
World Economic Forum 2018
మోడికి దక్కిన ఈ పోస్ట్ మెన్ / కొరియర్ పాత్రకే భారత మీడియా, బిజేపి నేతలు చంకలు గుద్దుకుంటున్నారు. ప్రపంచ వేదికలపై భారత్ కు ప్రతిష్ఠ పెరిగింది అని చెప్పడానికి ఇదే తార్కాణం అని ప్రజలకు నమ్మబలుకుతున్నారు. బలి ఇచ్చేముందు మేకపోతును అందంగా అలంకరించి, డప్పు వాయిద్యాల మధ్య వీధుల వెంట ఊరేగిస్తారన్న ఎరుక వీరికి లేకపోవడం భారత ప్రజల దౌర్భాగ్యం. కాగా మోడీ, ట్రంప్ ను తప్పు పట్టడాన్ని చైనా భలే సంతోషపడింది. దావోస్ వేదికపై మోడి గొప్పగా మాట్లాడడని చైనా మీడియా మెచ్చుకుంది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధులు మోడిని ప్రశంసిస్తూ ప్రకటన విడుదల చేశారు. “ప్రొటెక్షనిజం కు వ్యతిరేకంగా ఇద్దరం కలిసి పోరాడుదాం” అని పిలుపు కూడా ఇచ్చారు. ఎద్దు పుండు కాకికి ముద్దు కదా మరి!
ట్రంప్ కు వ్యతిరేకంగా తీవ్రంగా ప్రచారం చేసిన అమెరికా కంపెనీలు, కార్పొరేట్ మీడియా సంస్ధలు సైతం ట్రంప్ తీసుకుంటున్న చర్యలను ఇప్పుడు ప్రస్తుతిస్తున్నారు. దావోస్ వేదికకు హాజరైన ప్రముఖ అమెరికా కంపెనీల సిఈఓలు సమావేశాలకు ముందు పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ట్రంప్ వాణిజ్య చర్యలను ప్రశంసలతో ముంచెత్తారు. ట్రంప్ పై విషం వెళ్లగక్కిన వాల్ స్ట్రీట్ జర్నల్ (డబల్యూఎస్‌జే), సిఎన్‌ఎన్ లు ఈ ఇంటర్వ్యూలను ప్రచురించడం మరో విశేషం. దిగుమతి సుంకాలు విధించడంతో పాటు కార్పొరేట్ కంపెనీలు చెల్లించవలసిన వివిధ పన్నులను బాగా తగ్గించడంతో అమెరికా కంపెనీలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. ఒక వైపు కంపెనీలకు పన్నులు తగ్గిస్తూ, మరోవైపు సంక్షేమ విధానాలపై ప్రభుత్వ ఖర్చును తగ్గించే పొదుపు విధానాలను ట్రంప్ తీవ్రం చేశాడు. పన్నుల కోత వల్ల వ్యాపారం విస్తరిస్తుందని, ట్రంప్ చర్యల వల్ల అమెరికాలో ఆశావాదం బాగా పెరిగిందని అతి పెద్ద ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ సిటీ గ్రూప్ సిఈఓ మైఖేల్ కార్బట్, సిఎన్‌ఎన్ ఇంటర్యూలో చెప్పాడు. మరో బ్యాంకింగ్ కంపెనీ బార్ క్లేస్ సిఈఓ జెస్ స్టేలీ, కార్లయిల్ గ్రూపు అధినేత డేవిడ్ రూబెన్ స్టీన్ మొ.న వారు డబల్యూఎస్‌జే తో మాట్లాడుతూ ఇవే అభిప్రాయాలు చెప్పారు.
“ఇది 2006 లాగా అనిపిస్తోంది” అని వారు చెప్పడం గమనార్హం. 2008 ఆర్ధిక సంక్షోభానికి ముందు అమెరికా సెంట్రల్ బ్యాంక్ (ఫెడరల్ రిజర్వ్), ట్రెజరీలు వాల్ స్ట్రీట్ కంపెనీలకు ఇబ్బడి ముబ్బడిగా నిధులు, విధానాలు కుమ్మరించిన కుమ్మరించడాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే ట్రంప్ విధానాలకు ఐరోపా, చైనా, రష్యాల నుండి విమర్శలు వస్తున్నప్పటికీ అమెరికా బహుళజాతి కంపెనీలు బాగా లబ్ది పొందుతున్నాయి. అది కూడా అమెరికా కార్మికవర్గం ప్రయోజనాలను ఫణంగా పెడుతూ లబ్ది పొందుతున్నాయి. అనగా అమెరికా ప్రొటెక్షనిజం అక్కడి ఆర్ధిక వ్యవస్ధలో వేళ్లూనుతోంది. ఇది క్రమంగా ఇతర సామ్రాజ్యవాద శక్తులతో ఘర్షణలు తీవ్రం కావటానికీ వాణిజ్య, కరెన్సీ యుద్ధాలు బద్దలు కావడానికీ దారి తీయనుంది. సిరియా యుద్ధం లాంటి ప్రాక్సీ యుద్ధాల రూపంలో భౌతిక ఘర్షణల వరకూ వెళ్ళిన ఈ పరిస్ధితి ప్రత్యక్ష యుద్ధం రూపం తీసుకోవడం ఎంతో కాలం పట్టకపోవచ్చు. ట్రంప్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన వివిధ విధాన పత్రాలు -జాతీయ భద్రతా వ్యూహ పత్రం, అణు యుద్ధ తయారీ సమీక్ష (న్యూక్లియర్ పోశ్చర్ రివ్యూ), జాతీయ రక్షణ వ్యూహ పత్రం- ద్వారా అమెరికా బహిరంగంగానే చైనా, రష్యాలతో ఘర్షణ వైఖరిని ప్రకటించింది. దిగుమతుల సుంకాలు, దేశీయ బహుళజాతి కంపెనీలకు వారాలు, ప్రాక్సీ యుద్ధాలు, బహిరంగ ఘర్షణ వైఖరి… ఇవన్నీ రెండో ప్రపంచ యుద్ధం నాటి ముందరి పరిస్ధితిని గుర్తుకు తెస్తున్నాయి.
దావోస్ వేదిక సమావేశాలకు సరిగ్గా రెండు రోజులకు ముందు బ్రిటన్ కు చెందిన ఎన్‌జిఓ, ఆక్స్ ఫామ్ విడుదల చేసిన వార్షిక నివేదిక ఇక్కడ ప్రస్తావనార్హం. ఆర్ధిక సంక్షోభాల ప్రపంచంలో పేద, గొప్ప తారతమ్యాలు విపరీతంగా పెరిగిపోవడాన్ని ఈ నివేదిక వెలుగులోకి తెచ్చింది. ఆర్ధిక తారతమ్యాలు, వాటితో పాటు సామాజిక తారతమ్యాలు తీవ్రం అయ్యాయని, ఈ తారతమ్యాల పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతోందని నివేదిక తెలిపింది. ఉదాహరణకి 2017లో ప్రపంచ వ్యాపితంగా జరిగిన సంపదల వృద్ధిలో 82 శాతాన్ని అత్యంత ఉన్నత స్ధాయిలో ఉన్న 1 శాతం ధనికులే సొంతం చేసుకున్నారు. ప్రపంచ జనాభాలో అట్టడుగున ఉన్న 50 శాతం ప్రజలు -380 కోట్ల మంది- తమ సంపదలో ఎలాంటి వృద్ధిని చూడలేదు. నివేదికను విడుదల చేస్తూ ఆక్స్ ఫామ్ ఛైర్మన్ చెప్పిన మాటలు ఎన్న దగినవి:
“బిలియనీర్ల పెరుగుదల విలసిల్లుతున్న ఆర్ధిక వ్యవస్ధకు సంకేతం కాదు, అది ఆర్ధిక వ్యవస్ధ విఫలం అవుతున్నదని సూచించే లక్షణం మాత్రమే… మనం ధరించే బట్టలు తయారు చేస్తున్నవారు, మన ఫోన్లు అసెంబుల్ చేసేవారు, మనం తినే ఆహారం పండించేవారు దోపిడీకి గురవుతూ మనకు అత్యంత చౌకగా సరుకులు అందడానికి, కార్పొరేషన్లు మరియు బిలియనీర్లయిన పెట్టుబడిదారుల లాభాలు బలిసిపోవడానికి దోహదం చేస్తున్నారు.”
నివేదిక ప్రకారం మహిళా శ్రామికులు తరచుగా పురుషుల కంటే తక్కువ చెల్లింపులకు నోచుకుంటున్నారు. అత్యంత తక్కువ వేతనాలు పొందేదీ మహిళలే. అత్యంత అభద్రతా పని పరిస్ధితులను ఎదుర్కొనేది మహిళలే. బిలియనీర్లలో కూడా 10 మందిలో ఒకరు మాత్రమే మహిళ. కార్మికుల హక్కులను, వేతనాలను ఫణంగా పెట్టి కంపెనీల షేర్ హోల్డర్లకు లాభాలు చెల్లిస్తున్నారు, సిఈఓ లకు మిలియన్ల కొద్దీ బోనస్ లు చెల్లిస్తున్నారు. బడా వ్యాపారస్ధులలు ప్రభుత్వాలను అదుపులో ఉంచుకోవడం ద్వారా సానుకూల విధానాలు అమలు చేయించుకుంటున్నారు. కార్పొరేట్లపై పడే ఖర్చులను (పన్నులు, వేతనాలు) కనీస స్ధాయికి తగ్గిస్తున్నారు.
ఆక్స్ ఫామ్ నివేదిక వెనుక పరిస్ధితులు ఏమిటన్నది స్పష్టమే. ఆర్ధిక సంక్షోభం లోతుకు విస్తరించే కొద్దీ బహుళజాతి కంపెనీలు ప్రభుత్వాలపై ఒత్తిడులు పెంచి కార్మికవర్గానికి చెందవలసిన వాటాను మరింతగా తమ జేబుల్లోకి తరలిస్తున్నాయి. ఆ క్రమంలో కార్మికులు దశాబ్దాల తరబడి పొరాడి సాధించుకున్న హక్కులను హరించివేస్తున్నారు. సంస్కరణల పేరుతో కార్మిక వ్యతిరేక చట్టాలు తెస్తున్నారు. రక్షణ చట్టాలను నీరుగారుస్తున్నారు. అందుకోసం బిజేపి లాంటి మితవాద శక్తులను అధికారంలోకి తెచ్చుకుంటున్నారు. ప్రజల ఆందోళనలను, నిరసనలను ఉక్కు పాదంతో అణచివేసే కర్కశ పాలకులను ఎటువంటి కారణం లేకుండా ఛాంపియన్ లుగా నిలబెడుతున్నారు. ప్రజల మధ్య జాతి, మత, కుల, గ్రూపు వైరుధ్యాలను రెచ్చగొట్టి వారిలో వారికి తగవు పెట్టి కొట్టుకునేలా చేస్తున్నారు. వారి హక్కుల కోసం, వేతనాల కోసం ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పాలకులకు, ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా ఉద్యమించకుండా పక్కదారి పట్టిస్తున్నారు. అత్యంత కిరాతకంగా గుజరాత్ లో ముస్లింలపై మారణకాండ సాగడానికి కారకుడుగా నిలిచిన నరేంద్ర మోడి ఈ రోజు ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాలకు ప్రారంభ ఉపన్యాసకుడిగా ఈ నేపధ్యంలోనే వెళ్లగలిగాడు.
ఈ వాస్తవాలను భారత ప్రజలు గుర్తించాలి. ముఖ్యంగా భారత కార్మికవర్గం తన కర్తవ్యాన్ని మునుపటి కంటే ప్రబలంగా ముందుకు వచ్చిందని గ్రహించాలి. భారత దేశంలో అధికార బిజేపి హిందూత్వ విధానాలను ప్రజా రంగాలన్నింటా విస్తరించడానికి వెనుక ఉన్న సామ్రాజ్యవాద ప్రయోజనాలను, భారత దళారీ పెట్టుబడి ప్రయోజనాలను గుర్తించాలి. హిందూత్వకు వ్యతిరేకంగా స్ధిరమైన, నిర్ణయాత్మకమైన పోరాటాలు నిర్మించాలి. సాంస్కృతిక రంగంలో పోరాటాలు నిర్మించడానికి ముందు నిలవాలి. ప్రపంచ వ్యాపితంగా వర్గ పోరాటం తీవ్రం అయ్యే పరిస్ధితులను దావోస్ వేదిక సైతం గుర్తించిన సంగతి మనం విస్మరించరారు. అతి పెద్ద స్విట్జర్లాండ్ బ్యాంకర్ ‘యూబిఎస్ గ్రూప్ ఏజి’ ఛైర్మన్ యాక్సెల్ వెబర్ దావోస్ సమావేశాల్లో ప్రసంగిస్తూ “ద్రవ్యోల్బణం ఒత్తిడులను మనం విస్మరిస్తున్నాం. కఠినమైన కార్మికుల పరిస్డితులు మరియు వేతన ఒత్తిడుల మధ్య మాత్రమే మనం ఉత్పత్తి ఖాళీలను నింపుతున్నామని గ్రహించాలి. … ఈ యేడు ద్రవ్యోల్బణం ఒత్తిడి మళ్ళీ తలెత్తవచ్చు” అని హెచ్చరించడం గమనించవలసిన విషయం. ఆయన మాటలకు అర్ధం వేతనాల పెరుగుదలకు కార్మిక వర్గం నుండి ఒత్తిడి (పోరాటాలు, ఆందోళనలు) వస్తుంది అని. పెద్ద మొత్తంలో తమ జేబుల్లో కుక్కుతున్న బోనస్ లు, లాభాల కంటే అత్యంత హీనంగా ఉన్న కార్మికుల వేతనాలే ద్రవ్యోల్బణానికి కారకాలుగా వారికి కనిపిస్తాయి.
ఈ సమస్యకు వారి తక్షణ ఆయుధం మరిన్ని నల్ల చట్టాలు, మరింత అణచివేత. ఈ అణచివేత ఒక్క స్విట్జర్లాండ్ లోనే, లేక ఐరోపా వరకే పరిమితం అవుతుంది అనుకుంటే పొరబాటే. అణచివేత వివిధ రూపాల్లో పాలకులు అమలు చేస్తారు. చట్టాల ద్వారా ప్రత్యక్ష అణచివేత అమలు చేస్తే, ఆర్ధిక విధానాల ద్వారా ప్రజల మధ్య వైషమ్యాలు రగిలించడం ద్వారా పరోక్ష అణచివేతను అమలు చేయగలవు. పరోక్ష అణచివేతలను మోడి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది. కేవలం కాస్త ఆటవిడుపు కోసం చూసే పద్మావత్ లాంటి సినిమాల ఆధారంగా, తన చేతికి మట్టి అంటకుండానే, రాజ్ పుట్ కర్ణిసేన ను ప్రయోగించి వైషమ్య పూరిత భావోద్వేగాలను హిందూత్వ రెచ్చగొట్టి లబ్ది పొందుతోంది. ఈ నేపధ్యంలో మరింత మెలకువతో, వివేకంతో ప్రజా శత్రువులను గుర్తించి తదనుగుణంగా కార్మికవర్గం పోరాటాలను నిర్మించాలి.
-శేఖర్, 26/01/2018, 7:30 PM
………….అయిపోయింది.
[ప్రజా పంధా పక్ష పత్రిక ఫిబ్రవరి 1-15 లో ఈ ఆర్టికల్ అచ్చయింది.]