ప్రపంచ యుద్ధ ప్రమాదాన్ని చేరువ చేసిన ‘ఆకస్’ మిలట్రీ కూటమి


 

AUKUS – US, UK, Australia

2021 సెప్టెంబర్ 15 వ తేదీన ప్రపంచ భౌగోళిక-రాజకీయ యవనికపై ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా(A), బ్రిటన్ (యునైటెడ్ కింగ్^డమ్ – UK), అమెరికా సంయుక్త రాష్ట్రాలు (US).. ఈ మూడు సభ్య దేశాలుగా ‘ఆకస్ (AUKUS) పేరుతో మిలట్రీ కూటమి ఏర్పడినట్లుగా మూడు దేశాల నేతలు ప్రకటించారు. కూటమి ఏర్పాటు దానికదే ఒక ముఖ్య పరిణామం కాగా, ఆస్ట్రేలియాకు అణు ఇంధనంతో నడిచే 8 సబ్ మెరైన్లను అమెరికా సరఫరా చేయనున్నట్లు ప్రకటన వెలువడడం మరో ముఖ్య పరిణామం.

ఈ ప్రకటనతో అమెరికా మిత్ర దేశాలు, శత్రు దేశాలు రెండు పక్షాలూ ఉలిక్కి పడ్డాయి. ఆస్ట్రేలియా పొరుగు దేశాలు న్యూజిలాండ్, ఇండోనేషియా తదితర దేశాల నుండి అమెరికా అనుంగు మిత్రులు యూరోపియన్ యూనియన్ దేశాల వరకూ ‘ఆకస్’ ఏర్పాటును వివిధ స్ధాయిలలో ఖండించాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చతుర్భుజ కూటమి (QUAD – క్వాడ్) ద్వారా అమెరికాతో పీటముడి వేసుకున్న ఇండియా, జపాన్ లు పైకి చెప్పకపోయినా ఈ పరిణామంతో లోలోపల ఆందోళన చెందినట్లు పలు విశ్లేషణలు తెలియజేస్తున్నాయి.

‘ఆకస్’ కూటమి ఏర్పాటును ప్రకటిస్తూ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ఇలా వివరించాడు. “మా సాంకేతిక పరిజ్ఞానం, మా శాస్త్రవేత్తలు, మా పరిశ్రమలు, మా రక్షణ బలగాలు కలిసి సంయుక్తంగా పని చేస్తూ, అంతిమంగా అందరికీ ప్రయోజనం సిద్ధించేలా మరింత భద్రమైన, సురక్షితమైన (ఇండో-పసిఫిక్) ప్రాంతాన్ని అందిస్తాము.” ఆకస్ కూటమి లోని మూడు సభ్య దేశాలలో ఆస్ట్రేలియా ఒక్కటి మాత్రమే ఇండో-పసిఫిక్ ప్రాంత దేశం, అమెరికా, బ్రిటన్ లు రెండూ ఈ ప్రాంతానికి సుదూరంలో ఉన్నవే. ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రత ప్రధానంగా ఆ ప్రాంతం లోని దేశాలకు సంబధించిన వ్యవహారం. కానీ ప్రపంచం మొత్తంలో తన ప్రయోజనాలు ఉన్నాయని అమెరికా వాదిస్తుంది. ఆస్ట్రేలియా బ్రిటిష్ డొమినియన్ కనుక తమ ప్రయోజనాలు ముడి పడి ఉన్నాయని బ్రిటన్ వాదన.

ఈ వాదనలు ప్రధానంగా అమెరికా, బ్రిటన్ ల ఆధిపత్య ప్రయోజనాలకు సంబధించినవి తప్ప ఇండో పసిఫిక్ క్షేమాన్ని ఉద్దేశించినవి కావన్నది స్పష్టమే. అసలు ఇండో-పసిఫిక్ అన్న పద ప్రయోగమే మిలట్రీ ప్రయోజనాల నిమిత్తం మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ ప్రారంభించిన పదజాలం. బ్రిటిష్ వలస ఆధిపత్యంపై ఇక్కడి దేశాల వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ప్రారంభించిన ఆలోచన ఇప్పుడు అమెరికా అందిపుచ్చుకుని చైనా ఎదుగుదలను నిలువరించడానికి, తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి వినియోగిస్తున్నది. కాగా ఈ ప్రాంత దేశాల పాలకులు అమెరికా ప్రయోజనాలకు జో హుకుం అంటూ సాగిలపడుతున్నారు. 

ఆకస్ ఏర్పాటు అనేక దేశాల భౌగోళిక-రాజకీయ ప్రయోజనాలకు ప్రమాదకారి. మరీ ముఖ్యంగా, కూటమి స్వభావం రీత్యా, పంచ వ్యాపితంగా వివిధ ప్రాంతాలలో, ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రతా సమస్యలను ఈ మిలట్రీ కూటమి పెంచుతుంది. ఆయుధ పోటీని తీవ్రం చేస్తుంది. ప్రజలకు ఉపయోగ పెట్టవలసిన  వనరులను కొల్లగొట్టి ఆయుధ కొనుగోళ్లకు మళ్లిస్తుంది. ఇప్పటికే లోతుగా పాతుకుపోయిన ప్రపంచ పెట్టుబడిదారీ సంక్షోభాన్ని కఠినతరం చేస్తుంది. చైనా, రష్యాలతో కయ్యానికి అమెరికా సంసిద్ధతను మరింత నగ్నం కావిస్తుంది. అంతిమంగా మూడో ప్రపంచ యుద్ధ ప్రమాదాన్ని మరింత తీవ్రం చేయనున్నది. ఇండో-పసిఫిక్ దేశాల ప్రజలతో పాటు మొత్తం ప్రపంచ దేశాల ప్రజలకు, ముఖ్యంగా శ్రామికవర్గ ప్రజల ప్రయోజనాలకు తీవ్రమైన హాని చేయనున్నది. కనుక అమెరికా తెంపరితనాన్ని, బ్రిటన్ కపట బుద్ధినీ, ఆస్ట్రేలియా స్వార్ధ బుద్ధినీ, బాధ్యతా రాహిత్యాన్ని ప్రపంచ ప్రజానీకం గట్టిగా వ్యతిరేకించాలి.

ఒప్పందం ప్రకారం అమెరికా ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాములను సరఫరా చేస్తుంది. బ్రిటన్ తమ వద్ద ఉన్న న్యూక్లియర్ సబ్ మెరైన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందజేస్తుంది. అమెరికా అణు జలాంతర్గాములు ప్రత్యేకమైనవి. సాంప్రదాయ ఇంధనం (బ్యాటరీలు) కాకుండా అణు శక్తిని ఇంధనంగా వీటికి వినియోగిస్తారు. డీజెల్ బ్యాటరీల వల్ల జలాంతర్గాములు కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు మాత్రమే నీటి అడుగున ప్రయాణిస్తాయి. ఇంధనం నింపుకోవడానికి నీటి పైకి రావాలి. అణు విద్యుత్ జలాంతర్గాములలో సాంప్రదాయ ఇంధనంతో పాటు అదనంగా అణు విద్యుత్ ఇంధనం అందుబాటులో ఉంటుంది. దీనివల్ల జలాంతర్గాములు (సిబ్బంది ఆహార అవసరాలను మళ్ళీ నింపుకోవడానికి తప్ప) నీటి పైకి తేలే అవసరం రాదు. అనేక సంవత్సరాలు సముద్రం అడుగున ఉండవచ్చు. సుదూర ప్రాంతాలకు వెళ్లవచ్చు. వేగంగానూ ప్రయాణిస్తాయి.

చైనాకు వ్యతిరేకంగా దక్షిణ చైనా సముద్రంలో పహారా కోసమే వీటిని ఆస్ట్రేలియాకు సరఫరా చేస్తున్న విషయం రహస్యం కాదు. ఈ సరఫరా అణ్వస్త్ర తయారీకి కాదని అమెరికా, బ్రిటన్ లు నమ్మబలుకుతున్నాయి. ఇది నమ్మదగింది కాదు. అణు జలాంతర్గాములలో వినియోగించడానికి ఆస్ట్రేలియా అనివార్యంగా తన యురేనియం నిల్వల కోసం తవ్వకాలు చేస్తుంది. అణు రియాక్టర్లు నెలకొల్పుతుంది. తద్వారా ఆ దేశ ప్రజలకు ప్రమాదం తెచ్చిపెడుతోంది. పైగా అణు సబ్ మెరైన్ అసెంబ్లీ టెక్నాలజీ ఆస్ట్రేలియాకు తెలియదు. కనుక అమెరికా మిలట్రీ ఆస్ట్రేలియా గడ్డపై బిచాణా వేస్తుంది. చైనా వ్యతిరేక మిలట్రీ కార్యకలాపాలకు ఆస్ట్రేలియాను అడ్డాగా మార్చుతుంది.

ఆస్ట్రేలియా అణ్వస్త్ర దేశం కాదు. ‘అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం’ (ఎన్‌పి‌టి) పై ఆస్ట్రేలియా 1973లో సంతకం చేసింది. అలాగే ‘సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం’ (సి‌టి‌బి‌టి) కూడా ఆ దేశం 1998లో ఆమోదించింది. అణ్వస్త్ర దేశంగా మారకుండా అణు ఇంధన జలాంతర్గాములను నిర్వహించడం అసాధ్యం. కనుక అణు ఇంధనంతో నడిచే జలాంతర్గాములను ఆస్ట్రేలియాకు సరఫరా చేయడం అమెరికా, బ్రిటన్ తదితర పశ్చిమ రాజ్యాలు నిత్యం ప్రవచించే అంతర్జాతీయ చట్టాలకూ, ఒప్పందాలకు, నియమాలకు బద్ధ విరుద్ధం. విస్తారమైన యురేనియం నిల్వలు ఉన్నందున న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపు (ఎన్‌ఎస్‌జి) లో సభ్యత్వం కలిగి ఉన్నప్పటికీ ఎన్‌ఎస్‌జి కూటమి రూపొందించుకున్న నియమ నిబంధనల రీత్యా అణ్వస్త్ర రహిత దేశాలకు అణ్వాయుధ సామర్ధ్యం సమకూర్చడం నియమ విరుద్ధం. అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ (ఐ‌ఏ‌ఈ‌ఏ) నిబంధనలకు కూడా ఈ అణు జలాంతర్గాముల సరఫరా వ్యతిరేకమైనది.

అయితే అణ్వాయుధ నిషేధ ఒప్పందం (Treaty on the Prohibition of Nuclear Weapons –TPNW) లో మాత్రం ఆస్ట్రేలియా భాగస్వామి కాదు. ఈ ఒప్పందం ప్రకారం అణ్వాయుధాలు అభివృద్ధి చేయడం, పరీక్షించడం, ఉత్పత్తి చేయడం, కొనుగోలు చేయడం, కలిగి ఉండడం, నిల్వ చేయడం, అణ్వాయుధం ప్రయోగిస్తామని బెదిరించడం నిషిద్ధం. అమెరికాతో తమకు గల స్నేహం రీత్యా ఈ ఒప్పందం తమకు సరిపడదని ఆస్ట్రేలియా చెబుతుంది. అయినప్పటికీ ఎన్‌పి‌టి, సి‌టి‌బి‌టి ఒప్పందాలను ఆస్ట్రేలియా ఆమోదించినందున ‘అణు జలాంతర్గాముల సరఫరా’ ద్వారా సదరు ఒప్పందాలను ఆస్ట్రేలియాతో పాటు అమెరికా, బ్రిటన్ లు కూడా ఉల్లంఘించాయి. ఎన్‌ఎస్‌జి నిబంధనలను సైతం మూడు దేశాలు ఉల్లంఘించాయి. ఈ ఉల్లంఘనలను కప్పిపుచ్చడానికి తాము అణ్వస్త్రాలు ఇవ్వడం లేదని అబద్ధాలు చెబుతున్నాయి.  

కేవలం అణు విద్యుత్, వైద్య ప్రయోజనాలు లాంటి శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే అణు రియాక్టర్లు నిర్మించుకుంటున్న ఇరాన్ అణు విధానాన్ని పదే పదే తప్పు పడుతూ అనేక అగ్ని పరీక్షలకు గురి చేసి వేధించే ఐ‌ఏ‌ఈ‌ఏ, ఆస్ట్రేలియాను మరో అణ్వస్త్ర దేశంగా మార్చనున్న ‘అణు జలాతర్గాముల సరఫరా ఒప్పందం’ పట్ల ఐ‌ఏ‌ఈ‌ఏ ఇంతవరకు స్పదించకపోవడం దారుణం. అమెరికా, పశ్చిమ రాజ్యాల మిలిటరీ ఆధిపత్య ప్రయోజనాలను నెరవేర్చడమే కర్తవ్యంగా ఐ‌ఏ‌ఈ‌ఏ పని చేస్తుందని దీనితో మరోసారి తేటతెల్లం అయింది.

ఆసియాన్ కూటమి ఆందోళన

‘ఆకస్’ కూటమి ప్రకటనకు వ్యటురేకంగా మొదట ఫ్రాన్స్, చైనా, రష్యా, మలేషియా, ఇండోనేషియా, న్యూజిలాండ్ దేశాలు ప్రతిస్పందించాయి. తమ పొరుగు దేశం హఠాత్తుగా అణ్వస్త్ర దేశంగా అవతరించడం ఇండోనేషియా, మలేషియా లకు సహజంగానే ప్రమాదం తెచ్చి పెడుతుంది. ఈ రెండు దేశాలు ఆగ్నేయాసియా దేశాల కూటమి (ఆసియాన్ – ASEAN) లో భాగస్వాములు. ఆసియాన్ ప్రాంతాన్ని అణ్వస్త్ర రహితంగా ఉంచాలని, ‘శాంతి, స్వేచ్ఛ, తటస్ధత’ సూత్రాల ప్రాతిపదికన బాహ్య శక్తుల జోక్యానికి దూరంగా ఉంచాలని ఈ కూటమి దేశాలు తీర్మానించుకున్నాయి. ఆ మేరకు ‘ఆగ్నేసియా అణ్వస్త్ర రహిత ప్రాంత ఒప్పందం’ పై సభ్య దేశాలన్నీ సంతకం చేశాయి. ఒప్పందం కొన్ని ప్రోటోకాల్స్ ప్రకటించాయి.

అయితే అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ సదరు ప్రోటోకాల్స్ ను ఎన్నడూ గౌరవించింది లేదు. ఫ్రీడం ఆఫ్ నేవిగేషన్’ పేరుతో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లు దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ నౌకలను నడుపుతాయి. చైనా, అమెరికా యుద్ధ నౌకలు అనేకమార్లు అత్యంత సమీపానికి రావడం ఉద్రిక్తతలు పెచ్చరిల్లడం తరచూ జరుగుతుంది. ఆసియాన్ దేశాలకు చెందిన చైనా నౌకలు కూడా అమెరికా యుద్ధ నౌకలతో ప్రమాద పరిస్ధితి ఎదుర్కోవడం అనేకమార్లు జరిగింది. ఈ దేశాలకు అదనంగా తమ పొరుగు దేశం ఆస్ట్రేలియా వచ్చి చేరడం ఆసియాన్ దేశాలకు సుతరామూ నచ్చని విషయం. ఆస్ట్రేలియాకు జలాంతర్గాముల సరఫరా వల్ల తమ ప్రాంతంలో ఆయుధ పోటీ, ముఖ్యంగా అణ్వాయుధ పోటీ తీవ్రమై శాంతికి భంగం కలుగుతుందని మలేషియా, ఇండోనేషియా లు హెచ్చరించాయి. దక్షిణ చైనా సముద్రంలో చైనా-అమెరికా పోటీ వలన నిత్యం ఉద్రిక్తతలు ఏర్పడుతున్న నేపధ్యంలో ఆకస్ మరియు ఆస్ట్రేలియా అణు జలాంతర్గాములు ఉద్రిక్తతలను మరింత తీవ్రం చేస్తాయని ఆసియాన్ కూటమి ఆందోళన చెందుతున్నాయి.

ఇండోనేసియా తదితర ఆగ్నేయాసియా దేశాల ఆందోళన సహజమూ, న్యాయబద్ధమైనది కూడా. ఆస్ట్రేలియాతో ఉమ్మడి సముద్ర సరిహద్దు కలిగి ఉన్న ఇండోనేషియాకు ఈ పరిణామం మరింత కంటగింపు అయింది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో వీడొడో తాను అందుబాటులో ఉండనని, తనను కలవడం సాధ్యపడదని ప్రకటించడంతో ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ తన ఇండోనేషియా సందర్శనను రద్దు చేసుకోవలసి రావడం బట్టి నూతన కూటమి పట్ల ఆ దేశ కఠిన వైఖరిని అర్ధం చేసుకోవచ్చు. అయితే ఆగ్నేసియా దేశాల ఆందోళన, అభిప్రాయం పట్ల ఆకస్ దేశాలకు ఎలాంటి గౌరవము లేకపోవడం ఒక వాస్తవం. అమెరికా తదితర పశ్చిమ దేశాలకు తమ ఆర్ధిక-రాజకీయ ఆధిపత్య ప్రయోజనాలే ముఖ్యం. ఆ మాటకొస్తే దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదే అని వాదించే చైనాకు కూడా ఆగ్నేసియా దేశాల వ్యాపార ప్రయోజనాల పట్ల పట్టింపు, గౌరవం ఉన్నాయనీ చెప్పలేము.

ఇది వెన్నుపోటు –ఫ్రాన్స్

ఆకస్ ప్రకటన అనంతరం ఫ్రాన్స్ అత్యంత తీవ్రంగా ప్రతిస్పందించింది. ఆకస్ కూటమి ఏర్పాటు ప్రకటించిన మరుసటి రోజు యూ‌ఎస్, యూ‌కే లు మొదటి చర్యగా తమకు అణు శక్తి జలాంతర్గాములు సరఫరా చేస్తాయని ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటించాడు. దానితో పాటు 2016లో ఫ్రాన్స్ తో కుదుర్చుకున్న 12 సంప్రాదాయ జలాంతర్గాముల సరఫరా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ఒప్పందం ఖరీదు 66 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఒప్పందం విలువ $90 బిలియన్లు అని కొన్ని పత్రికలు రాశాయి. ఇంత భారీ మొత్తంతో కూడిన ఒప్పందం రద్దు చేస్తున్నట్లు హఠాత్తుగా ప్రకటించడం ఫ్రాన్స్ కు సహజంగానే ఆగ్రహం తెప్పించింది. అదీ కాక తనకు ఏ మాత్రం సమాచారం లేకుండా రహస్య చర్చలు జరపడం, అత్యంత విలువైన వ్యాపార ఒప్పందాన్ని ఒక్క ప్రకటనతో రద్దు చేయడం ఫ్రాన్స్ కు అత్యంత అవమానకరం అయింది. బ్రిటన్-ఫ్రాన్స్ ల మధ్య ఉన్న సంప్రదాయ ప్రచ్చన్న వైరం ఈ ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసి ఉండవచ్చు.

ఫ్రాన్స్ విదేశీ మంత్రి ఇఝా ఇహిద్ లోడిగియా, రక్షణ మంత్రి ఫ్లోహోన్స్ పాహలీ స్పందిస్తూ “ఆస్ట్రేలియాతో కీలకమైన భాగస్వామ్యం నుండి ఫ్రాన్స్ లాంటి ముఖ్యమైన ఐరోపా మిత్రుడు మరియు భాగస్వామిని మినహాయించే ఈ అమెరికా నిర్ణయం స్ధిరత్వం లేనితనాన్ని సూచిస్తోంది. అది కూడా మన (పశ్చిమ) విలువల విషయంలో గానీ, చట్టబద్ధ సూత్రాలపై ఆధారపడిన బహుళపక్ష వాదం పట్ల గౌరవం విషయంలో గానీ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కనీ వినీ ఎరుగని సవాళ్లను మనం ఎదుర్కొంటున్న సమయంలో ఇది జరగడాన్ని ఫ్రాన్స్ గమనించి విచారించడం మాత్రమే చేయగలదు” అని ప్రకటించారు.

ఇహిద్ లోడిగియా మరో ప్రకటనలో “ఇది నిజంగా వెన్నుపోటు. ఆస్ట్రేలియాతో నమ్మకంతో కూడిన భాగస్వామ్యాన్ని స్ధాపించాం. ఆ నమ్మకానికి ఆ దేశం ద్రోహం చేసింది” అని తీవ్రంగా స్పదించాడు (IE). తాను కొద్ది వారాల క్రితమే కూడా ఆస్ట్రేలియా విదేశీ మంత్రితో మాట్లాడాననీ ఒప్పందం రద్దుకు సంహంధించిన ఎలాంటి సూచనా తనకు అందలేదని చెబుతూ “ఈ రద్దు విషయంలో నేను చాలా కోపంగా ఉన్నాను. మాకు వివరణ కావాలి. పటిష్టమైన నియమ నిబంధనలతో ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం నుండి ఎలా బైటికి వెళ్తారో ఆస్ట్రేలియా చెప్పాలి. ఇంతటితో అయిపోలేదు.’ అని ఆయన ప్రకటించాడు (న్యూయార్క్ టైమ్స్). “అమెరికా ప్రవర్తన నాకు ఆందోళన కలిగిస్తున్న విషయం. ఈ క్రూరమైన, ఏకపక్ష, అనూహ్యమైన నిర్ణయం గత అధ్యక్షుడు ట్రంప్ తీసుకునేవాడు. మిత్రులు ఒకరికొకరు ఇలాంటివి చేసుకోరు” అంటూ నిరసించాడు (పొలిటికో).

మామూలుగా అయితే ఫ్రాన్స్ మంత్రుల ప్రకటనలు ఇంత వివరంగా చూడనవసరం లేదు. ఎందుకు చూస్తున్నామంటే ఆకస్ ఏర్పాటు ఒక మలుపు లాంటి పరిణామం. ఇందులో బ్రెగ్జిట్ అనంతరం బ్రిటన్/యూ‌కే యూరోపియన్ యూనియన్ కి అతీతంగా తన స్వతంత్రతను స్ధాపించుకోవాలన్న ప్రయత్నాన్ని గమనించవచ్చు. అలాగే చైనా ఎదుగుదల, రష్యా స్ధిరమైన ప్రతిఘటనలతో పాటు రష్యా-ఈ‌యూ, చైనా-ఈ‌యూ ల మధ్య వాణిజ్య సామీప్యత పెరుగుతున్న నేపధ్యంలో ఈ‌యూని అమెరికా క్రమంగా పక్కన పెడుతున్న అంశాన్ని చూడవచ్చు. ఈ పరిణామాలు గతం నుండి గోచరిస్తున్నవే అయినప్పటికీ ఇంత స్పష్టంగా ఆచరణ రూపంలో కనిపించడం ఇది ప్రధమం. గతంలో అమెరికా-ఈ‌యూ ల కీచులాట సమావేశాల్లో, టెలిఫోన్ సంభాషణల్లో, పరోక్ష హెచ్చరికల్లోనే వ్యక్తం కాగా ఆకస్ ఏర్పాటు ప్రకటన వారి వైరుధ్యాలను స్పష్టంగా బహిరంగం కావించింది. అందువలన ఫ్రాన్స్ స్పందన తీవ్రత ఆ దేశ మంత్రుల మాటల్లోనే చూడటం ఉపయోగంగా ఉంటుంది. ఆస్ట్రేలియా-ఫ్రాన్స్ ల సబ్ మెరైన్ ఒప్పందం రద్దు సుదీర్ఘమైన ‘లీగల్ వార్’ కు దారి తీస్తుందని ఫ్రాన్స్ మంత్రి స్పందన తెలియజేస్తోంది.

ఫ్రాన్స్ ప్రకటనలతో సరిపెట్టుకోలేదు. అమెరికా, ఆస్ట్రేలియాల్లోని తన రాయబారులను వెనక్కి పిలిపించుకుంది. దానితో అమెరికా, ఆస్ట్రేలియాలు ఒకింత ఖంగు తిన్నాయి. ఫ్రాన్స్ నుండి నిరసన ఊహించినప్పటికీ ఈ స్ధాయి వ్యతిరేకత వస్తుందని అమెరికా అధ్యక్షుడు ఊహించలేదని అమెరికా పత్రికలు వ్యాఖ్యానించాయి. మరో వారం రోజులకే (సెప్టెంబర్ 22) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫ్రాన్స్ తో సంబంధాల పునరుద్ధరణ కోసం అధ్యక్షుడు ఇమానియేల్ మాక్రోన్ కు ఫోన్ చేసి 30 ని.లు మాట్లాడవలసి వచ్చింది. ఇరువురి సంభాషణల్లో బైడెన్ తమ తప్పటడుగులను గుర్తించానని, ఇలాంటి వ్యూహాత్మక అంశాలలో ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ భాగస్వాములతో ముందుగా చర్చించి ఉండాల్సిందని అంగీకరించాడని సి‌ఎన్‌ఎన్ తెలిపింది. త్వరలో రోమ్ లో జరగబోయే జి20 సమావేశాల్లో ప్రత్యక్షంగా సమావేశమై ఈ అంశాన్ని చర్చించాలని ఇరువురు అంగీకరించారు కూడా. రాయబారులను త్వరలో పంపనున్నట్లు ఇరు దేశాల ఉమ్మడి ప్రకటన తెలిపింది. అయితే ఆకస్ ఏర్పాటు, సబ్ మెరైన్ ఒప్పందం రద్దు జరిగిపోయాయి. ఈ ఫోన్ కాల్ వాటిలో మార్పు ఉండదు. కనుక అమెరికా-ఫ్రాన్స్ సంబంధాల మెరుగుదల అన్నది అలంకార ప్రాయమే.

ఆస్ట్రేలియా కోణం

ఆస్ట్రేలియా కోణంలో కొన్ని అంశాలను గమనించవలసి ఉన్నది. ఒబామా పాలనలో ఉక్రెయిన్-రష్యా ఘర్షణ, క్రిమియా రష్యాలో విలీనం, సిరియా యుద్ధంలో రష్యా ప్రత్యక్ష జోక్యం.. మున్నగు పరిణామాలు అమెరికా-రష్యాల ఘర్షణను ప్రధానంగా ముదుకు తెచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అమెరికా రష్యాపై కేంద్రీకరణ తగ్గించి చైనాను తమ ప్రధమ శత్రువుగా ప్రకటించింది. అంతకు ముందరి అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రకటించిన ‘పీవోట్ టు ఆసియా’ వ్యూహానికి ఇది కొనసాగింపే అయినా చైనాతో ఘర్షణను ట్రంప్ నూతన స్ధాయికి చేర్చాడు. దరిమిలా పసిఫిక్ మహా సముద్రంలో అమెరికా-చైనాల మధ్య వ్యూహాత్మక పోటీ తీవ్రం అయింది. జపాన్, ఇండియాలను జత కలుపుకుని ఆస్ట్రేలియా, చైనాతో అమెరికా నిర్దేశించిన సైద్ధాంతీక, రాజకీయ ఘర్షణను తన నెత్తిన వేసుకుంది. ఆ మేరకు సందర్భం వచ్చినప్పుడల్లా చైనాతో ప్రకటనల యుద్ధానికి దిగింది. ఇందుకు క్వాడ్ ను వేదికగా చేసుకుంది. క్వాడ్ మిలట్రీ కూటమి కాదని ఇండియా విదేశీ మంత్రి తదితరులు ఎంత చెప్పినా ఆస్ట్రేలియా, అమెరికా చర్యలు అందుకు విరుద్ధ చిత్రాన్ని ప్రపంచం ముదుకు తెచ్చాయి.

ఈ పరిస్ధితుల్లో ఆస్ట్రేలియా పొరుగునే ఉన్న దక్షిణ పసిఫిక్ ద్వీప దేశాల్లో (ఫిజి, వనౌటు, పపువా న్యూగినియా) మిలటరీ స్ధావరాలు నెలకొల్పడానికి 2018 లో చైనా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోటీగా సమీపంలో పసిఫిక్ లో తన ప్రధాన మిలట్రీ స్ధావరమైన గువామ్ లో తన అణ్వస్త్ర శక్తిని మరింత ఆధినికం చేయడం అమెరికా ప్రాంభించింది. అదే ప్రాంతంలోని ఫ్రెంచి పాలినేసియా ద్వీపకల్పంలో ఫ్రాన్స్ మిలట్రీ స్ధావరం అప్పటికే ఉన్నది. మరో యేడాది తర్వాత 2019లో ఫ్రాన్స్ తో 66 బిలియన్ డాలర్లతో సబ్ మెరైన్ కాంట్రాక్టుపై ఆస్ట్రేలియా సంతకం చేసింది. ఈ జలాంతర్గాములకు అనంతర కాలంలో అణు క్షిపణులు చేర్చడానికి కూడా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఫ్రాన్స్ సబ్ మెరైన్ సరఫరా వాయిదా పడుతూ వచ్చింది. కడపటి వార్తల ప్రకారం మొదటి ఫ్రెంచి సబ్ మెరైన్ 2034 లో అందనున్నది.

కాగా ‘గేట్ వే టు ఆసియా’ గా పిలిచే ఉత్తర ఆస్ట్రేలియా రేవు ‘ద పోర్ట్ ఆఫ్ డార్విన్’ నిర్వహణను చైనా 2015లో 99 సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నది. ఈ పోర్టు నిర్వహణ మొత్తం ప్రస్తుతం చైనా నియత్రణలో ఉన్నది. పసిఫిక్ లో పెరుగుతున్న ఉద్రిక్తతల రీత్యా ఉత్తర ఆస్ట్రేలియాలో చైనా ప్రభావాన్ని పూర్వపక్షం చేయడానికి లేదా సమతూకం చేయడానికి అక్కడ అమెరికా మిలట్రీ ఉనికి పెంచడానికి ఆస్ట్రేలియా నిర్ణయించింది. ఈ విధంగా అమెరికా వ్యూహాత్మక మిలట్రీ ప్రయోజనాలను, చైనా వ్యాపార-వాణిజ్య ఆకాంక్షలను ఫ్రాన్స్ తో ఉన్న స్నేహ సంబంధాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆస్ట్రేలియా పూనుకుంది. అదే సమయంలో ఇన్ని వైపుల నుండి వచ్చే ఒత్తిడులను ఎదుర్కోవడానికి అమెరికా అనుంగు మిత్రుడుగా పొజిషన్ తీసుకుంది.

ఈ శక్తులకు తోడుగా బ్రెగ్జిట్ దరిమిలా ప్రపంచ పటంపై తన స్వతంత్ర శక్తిని స్ధాపించాలని తహతహ లాడుతున్న బ్రిటన్ కూడా ఈ ఆధిపత్య ప్రభావాల దొమ్మీలో జొరబడింది. ఆకస్ పరిణామం వెనుక బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రధాన చొరవ ఉన్నదని కొన్ని ఇటీవలి విశ్లేషణలు చెబుతున్నాయి. నిజానికి యూ‌కే, ఆస్ట్రేలియాలు మొదట నిర్ణయించుకుని అమెరికా ముందు ప్రతిపాదన ఉంచినట్లు కూడా విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవం ఏమిటో సమీప భవిష్యత్తులో తెలియవచ్చు.

ఆకస్ ఏర్పాటులో బ్రిటన్ పాత్ర ప్రబలంగా ఉందన్నది ఇక్కడ గమనించాలి. క్వాడ్ సభ్య దేశాలు జపాన్, ఇండియాలను ఈ కూటమి మినహాయించడాన్ని తెల్లజాతి ఆధిపత్య స్వభావంలో భాగమేనని అనేకమంది వ్యాఖ్యానించడం గమనించవలసిన విషయం. చైనా, రష్యాల ప్రాబల్యాన్ని ఎదుర్కోవడానికి అమెరికా అనేకసార్లు “అమెరికా ప్రత్యేకతల” (American Exceptionalism – అమెరికా స్వతస్సిద్ధంగానే ప్రత్యేక లక్షణాలు కలిగి ఉందన్న వాదన) గురించి వాదించడం తెలిసిందే. మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా ఈ వాదనను పదే పదే వల్లించడం ఇటీవలి విషయమే. జాతి, మత, లింగ, ప్రాంత వైరుధ్యాలకు, విభేదాలకు అతీతంగా సర్వ మానవ సమానాత్వాన్ని ప్రభోదించే ఆధునిక విలువకు ఈ వాదన విరుద్ధం అయినప్పటికీ అమెరికా దాన్ని తిరిగి తిరిగి వల్లె వేస్తూనే ఉన్నది.

కనుక నానాటికీ క్షీణిస్తున్న తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ‘ఆంగ్లో-సాక్సన్’ శక్తులు తెల్లజాతి దురహంకారాన్ని, ప్రత్యేకతను తిరిగి తెరమీదికి తేనున్నాయనీ, తెల్లజాతి వలస శక్తులు చైనాపై ప్రతీకారం తీర్చుకోవడానికి పూనుకున్నదని చెప్పేందుకు ఆకస్ ఒక ప్రబల సూచిక అనీ ఈ వాదనలోని సారాంశం. రెండో ప్రపంచ యుద్ధం ముందు కాలంలో హిట్లర్ సాగించిన యూదు జాతి హత్యాకాండ సర్వ విదితమే. ‘నాగరితల యుద్ధం’ పేరుతో సెప్టెంబర్ 11 టెర్రరిస్టు దాడులకు ముందు అమెరికా ముస్లిం ప్రజలపై పరోక్ష యుద్ధం ప్రకటించడం నిన్న మొన్నటిదే. అయితే   ఈ వాదనను ధృవీకరించటానికి మరిన్ని పరిణామాలు జరగాల్సి ఉన్నది.

….. తరువాయి రెండో భాగంలో

10 thoughts on “ప్రపంచ యుద్ధ ప్రమాదాన్ని చేరువ చేసిన ‘ఆకస్’ మిలట్రీ కూటమి

  1. అవును లోకేశ్వర్ గారు. చాలా కాలం తర్వాత. నాకూ సంతోషంగా ఉంది. మళ్ళీ మొదలు పెట్టినందుకు.

    హరీష్ గారు, ప్రస్తుతం బాగానే ఉన్నాను. ధన్యవాదాలు.

  2. కిరణ్ గారు, బాగున్నాను. నాకు, నా భార్యకు జరిగే సంభాషణల్లో అప్పుడప్పుడూ మీ ప్రస్తావన జొరబడుతు ఉంటుంది. మీరు బాగున్నారని తలుస్తాను.

వ్యాఖ్యానించండి