“రష్యాలో వర్షం కురిస్తే భారత కమ్యూనిస్టులు ఇండియాలో గొడుగు పట్టుకుంటారు” అని గతంలో పరిహాసం ఆడేవాళ్లు. బిజేపి పార్టీ, దాని అనుబంధ సంఘాల వాళ్ళకు ఈ పరిహాసం అంటే తగని ఇష్టంగా ఉండేది. “భారత స్టాక్ మార్కెట్ల పతనానికి మేము తెచ్చిన ఎల్‌టిసిజి పన్ను కారణం కాదు, బలహీన గ్లోబల్ (అమెరికా అని చదువుకోవాలి) ఆర్ధిక పరిస్ధితులే అందుకు కారణం” అని ఇప్పుడు బిజేపి మంత్రి జైట్లీ నిజాలను విడమరిచి చెబుతున్నాడు. అప్పుడు కమ్యూనిస్టులపై చేసిన పరిహాసం కేవలం పోలిక మాత్రమే తప్ప వాస్తవం కాదు. కాగా ఈ రోజు అమెరికా కాస్త తుమ్మితే భారత ఆర్ధిక వ్యవస్ధకు ముక్కులు కారిపోవడం మాత్రం కఠిన వాస్తవం. ఎంత వాస్తవం అంటే ఫిబ్రవరి 1 నుండి 6 తేదీ వరకు జరిగిన భారత షేర్ల పతనం వల్ల మదుపుదారులు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయేటంత! ఈ మొత్తం భారత వార్షిక బడ్జెట్ లో సగం కంటే ఎక్కువే!
ట్రెజరీ బాండ్లపై రాబడి (యీల్డ్)
షేర్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడికి బీజం అమెరికా సార్వభౌమ ఋణ పత్రాల యీల్డ్ (లాభం/రాబడి/వడ్డీ రేటు) లో పడింది. ఇందులోకి వెళ్ళే ముందు కొన్ని మౌలిక అంశాలు తెలుసుకోవాలి. అమెరికా ప్రభుత్వ రోజువారీ ఖర్చులు నడిపేందుకు అమెరికా ట్రెజరీ వివిధ కాల పరిమితులతో సార్వభౌమ ఋణ పత్రాలు జారీ చేయడం ద్వారా ఋణ సేకరణ జరిపే సంగతి తెలిసిందే. వేలం ద్వారా తక్కువ వడ్డీ రేటు కోట్ చేసిన వారికి ఋణ పత్రాలు దక్కుతాయి. ప్రైమరీ మార్కెట్ లో పలికే యీల్డ్ స్ధిరమైంది. బాండు పరిపక్వం అయ్యేవరకూ ఇందులో మార్పు ఉండదు.
ట్రెజరీ బాండ్లు జారీ చేశాక అవి మార్కెట్ లో మళ్ళీ మళ్ళీ అమ్మకాలు-కొనుగోళ్లకు గురవుతూ ఉంటాయి. అదనపు వడ్డీ రేటు ఇవ్వజూపడం ద్వారా వ్యక్తులు/కంపెనీలు/సంస్ధలు సెకండరీ మార్కెట్లో మారు బేరానికి బాండ్లు కొనుగోలు చేస్తాయి. సెకండరీ మార్కెట్లో పలికే వడ్డీ రేటుకూ, ప్రైమరీ వడ్డీ రేటు (మళ్ళీ జరిగే వేలంలో పలికే వడ్డీ రేటు) కూ సంబంధం ఉండదు. సెకండరీ మార్కెట్ లో వడ్డీ ఎక్కువ పలికితే ఆ ఎక్కువ వడ్డీనే ట్రెజరీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడం కుదరదు. అయితే సెకండరీ మార్కెట్ లో పలికే వడ్డీ రేట్ల ప్రభావం ప్రైమరీ మార్కెట్ పై అనివార్యంగా పడుతుంది. ఎందుకంటే బాండ్ల గిరాకీ ఏ స్ధాయిలో ఉన్నదో సెకండరీ మార్కెట్ లో పలికే తాజా యీల్డ్ తెలియజేస్తుంది గనుక.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షరికం ప్రారంభం అయ్యాక కంపెనీలకు, పెట్టుబడిదారులకు వరాల వర్షం కురిపించాడు. కురిపించడమే కాదు చర్యలు తీసుకుని అమలు చేశాడు కూడా. ట్రంప్ పదవీ స్వీకారం నాడు 100 మిలియన్ డాలర్ల మేర (హఫింగ్టన్ పోస్ట్) ఖర్చు పెట్టి పండగ జరిపిన బడా కార్పొరేట్లకు తగిన విధంగా లబ్ది చేకూర్చాడు. కార్పొరేట్ కంపెనీలకు పెద్ద మొత్తంలో పన్ను రాయితీలు కల్పించాడు. బడా ధనికులు, కార్పొరేషన్ లకు 2026 వరకు 350 బిలియన్ డాలర్ల పన్ను కోత ప్రకటించాడు. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఎఫర్డబుల్ కేర్ యాక్ట్ (ఒబామా కేర్ -ఆరోగ్య సంరక్షణ చట్టం) రద్దు చేశాడు. కంపెనీలకు అడగకుండానే సబ్సీడీలు ప్రకటించాడు. టాక్స్ హాలిడేలు ప్రకటించాడు. పెద్ద కార్పొరేట్ కంపెనీల సిఈఓల నుండి కార్పొరేషన్ ల నుండి బహిరంగంగానే సలహాలు, సూచనలు, మార్గదర్శకత్వం స్వీకరిస్తూ విధానాలను రూపొందిస్తున్నాడు. కార్పొరేట్ ప్రయోజనాల నిమిత్తం క్రమం తప్పకుండా ఏదో ఒక కొత్త నిర్ణయం ప్రకటిస్తూనే ఉన్నాడు.
ప్రభుత్వ నియంత్రణ కార్యకలాపాలను నిర్దిష్ట కాలం పాటు స్తంభింపజేసి కార్పొరేట్లకు పూర్తి స్వేచ్ఛ కల్పించాడు. ప్రభుత్వం రూపొందించే ప్రతి కొత్త నిబంధనకు గాను రెండు పాత నిబంధనలు రద్దు చేయాలని ఈఓ (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) జారీ చేశాడు. ప్రభుత్వంలో ప్రధాన పోస్టులను కార్పొరేట్ కంపెనీల మాజీ బాస్ లతోనూ, కంపెనీల అధిపతులతోనూ నింపేశాడు. (ట్రంప్ స్వయంగా బడా రియల్ ఎస్టేట్ కంపెనీకి అధిపతి). వాతావరణ మార్పులపై ప్యారిస్ లో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం నుండి బైటికి వచ్చేశాడు. భూతాపానికి కారణం అని చెప్పిన పెట్రోలు, గ్యాస్ కంపెనీలకు వేగంగా అనుమతులు ఇచ్చేశాడు. ‘వాతావరణ మార్పు’ అన్న పదాన్నే వాడకూడదని ప్రభుత్వ విభాగాలకు హుకుం వేశాడు. ఒబామా తెచ్చిన క్లీన్ విద్యుత్ పధకాన్ని రద్దు చేశాడు. మెదడుకు హాని చేసే పురుగు మందుల తయారీకి డౌ జోన్స్ కెమికల్ కు అనుమతి ఇచ్చాడు. మిలటరీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ప్రయోజనం చేకూర్చుతూ మిలట్రీ బడ్జెట్ భారీగా పెంచాడు. సౌదీ అరేబియాతో భారీ ఆయుధ అమ్మకం ఒప్పందం చేసుకుని మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోశాడు.
కార్పొరేట్ల ప్రయోజనం కోసం ట్రంప్ చేపట్టిన చర్యల్లో ఇవి కొన్ని మాత్రమే. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వర్గం ప్రయోజనాలు నెరవేర్చే విధానాలు స్టాక్ మార్కెట్లకు అమిత ప్రియం. ట్రంప్ అండతో అమెరికా స్టాక్ మార్కెట్లు, పొడిగింపుగా ఐరోపా, జపాన్, హాంగ్ కాంగ్ మార్కెట్లు మిడిసిపడ్డాయి. నెలకు 40 బిలియన్ల మేర ట్రెజరీ బాండ్లను తిరిగి కొనుగోలు చేసే ‘ఉద్దీపన చర్య’ (క్వాంటిటేటివ్ ఈజింగ్) ద్వారా విడుదల అయిన సొమ్ము కూడా ప్రపంచ షేర్ మార్కెట్లను పైపైకి నెట్టింది.
అమెరికా షేర్ మార్కెట్ జోరుకు మరో కారణం బాండ్ల పై యీల్డ్ కంటే షేర్ మార్కెట్ లాభాలు ఆకర్షణీయంగా ఉండటం. పెట్టుబడి లాభం ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. ఈ పరిస్ధితుల్లో ఫిబ్రవరి 2వ తేదీన (భారత బడ్జెట్ ప్రకటించిన మరుసటి రోజు) అమెరికా బాండ్ యీల్డ్ గత 4 యేళ్ళలో అత్యధిక స్ధాయిలో పలికింది. అంటే షేర్ మార్కెట్ కంటే బాండ్ మార్కెట్ భద్రం అని మార్కెట్ ప్లేయర్లకు ఉప్పు అందిందన్నమాట! ఆ ఉప్పు ఏమిటి అంటే కార్పొరేట్ కంపెనీలకు ఇటీవల ట్రంప్ ప్రకటించిన పన్ను కోతలు ప్రభుత్వం భారీ మొత్తంలో ఋణ సేకరణ చేయనుందని రూఢి చేయడం.
ఋణ సేకరణ కోసం బాండ్ల సరఫరా పెంచాలి. బాండ్ల కొనుగోలు బదులు బాండ్ల అమ్మకం జరుగుతుందన్న ఈ సూచన బాండ్ల యీల్డ్ ని పెంచివేసింది. సెప్టెంబర్ 2017 లో 10 యేళ్ళ కాలపరిమితితో కూడిన బాండ్లపైన 2.1% యీల్డ్ రాగా అది ఫిబ్రవరి నెలలో 2.8 % కి పెరిగింది. బాండ్ యీల్డ్ లో శతాంశంలో తేడా వచ్చినా మిలియన్ల కొద్దీ లాభాల్ని సమకూర్చుతుంది. అలాంటిది 0.7% పెరుగుదల అంటే పెద్ద మొత్తంలో లాభాలు ఇస్తుంది. బాండ్ల యీల్డ్ పెరగడంతో తొక్కిడి మొదలయింది. షేర్ల కంటే బాండ్లలో మదుపు లాభకరం అన్న సెంటిమెంట్ బలపడింది. యీల్డ్ పెరుగుదల వల్ల షేర్ మార్కెట్ లో పెట్టుబడి బాండ్ మార్కెట్ లోకి ప్రవహిస్తుందన్న స్పెక్యులేషన్ జోరందుకుంది. ఇది సైక్లిక్ ఎఫెక్ట్ గా మారింది.
అమెరికా వేతనాల పెరుగుదల
అమెరికాలో ప్రతి నెలా వివిధ గణాంకాలు వెలువరిస్తారు. అందులో నిరుద్యోగం, ఉపాధి, వేతనాల గణాంకాలు కూడా ఉంటాయి. జనవరి నెలలో అత్యధికంగా 2 లక్షల ఉద్యోగాలు కల్పించబడ్డాయని, కార్మికులు ఉద్యోగుల వేతనాలు 2009 తర్వాత కాలంలో అత్యధిక వేగంగా పెరిగాయని, నిరుద్యోగం 4.1 శాతానికి తగ్గిందని ఆ నెల గణాంకాలు తెలిపాయి. ఇవి మరో వైపు నుండి ఒత్తిడికి కారణం అయ్యాయి. వేతనాల పెంపుదల అనివార్యంగా ద్రవ్యోల్బణం పెరగడానికి దారి తీస్తుందన్నది పెట్టుబడిదారీ సూత్రీకరణ. పెట్టుబడిదారులకు బిలియన్ల కొద్దీ నిధులు కురిపించినా పెరగని ద్రవ్యోల్బణం అంచనాలు కార్మికుల వేతనాలు పెరిగినప్పుడు ఠంచన్ గా పెరిగిపోయి టెన్షన్ ను సృష్టిస్తాయి.
ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు సెంట్రల్ బ్యాంకు (అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు) మానిటరీ విధానం సవరించడానికి తగిన పరిస్ధితులు తయారవుతాయి. ఇది సాధారణ సూత్రం. లేకుంటే అనేక విపరిణామాలకు దారి తీస్తుంది. వడ్డీ రేట్లలోని వ్యత్యాసాలు ద్రవ్య కార్యకలాపాలకు చోదక శక్తిగా ఉంటాయి. ఉత్పాదక కార్యకలాపాలలోని లాభ నష్టాలకు కూడా ఫెడరల్ వడ్డీ రేటు ఒక రిఫరెన్స్ గా ఉంటుంది. మానిటరీ విధానంలో ప్రధాన ఉపకరణం వడ్డీ రేటు పెంపు లేదా తగ్గింపు. ప్రస్తుత సందర్భంలో పెంపుని పరిగణలో తీసుకోవాలి.
ఫెడరల్ రిజర్వ్ కఠిన ద్రవ్య విధానం
పైన చూసినట్లు ద్రవ్యోల్బణంకి సంబంధించిన ఆందోళనల నేపధ్యంలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు మరింత కఠినమైన మానిటరీ విధానాన్ని అవలంబిస్తుందన్న అంచనాలు జనవరి వరకు ఉన్నాయి. అనగా మార్కెట్ లో లిక్విడిటీ సరఫరా కళ్ళెం వేయడం. ఇందుకు రెండు చర్యలు రెడీగా ఫెడ్ కు అందుబాటులో ఉన్నాయి.
ఒకటి: క్వాంటిటేటివ్ ఈజింగ్ లో భాగంగా చేస్తున్న బాండ్ల కొనుగోలు నిలిపివేయడం. దీనితో ప్రపంచ షేర్ మార్కెట్లలోకి ప్రవహిస్తున్న పశ్చిమ ఎఫ్‌ఐఐ లకు నిధుల ప్రవాహం ఆగిపోతుంది లేదా తగ్గిపోతుంది. కాబట్టి ఇతర దేశాల షేర్ మార్కెట్ల లోకి ఎఫ్‌ఐఐ లుగా ప్రవహించిన పెట్టుబడి వెనక్కి వచ్చి భద్రమైన చోటికి చేరుకోవాలి. ప్రస్తుతానికి సాపేక్షికంగా అధిక లాభాలు ఇస్తున్న జపనీస్ యెన్ (కరెన్సీ) మార్కెట్, అమెరికా బాండ్ మార్కెట్లు బద్రంగా కనిపించడంతో షేర్ మార్కెట్లలోని పెట్టుబడి అక్కడికి ప్రయాణించింది. ఫలితంగా అమెరికా బాండ్ యీల్డ్, జపాన్ కరెన్సీ విలువ పెరిగాయి.

The US’ Federal Reserve Bank
రెండు: వడ్డీ రేట్ల పెంపుదల. బాండ్ యీల్డ్ పెరుగుదలతో వడ్డీ రేట్లను మరిన్నిసార్లు ఫెడ్ పెంచనుందని మార్కెట్లు అంచనాకు వచ్చాయి. జనవరి చివరి వారం వరకు చూసినా 2018 సం.లో ఫెడ్ కనిష్టం మూడు సార్లు వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలో మార్కెట్లు ఉన్నాయి. అవసరం అయితే 4 సార్లు కూడా పెంచవచ్చన్న అంచనాలో ఉన్నాయి. ఫిబ్రవరి 2 నాటి బాండ్ యీల్డ్ పెరుగుదల తర్వాత ఈ అంచనా 2 సార్లకు తగ్గిపోయింది.
వడ్డీ రేటు పెరిగితే ఫెడ్ నుండి బ్యాంకులకు అధిక వడ్డీ రేటుకు నిధులు అందుతాయి. కనుక బ్యాంకులు కూడా ఋణ స్వీకర్తల నుండి అధిక వడ్డీ వసూలు చేస్తాయి. కంపెనీలకు ఋణ లభ్యతను ప్రియం అవుతుంది. కాబట్టి ఆ మేర పెట్టుబడి అవసరాలను స్టాక్ మార్కెట్ల నుండి పెట్టుబడి ఉపసంహరణ ద్వారా పూడ్చుకునేందుకు మదుపుదారులు, కంపెనీలు సిద్ధం అవుతాయి. ఈ అంచనాతో అమెరికా, ఐరోపా, ఆసియాలతో పాటు ఇండియా లాంటి ఎమర్జింగ్ మార్కెట్ల లోనూ షేర్ మార్కెట్లు పతనం అయ్యాయి. ఇది మళ్ళీ బాండ్ల యీల్డ్ ని తగ్గించింది. ఏ యీల్డ్ పెరుగుదల మార్కెట్ల మేహం ను సృష్టించినదో అదే యీల్డ్ తిరిగి ప్రభావితమై బలహీనపడేందుకు దోహదం చేసింది. ఇదొక విలోమ సైక్లిక్ ఎఫెక్ట్.
షేర్ ర్యాలీకి మౌలిక అంశాల మద్దతు లేదు
అమెరికా ఎన్నికలు 2016 నవంబర్ 8 తేదీన జరిగాయి. ఆ రోజున డౌ జోన్స్ సూచీ 18330 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఫిబ్రవరి 6 తేదీ నాటికి చూసినా డౌ సూచీ ఇంకా 6013 పాయిట్ల ఎగువన ఉన్నది. ట్రంప్ ర్యాలీగా పేర్కొనబడుతున్న ఈ షేర్ల జోరు ఇంకా భారీగానే ఉన్నది. ఈ జోరుకు తగిన మద్దతు ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్ధలో -షేర్ల లాభదాయకత లో గానీ, షేర్ల వాస్తవ విలువలో గానీ- తగిన మద్దతు లేదని కాబట్టి కరెక్షన్ తధ్యం అని అంచనాలు ఉన్నాయి.
షేర్ వ్యాపారంలో ఆదాయ వృద్ధి బలహీనంగా ఉన్నప్పటికి స్టాక్ ధరలు పెరిగాయి. షేర్ల విలువ మదింపు వాస్తవం కంటే అధిక స్ధాయిలో జరిగింది. ప్రైవేటు పెట్టుబడులు లేకపోవడం, మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలలో పెట్టుబడి వినియోగం కనిష్టంగా ఉండటం, బ్యాంకుల బ్యాలన్స్ షీట్లలో సమస్యలు, విద్యుత్-రియల్ ఎస్టేట్-ఐ.టి రంగంలలో విధానాలు ముందుకు కదలకపోవడం, ఫార్మా రంగంలో రెగ్యులేటరీ సంస్ధల నిబంధనలను కంపెనీలు సమస్యలుగా చూడటం… ఇవన్నీ స్టాక్ మార్కెట్ల వృద్ధికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మార్కెట్లలో కరెక్షన్ తధ్యంగా కనిపిస్తున్నది. కాబట్టి ఆ కరెక్షన్ రాక మునుపే జాగ్రత్త పడాలని మదుపుదారులు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు. అదే షేర్ల అమ్మకం.
ముందు చెప్పుకున్నట్లు ఎల్‌టిసిజి పన్ను విధింపు అమెరికా పరిధితులకు జత కలిసింది. ఎల్‌టిసిజి వల్ల షేర్ల ఆదాయంపై పన్ను పడుతుంది. అనగా ఆదాయం తగ్గుతుంది. కనుక ఎల్‌టిసిజి అమలులోకి వచ్చే లోపే అంతకు మించి ఆదాయం వచ్చే ట్రెజరీ బాండ్, జపనీస్ యెన్ లలోకి పెట్టుబడి ప్రవహించింది. ఇది సెకండరీ కారణమే గానీ ప్రైమరీ కారణం కాదు.
*********
చివరికి తేలేది ఏమిటంటే అమెరికా తన ఆర్ధిక వ్యవస్ధ మెరుగుదల కోసం వడ్డీ రేట్లు సవరిస్తే ఆ ప్రభావం భారీగా భారత ఆర్ధిక వ్యవస్ధపై పడుతుంది. ద్రవ్యోల్బణం అంచనాలు పెరిగితే భారత షేర్లు పతనం అవుతాయి. అమెరికా ద్రవ్య విధానం మార్చుకుంటే భారత ఆర్ధిక వ్యవస్ధ వణికిపోతుంది. “బాబ్బాబు మార్చే ముందు మాకో మాట చెవిన వేయండి” అని మన మంత్రులు బతిమాలు కుంటారు. వీసా విధానం మార్చుకుంటే సాఫ్ట్ వేర్ బుద్ధి జీవులు డీలా పడిపోతారు. (భారత దేశ అవసరాలు వారికి అనవసరం.)
అమెరికా తదితర పాశ్చాత్య దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు భారత ఆర్ధిక వ్యవస్ధను ఇంతంగా బందీ చేసిన విధాన కర్తలు (ప్రస్తుతం మోడి-జైట్లీ బృందం) భారత ప్రజల కోసం పని చేస్తున్నట్లా లేక అమెరికా కంపెనీల లాభ దాహాన్ని తీర్చే సెకండరీ మార్కెట్లుగా పని చేస్తున్నట్లా? భారత ఆర్ధిక వ్యవస్ధ బలాన్ని చూసి కాకుండా అక్కడి షేర్లలో స్వల్ప, దీర్ఘ కాలిక లాభాలను సొంతం చేసుకునేందుకు పనికి వచ్చే అనుబంధ ఆర్ధిక వ్యవస్ధగా భారత దేశాన్ని మార్చివేసిన భారత పాలకులకు ప్రజలే బుద్ది చెప్పాలి.
ఇటువంటి గందరగోళ ఆర్ధికవిధానాలలో ఒకవైపు పెట్టుబడీదారులు ఉంటే మరో వైపున కార్మిక,కర్షకులున్నారన్నమాట!