంతర్గత వైరుధ్యాలతో నిండి ఉంటుంది. అక్కడి పెట్టుబడిదారీ కార్పొరేట్ వర్గం, అనేక శ్రమలు, ఉద్యోగాలు చేసే శ్రామిక వర్గం మధ్య ఉండే వైరుధ్యం ఆ వ్యవస్ధలను లోలోపలి నుండి తొలిచివేస్తూ ఉంటుంది. పెట్టుబడిదారీ కంపెనీలకు నిరంతరం లాభాలు కావాలి. ఆ లాభాలు పెరుగుతూ పోవాలి. అందుకోసం శ్రామిక, ఉద్యోగ వర్గం వేతనాలు, సౌకర్యాల వాటాను తగ్గిస్తూ పోతాయి. పైకి చూసేందుకు వేతనాలు సంఖ్యా రూపంలో (absolute number) పెరుగుతున్నట్లు కనిపించినా నిజవేతనాలు పడిపోతు ఉంటాయి. ఈ పడిపోయిన భాగం పెట్టుబడిదారీ కంపెనీల వాటాగా తరలిపోతూ ఉంటుంది.
ఫలితంగా ప్రజల ఆదాయాలు, కొనుగోలు శక్తి క్షీణించి అమ్మకాలు పడిపోయి, ఉత్పత్తులు పేరుకుపోతాయి. ఇది ఆర్ధిక సంక్షోభంగా మారుతుంది. లాభాలు కావాలంటే శ్రామికులు, ఉద్యోగులు, ఇతర ప్రజల ఆదాయాలు స్ధిరంగా ఉండాలి. అప్పుడే వాళ్ళు సరుకులు కొనుక్కోగలరు. కొనుగోళ్ళు జరిగితేనే లాభాలు ఉంటాయి. కానీ లాభాల కోసం ప్రజల ఆదాయాల్లో కోత పెడతారు. ఇదే పెట్టుబడిదారీ వ్యవస్ధలోని స్వాభావిక వైరుధ్యం. ఒక వైపేమో లాభాలు రావాలంటే ప్రజల కొనుగోలు శక్తి బాగుండాలి. కానీ లాభాలు పెంచుకునే ప్రయత్నంలో ఆ కొనుగోలు శక్తినే పెట్టుబడిదారీ కంపెనీలు కొల్లగొడతాయి.
ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధలో, ముఖ్యంగా అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాల్లో ఇదే జరిగింది. ఈ వైరుధ్యం పెరిగి వరుస సంక్షోభాలుగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను ముఖ్యంగా అమెరికా, పశ్చిమ ఐరోపా రాజ్యాల ఆర్ధిక వ్యవస్ధలను చుట్టుముట్టడం తీవ్రం అయింది. 1970ల ఆరంభం నుండి మొదలైన ఈ సంక్షోభాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. వీటికి తోడు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలో సాగించిన వినాశకర యుద్ధాలు అమెరికా ఆర్ధిక పరిస్ధితిని అతలాకుతలం చేశాయి. ఋణ భారం మోయలేని స్ధాయికి చేరింది.
మరోవైపు అమెరికా, ఐరోపాల అంగీకారం తోనే డబల్యూటిఓ సభ్యత్వం సంపాదించిన చైనా పెట్టుబడిదారీ ఆర్ధిక విధానాలు ముమ్మరంగా అమలు చేసింది. మూడున్నర దశాబ్దాల పాటు చైనాలో అమలు జరిగిన సోషలిస్టు విధానాల ద్వారా పటిష్టపడిన ఆర్ధిక పునాదులు, కమ్యూనిస్టు పార్టీ ద్వారా అందివచ్చిన పోటీ రహిత రాజకీయ అధికారం చైనాలోని నూతన పెట్టుబడిదారీ వర్గానికి బాగా అందివచ్చింది. స్వేచ్ఛా వాణిజ్య మండళ్లను ఏర్పరిచి దేశాన్ని మాన్యుఫాక్చరింగ్ హబ్ గా మార్చివేసింది. మిలియన్ల కొద్దీ ఉన్న చైనా శ్రామికుల శ్రమని అతి చౌకగా విదేశీ కంపెనీలకు బేరం పెట్టడం ద్వారా సరుకులు, సేవల ఉత్పత్తిలో అగ్రస్ధానం చేరుకుంది.
చైనా అనతికాలంలోనే అమెరికాకు పోటీ ఇవ్వగల ఆర్ధిక శక్తిగా మారింది. మిలట్రీ శక్తిని కూడా భారీ బడ్జెట్ తో అభివృద్ధి చేసుకుంటోంది. చైనా పాలకులు ఆర్ధికరంగాన్ని ప్రధానంగా ఇప్పటికీ ప్రభుత్వరంగంలోనే ఉంచారు. (ఉండేది ప్రభుత్వరంగంలోనే అయినా దాని నియంత్రణ కొద్ది మంది చైనీయ ఆధిపత్య శక్తుల చేతుల్లో ఉంటుంది). విదేశీ ప్రైవేటు కంపెనీల కార్యకలాపాలు తమ షరతులలోనే పరిమితం చేస్తారు. చైనా రాజకీయ నియంత్రణను ఉల్లంఘించడానికి మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి భారీ కంపెనీలు ప్రయత్నించి ఓడిపోయాయి. అయితే పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలో ఉండే వైరుధ్యాలు, చెడుగులు అనివార్యంగా చైనాను చుట్టుముట్టడమూ ఒక వాస్తవమే. కొద్ది రోజుల క్రితమే పతాక శీర్షికలకు ఎక్కిన ఎవర్ గ్రాండ్ రియల్ ఎస్టేట్ కంపెనీ సంక్షోభం ఒక చిన్న ఉదాహరణ. అది వేరే చర్చ.
గోర్బచేవ్-యెల్టిసిన్ హయాంలో కూలిపోయిన సోవియట్ రష్యా స్ధానంలో రష్యన్ ఫెడరేషన్ ప్రవేశించింది. ఆరంభంలో (1990ల్లో) యెల్టిసిన్ హయాంలో రష్యా అమెరికా-పశ్చిమ ఐరోపా దేశాలకు సాగిలపడింది. తాగుబోతు యెల్టిసిన్ రష్యా గౌరవాన్ని, ప్రతిష్టను, ఆర్ధిక వాణిజ్య సంపదను పశ్చిమ దేశాలకు అప్పనంగా ధారపోసాడు. పశ్చిమ దేశాలు రష్యాను మాఫియా ముఠాలతో నింపేశాయి. వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షరికంలో పరిస్ధితి మారిపోయింది. నేరస్ధ ముఠాలను పూర్తిగా నిర్మూలించనప్పటికీ పుతిన్ నియంత్రణలో ఉంచాడు. క్రమ శిక్షణతో విస్తారమైన చమురు, గ్యాస్ వనరులపై పట్టు సాధించాడు. సోవియట్ కాలం నాటి సాంకేతిక, ఆయుధ పరిజ్ఞానాన్ని పునాదిగా చేసుకుని శక్తివంతమైన నూతన ఆయుధ సంపత్తిని నిర్మించాడు.
ఇప్పుడు గణనీయమైన ఆయుధ సరఫరాదారుగా రష్యా అవతరించింది. ప్రస్తుతం ప్రపంచంలో రష్యా ఒక ప్రబల ఆయుధ శక్తి. “ఇప్పుడు మీరు మేము చెప్పేది వినండి” అంటూ పుతిన్ 2018లో ఆవిష్కరించిన 6 రకాల అణుశక్తి ఆధారిత క్రూయిజ్ మిసైళ్ళు, హైపర్ సోనిక్ ఆయుధాలు, అణు టార్పెడోలు, పెంటగాన్ ను బెదరగొట్టాయంటే అతిశయోక్తి కాదు. మిలట్రీ శక్తి పరంగా అమెరికా ఇప్పటికీ అగ్రగామిగా ఉన్నప్పటికీ మిలట్రీ సాంకేతిక పరిజ్ఞానం రీత్యా రష్యా అమెరికాను మించిపోయిందని పెంటగాన్ వర్గాలు కూడా అంగీకరిస్తున్న విషయం. ఆయుధ వ్యాపారంలో వాటా పెంచుకోవడంతో పాటు సాయుధ ఘర్షణలు జరుగుతున్న చోట్లకు నమ్మకమైన కిరాయి బలగాలను కూడా రష్యా సరఫరా చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇది ఆధిపత్య విస్తరణ కోసం కాకుండా, ఆయా దేశాల అభ్యర్ధన మేరకు, ఒక వ్యాపార సరఫరాగా జరుగుతున్నట్లు తెలుస్తున్నది. అంటే నిర్దేశించిన పని పూర్తయ్యాక సదరు బలగాలు తిరిగి స్వదేశం చేరుకునే ఏర్పాటు ఉంటుంది. (హాలీవుడ్ సినిమా Expendables స్ఫురణకు వస్తే మీ తప్పు లేదు.)
ప్రబల ఆర్ధిక శక్తిగా చైనా అవతరణ, మిలట్రీ శక్తిగా రష్యా పునరుద్ధానం పశ్చిమ రాజ్యాలకు ముఖ్యంగా ప్రపంచాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలాలని భావించే అమెరికాకు ఏ మాత్రం రుచించని విషయం. రష్యా, చైనాలను సైనికంగా చుట్టుముట్టడం ద్వారా ఇరు దేశాలను కట్టడి చేయాలని శతధా ప్రయత్నాలు చేసింది. నాటో కూటమిలో ఒకప్పటి సోవియట్ రష్యా ఉపగ్రహ రాజ్యాలయిన తూర్పు యూరప్ రాజ్యాలను చేర్చుకుని రష్యా సరిహద్దు వరకు నాటోని అమెరికా విస్తరించింది. రష్యా పొరుగునే పోలండ్ లో మిసైల్ డిఫెన్స్ వ్యవస్ధను నెలకొల్పింది. ఉక్రెయిన్ ను రెచ్చగొట్టి రష్యాకు వ్యతిరేకంగా యుద్ధానికి ప్రేరేపించింది. నల్ల సముద్రంలో ఒకప్పటి రష్యా భూభాగం క్రిమియాను తిరిగి స్వాధీనం చేసుకోవడంతోనూ, తూర్పు ఉక్రెయిన్ రిపబ్లిక్ లు స్వతంత్రత కోసం సాయుధ ఘర్షణకు దిగడంతోనూ అమెరికా ఎత్తుగడ బెడిసి కొట్టింది. క్రిమియాను రష్యా ఆక్రమించిందన్న సాకుతో పలు దఫాలుగా రష్యా పైనా, అక్కడి నేతలు, అధికారులపైనా ఆంక్షలు విధించింది.
అయితే ఇవేవీ రష్యా, చైనాలను పెద్దగా ఆటంకపరచలేదు. అనేక సమస్యలు ఎదుర్కొంటూనే అవి తమ వ్యూహాలను అమలు చేశాయి. అమెరికా-ఈయూల మైత్రి పై చర్యలలో కొనసాగినప్పటికీ 2008-09 నుండి తీవ్రం అవుతూ వచ్చిన ఆర్ధిక-ద్రవ్య సంక్షోభం, ఐరోపా ఋణ సంక్షోభం ఫలితంగా ఐరోపా దేశాలు అమెరికాకు పాక్షికంగానైనా ప్రత్యామ్నాయం వెతుక్కునే పనిలో పడ్డాయి. జర్మనీ నేతృత్వంలో శాస్త్ర, సాంకేతిక రంగాలలో ప్రగతి సాధించిన ఈయూ కూటమి వాణిజ్య విస్తరణ కోసం మరింత వాటా కోరడం అనివార్యం అయింది. 1990-2010 కాలంలో ఏకైక అగ్రరాజ్యంగా ఆధిపత్యం నెరపడానికి అలవాటు పడ్డ అమెరికా ఐరోపా డిమాండ్లకు చోటు ఇవ్వలేదు. డబల్యూటిఓ, జి20 సమావేశాల్లో, డబల్యూఈఎఫ్, జి7 సమావేశాల్లో తన సంక్షోభ భారాన్ని ఐరోపాపై రుద్దడానికే ప్రయత్నించింది తప్ప మిత్రుల మొరలను ఆలకించలేదు.
పెరుగుతున్న అవసరాలు, మారుతున్న ఇంధన ప్రాధామ్యాల రీత్యా రష్యా గ్యాస్ వనరులు జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్ తదితర పశ్చిమ ఐరోపా దేశాలకు అత్యవసరం అయ్యాయి. ఇందుకోసం రష్యా నుండి బాల్టిక్ సముద్రం గుండా (ఉక్రెయిన్ తో సంబంధం లేకుండా) జర్మనీ తీరం వరకూ గ్యాస్ సరఫరా చేసే ‘నార్డ్ స్ట్రీం 1 & 2’ పైప్ లైన్ల నిర్మాణాలకు జర్మనీ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం రద్దు చేసుకోవాలని రష్యా గ్యాస్ బదులు తానే సరఫరా చేస్తానని ఒబామా, ట్రంప్ ప్రభుత్వాలు తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. ఖరీదైన తన ఫ్రాకింగ్ గ్యాస్ ను ఐరోపాకు అంటగట్టాలని చూసింది. ఈ ఒత్తిళ్ళు ఏవీ ఫలించలేదు. నార్డ్ స్ట్రీం రెండవ పైప్ లైన్ విజయవంతంగా పూర్తయిందని 2021 సెప్టెంబర్ 9 తేదీన రష్యన్ సహజవాయువు కంపెనీ గాజ్ ప్రోమ్ ప్రకటించింది. (నార్డ్ స్ట్రీమ్ 1 2012లో పూర్తయింది.) ఈ పైప్ లైన్ వల్ల ఇంధనం కోసం ఐరోపా, రష్యాపై ఆధారపడడం పెరుగుతుందని అమెరికా భయం. తన మాట చెల్లకపోవడంతో అమెరికాయే దిగి వచ్చి జులై 2021లో జర్మనీతో ఒప్పందానికి రాక తప్పలేదు.
ఆర్ధిక రంగంలోనూ అమెరికా మాట వినడం ఈయూ దేశాలు క్రమంగా తగ్గించేశాయి. డబల్యూటిఓ వేదికపై తమ ప్రయోజనాల కోసం ఘర్షణ పడడం పెంచాయి. ఈయూ దేశాలు రక్షణ బడ్జెట్ పెంచాలని అమెరికా దశాబ్దంగా డిమాండ్ చేస్తున్నా అవి పెడచెవిన పెట్టాయి. చివరికి 2019లో డిఫెన్స్ ఖర్చు పెంచుకునేందుకు తమలో తాము ఒప్పందం చేసుకున్నాయి. కానీ తమ కంపెనీలకు కూడా కాంట్రాక్టులు ఇవ్వాలన్న అమెరికా డిమాండ్ కు ఈ ఒప్పందంలో స్ధానం ఇవ్వలేదు. ఇతర దేశాలు కూడా బిడ్డింగ్ లో పాల్గొనేందుకు తక్కువ అవకాశం ఇచ్చాయి. ఈ విషయమై అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. “రక్షణ విధానం పేరుతో పారిశ్రామిక విధానాన్ని ఈయూ రూపొందించుకుంది. ఇలా అయితే మీతో పాటు అమెరికా రక్షణ కూడా ప్రమాదంలో పడుతుంది” అని ట్రంప్, పెంటగాన్ వర్గాలు హెచ్చరించారు (న్యూ యార్క్ టైమ్స్ -జూన్ 6, 2019).
అమెరికా, ఈయూల మధ్య ‘ట్రాన్స్ అట్లాంటిక్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్^మెంట్ పార్టనర్షిప్’ పేరుతో వాణిజ్య ఒప్పందం కోసం అనేక యేళ్ళు చర్చోప చర్చలు జరిగినప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఈ ఒప్పందం ఫలితంగా ఈయూ దేశాల ప్రయోజనాలకు, అక్కడి ప్రజల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఈయూ నమ్మడంతో చర్చలు సాగుతూ పోయాయి. యూకే, ఈయూ ని వీడటం వల్ల చర్చలు పునః ప్రారంభించవల్సి రావడంతో 2016లో చర్చలకు ముగింపు పలికారు. ఆ తర్వాత చర్చలు తిరిగి ప్రారంభం అవుతాయని చెప్పినా ఆ పరిస్ధితి కనిపించడం లేదు. జపాన్, మలేషియా, ఆస్ట్రేలియా, కెనడా, మెక్సికో, న్యూజిలాండ్ తదితర 12 దేశాలతో ఏర్పరుచుకున్న ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్షిప్ ఒప్పందాన్ని సైతం ట్రంప్ రద్దు చేశాడు. చైనాను పసిఫిక్ లో ఒంటరిని చేసేందుకు ఉద్దేశించిన ఈ ఒప్పందం ట్రంప్ మొదలు పెట్టిన ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో కొండెక్కింది. ఇదే నినాదంతో నాఫ్తా (నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ – మెక్సికో, కెనడా, అమెరికా) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కూడా ట్రంప్ రద్దు చేశాడు. ఈయూ వారిస్తున్నా వినకుండా, ‘ఇరాన్ అణు ఒప్పందం’ (JCPOA) ను సైతం రద్దు చేసేశాడు. ట్రంప్ చర్యలు ఈయూ ను మరింత అభద్రతకు గురి చేశాయి. అమెరికాపై నమ్మకాన్ని బలహీనం చేశాయి.
ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ట్రంప్ నేతృత్వంలోని అమెరికా వాదనలు చేస్తూ ‘అమెరికా ఫస్ట్’ పేరుతో వాణిజ్య రక్షణ విధానాల (protective policies) వైపు ప్రయాణిస్తుండగా, ప్రపంచీకరణ విధానాలకు చైనా గట్టి మద్దతు ప్రకటిస్తున్న పరిస్ధితి ఏర్పడింది. చైనాలోని అమెరికా కంపెనీలన్నీ తిరిగి అమెరికా వచ్చేయాలని ట్రంప్ పిలుపులు ఇచ్చాడు. మాన్యుఫాక్చరింగ్ కు తిరిగి అమెరికా కేంద్రం కావాలని ప్రకటించాడు. ఈ నినాదాల్లో చైనాతో పాటు అడపా దడపా ఈయూ ప్రయోజనాలకు కూడా ప్రమాదం వ్యక్తం అయింది. బైడెన్ పాలనా పగ్గాలు చేపట్టాక ట్రంప్ నిర్ణయాలను తిరగదొడతానని హామీ ఇచ్చాడు. కానీ అదేమీ జరగగక పోగా ట్రంప్ విధానాలే కొనసాగుతున్నాయి. ఇరాన్ తో చర్చలు తిరిగి ప్రారంభం అయ్యే సూచనలేమీ లేవు. బహుళ పక్ష వేదికలైన డబల్యూటిఓ, జి20 లకు ప్రాధాన్యత ఇవ్వకుండా అమెరికా సొంత ఒప్పందాలను చేసుకోవడం కొనసాగిస్తోంది.
ఈ పరిస్ధితుల్లో వెలువడిన ఆకస్ ప్రకటన ఈయూ కు ఆశనిపాతం అయింది.
…………. తదుపరి 3వ భాగంలో