
Kodli -Largest Iron Ore Mine in Goa
కాంగ్రెస్ పార్టీ అవినీతికి రారాజు అని బిజేపి నేతలు తిట్టి పోస్తారు. ఎన్నడూ నోరు మెదపని ప్రధాని నరేంద్ర మోడి ఎన్నడన్నా నోరు తెరిస్తే మాత్రం కాంగ్రెస్ అవినీతి గురించీ, అనువంశిక పాలన గురించీ విమర్శించకుండా ఉండడు. కానీ కాంగ్రెస్ అవినీతిని కొనసాగించడానికి మాత్రం బిజేపికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు.
గోవా బిజేపి ప్రభుత్వం రెన్యూవల్ చేసిన 88 మైనింగ్ లీజులు అక్రమం అని సుప్రీం కోర్టు ధర్మాసనం నిర్ధారించింది. లీజులను రద్దు చేస్తూ ఈ రోజు -ఫిబ్రవరి 7- తీర్పు ప్రకటించింది. తీర్పు దరిమిలా ఇనుము, మాంగనీసు గనుల తవ్వకాల నిమిత్తం బిజేపి ప్రభుత్వం జారీ (రెన్యువల్) చేసిన లైసెన్స్ లు రద్దవుతాయి. మార్చి 15 లోపు మైనింగ్ కార్యకలాపాలు ఆగిపోతాయి.
జస్టిస్ మదన్ బి లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. 2015లో మోడి ప్రభుత్వం తెచ్చిన మైనింగ్ చట్టం ప్రకారం గనుల తవ్వకాల లైసెన్స్ ల జారికై వేలం నిర్వహించి కొత్తగా లైసెన్స్ లు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.
ఈ రోజు రద్దయిన లీజు అనుమతులు ఇలా రద్దు కావడం రెండవసారి. గనుల కేటాయింపుల లోనూ, తవ్వకాలలోనూ అక్రమాలు జరిగాయని నిర్ధారించిన సుప్రీం కోర్టు 2012 లో ఒకసారి లీజులు రద్దు చేసింది. మొత్తం గనుల తవ్వకాలపై నిషేధం విచించింది. ఏడాది తర్వాత నిషేధాన్ని పాక్షికంగా సడలించింది.
సడలింపును ఆసరా చేసుకుని 2015 లో బిజేపి ప్రభుత్వం రద్దయిన లీజులను రెన్యువల్ చేస్తూ హడావుడిగా ఆదేశాలు ఇచ్చింది. అది కూడా పాత తేదీ (2007) నుండి లీజుల పునరుద్ధరణ అమలులో ఉన్నట్లుగా ఆదేశాలు ఇచ్చింది.
మోడి ప్రభుత్వం గనుల తవ్వకాల లైసెన్స్ లను తప్పనిసరిగా వేలం ద్వారా కేటాయించబడేలా ఒక చట్టం చేసింది. దాని పేరు గనులు మరియు ఖనిజాల (నియంత్రణ మరియు అభివృద్ధి) చట్టం –Mines and Minerals (Regulation & Development) Act.
సరిగ్గా ఈ చట్టం చేయడానికి ముందు గోవా బిజేపి ప్రభుత్వం హడావుడిగా పాత తేదీ నుండి అమలులో ఉండేలా లీజులను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా వేలంలో పలికే ధరలు చెల్లించే పరిస్ధితి నుండి కంపెనీలను తప్పించింది. ప్రజా వనరులైన ఖనిజాలను పెట్టుబడిదారీ కంపెనీలకు, ధనికులకు ఉచితంగా తవ్వుకునేందుకు పంచి పెట్టింది.
కాంగ్రెస్ ఏలుబడిలోని అవినీతి దరిమిలా సుప్రీం కోర్టు రద్దు చేసిన మైనింగ్ లీజు అనుమతులను బిజేపి ప్రభుత్వం హడావుడిగా రెన్యువల్ చేయడం ద్వారా తానూ కాంగ్రెస్ పార్టీకి తక్కువ కాదని నిరూపించుకుంది.
కాగా సదరు లీజుల రెన్యువల్ పైన ఒక ఎన్‌జిఓ సంస్ధ దాఖలు చేసిన ప్రజాహితవ్యాజ్యంను సుప్రీం కోర్టు విచారించి ఈ రోజు తీర్పు వెలువరించింది. బిజేపి పునరుద్ధరించిన 88 లీజు లైసెన్స్ లను రద్దు చేసేసింది. తద్వారా బిజేపి అవినీతిని హై కోర్టు నిర్ధారించింది.
ఇనప గనుల తవ్వకాల్లో అప్పటి గోవా కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని గోవా బిజేపి నేతలు ఇప్పటికీ విమర్శిస్తూ ఉంటారు. ముడి ఇనుము మైనింగ్ పై ఏర్పాటు చేసిన జస్టిస్ షా కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని నిర్ధారించింది. దరిమిలా సుప్రీం కోర్టు 2012లో మైనింగ్ అనుమతులను అన్నింటినీ రద్దు చేసింది.
కాంగ్రెస్ హయాంలో జరిగిన 35000 వేల కోట్ల మైనింగ్ కుంభకోణం కంటే బిజేపి హయాంలో జరిగిన మైనింగ్ కుంభకోణం మరింత పెద్దదని ఏఏపి పార్టీ గోవా శాఖ ఆరోపించడం గమనార్హం. కేసు దాఖలు చేసిన గోవా ఫౌండేషన్ ను అభినందించిన ఏఏపి పార్టీ బిజేపి ప్రభుత్వ అవినీతిని తూర్పారబట్టింది.
“జస్టిస్ ఎంబి షా కమిటీ 35,000 కోట్ల అక్రమ మైనింగ్ కుంభకోణాన్ని వెల్లడి చేసింది. బిజేపి ప్రభుత్వం కమిటీ నివేదికపై ఎలాంటి చర్యా తీసుకోలేదు. కేంద్ర చట్టం అమలులోకి రావడానికి సరిగ్గా ముందు హడావుడిగా 89 మైనింగ్ లీజులను పునరుద్ధరించడం అంతకంటే పెద్ద కుంభకోణం” అని ఆమ్ ఆద్మీ పార్టీ గోవా కన్వీనర్ ఎల్విస్ గోమ్స్ విమర్శించాడు.
“ఈ తీర్పుతో బిజేపి సిగ్గు పడాలి. లీజుల పునరుద్ధరణ జరిగిన తీరుపై విచారణ జరగాలి. గోవా ఫౌండేషన్ సంస్ధను మేము అభినందిస్తున్నాము” అని గోమ్స్ పత్రికలతో మాట్లాడుతూ అన్నాడు.
షా కమిషన్ నివేదిక వెలువడక ముందు గోవా రాష్ట్రం సంవత్సరానికి 50 మిలియన్ టన్నుల ముడి ఖనిజాన్ని ఎగుమతి చేసేది. లీజులను కేటాయించిన ప్రభుత్వ సంస్ధలతో పాటు, మైనింగ్ కార్యకలాపాలలో ఉన్న కంపెనీలు దాదాపు అన్నింటినీ షా కమిషన్ తప్పు పట్టింది. తిరిగి అదే కంపెనీలకు లైసెన్స్ లు పునరుద్ధరిస్తూ బిజేపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆర్ధిక విధానాలు, అవినీతి లలో కాంగ్రెస్, బిజేపి లకు ఎలాంటి తేడా లేదని లోక్ పాల్ చట్టం చేయడంలోనే రుజువయింది. గోవా మైనింగ్ లీజుల రద్దు దానిని మరోసారి ధ్రువపరిచింది. కాంగ్రెస్ అవినీతిని, ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నాలుగు సం.ల తర్వాత కూడా, విమర్శిస్తూ పబ్బం గడుపుకోవడం మోడీ ప్రభుత్వం మానుకోవాలి.