కస్టమ్స్ సుంకం తగ్గించి ట్రంప్ కి ఫోన్ చేసిన మోడి


Trump at cabinet meeting

ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రుల (కేబినెట్) విధాన నిర్ణయాలు ఎవరి ప్రయోజనం కోసం ఉద్దేశించబడి ఉండాలి? ఈ ప్రశ్నకు జవాబు చాలా సులభం. దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు విధానాలు రూపొందించి అమలు చేయాలి.

విదేశాలు, విదేశీ కంపెనీల మరియు విదేశీయుల పెట్టుబడుల ప్రయోజనాల కోసం భారత ప్రభుత్వం పని చేయకూడదు. అలా ఎవరైనా చేస్తే దేశద్రోహం అవుతుంది. భారత దేశ రక్షణ కోసం పని చేసే ఆర్మీ-నేవీ-ఎయిర్ ఫోర్స్ అధికారులు రక్షణ రహస్యాలను విదేశాలకు అందజేస్తే దేశ ద్రోహం అయినట్లే, దేశాన్ని అభివృద్ధి చేయవలని అధికారం అప్పగించబడిన ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రి, కేంద్ర కేబినెట్ తదితరులు విదేశాలు, వారి కంపెనీల కోసం విధానాలు రూపొందించినా, చర్యలు తీసుకున్నా దేశద్రోహం అవుతుంది.

ఇటీవల బడ్జెట్ లో అమెరికాకి చెందిన లగ్జరీ మోటార్ సైకిళ్ళ కంపెనీ హార్లే డేవిడ్సన్ మన దేశానికి చేసే ఎగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది కేంద్ర ప్రభుత్వం.

ఈ చర్య ఎవరికి మేలు చేసింది? ఈ ప్రశ్నకు సమాధానం కూడా కష్టం కాదు. ఈ చర్య వల్ల హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళ ఇండియా ఎగుమతులు పెరుగుతాయి; హార్లే డేవిడ్సన్ కంపెనీ ఆదాయం పెరుగుతుంది; అమెరికా ఆదాయం మరియు జి‌డి‌పి పెరుగుతుంది. వెరసి మోడి-జైట్లీ చర్య అమెరికాకు మేలు చేస్తుంది.

మరో వైపు ఇండియా దిగుమతులు పెరుగుతాయి. అందుకోసం ఇండియా మరింత విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు పెట్టుకోవాలి. ఆ మేరకు విదేశీమారక ద్రవ్య నిల్వలు తగ్గుతాయి. హార్లే డేవిడ్సన్ దిగుమతులు పెరిగినంత మేరకు ఇండియాలో తయారయ్యే లగ్జరీ మోటార్ సైకిళ్ళ ఉత్పత్తి తగ్గిపోతుంది. అనగా ఇండియా కంపెనీల ఆదాయం, ఇండియా జి‌డి‌పి తగ్గిపోతుంది.

మోటార్ సైకిళ్ళ దిగుమతులపై ఇప్పటి వరకూ విధించిన 100% మరియు 75% కస్టమ్స్ సుంకాన్ని 50% కి తగ్గించడం వల్ల అమెరికా ఆదాయం, జి‌డి‌పి లు పెరిగితే, ఇండియా ఆదాయం, జి‌డి‌పి లు తగ్గుతాయి. మేక్-ఇన్-ఇండియా స్కీమ్ కి కేంద్ర ప్రభుత్వమే హాని చేసినట్లు!

ఇంతవరకూ ఒక కధ! ఈ కధకి రుజువు ఏమిటి అంటే భారత దేశ ప్రధాన మంత్రి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి చేసిన ఫోన్ కాల్! మోడి ఫోన్ కాల్ గురించి డొనాల్డ్ ట్రంప్ స్వయంగా అక్కడ ఉన్న తన కేబినెట్ సభ్యులకీ, విలేఖరులకి చెప్పాడు. ఆ సందర్భంగా ఇండియా పైన ట్రంప్ జోక్ లు పేల్చడం విపరిణామం. ఓ పక్క తమ వ్యతిరేకులపై జాతి-వ్యతిరేక ముద్రలు వేస్తున్న బి‌జే‌పి మంత్రులు, నేతలు అమెరికాకు మేలు చేసే విధానాలు అమలు చేస్తూ కూడా దేశం అపహాస్యానికి గురవడానికి కారకులు అవుతున్నారు.

మోడి ఫోన్ కాల్ గురించి ట్రంప్ ఏం చెప్పాడో చూడండి:

“ఇంకా ఇండియా నుండి ఓ గొప్ప జెంటిల్ మేన్ నాకు ఫోన్ చేసి, మేము (హార్లే డేవిడ్సన్) మోటార్ సైకిళ్ళ పైన ఇప్పుడే సుంకం తగ్గించామని చెప్పారు. 75% నుండి 50% కీ, 100% నుండి 50% కీ తగ్గించామని చెప్పారు.”

‘ఇండియా నుండి జెంటిల్ మెన్’ అంటే భారత ప్రధాని నరేంద్ర మోడి అని. తనకు మోడీ మధ్య నడిచిన ఫోన్ సంభాషణలో సుంకం తగ్గించిన సంగతిని మోడి తెలియజేశారని ట్రంప్ చెప్పాడు.

అమెరికా సరుకులపై కస్టమ్స్ పన్ను తగ్గించి ఆ సంగతిని వెంటనే నేరుగా అమెరికా అధ్యక్షుడికే మన ప్రధాని ఫోన్ చేసి చెప్పారు. “మేము మీకు హామీ ఇచ్చినట్లు మీ కంపెనీలకు మేలు చేశాం, చూసారా?” అని మన ప్రధాని అమెరికా ప్రసిడెంట్ కి చెప్పారు.

ఈ వైపరీత్యాన్ని మనం ఎన్నడన్నా విన్నామా? మన జి‌డి‌పి కి నష్టం; అమెరికా జి‌డి‌పి కి లాభం చేసే చర్య తీసుకోవడం ఒక ఎత్తైతే ఆ సంగతి అమెరికా అధ్యక్షుడికి మన ప్రధాన మంత్రే ఫోన్ చేసి చెప్పడం మరో ఎత్తు. మన ప్రధాని, మన భారత దేశానికి అత్యంత ఉన్నత స్ధాయి అధికారి మరియు నేతగా ఉన్న ప్రధాన మంత్రి మోడి ఇటువంటి పరిస్ధితిలో ఉండడం ఎన్నడన్నా ఎరుగుదుమా?

భారత ప్రభుత్వం ఒక ముఖ్యమైన వార్షిక పత్రం ద్వారా ప్రకటించిన విధాన నిర్ణయాన్ని విదేశీ ప్రభుత్వ నేతకు చెప్పవలసిన అవసరం ఏమిటి? ప్రభుత్వాధినేతలు తమ తమ దేశము మరియు దేశ ప్రజల గురించి, వారి గొప్పతనం గురించి వివరాలు ఇచ్చి పుచ్చుకుంటే అది సహజం. తమ తమ విదేశీ విధానాలు చెప్పినా, అవతలి దేశం వల్ల మనకు వస్తున్న సమస్యలు చెప్పినా, మన దేశ అభివృద్ధికి తోడ్పడే అంశాలను చర్చించినా… సహజమే. ఈ అంశాలు వివిధ సందర్భాల్లో మాట్లాడుకుంటారు కూడా.

కానీ ఒక వాణిజ్య చర్య గురించి ఒక దేశాధినేత మరో దేశాధినేతకు రిపోర్ట్ చేయడం ఖచ్చితంగా అసహజం. వాణిజ్య సుంకాల గురించి అధికారులు మాట్లాడుకుంటారు. లేకపోతే వాణిజ్య మంత్రులు (కామర్స్ మినిస్టర్) మాట్లాడుకుంటారు. బేరసారాలు సాగిస్తారు. కానీ బడ్జెట్ లో సుంకం తగ్గించి “మీకు మేలు చేశాం” అని చెప్పడం అసహజం. బొత్తిగా తగని విషయం.

Harley Davidson bikes

మోడి ఫోన్ కాల్ గురించి చెప్పడం తోనే ట్రంప్ ఆగిపోలేదు. 50% సుంకం కూడా ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నిస్తున్నట్లుగా సూచిస్తూ జోక్ లు పేల్చాడు. ప్రతీకార సుంకాలు విధిస్తామని ఇండియాను బెదిరించాడు.

“మనకు చాలా దేశాలున్నాయి. మనం ఒక ఉత్పత్తి తయారు చేస్తాం. వారు ఒక ఉత్పత్తిని తయారు చేస్తారు… వారి దేశాల్లోకి ప్రవేశించడానికి మనం భారీ పన్నులు చెల్లించాలి – మోటార్ సైకిళ్ళు, హార్లే డేవిడ్సన్- ముఖ్యంగా ఒక దేశం గురించి చెప్పుకోవాలి. ఆ దేశం ఇండియాయే అన్న నిజాన్ని నేను ఇప్పుడు చెప్పబోవడం లేదు..”

అని ట్రంప్ చెప్పగానే అక్కడ ఉన్న విలేఖరులు, కేబినెట్ సభ్యులు పెద్ద పెట్టున నవ్వారని పత్రికల సమాచారం.

“ఒక గొప్ప జెంటిల్ మేన్ ఇండియా నుండి ఫోన్ చేసి తాము ఇప్పుడే మోటార్ సైకిళ్ళ పైన సుంకం తగ్గించామని చెప్పారు…” అంటూ ట్రంప్ కొనసాగించాడు.

“కాబట్టి నేనేమంటానంటే, ఇటువంటి కేసుల్లో మనం ప్రతీకార పన్నులు (Reciprocal Taxes) విధించాలి. నేను ఇండియాను తప్పు బట్టడం లేదు. ఇలా చేస్తూ కూడా ఆ దేశం తప్పించుకోగలగడం గొప్ప విషయం అనుకుంటాను. వాళ్ళు తప్పించుకుపోవడానికి ఎలా అనుమతించారో నాకు తెలియదు. కానీ (మనకు జరుగుతున్న) అన్యాయానికి ఇదొక ఉదాహరణ. ఇవి జరగకుండా ప్రతీకార పన్ను విధించాలి.”

అని ట్రంప్ బెదిరించాడు.

“మనం, హార్లే డేవిడ్సన్ వాళ్ళ దేశంలో ప్రవేశించి మోటార్ సైకిల్ అమ్ముకోవాలంటే 50 నుండి 75 శాతం సుంకం చెల్లించాలి. అయినప్పటికీ వాళ్ళు వేల కొద్దీ మోటార్ సైకిళ్ళని అమెరికాలో ఇండియా అమ్ముకుంటుంది. ఈ సంగతి చాలా మందికి తెలియదు. వాటి పైన మన పన్ను ఎంతో తెలుసా? ఏమీ లేదు, సున్నా.”

ఇది అబద్ధం. ఇండియా నుండి వేలాది మోటార్ సైకిళ్ళు అమెరికాకు దిగుమతి అవుతుంటే సుంకం విధించకుండా అమెరికా వదిలి పెట్టదు. ఒక్క రాయల్ ఎన్ ఫీల్డ్ తప్ప మరే ఇతర కంపెనీ మోటార్ సైకిళ్ళకి అమెరికాలో మార్కెట్ లేదు. ఇక్కడి లాగా తక్కువ కెపాసిటీ (సిసి) ప్రయాణ మోటార్ సైకిళ్ళను అక్కడ వాడరు. రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే అమెరికాకు ఎగుమతి అవుతాయి. ట్రంప్ చెప్పినట్లు “వేల కొద్దీ” కాదు.

రాయల్ ఎన్ ఫీల్డ్ ఎగుమతి చేసే మోటార్ సైకిళ్ళు మధ్యమ కెపాసిటీ కలిగినవి. 350 CC నుండి 550 CC వరకూ మాత్రమే. ఈ కంపెనీ మొత్తం ఉత్పత్తిలో ఎగుమతులు కేవలం 3 శాతం మాత్రమే. అంటే దాదాపు 3300 బైక్ లు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఈ‌యూ దేశాలన్నీ కలిపి 3300 ఎగుమతి చేస్తే అందులో అమెరికా ఎగుమతులు ఎన్ని ఉండగలవు. ట్రంప్ చేప్పినట్లు “వేలాది” అయితే కాదు. ఇంత తక్కువ దిగుమతులపైన పన్ను వేస్తే అమెరికాకి వచ్చేది ఏమీ లేదు.

హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళలో అత్యంత తక్కువ ఖరీదు, రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ ఖరీదు కంటే 3 రెట్లు ఎక్కువ. నిజానికి హార్లే డేవిడ్సన్ కి 2010 నుండి ఇండియాలో ఫ్యాక్టరీ నడుపుతోంది. ఇది విడి భాగాలను అమెరికా నుండి దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేస్తుంది. సుంకం ఎగవేసేందుకు ఇలాంటి ఎత్తుగడలకు అమెరికా, ఐరోపా కంపెనీలు పాల్పడడం కద్దు. కనుక ఇండియాలో అసెంబుల్ చేయనివి మాత్రమే హార్లే డేవిడ్సన్ ఎగుమతి చేస్తుంది.

కనుక ట్రంప్ వలపోత, అపహాస్యంల లక్ష్యం సుస్పష్టం. సుంకం సున్నాకు తగ్గించి తమ కంపెనీ మోటార్ సైకిళ్ళ ఇండియా ధరల్ని వీలైనంత కనీస స్ధాయికి తగ్గించుకుని అమ్మకాలు పెంచుకోవడం. దాదాపు పదేళ్ళ నుండి హార్లే డేవిడ్ సన్ ఇందుకోసం లాబీయింగ్ నడుపుతోంది. ట్రంప్ హయాంలో మరింత ఒత్తిడి పెంచింది. ఆ ఒత్తిడికి మోడి ప్రభుత్వం తల వంచింది. తల వంచడమే కాకుండా “మేము తలవంచాం. కాస్త గమనించండి” అని ట్రంప్ కి ఫోన్ చేసి చెప్పుకుంది.

ఇదా స్వదేశీ ప్రభుత్వం? నవ్వి పోదురు గాక!

2 thoughts on “కస్టమ్స్ సుంకం తగ్గించి ట్రంప్ కి ఫోన్ చేసిన మోడి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s