
Arvind Subramanian
జనవరి 29 తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎకనమిక్ సర్వే – 2018, 10 ప్రధాన అంశాలను గుర్తించింది. ఇవి భారత ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణీయన్ దృష్టిలో ప్రధానమైనవి. ‘పది కొత్త ఆర్ధిక నిజాలు’ అని సర్వే వీటిని అభివర్ణించింది. ప్రజల వైపు నుండి చూసినపుడు ప్రధానం కావచ్చు, కాకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నియమించుకున్న సలహాదారు కనుక ఈ అంశాలు పాలకవర్గాల దృక్కోణం నుండి ప్రధాన అంశాలుగా ఉంటాయని గుర్తించడం సబబు.
ఆ పది ప్రధాన అంశాలు / పది కొత్త ఆర్ధిక నిజాలు ఇవి:
-
పరోక్ష మరియు ప్రత్యక్ష పన్నుల చెల్లింపుదారులు భారీ మొత్తంలో నమోదయ్యారు.
-
వ్యవసాయేతర ఉపాధి రంగం ఇన్నాళ్లూ అనుకుంటున్నన్నదాని కంటే పెద్దది
-
రాష్ట్రాల ఐశ్వర్యం (prosperity) వాటి యొక్క అంతర్జాతీయ మరియు అంతర్రాష్ట్ర వాణిజ్యంతో సానుకూల సంబంధం కలిగి ఉన్నది.
-
భారత దేశ దృఢమైన ఎగుమతి వ్యవస్ధ సమానత్వంతో కూడుకుని ఉన్నది
-
వస్త్ర పరిశ్రమ ప్రోత్సాహక ప్యాకేజీ రేడీమేడ్ వస్త్రాల ఎగుమతులను పెంచింది.
-
భారతీయ తల్లిదండ్రులు పుత్ర సంతానం కోసం ఎంతమందినైనా కనడానికి సిద్ధంగా ఉన్నారు.
-
పన్నుల రంగంలో లిటిగేషన్ (న్యాయ సమస్యలు) లను తప్పించడానికి చాలా అవకాశం ఉన్నది. దరిమిలా ప్రభుత్వ చర్యల అవసరం తగ్గుతుంది.
-
వృద్ధి రేటును తిరిగి రాజుకోవాలంటే పొదుపు పెంచడం కంటే పెట్టుబడుల మదుపుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి.
-
ఇతర ఫెడరల్ (సమాఖ్య) దేశాలలో రాష్ట్రాల మరియు స్ధానిక సంస్ధల ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఇండియా కంటే చాలా తక్కువ.
-
తీవ్ర వాతావరణ పరిస్ధితులు వ్యవసాయ రాబడి పైన ప్రతికూల ప్రభావాన్ని పడవేస్తుంది.
ఎకనమిక్ సర్వే దృష్టిలో ఇవి కొత్త పది ఆర్ధిక నిజాలు. ‘కొత్త’ అని సర్వే రచయిత అని చెబుతున్నదంతా జిఎస్‌టి గొప్పదనాన్ని చెప్పడం కోసమే. జిఎస్‌టి వల్ల మనకు భారత ఆర్ధిక వ్యవస్ధకు సంబంధించిన భారీ డేటా (గణాంకాలు) అందుబాటులోకి వచ్చాయని ఆయన చెబుతున్నారు. ఇంత భారీ గణాంకాలు గతంలో ఎన్నడూ లేవట. జిఎస్‌టి వల్ల అనేక కొత్త సంగతులు తెలిసాయనీ, పరిశోధకుల పరిశోధనలకు, విశ్లేషకుల విశ్లేషణలకు విస్తృతమైన పరిశోధన మరియు విశ్లేషణ అవకాశాలను ఈ కొత్త డేటా అందించిందని, వారికి చేతినిండా పని దొరికిందనీ అరవింద్ చెప్పారు. సర్వేలోనూ, విలేఖరులతోనూ ఈ విషయాన్ని నొక్కి చెప్పారు.
ఇందులో నిజంగా కొత్తవిగా కనిపిస్తున్నవి ఎన్ని? కొత్తవి కాని అంశాలను, అనేక మంది సామాజికవేత్తలు, ఆర్ధికవేత్తలు ఎన్నాళ్లుగానో మొట్టుకుంటున్న అంశాలని కొత్తవిగా పేర్కొనడం చిత్రమైన విషయం. సాధారణ దృక్కోణానికి నిత్యం కనిపించే అంశాలను జిఎస్‌టి గణాంకాల ద్వారా లేదా ఆర్ధిక సర్వే ద్వారా కనిపెట్టి వాటిని కొత్తగా చెప్పడం ఏమిటో బొత్తిగా అర్ధం కాని సంగతి.
ఉదాహరణకి తీవ్ర వాతావరణ పరిస్ధితులు –తీవ్ర స్ధాయి ఉష్ణోగ్రతలు, అతి భారీ వర్షాలు, అకాల వర్షాలు, గడ్డ కట్టే చలి.. మొ.వి- వ్యవసాయ దిగుబడిని తగ్గిస్తాయని, రైతులకు రాబడి తగ్గిపోతుందని తెలియని వారు ఎవరైనా ఉంటారా? వాతావరణ మార్పుల వల్ల భూమి వేడెక్కుతోందని ఫలితంగా ఎన్నడూ ఎరగని ఎండలు. వానలు నిత్యకృత్యం అవుతోందని కనీసం రెండు మూడు దశాబ్దాలుగా చెప్పుకుంటున్నదే కదా. భారత వ్యవసాయం ప్రధానంగా ఋతుపవనాల పైన ఆధారపడి ఉన్నది కనుక వర్షాలు రాకపోతే పంటలు పండవనీ, వర్షాలు ఎక్కువైనా పంటలు నాశనం అవుతాయనీ ఏ రైతును అడిగినా చెప్పగలడు కదా! దానికి సర్వేయే కావాలా? పేజీలకు పేజీలు గణాంకాలు నిండాలా?
భారతీయ సమాజం పుత్ర సంతానం కోసం పరితపిస్తుందన్న విషయం కూడా ఆర్ధిక సర్వేకు కొత్తగా కనిపించింది. నాలుగు దశాబ్దాల క్రితమే హర్యానా లాంటి భూస్వామ్య భావజాలం కరుడుగట్టిన ఉత్తర భారత రాష్ట్రాల్లో ఆడ శిశువుల్ని పురిటిలోనే చంపేస్తున్నారని మహిళా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు గగ్గోలు పెట్టలేదా?
దశాబ్దాని కొకసారి వెలువడే జనాభా లెక్కల్లో పురుషులు, స్త్రీల నిష్పత్తి దారుణంగా పడిపోతున్న సంగతి తెలియడం లేదా? 0-5 సంవత్సరాల వయసు పిల్లల్లో ఆడ పిల్లల సంఖ్య మరింత ఘోరంగా తగ్గుతూ వస్తున్న సంగతి తెలియడం లేదా? ఇవన్నీ భారతీయ కుటుంబాలు ఆడ పిల్లల కంటే మగ పిల్లలకే ప్రాధాన్యత ఇస్తున్నారనీ, మగ శిశువు కోసం భార్యల్ని తన్ని తగలేస్తున్నారనీ, బహు భార్యత్వానికి కూడా సిద్ధ పడుతున్నారని మహీళా ఘోష పెట్టడం లేదా? గర్భస్ధ పిండాల లింగ నిర్ధారణ చేసే ‘ఆమ్నియో సెంటసిస్’ పరీక్షల ద్వారా ఆడ పిండాలను గర్భంలోనే చంపేస్తున్నారని ఆందోళనలు చేయలేదా?
పితృస్వామ్య పునాదులను కూల్చివేస్తే తప్ప ఈ అసమానతలు పోవనీ, సంపదల వాటాలో స్త్రీలకు సమాన అవకాశం ఇస్తే తప్ప ఆడ శిశువులపై చూపిస్తున్న పక్షపా(వా)త దృష్టి పోదనీ అభ్యుదయ కాముక ప్రజా సంఘాలు చెవిన ఇల్లు కట్టుకుని పోరాడం లేదా? శంఖువులో పోస్తే కానీ తీర్ధం కాదని ఆర్ధిక సర్వేలు కూడా కొత్తగా చెప్పవలసిందేనా?
ఆర్ధిక సలహాదారు కనిపెట్టిన “కొత్త” అంశాల్లో కొన్నయితే అసత్యాలు, అర్ధ సత్యాలు అన్నా అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ నిర్ధారణలకు రావడానికి ఆయన ఆధారపడింది కేవలం ఆర్ధిక గణాంకాల పైనే. సామాజిక పునాదులను, సంబంధాలను, రాజకీయ అవకాశాలను మరియు నిర్మాణాలను అన్నింటినీ ఆర్ధిక అంశాలతో కలిపి పరిశీలిస్తే తప్ప ఒక సమగ్ర అవగాహనకు రావడం సాధ్యం కాదు. అలాంటిది కేవలం గణాంకాల ద్వారా; అది కూడా సమగ్ర ఆర్ధిక పరిశీలన అని చెప్పడానికి వీలు లేని గణాంకాల ద్వారా; అనగా కేవలం కేంద్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, జిడిపి వృద్ధి, ద్రవ్యోల్బణం, కోశాగార స్ధిరీకరణ (ఫిస్కల్ కన్సాలిడేషన్, పెట్టుబడులు-పొదుపు అవకాశాలు లాంటి గణాంకాల ద్వారా మొత్తం సామాజికార్ధిక వ్యవస్ధ ధోరణిని అంచనా వేయడానికి పూనుకోవడం, దిశానిర్దేశం కూడా చేసేయడం బృహత్ సాహసమే అవుతుంది.
ఉదాహరణకి వ్యవయేతర ఉపాధి రంగం ఇన్నాళ్ళు అనుకున్నదాని కంటే పెద్దదని సర్వే కులుక్కుంటూ చెప్పింది. ఇది నిజానికి కేంద్ర ప్రభుత్వం / పాలకవర్గాల అవసరం నుండి వెలువడిన నిర్ధారణ మాత్రమే. బిజేపి దృష్టిలో ఉపాధి అంటే ఏమిటో మోడి స్వయంగా జీ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. మోడి ప్రకారం “ఆఫీసుల బయట పకోడీలు అమ్ముతూ రోజుకు రు 200 సంపాదించే వాళ్ళు కూడా ఉపాధి కల్పించబడినట్లే.” మోడి చెప్పిన ‘సంవత్సరానికి కోటి ఉద్యోగాల’ హామీ ఆ విధంగా నెరవేరినట్లే అన్నట్లు!
కాబట్టి బిజేపి/మోడి ప్రభుత్వం దృష్టిలో ఉపాధి అంటే దానికి స్ధిరత్వం అవసరం లేదు. ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో అన్న భయం ఉన్నా అది ఉపాధే. ఎండా, వానల్లో గల్లంతయ్యే ఉపాధి కూడా ఉపాధే. రాత్రింబవళ్ళు ఎండనకా, వాననకా నిలబడవలసి వచ్చే పనీ ఉపాధే. ఎటూ పాలు పోక ఉన్న పరిస్ధితుల్లోనే నాలుగు రాళ్ళు సంపాదించుకోవడానికి స్వయంగా కల్పించుకునే ఉపాధి కూడా ఉపాధే. కడుపు నింపుకోవడానికి తప్ప విద్య, ఉన్నత విద్య, వైద్యం, మానసిక ఉల్లాసం మొ.న సహజ అవసరాలను తీర్చుకోవడానికి పైసా మిగలకపోయినా కూడా ఉపాధే. వారికి స్ధిరమైన ఆదాయం, భద్రత కల్పించే బాధ్యత ఇక ప్రభుత్వాలపై లేదు. ఆకలి, అర్ధాకలి, కరువు, పోషహాకార లేమి ఇవేవీ వారికి సమస్యలు కావు.
ఇలాంటి వారికి వ్యవసాయేతర ఉపాధి అకస్మాత్తుగా పెద్దదిగా కనిపిస్తోంది. ఈ నిర్ధారణతో వ్యవసాయ రంగంలో నెలకొన్న తీవ్ర సంక్షోభాన్ని గుర్తించే అవసరం ప్రభుత్వాలకు తప్పిపోయింది. ‘వ్యవసాయం దండగ’ అన్నందుకు పదేళ్ళ పాటు అధికారం నుండి దూరమైన చంద్రబాబు నాయుడు లాంటివారైనా మోడి, జైట్లీ, అరవింద్ సుబ్రమణీయన్ లకు పాఠాలు నేర్పవలసిన అగత్యం వచ్చింది.
జిఎస్‌టి చెల్లింపుదారుల నమోదు సంఖ్య, చెల్లింపులు / వసూళ్లు గణాంకాలను బట్టి సర్వే వ్యవసాయేతర ఉపాధి సైజును నిర్ధారించింది. అనగా ఇది పరోక్ష నిర్ధారణ. ఏసి గదుల్లో కూర్చొని గణాంకాలను బట్టి వేసిన నిర్ధారణ. అంతే తప్ప వాస్తవంగా ఉపాధి గణాంకాలను సేకరించి వేసిన నిర్ధారణ కాదు. ఇలాంటి పరోక్ష నిర్ధారణలు ఎంత మాత్రం శాస్త్రీయం కాజాలదు.
(ఎకనమిక్ సర్వే గురించిన మరిన్ని వివరాలు తర్వాత వ్యాసాలలో చూద్దాం!)
Great knowledge info. Thanks for info