బడ్జెట్ 2018-19: ఉద్యోగులకు తొండి చెయ్యి


Cutting Exemptions

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఎన్నికలు దగ్గర కావడంతో వారి ఆశలు ఇంకా పెరిగాయి. ఓట్ల కోసం ఆదాయ పన్ను విషయంలో మరింత రాయితీ ఇస్తాడని ఆశించారు. కానీ వారిని జైట్లీ బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచింది. గతంలో ఉన్న రాయితీలలో ఎలాంటి మార్పూ లేకుండా అట్టే కొనసాగించింది. విద్యా సెస్ కు ఆరోగ్యం జత కలిపి 1% అదనంగా సెస్ వసూలు చేస్తామని ప్రకటించారు.

గత సంవత్సర (2017-18) బడ్జెట్ లోనూ ఉద్యోగులకు వారి ఆదాయాన్ని వారికి మిగిల్చే విషయంలో జైట్లీ ఎటువంటి చర్యా ప్రకటించలేదు. ఆదాయ పన్ను స్లాబ్స్ కదల్చకుండా అట్టే పెట్టాడు. దానితో ఈ సంవత్సరం అయినా స్లాబ్స్ విషయంలో ఉద్యోగులకు రాయితీ పెంచే అవకాశం ఉన్నదని  దాదాపు పత్రికలన్నీ అంచనా వేశాయి. పత్రికల అంచనాలు కూడా తప్పాయి.

నిజానికి ఆదాయ పన్ను రాయితీని ఉద్యోగులకు అనుకూలంగా మెరుగుపరిచేందుకు పెద్ద అవకాశమే ఉన్నది. ద్రవ్యోల్బణం గతం కంటే పెరిగింది. పెట్రోలు ధరలు ఎన్నడూ లేనట్లు లీటర్ కి రు. 80 దాటి పోయింది. పలు నిత్యవసర సరుకుల ధరలు కొండెక్కి వెక్కిరిస్తున్నాయి. ఈ పరిస్ధితుల్లో ఉద్యోగులకు కాస్తయినా ఊరట ఇవ్వాలని ఆర్ధిక నిపుణులు సైతం బడ్జెట్ కు ముందు అభిప్రాయ పడ్డారు. టి.వి చానెళ్ల చర్చా గోష్టుల్లో ఈ అభిప్రాయం ప్రబలంగా వ్యక్తం అయింది. రాయిటర్స్ లాంటి అంతర్జాతీయ వ్యాపార పత్రికలతో పాటు బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, ఎకనమిక్ టైమ్స్, ఎకనమిక్ ఎక్స్ ప్రెస్… లాంటి దేశీయ పత్రికలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నాయి. కానీ జైట్లీ, మోడిల అభిప్రాయం మరోలా ఉన్నది.

ప్రస్తుతం వ్యక్తిగత ఆదాయ పన్ను నిమిత్తం స్టాండర్డ్ డిడక్షన్ మొత్తం రు 2,50,000. అంటే అంత మొత్తం వరకు పన్ను ఉండదు. రు 2.5 నుండి రు. 5 లక్షల వరకు 5%, రు 5 నుండి 10 లక్షల వరకు 20% పన్ను విధిస్తున్నారు. రు 10 లక్షలు దాటితే పన్ను రేటు 30%. ఇందులో 10% శ్లాబ్ లేనే లేదు. 5% శాతం తర్వాత ఏకంగా 20% లోకి వెళ్ళిపోయారు. అనగా ఆదాయం రు. 2.5 లక్షలు దాటితే పన్ను అమాంతం 3 రెట్లు పెరిగిపోతుంది.

ఈ యేడు బడ్జెట్ లో స్టాండర్డ్ డిడక్షన్ ను అధమం రు 3 లక్షలకు పెంచుతారని పత్రికలు, నిపుణులు అంచనా వేశారు. ఉద్యోగులు కూడా అదే ఆశించారు. లేకపోతే 5%, 20% మధ్య 10% శ్లాబ్ అయినా ప్రవేశ పెడతారని ఆశించారు. ఇవేవీ జరగలేదు. స్టాండర్డ్ డిడక్షన్ అదనంగా 40,000 ఇస్తున్నామని ఊరిస్తూ “ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ (టి‌ఏ) మెడికల్ అలవెన్స్ (ఎం‌ఏ) లకు బదులుగా” అని చల్లగా చెప్పింది. మామూలుగా అయితే స్టాండర్డ్ డిడక్షన్ కి షరతులు ఏమీ ఉండవు. దానికి కూడా షరతు పెట్టి “మేము డిఫరెంట్” అని మోడి, జైట్లీ చాటారు.

టి‌ఏ, ఎం‌ఏ లలు మామూలుగానే పన్ను వేయదగ్గ ఆదాయంలో కలవ్వు. ఇప్పుడు వాటిని పన్ను పరిధిలోకి తెచ్చి, ఆనక వాటికి స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తున్నామని చెప్పారు. ఇది రొంబ మోసం. ఎందుకంటే ఈ అలవెన్స్ లో 40,000 పై బడితే గనక ఆ మొత్తం వెళ్ళి పన్ను వేయదగ్గ ఆదాయంలో (Taxable Income) లో కలుస్తుంది. చివరికి నికరంగా జరిగింది ఏమిటంటే పన్ను మరింత పెరగడం. 40,000 లోపు టి‌ఏ, ఎం‌ఏ ఉన్నవారికి ఎలాగూ పన్ను ఉండదు. ఆ పైన ఉన్నవారికి ఈ సంవత్సరం నుండి అదనంగా పన్ను పడనుంది.

ఇలాంటి మోసపూరిత పన్ను విధానం కేవలం బి‌జే‌పి కే తగును. పెర్క్ లపై ఆదాయ పన్ను కనిపెట్టింది కూడా బి‌జే‌పి మంత్రులే. ఎన్‌డి‌ఏ -1 హయాంలో అప్పటి ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా పెర్క్ లపై పన్ను మొదలు పెట్టాడు. ఉద్యోగులకు వడ్డీ రాయితీ కల్పించే గృహ రుణాలు, వాహన రుణాలు మొ.న రుణాల్లో రాయితీ కల్పించిన మొత్తాన్ని లెక్క గట్టి ఆ మొత్తం పైన పన్ను వేశాడు యశ్వంత్ సిన్హా. ఈ తరహా శాడిజం బి‌జే‌పి కే సాధ్యం కాబోలు. ఇప్పుడు అదే తరహాలో టి‌ఏ, ఎం‌ఏ లపై కూడా పరోక్షంగా పన్ను వేసే వెసులుబాటును జైట్లీ కల్పించుకున్నాడు.

సెస్ పెంపు

ఇప్పటి వరకూ 3% మేర విద్యా సెస్ విధించేవారు. మొత్తం ఆదాయ పన్ను లెక్క గట్టి అంతిమ ఆదాయ పన్ను పైన 3% సెస్ వసూలు చేసేవారు. విద్యారంగం అభివృద్ధికి ఈ ఆదాయాన్ని ఖర్చు చేస్తామని యూ‌పి‌ఏ-1 ప్రభుత్వం ఈ సెస్ (2% తో) ప్రారంభించింది. తర్వాత యూ‌పి‌ఏ ప్రబుత్వమే దాన్ని 3% కి పెంచింది. ఇప్పుడు జైట్లీ విద్యారంగంతో పాటు ఆరోగ్యరంగాన్ని కూడా అభివృద్ధి చేస్తానని చెబుతూ 4% కి పెంచాడు.

సెస్ ఆదాయాన్ని ఎంతవరకు విద్యారంగం అభివృద్ధికి తరలిస్తున్నది లెక్కలు లేవు. బడ్జెట్ కేటాయింపులు కనపడతాయి గానీ వాస్తవ ఖర్చులో అంత లెక్క కనిపించదు. ప్రజా రంగం కేటాయింపుల్ని వ్యాపారాల ప్రయోజనాలకి తరలించడం కద్దు. ఉదాహరణకి గత యేడు ఇన్ ఫ్రా స్ట్రక్చర్ బాండ్ల ఆదాయాన్ని పెద్ద మొత్తంలో జి‌ఎస్‌టి వసూళ్ల లోటు పూడ్చడానికి తరలించారని ఫస్ట్ పోస్ట్ పత్రిక వెల్లడి చేసింది. అలాగే గ్రామీణ ఉపాధీ హామీ కేటాయింపుల్లో వేల కోట్లు కాంట్రాక్టర్లకి చెల్లించారు. ఇదే తరహాలో విద్య, ఆరోగ్యం సెస్ వసూళ్లు ఆ రంగాలకు ఖర్చవుతుందన్నా గ్యారంటీ లేదు.

సీనియర్ సిటిజన్లకు పెంచినట్లు చెప్పిన స్టాండర్డ్ డిడక్షన్ (50,000) ఏ మూలకూ రాదు.

వెరసి 2018-19 బడ్జెట్, ఆదాయ పన్ను చెల్లిస్తున్న 2.5 కోట్ల ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు అన్ని విధాలుగా తొండి చెయ్యి చూపింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s