
Modi for Globalization
ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఆల్పైన్ పర్వతాల లోని విడిది నగరం దావోస్ లో ప్రపంచ ఆర్ధిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) సమావేశాలు జరుగుతున్నాయి. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడి కూడా ఈ సమావేశాలకు హాజరై ప్రారంభ ప్రసంగం చేసి వచ్చాడు. మోడీతో పాటు పలు ఇతర దేశాల ప్రభుత్వాధినేతలు కూడా వేదికపై ప్రసంగాలు చేస్తున్నారు. 2000 సం. తర్వాత మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు ఈ సమావేశాలకు హాజరవుతున్నాడు. అందుకు అమెరికాకు కారణాలు ఉన్నాయి. అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చీ రావడంతోనే ‘అమెరికా ఫస్ట్’ నినాదాన్ని అందుకున్నాడు. వాణిజ్య పరిభాషలో చెప్పాలంటే ట్రంప్ విధానాలను ‘ట్రేడ్ ప్రొటెక్షనిజం’ అంటారు. అనగా అమెరికా ఇన్నాళ్లూ ఇండియా లాంటి దేశాలపై రుద్దిన స్వేచ్ఛా మార్కెట్ విధానాలకు బదులుగా అమెరికా కంపెనీలకు ప్రాధాన్యత, రక్షణలు కల్పించే వాణిజ్య విధానాలు అవలంబించడం. ఈ విధానాలను ఐరోపా నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అందువలన 2018 దావోస్ సమావేశాలు అమెరికా, ఐరోపా నేతల మధ్య ఘర్షణకు వేదికగా మారవచ్చని పశ్చిమ కార్పొరేట్ పత్రికలు అంచనా వేశాయి.
ప్రధాని మోడి ప్రసంగాన్ని భారత పత్రికలు ఓ గొప్ప ప్రపంచ స్థాయి ఘటనగా ఆకాశానికి ఎత్తి ప్రస్తుతించడంలో పోటీ పడ్డాయి. ఆ వేదికపై ప్రసంగించడమే గొప్ప సంగతిగా వారి భజన సాగిపోయింది. భారత దేశంలో 125 కోట్ల ప్రజలు నివసిస్తున్నారని. అందులో 30 కోట్లకు పైగా ఉన్న మధ్యతరగతి వర్గం బహుళజాతి కార్పొరేట్ కంపెనీలకు ఒక పెద్ద మార్కెట్ గనిగా అవి చూస్తున్నాయనీ, ఆ గనిని సొంతం చేసుకుని కొల్లగొట్టడానికి భారత ప్రభుత్వ నేతకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతిస్తున్నాయనీ భారత పత్రికలు విస్మరిస్తున్నాయి. అప్పు తేవడం, పెట్టుబడి ఆకర్షించడం కూడా భారీ విజయాలుగా ప్రచారం చేస్తున్న భారత ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా నుండి ఇంతకంటే ఎక్కువ ఆశించడం బహుశా వర్ధం కావచ్చు.
ప్రపంచ స్థాయి బహుళజాతి కంపెనీలు స్థాపించినదే ప్రపంచ ఆర్ధిక వేదిక. ప్రపంచంలోని అత్యంత పెద్ద వ్యాపార కంపెనీలు మాత్రమే ప్రపంచ ఆర్ధిక వేదిక (ఇక నుండి దావోస్ వేదిక అందాం) లో సభ్యత్వం పొందగలవు. దావోస్ వేదికలో సభ్యత్వం పొందాలంటే వార్షిక రెవిన్యూ ఆదాయం కనీసం 5 బిలియన్ డాలర్లు (రు 33 వేల కోట్లకు సమానం) ఉండాలి. ఈ సమావేశానికి హాజరు కావాలంటే కనీసం 72,000 డాలర్లు (రు 47 లక్షలు) చెల్లించాలి. ప్రయాణ ఖర్చు అదనం. కార్పొరేట్ కంపెనీల సిఈఓలు, ప్రభుత్వాల అధికారులు, ప్రభుత్వాధినేతలు, వివిధ రంగాల్లోని సెలబ్రిటీలు, బ్యాంకర్లు, హెడ్జ్ ఫండ్ ల మేనేజర్లు దావోస్ వేదిక సమావేశాలకు యేటా హాజరవుతారు.
ఈ సంవత్సరం హాజరవుతున్న ప్రతినిధుల సంఖ్య 3 వేలు. దావోస్ సమావేశాలకు వ్యతిరేకంగా నిరసనలు పెరగడంతో స్విస్ ప్రభుత్వం ఈ యేడు గట్టి భద్రతా ఏర్పాట్లు కల్పించింది. 4 వేల మంది స్విట్జర్లాండ్ సైనికులను, 1000 మంది పోలీసులను సమావేశాలకు కాపలాగా పెట్టారు. అది చాలక దావోస్ నగరం పైన ‘నిషిద్ధ గగన తలం’ (నో-ఫ్లై జోన్) విధించారు. అప్పటికీ నమ్మకం కుదరక నిరసన ప్రదర్శనలపై నిషేధం విధించారు. విపరీతంగా మంచు కురుస్తున్నందున నిరసనలపై నిషేధం విధించాం అని సాకు చెప్పారు. దీన్ని బట్టే దావోస్ సమావేశాలు ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగానూ, బహుళజాతి కంపెనీలకు ప్రయోజనకరంగానూ జరుగుతాయని స్పష్టం అవుతుంది. ఇలాంటి ప్రజా-వ్యతిరేక, బహుళజాతి కంపెనీల-అనుకూల సమావేశాలలో భారత ప్రధాని ప్రారంభ ప్రసంగం చేయడం బట్టి ఆయన భారత ప్రధానిగా భారత దేశంలో ఎవరి ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు.
ప్రతి యేటా జరిగే దావోస్ వేదిక సమావేశాలను ఒక్కో యేడు ఒక్కొక్క అంశంతో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం అంశం: బీటలు వారిన ప్రపంచంలో ఉమ్మడి భవిష్యత్తును సృష్టించడం (Creating Shared Future in a Fractured World). ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో వివిధ శక్తుల మధ్య వైరుధ్యాలు తీవ్రం అయ్యాయనీ, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ బీటలు వారిందనీ దావోస్ వేదిక స్వయంగా గుర్తించినట్లు దీని ద్వారా స్పష్టం అవుతోంది. ఆ అంశాన్నే ఈ వ్యాసంలో చర్చించుకుందాం.
దావోస్ వేదిక దృష్టిలో బీటలు వారడం అంటే బహుళజాతి కంపెనీల ప్రయోజనాలు, ముఖ్యంగా పశ్చిమ బహుళజాతి కంపెనీల ప్రయోజనాలు బలహీనపడుతున్నాయని. వేదిక దృష్టిలో సామాన్య, మధ్య తరగతి ప్రజానీకం ఉండరు. కార్మికవర్గ ప్రజలు ఐతే అసలే ఉండరు. ప్రజలు ఎదుర్కొంటున్న ఆకలి, దరిద్రం, నిరుద్యోగం, అధమ వేతనాలు, వేతనాల తగ్గుదల, పేదరికం… మొ. న సమస్యలేవీ వేదికకు సమస్యలు కావు. పడిపోతున్న జిడిపి, దిగజారుతున్న లాభాలు, వివిధ దేశాల, ప్రాంతాల బహుళజాతి కంపెనీల మధ్య పెరుగుతున్న వైరుధ్యాలు, సంస్కరణల విధానాల సక్రమ అమలు… ఇవే వేదికకు ప్రధాన సమస్యలు. తమలో తమకు వస్తున్న తగాదాలు ఎప్పటికప్పుడు రాజీలు, సర్దుబాట్లు ద్వారా పరిష్కారం కావటానికి బదులు అంతకంతకూ ఎక్కువగా ఘర్షణ రూపం తీసుకోవడం, వాణిజ్య యుద్ధాలు, కరెన్సీ యుద్ధాలు, చివరికి భౌతిక యుద్ధాలు కూడా అనివార్యం కావడం వేదికకు లేదా పశ్చిమ బహుళజాతి కంపెనీలకు పెను సమస్యలుగా మారాయి. ఈ సమస్యలకు సానుకూల పరిష్కారాలు వెతుక్కోవడానికి ఒక ప్రయత్నంగా దావోస్ వేదిక సమావేశాలను సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలు చూస్తున్నాయి.
సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ ప్రపంచం ప్రస్తుతం ‘అమెరికా ప్రొటెక్షనిజం’ ను ఒక ముఖ్య సమస్యగా చూస్తున్నాయి. యూరోపియన్ యూనియన్, చైనా, రష్యా సామ్రాజ్యవాదాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించిన ‘అమెరికా ఫస్ట్’ విధానం తీవ్ర సమస్య అయింది. దావోస్ సమావేశాలకు బయలుదేరడానికి కొద్ది రోజుల ముందే కొన్ని సరుకుల దిగుమతులపై భారీ సుంకం విధించడం ద్వారా తాను వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ చాటి చెప్పాడు. చైనా, సౌత్ కొరియా దేశాల నుండి దిగుమతి అవుతున్న వాషింగ్ మెషీన్ల పైన 50% సుంకం విధించిన అమెరికా సోలార్ ప్యానెళ్ల దిగుమతిపై 30% సుంకం ప్రకటించింది. ఇందుకోసం అధ్యక్షుడు ట్రంప్ చాలా అరుదుగా ప్రయోగించే వాణిజ్య చట్టాన్ని దుమ్ము దులిపి వెలికి తీశాడు. విదేశీ దిగుమతుల వల్ల దేశీయ తయారీదార్లకు ‘తీవ్ర గాయం’ తగిలినట్లయితే వాటిపై భారీ సుంకం విధించవచ్చన్నదే చట్టం. నాఫ్తా, ఆసియాన్, డబల్యూటిఓ మొ. న బహుళ పక్ష వాణిజ్య ఒప్పందాల సహాయంతో అమెరికా, ఐరోపాలు మూడో ప్రపంచ దేశాలను అదిరించి, బెదిరించి కొల్లగొట్టడం సజావుగా సాగినన్నాళ్లూ ఈ చట్టం అవసరం అమెరికాకు రాలేదు.
2008 ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం దరిమిలా అమెరికా ఆర్ధిక శక్తి వేగంగా క్షీణించింది. చైనా ఆర్ధిక శక్తి వేగంగా వృద్ధి చెందుతోంది. ఉక్రెయిన్-క్రిమియా పరిణామాలను సాకుగా చూపిస్తూ రష్యాపై విడతలు విడతలుగా వాణిజ్య ఆంక్షలు విధించడంతో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర ఈయూ దేశాల ఇంధనం (చమురు, గ్యాస్) ప్రయోజనాలకు విఘాతం ఏర్పడింది. దానితో అమెరికా-ఈయూ వైరుధ్యాలు తీవ్రం అయ్యాయి. సిరియా యుద్ధంలో రష్యా జోక్యంతో అమెరికాకు పరాభవం ఎదురయింది. సిరియాను మూడు ముక్కలు చేసి, మధ్య ప్రాచ్యంలో ఇరాన్ ప్రభావాన్ని తగ్గించి, సౌదీ అరేబియా-ఇజ్రాయెల్ ప్రభావాన్ని పెంచి తన చమురు, గ్యాస్ వాణిజ్యాన్ని పెంచుకోవాలన్న అమెరికా సామ్రాజ్యవాద లక్ష్యం నెరవేరలేదు. మరో పక్క చైనా, రష్యాలు ఉమ్మడిగానూ, విడి విడి గానూ డాలర్ ఆధిపత్యాన్ని గండి కొడుతున్నాయి. చైనీయ కరెన్సీ యువాన్ అంతర్జాతీయ పెట్రోల్ వాణిజ్యంలో ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో అడుగు పెట్టడం ద్వారా పెట్రో యువాన్ కు నాంది పలికింది. పెట్రో రూబుల్ కూ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దరిమిలా పెట్రో డాలర్ పెత్తనం కూలిపోయెందుకు తొలి అడుగులు పడ్డాయి. అమెరికా ఆర్ధిక ఆధిపత్యానికి చివరి రక్షణ దుర్గంగా నిలిచిన పెట్రో డాలర్ క్షీణిస్తే అమెరికా సైనికాధిపత్య దుష్కృత్యాలకు, యుద్ధాలకు ఫైనాన్స్ వనరులు కొడిగడతాయి. ఇప్పటికే అమెరికా మాటకు అటు ఐరాస భద్రతా సమితి లోనూ ఇటు డబల్యూటిఓ లోనూ అమెరికా మాటకు విలువ పడిపోయింది. అమెరికాకు ఎదురు మాట్లాడడానికి ఈయూ దేశాలు వెరవడం లేదు. అమెరికా ఆధిపత్యం లోని ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ లకు ప్రత్యామ్నాయంగా చైనా ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (ఏఐఐబి) స్ధాపించగానే ఈయూ దేశాలు పోలోమెంటూ వెళ్ళి అందులో సభ్యత్వం తీసుకున్నాయి. ఏఐఐబిలో చేరడానికి వీలు లేదన్న అమెరికా హెచ్చరికలను అవి బేఖాతరు చేశాయి.
ఈయూ దేశాలు సైతం ఒక్క తాటిపై లేవు. జర్మనీ ఆధిపత్యాన్ని బ్రిటన్ లాంటి దేశాలు ధిక్కరిస్తున్నాయి. చివరికి బ్రెగ్జిట్ వరకు పరిణామాలు వెళ్ళాయి. ‘ఇప్పటికైనా మించింది లేదు, వెనక్కి రండి’ అంటూ జర్మనీ, ఈయూ నేతలు ప్రకటనలు జారీ చేయని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. బ్రెగ్జిట్ ఫలితాలు వెలువడిన వెంటనే “వీలైనంత త్వరగా వెళ్లిపోండి. విడాకుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి” అని హుంకరించిన ఈయూ ఇప్పుడు అందుకు భిన్నంగా బ్రెగ్జిట్ వల్ల నష్టాలు ఏకరువు పెడుతూ ఏదో విధంగా బ్రిటన్ ను కలిపి ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘బ్రిటన్ సభ్యత్వం కొనసాగింపుకు ఈయూ దాదాపు దేబిరిస్తోంది’ అని కూడా కొందరు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటలీ, పోలండ్ లు అనేక మార్లు ఈయూ కు భిన్నమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నాయి. ఆఫ్రికా, మధ్య ప్రాచ్యంల నుండి పోటెత్తిన వలసదారులను అనుమతించడంలో ఈయూ నేత జర్మనీతో సభ్య దేశాలన్నీ విభేదించాయి. ఈ అంశంపై హంగేరీ దేశం అయితే జర్మనీపై దాదాపు తిరుగుబాటు చేసింది.
ప్రపంచ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద వ్యవస్ధలో సర్దుబాట్ల కంటే ఘర్షణలే పై చేయి సాధిస్తున్న ఈ నేపధ్యంలో అమెరికా, ట్రంప్ నేతృత్వంలో రక్షణాత్మక (ప్రొటెక్షనిస్టు) విధానాలు చేపట్టింది. ఇండియా లాంటి దేశాలకు ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన ‘స్వేచ్ఛా మార్కెట్’ సూత్రాలను గట్టున పెట్టేసింది. ఇండియా లాంటి దేశాల్లో పశ్చిమ బహుళజాతి కంపెనీలకు “లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్” డిమాండ్ చేస్తూ అమెరికాలో మాత్రం భారీ దిగుమతి సుంకాలు ప్రకటిస్తోంది. ఈ పరిస్ధితుల్లో దావోస్ వేదిక సమావేశాలు ప్రారంభించిన నరేంద్ర మోడి ఏమన్నాడో చూడండి:
“ప్రొటెక్షనిజం శక్తులు ప్రపంచీకరణకు వ్యతిరేకంగా తల ఎత్తుతున్నాయి. ప్రపంచీకరణ జరగడానికి బదులు దానికి వ్యతిరేకంగా జరుగుతున్న భావన కలుగుతోంది… ఈ తరహా ఆలోచనా విధానం యొక్క వ్యతిరేక ప్రభావం వాతావరణ మార్పుల ప్రభావం కంటే లేదా ఉగ్రవాదం ప్రభావం కంటే తక్కువగా ఉంటుందని భావించలేము”
పేరు పెట్టి చెప్పనప్పటికీ మోడి ఉద్దేశించినది అమెరికా / ట్రంప్ అనుసరిస్తున్న ప్రొటెక్షనిస్టు విధానాలనే అని వేరే చెప్పనవసరం లేదు. ఎటువంటి శషభిషలు లేకుండా అమెరికాకు దగ్గరవుతున్న మోడి నోట ఈ మాటలు వెలువడడం ఆశ్చర్యంగా కనిపించవచ్చు. కానీ వివిధ సామ్రాజ్యవాద యాజమానుల మధ్య బేరాలు సాగిస్తూ లబ్ది పొందే దళారీ పెట్టుబడి ప్రతినిధులకు ఇదేమీ కొత్తకాదని గ్రహించాలి. నిజానికి ప్రొటెక్షనిస్టు విధానాలను అవలంబించడంలో అమెరికా / ట్రంప్ ఒంటరిగా ఏమీ లేరు. ఈయూ నేతలైన జర్మనీ, ఫ్రాన్స్ లు కూడా తమ తమ బహుళజాతి కంపెనీలకు లబ్ది చేకూర్చే విధానాలను హంగు ఆర్భాటం లేకుండా అమలు చేస్తున్నాయి. అందువలన దావోస్ వేదికగా ప్రొటెక్షనిస్టు ట్రంప్ కూ, గ్లోబలిస్టు ఏంజలా మెర్కెల్ (జర్మనీ ఛాన్సలర్) మరియు ఎమాన్యువల్ మెకరోన్ (ఫ్రాన్స్ అధ్యక్షుడు) లకూ మధ్య వాదోపవాదాలు తధ్యమన్న పశ్చిమ పత్రికల ఊహాగానాలు టిఆర్‌పి రేటింగ్ ల కోసమే. (పైగా సమావేశాల చివరి రోజైన శుక్రవారం -జనవరి 26- ట్రంప్ దావోస్ విచ్చేస్తాడు. మెర్కెల్, మెకరోన్ ల ప్రసంగాలు ఇప్పటికే ముగిశాయి. కనుక ఇరు పక్షాలు ఎదుర్కొనే సమస్య లేదు.) కానీ ఇరువురి వైరుధ్యాలను పైకి చెప్పే అవకాశం మాత్రం భారత ప్రధానికి ఇచ్చారు. తద్వారా మీడియాలో పలచనయ్యే ప్రమాదం నుండి వారు తప్పుకున్నారు.
————–తరువాయి రెండవ భాగంలో