
Stock Market Crash
సోమవారం ప్రపంచం లోని వివిధ ప్రధాన స్టాక్ మార్కెట్లు భారీ మొత్తంలో నష్టపోయాయి. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఈ భారీ పతనాన్ని బ్లడ్ బాత్ గా అభివర్ణిస్తున్నాయి. అమెరికా ప్రధాన స్టాక్ సూచీ అయిన డౌ జోన్స్, 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం కాలంలో కూడా ఎరగని విధంగా ఒకే రోజు 1175 పాయింట్లు నష్టపోయింది. కాబట్టి బ్లడ్ బాత్ అనడం కరెక్ట్ అనిపించక మానదు.
అంకెల్లో చూసినప్పుడు ఇంత భారీ పతనాన్ని డౌ జోన్స్ సూచి తన చరిత్రలో ఇంతవరకు చవి చూడని మాట నిజమే. కానీ నిష్పత్తి (శాతం) లో చూస్తే ఈ పతనం 4.6 % తో సమానం దీని కంటే ఎక్కువ నిష్పత్తిలో డౌ జోన్స్ (ఒకే రోజు) పతనం అయిన ఉదాహరణలు గతంలో ఒకటీ రెండు ఉన్నందున చారిత్రకం కాదు. అయినప్పటికీ నిష్పత్తిలో కూడా ఇది పెద్ద మొత్తమే.
ఆగస్టు 2011 లో ఎస్ & పి రేటింగ్ కంపెనీ అమెరికా సార్వభౌమ రుణ పత్రాల (సావరిన్ డెట్ బాండ్స్) రేటింగ్ ని తగ్గించిన తర్వాత ఈ స్ధాయి నిష్పత్తి లో డౌ జోన్స్ పతనం కావడం ఇదే ప్రధమం. నిజానికి డౌ జోన్స్ పతనం శుక్రవారం రోజే ప్రారంభం అయింది. ఆ రోజు 666 పాయింట్లు పతనం అయిన డౌ జోన్స్ సోమవారం కూడా అధో ప్రయాణాన్ని కొనసాగించింది. అనగా రెండు రోజుల్లో 1600 పాయింట్లు పైగా నష్టపోయింది.
అమెరికా స్టాక్ మార్కెట్లు పతనంతో ఐరోపా, ఆసియా స్టాక్ మార్కెట్లు కూడా వరస కట్టాయి. జర్మనీ ప్రధాన స్టాక్ సూచీ DAX , ఫ్రాన్స్ సూచీ CAC , బ్రిటన్ సూచీ FTSE లతో పాటు జపాన్ (నిక్కీ), హాంకాంగ్ (హ్యాంగ్ సెంగ్), తైవాన్ (TWSE) దేశాల సూచీలు 3.5 శాతం నుండి 5 శాతం వరకూ పతనం అయ్యాయి. సోమవారం ఒక్క రోజే ప్రపంచ మార్కెట్లలో లిస్ట్ అయిన కంపెనీల పతనం మొత్తం 4 ట్రిలియన్ డాలర్లకు సమానం అని రాయిటర్స్ అంచనా వేసింది. ఇది దాదాపు 250 లక్షల కోట్ల రూపాయలకు సమానం.
స్టాక్ మార్కెట్లలోకి డబ్బు వచ్చి చేరితే సూచీలు పై పైకి ఎగబాకుతాయి. మరో విధంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీల షేర్ లను మదుపుదారులు కొనుగోళ్ళు చేస్తుంటే డిమాండ్ మేరకు స్టాక్ / షేర్ / వాటా ధర పెరుగుతుంది. అలా కాకుండా మదుపుదారులు తమ వద్ద ఉన్న షేర్ లను వరస పెట్టి అమ్మితే వాటి ధర తగ్గుతుంది.
[కొనుగోళ్ళు జోరుగా సాగితే బుల్ మార్కెట్ అంటారు. ఈ ధోరణిని కార్టూనిస్టులు రంకెలు వేస్తున్న ఎద్దు (బుల్) బొమ్మతో సూచిస్తారు. (బోంబే స్టాక్ ఎక్చేంజి ముందు ఉండే ఎద్దు విగ్రహం గుర్తుకు వస్తే అది సబబే). అమ్మకాలు జోరుగా సాగితే బేర్ మార్కెట్ అంటారు. ఈ ధోరణిని కార్టూనిస్టులు ఛాతీ చరుచుకుంటూ గొంతెత్తి అరుస్తున్న ఎలుగుబంటి బొమ్మతో సూచిస్తారు.]

Bear Market
భారత్ స్టాక్ మార్కెట్లు కూడా డౌ జోన్స్ పతనాన్ని అనుసరించాయి. అమెరికా మార్కెట్లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం ట్రేడింగ్ ప్రారంభిస్తాయి. కనుక డౌ జోన్స్ పతనం ప్రభావం ఇండియాలో మంగళవారం కనిపిస్తుంది.
ఈ రోజు, మంగళవారం, మార్కెట్ లో ట్రేడింగ్ ప్రారంభం అయిన నిమిషాల లోనే బిఎస్‌ఈ సెన్సెక్స్ సూచీ 1000 పాయింట్లు పతనం అయింది. ఇంట్రా-డే (ఉదయం ట్రేడింగ్ మొదలై సాయంత్రం ముగింపు బెల్ మోగే లోపు) లో అత్యధికంగా 1274 పాయింట్లు పతనం అయింది. ఆ తర్వాత కోలుకుని ట్రేడింగ్ ముగిసే సమయానికి 561 పాయింట్ల పతనాన్ని నమోదు చేసింది.
అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజీ (ఎన్‌ఎస్‌ఈ – నిఫ్టీ) ఒక దశలో 390 పాయింట్లు (3.6%) పతనం అయింది. ఆ తర్వాత కోలుకుని ట్రేడింగ్ ముగిసే సమయానికి 168 పాయింట్ల (1.58%) నష్టానికి చేరింది.
నిజానికి భారత మార్కెట్ల పతనం బడ్జెట్ ప్రకటించిన రోజు నుండి మొదలయింది. బడ్జెట్ లో దీర్ఘ కాలిక పెట్టుబడి లాభాల పన్ను (లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ టాక్స్ – ఎల్‌టిసిజి) ప్రకటించడం వల్ల స్టాక్ మార్కెట్లు నష్టపోయాయని రాయిటర్స్ తో పాటు ఇతర పశ్చిమ బిజినెస్ మీడియా విశ్లేషించింది. వాటిలో కొన్ని వార్తా సంస్ధలు ఇప్పటికీ ఇదే విశ్లేషణ చేస్తున్నాయి. ఇతర పాయింట్లు కూడా కొన్ని చెప్పినా ఎల్‌టిసిజి పన్నునే ప్రధానం చేసి చూపుతున్నాయి.
బడ్జెట్ ప్రకటనతో మొదలయిన పతనం ఫిబ్రవరి 6 వరకూ కొనసాగుతూనే ఉన్నది. ఎల్‌టిసిజి పన్ను (10%) ప్రభావం ఇన్ని రోజులు ఉండటం సాధ్యం కాదన్న సంగతిని పశ్చిమ మీడియా పట్టించుకోవడం లేదు. [ఎల్‌టిసిజిని ప్రధానంగా స్టాక్ మార్కెట్ లో మదుపుదారులు సంపాదిస్తున్న లాభాలు లక్ష్యంగా చేసుకుని జైట్లీ ప్రకటించాడు. అది కూడా లాంగ్ టర్మ్. అనగా స్టాక్ మార్కెట్ లో మదుపు చేసిన సంవత్సరం తర్వాత వచ్చే లాభం లక్ష రూపాయలు దాటితే పన్ను పైగా ఇది ఆచరణలో రావడానికి కొన్ని నెలలు పడుతుంది.
భారత వ్యాపార మీడియా పశ్చిమ మీడియా విశ్లేషణతో విభేదిస్తున్నాయి. ఫిబ్రవరి 2 తేదీన భారత ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఓ ప్రకటన విడుదల చేస్తూ ఈ విశ్లేషణతో విభేదించాడు. ఎల్‌టిసిజి పన్నుకీ స్టాక్ మార్కెట్ల పతనానికీ సంబంధం లేదని చెబుతూ వాస్తవ కారణం గ్లోబల్ నేపధ్యం ఉన్నదని చెప్పాడు. ఈ రోజు -ఫిబ్రవరి 6, మంగళవారం- ఆర్ధిక శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా కూడా పత్రికలకు ఇదే విషయం మళ్ళీ చెప్పాడు. ప్రపంచ మార్కెట్లలో బలహీనత వల్ల ఈ పరిస్ధితి ఏర్పడిందని చెప్పాడు.
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే భారత స్టాక్ మార్కెట్ పతనాన్ని అమెరికా-ఐరోపా మార్కెట్ల పతనంతో విడదీసి చూపడానికి పశ్చిమ మీడియా ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నాన్ని భారత ప్రభుత్వమూ, భారత మీడియా ప్రతిఘటించడం. “మా తప్పేమీ లేదు” అని చెప్పేందుకు పశ్చిమ మీడియా ప్రయత్నిస్తుంటే “మీ వల్లే మాకూ తిప్పలు” అని మనవాళ్లు వాదిస్తున్నారు.
ఎల్‌టిసిజి పన్ను వల్ల కంపెనీలకు పెద్ద ఎత్తున నష్టం ఏదీ జరగదని మదుపుదారులకు అష్యూరెన్స్ ఇచ్చేందుకు భారత ప్రభుత్వం తిప్పలు పడుతోంది. లేకుంటే స్టాక్ మార్కెట్ల నుండి మరింత డబ్బు తరలిపోతుందని ప్రభుత్వం భయం. 2018 లో స్టాక్ మార్కెట్లు సాధించిన వృద్ధి మొత్తం ఈ ఐదు సెషన్ల పతనంలో ఊడ్చుకుపోయింది. స్టాక్ మార్కెట్ వృద్ధినే తమ గొప్పతనం గా చెప్పుకుంటున్న బిజేపి ప్రభుత్వానికి ఇది నష్టకరం. స్టాక్ మార్కెట్ మరింత పడిపోతే మోడి ప్రతిష్ట మసకబారుతుంది మరి!
మరో పక్క పశ్చిమ దేశాలలోని పరిస్ధితులు భారత మార్కెట్ల పతనానికి దారి తీస్తాయన్న నిజం భారత ప్రజలకు అందకుండా ఉండడం పశ్చిమ దేశాల ప్రయోజనం. ఆ నిజం తెలిస్తే గ్లోబలైజేషన్ కి వ్యతిరేకత పెరుగుతుంది. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుల ద్వారా పశ్చిమ దేశాలు ప్రభోదించే ఎల్‌పిజి విధానాల పట్ల నిరసన పెరుగుతుంది. ఎఫ్‌ఐఐ లకు, ఎఫ్‌డిఐ లకూ అనుకూల వాతావరణం కల్పిస్తే భారత దేశానికి మేలు జరుగుతుందన్న బోధన తప్పన్న అవగాహన ఏదో ఒక స్ధాయిలో కలుగుతుంది. ఇది జరగకూడదు.
ఏది నిజం? భారత మీడియా, కేంద్ర మంత్రి, ఆర్ధిక సెక్రటరీ… వీరు చెబుతున్నదే నిజం అని వేరే చెప్పనవసరం లేదు. ఈ వైరుధ్యం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే వైరుధ్యం ఏమీ కాదు. ఎల్‌టిసిజి వల్ల ఎఫ్‌ఐఐ ల లాభాలు తగ్గుతాయి. పశ్చిమ మీడియా దృష్టిలో ఆ కాస్త నష్టం కూడా పశ్చిమ పెట్టుబడులకు రాకూడదు. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న స్టాక్ మార్కెట్లు ఏదో ఒక రోజు కరెక్షన్ కు గురవుతాయి. ఇప్పటికే భారత స్టాక్ మార్కెట్లలో షేర్లు వాటి వాస్తవ విలువ కంటే అధిక స్ధాయికి పెరిగిపోయాయి. దీన్ని నియంత్రించకపోతే కరెక్షన్ వరకే పరిమితం కావలసిన స్టాక్ ల పతనం సంక్షోభ పరిస్ధితులకు దారి తీసేలా పరిణమించవచ్చు. దానిని నిరోధించడం భారత ప్రభుత్వ లక్ష్యం. ఈ వైరుధ్యం పరిధి చాలా పరిమితం. ఎఫ్‌ఐఐ ల కొద్ది పాటి లాభాలకూ భారత ప్రభుత్వ సారధి అయిన బిజేపి ఓట్ల ప్రయోజనాల వరకే ఇది పరిమితం.
ఇంతకీ గ్లోబల్ స్ధాయిలో షేర్లు ఎందుకు పతనం అవుతున్నట్లు? దానికి ప్రధాన కారణాలు:
-
అమెరికా సావరిన్ ఋణ పత్రాలపై వస్తున్న లాభాల (యీల్డ్) పెరుగుదల
-
అమెరికా (& ఐరోపా) లో వేతనాల పెరుగుదలతో ద్రవ్యోల్బణం ప్రమాదం పెరగడం
-
అమెరికా రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపుదల (కఠిన ద్రవ్య విధానం)
-
అమెరికా స్టాక్ మార్కెట్ లో ముంచుకొస్తున్న కరెక్షన్
ఈ నాలుగు కారణాలకు ఎల్‌టిసిజి ప్రభావం కాస్త అదనంగా జత కలిసింది. కానీ ఎల్‌టిసిజి ప్రధాన కారణం కాదు. పై 4 కారణాలు లేకపోతే ఎల్‌టిసిజి ప్రభావం ఆ ఒక్క రోజుతోనే ముగిసిపోయేది. ఎందుకంటే ఎల్‌టిసిజి నుండి బైట పడేందుకు కావలసిన రంధ్రాలను జైట్లీ ఆ ప్రతిపాదనలోనే కల్పించి పెట్టాడు. ఆ రంధ్రాల జల్లెడలో మిగిలిన లాభాల పైనే ఎల్‌టిసిజి పన్ను పోటు పడుతుంది.
నాలుగు కారణాల గురించి రెండో భాగంలో చూద్దాం.
………..తరువాయి రెండో భాగంలో