
A Raja being greeted?
కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ఒక కారణంగా పని చేసిన 2జి కుంభకోణంలో ఎట్టకేలకు తీర్పు వెలువడింది. 2011 లో మొదటి అరెస్టు జరిగిన ఈ కేసు విచారణ 6 సంవత్సరాల లోనే పూర్తి కావడం బహుశా -భారతీయ కోర్టుల సంప్రదాయం ప్రకారం- ఒక రికార్డు కావచ్చుఁ.
2008 లో కాగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన 2జి కుంభకోణం 2009 – 10 నాటికి భారీ 1.76 లక్షల కోట్ల భారీ కుంభకోణంగా దేశ ప్రజల దృష్టికి వచ్చింది. సిబిఐ చేతికి వెళ్ళాక 2011 లో మొదటి అరెస్టు జరగ్గా, 2012 లో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 122 టెలికం లైసెన్స్ లను రద్దు చేసేసింది.
అయితే కుంభకోణం ఎంతటి సంచలనానికి కారణం అయిందో, తీర్పు మాత్రం అంత చప్పగా ముగిసిపోయింది. ఆరేళ్ళ పాటు విచారించిన భారతీయ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు టన్నుల కొద్దీ పేపర్లలో అభియోగాలు, సాక్ష్యాలు ప్రవేశపెట్టి చివరికి నిందితులు ఎటువంటి శిక్షా లేకుండా తప్పించుకునేలా చూడటంలో గొప్పగా సఫలం అయ్యారు. నిందితులపై నేరారోపణలు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలం అయిందని ప్రత్యేక సెషన్స్ (సిబిఐ) కోర్టు జడ్జి ఓ పి సైనీ తేల్చేశారు.
“నేరారోపణలు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ అత్యంత దారుణంగా విఫలం అయిందని చెప్పడానికి నేను వెనకాడడం లేదు” అని జడ్జి తన తీర్పులో చెప్పారంటే ప్రభుత్వ లాయర్లు శిక్షలు పడేందుకు కృషి చేశారో, శిక్షలు తప్పించేందుకు కృషి చేశారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. అత్యంత ఘోరమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలకు కేవలం బెయిల్ వఛ్చినందుకే పెద్ద ఎత్తున సంబరాలు జరిగే ఈ దేశంలో నేరాలు చేసిన రాజకీయ నేతల నేర విచారణ సజావుగా జరగడం, శిక్షలు పడడం ఎవరూ ఊహించలేని ఘనకార్యాలే మరి!
సిబిఐ ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణలో నిందితులుగా ప్రాసిక్యూషన్ పేర్కొన్న ఏ ఒక్కరి పైనా నేరం రుజువు చేయలేకపోయారని తీర్పు వెలువడింది. యూపీఏ 2 హయాంలో కేంద్ర మంత్రులుగా పని చేసిన రాజకీయ నేతలు, ప్రముఖ కార్పొరేట్ కంపెనీల అధిపతులు మరియు అధికారులు, అత్యున్నత బ్యూరోక్రాట్ అధికారులు ఈ కేసులో నిందితులు కాగా అందరూ నేరం రుజువు కానీ వారు గా బయటపడ్డారు. అయితే నిందితులు ‘నిర్దోషులు’ అని కోర్టు పేర్కొన్నట్లుగా ఏ పత్రికా చెప్పకపోవడం గమనించవలసిన విషయం. ‘నిందితుల పైన నేరం రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలం అయింది’ అని కోర్టు అన్నదే గానీ ‘సాక్షాధారాల ప్రకారం నిందితులు నిర్దోషులు‘ అని మాత్రం కోర్టు చెప్పలేదు. నిందితులు దోషులుగా రుజువు అయే అవకాశం లేకపోలేదని కోర్టు తీర్పు పరోక్షంగా సూచిస్తున్నది.
ఇంతకీ 2 జి కుంభ కోణం జరిగినట్లా, జరగనట్లా? కాగ్ పేర్కొన్నట్లు భారత ఖజానాకు 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లడం నిజం కాదా? నష్టం నిజం కాకపొతే, సుప్రీం కోర్టు 122 కంపెనీల టెలికం లైసెన్స్ లను ఎందుకు రద్దు చేసినట్లు? రద్దు చేసిన తర్వాత స్పెక్ట్రమ్ వేలంలో లక్ష కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు ఎలా వఛ్చి చేరింది? కాగ్ వేసిన లెక్క అక్షరాలా నిజమే అని ఖజానా ఆదాయం స్పష్టంగా చూపుతుంటే కుంభకోణం జరగలేదని చెప్పే అవకాశమే లేదు.

kanimozhi & raja celebrate
చూడగానే ఈ రోజు స్పెషల్ కోర్టు తీర్పు సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాంగ్రెస్ ఎంపీలు, డీఎంకే ఎంపీలు, కార్పొరేట్ అధికారులు, బ్యూరోక్రాట్లు కూడా అదే చెబుతున్నారు. అసలు 2జి కుంభకోణమే మిధ్య అన్నట్లుగా కాంగీ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఉదాహరణకి మాజీ టెలికం మంత్రి కపిల్ సిబాల్ ఈ మేరకు అప్పుడే ఇంటర్వ్యూ కూడా ఇచ్ఛేశాడు. విచారణకు ముందు ఈయనే “కుంభకోణం మిధ్య“ అని ప్రకటించాడు.
ఇవి వాస్తవాలు కావు. జరిగింది ఏమిటి అని చూస్తే కుంభకోణం జరిగింది నిజమే గానీ ఇప్పుడు/ఈ రోజు సిబిఐ స్పెషల్ కోర్టు తేల్చిన విచారణ కేసు, 122 టెలికం లైసెన్స్ లను రద్దు చేసిన కేసు రెండూ వేరు వేరు అని అర్ధం అవుతుంది. రెండు కేసులూ 2 జి కుంభకోణానికి సంబంధించినవే. కానీ సారాంశం మాత్రం వేరు. ఒక కుంభకోణం లోని రెండు వేరు వేరు అంశాలలో సుప్రీం కోర్టు, సిబిఐ కోర్టులు తీర్పులు ఇచ్చాయి. అవి వేరు వేరుగా ఉన్నాయి.
కాస్త వివరంగా చూస్తే 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయా లేదా అన్న సంగతిని 2012 తీర్పులో సుప్రీం కోర్టు పరిశీలించింది. అక్రమాలు జరిగాయి అనేందుకు తగిన ఆధారాలు ఉన్నాయి అని సుప్రీం కోర్టు నిర్ధారించింది. ఈ నిర్ధారణ వల్లనే స్పెక్ట్రమ్ లైసెన్స్ లను మొత్తంగా రద్దు చేసి సరికొత్తగా వేలం వేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. అనగా కేటాయింపులలో అక్రమాలు జరిగాయన్న కాగ్ పరిశీలన నిజమే అని సుప్రీం కోర్టు తేల్చింది.
సిబిఐ ప్రత్యేక కోర్టు మూడు అంశాలను / కేసులను పరిశీలించింది. అవి:
1 మాజీ మంత్రి ఏ రాజా తదితరులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారా లేదా?
2 ఎస్సార్ గ్రూపు కంపెనీ చట్టాల నుండి తప్పించుకోవడానికి వీలుగా లూప్ టెలికం కంపెనీని ఫ్రంట్ కంపెనీగా స్ధాపించిందా?
3 ఏ రాజా తదితరులు రు 200 కోట్ల మేరకు మనీ లాండరింగ్ నేరానికి పాల్పడ్డారా?
ఈ మూడింటికి నిందితులు పాల్పడ్డారని సిబిఐ అభియోగాలు మోపింది. సాక్షాలు సేకరించి సమర్పించింది. కానీ ముగ్గురు నిందితులుగా రుజువు ఆఎందుకు తగిన సాక్షాలను ప్రవేశపెట్టడం, శక్తివంతమైన వాదనలు వినిపించడం లాంటివి ప్రాసిక్యూషన్ బృందం (ప్రభుత్వ లాయర్లు) చేయలేకపోయింది. అదే ట్రయల్ కోర్టు / ప్రత్యేక కోర్టు తన తీర్పులో చెప్పింది.
కాబట్టి కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నట్లు సిబిఐ కోర్టు తీర్పు వారికి క్లీన్ చిట్ ఇవ్వడం కాదు. నిందితులు చెప్పుకుంటున్నట్లు ఇది వారికి విజయం కాదు.
ఈ తీర్పు నిజానికి భారత దేశంలో పెద్దలపై (బడా రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్ అధికారులు, పెట్టుబడిదారీ సంపన్నులు) నేరాలు, వాటికి ఎన్ని గట్టి సాక్షాలు ఉన్నప్పటికీ, రుజువై శిక్షలు పడే అవకాశం లేదని, శిక్షలు పడకుండా ఉండేందుకు ఈ పెద్దలు అందరూ పార్టీలకు అతీతంగా ఒకటి అవుతారని మరోసారి నిర్ధ్వంద్వముగా రుజువు చేసింది.
అవును సర్,గుజరాత్ ఎంకౌంటెర్ నుండి,మారణహోమంల నుండి ఇలానే అమిథ్ షా,మోదీలు కూడా తప్పించుకున్నారు.
అవును మూల గారు. కోర్టులో మాట వినని సెషన్స్ జడ్జిలను బదిలీ చేయించి తమ వాడిని అక్కడికి తెప్పించుకుని కేసు రద్దు చేయించుకున్నారు. ఈ క్రమంలో ఓ జడ్జి అనుమానాస్పద పరిస్ధితుల్లో చనిపోయారు కూడాను.
ఈ కేస్ కొట్టివేసిన న్యాయమూర్తే ఇంతకుముందు ఎర్రకోట కాల్పుల కేసులో నిందితులకి మరణశిక్ష వేసాడు. ఇది చట్టం ముందు సమానత్వం లేకపోవడానికి సంబంధించిన సమస్య.
2జి స్కామ్ వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది. కానీ చట్టం ముందు సమానత్వం అమలు చేస్తే రేపు భాజపా నాయకులు కూడా ఏ స్కామ్‌లోనో జైలుకి వెళ్ళొచ్చు కనుక నరేంద్ర మోదీ కూడా దాన్ని అమలు జరగనివ్వడు.