జింబాబ్వేలో మిలట్రీ కుట్ర: ముగాబే హౌస్ అరెస్ట్!


Robert Mugabe

పశ్చిమ సామ్రాజ్యవాదులు మరోసారి ప్రచ్చన్న యుద్ధం నాటి మిలట్రీ కుట్రలకు తెర తీశారు. జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే (97) ను, ఆయన కుటుంబాన్ని ఆ దేశ మిలట్రీ గృహ నిర్బంధంలో ఉంచింది. రాజధాని హరారేలో సైనికులు కవాతు తొక్కుతున్నారు. పలు ప్రభుత్వ భవనాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు వారి ఆఫీసులకు వెళ్లకుండా రోడ్లపైనే ఆపి వెనక్కి పంపేశారు. “దేశాధ్యక్షుడు క్షేమమే” అంటూ మొదట ప్రకటించిన సైన్యం ఆ తర్వాత ఆధికారాలను చేపట్టినట్లు ప్రకటించింది.

దేశాధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేసి ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకుని, ప్రభుత్వ ప్రసార సాధనాల (టి.వి, రేడియో) భవనాల పైకి సైన్యాన్ని నడిపించి బలవంతంగా స్వాధీనం చేసుకున్న మిలట్రీ విచిత్రంగా “మేము మిలట్రీ కుట్రకు పాల్పడలేదు” అని ప్రకటించింది. “అధ్యక్షుడి చుట్టూ గుమి కూడిన నేరగాళ్లను అరెస్టు చేసి శిక్షించే లక్ష్యంతోనే మేమీ చర్యలు తీసుకుంటున్నాం. మా మిషన్ పూర్తయ్యాక త్వరలో పరిస్ధితి సాధారణ స్ధితికి వస్తుంది. ఇది అధికార ఘర్షణ కాదు” అని చెప్పుకుంది.

“హిస్ ఎక్సలెన్సీ ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ జింబాబ్వే, మరియు జింబాబ్వే డిఫెన్స్ బలగాల కమాండర్ ఇన్-చీఫ్ అయిన కామ్రేడ్ రాబర్ట్ ముగాబే, ఆయన కుటుంబం క్షేమమే. వారి భద్రతకు గ్యారంటీ ఉన్నదని దేశానికి హామీ ఇస్తున్నాము. అధ్యక్షుడు చుట్టూ ఉన్న నేరగాళ్లను మాత్రమే మేము లక్ష్యం చేసుకున్నాం. దేశంలో సామాజిక, ఆర్ధిక కష్టాలకు కారణం అవుతున్న ఈ నేతలను అరెస్ట్ చేసి న్యాయం చేసేందుకే ఈ చర్యలు” అని మిలట్రీ ప్రకటించింది.

పలు పశ్చిమ పత్రికలు ఇదే వార్తను పొల్లు పోకుండా ప్రసారం చేస్తున్నాయి. ముగాబే క్షేమమే అని చెబుతున్నాయి గానీ ఆయన ఎందుకు మాట్లాడడం లేదో చెప్పడం లేదు. ఆయన భార్య గ్రేస్ నాయకత్వం లోని జి40 గ్రూపు నాయకులు ఎందుకు అరెస్ట్ అవుతున్నారో చెప్పడం లేదు.

కానీ ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ప్రకారం బుధవారం ఉదయం కూడా ప్రభుత్వ టి.వి భవనాలు సైన్యం స్వాధీనం లోనే ఉన్నాయి. ఎయిర్ పోర్ట్ వద్ద చెక్ పోస్ట్ సైన్యం స్వాధీనంలో కొనసాగుతోంది. నగర కేంద్రంలో పలు వీధులు సైన్యం స్వాధీనంలో ఉన్నాయి. ఆర్మీ వాహనాలు వీధుల్లో మోహరించారు. టి.వి, రేడియోలు సాధారణ కార్యక్రమాలకు బంద్ పెట్టి కేవలం మ్యూజిక్ మాత్రమే ప్రసారం చేస్తున్నాయి.

అయితే అమెరికా పత్రిక బ్లూమ్ బర్గ్ న్యూస్ అసలు సంగతి చెప్పకనే చెప్పింది. పత్రిక ప్రకారం రాబర్ట్ ముగాబే పదవి నుండి దిగిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. తన భార్య గ్రేస్ దేశం వదిలి వెళ్లిపోయేందుకు అనుమతించడం కోసం  సైన్యంతో చర్చలు జరుపుతున్నాడు. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఇంటర్నెట్ పత్రిక న్యూస్ 24 ఈ వార్తను ధృవీకరించింది.

ఎలా మొదలైంది?

జింబాబ్వేకు ఎమర్శన్ నంగాగ్వా ఉపాధ్యక్షుడు. ముగాబే అనంతరం ఆయనే అధ్యక్ష పదవిని చేపట్టే వారసుడు ఆయనేనని దాదాపు ఖాయం అయింది. అలాంటిది నవంబర్ 6 తేదీన అధ్యక్షుడు ముగాబే, ఎమర్శన్ నంగాగ్వాను ఉపాధ్యక్ష పదవి నుండి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశాడు. ఉపాధ్యక్షుడు, ఆయన మద్దతుదారులు అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేసేందుకు సిద్ధం అయ్యారని, అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారని అందుకే పదవి నుండి తొలగించామని ప్రభుత్వం ప్రకటించింది.

పశ్చిమ పత్రికలు తొలగింపుకు వేరే భాష్యం చెప్పాయి. పార్టీలోనే జి40 ఫ్యాక్షన్ కు నాయకత్వం వహిస్తున్న గ్రేస్ (ముగాబే భార్య. ఆమె వయసు 52) కు పార్టీ, ప్రభుత్వ పగ్గాలు అప్పగించే లక్ష్యంతోనే ఈ ఉద్వాసన జరిగిందని అవి ప్రచారం ప్రారంభించాయి. స్వాతంత్ర పోరాటం నుండి పార్టీలో ఉంటున్న నాయకులను ఈ గ్రూపు పక్కకు నెట్టివేసిందని, అధికారం లాక్కునేందుకు లక్ష్యం చేసుకుందని రాశాయి.

నంగాగ్వా దేశం నుండి వెళ్లిపోయాడని, దక్షిణాఫ్రికా చేరాడని ఆయన మద్దతుదారులు నవంబర్ 8 తేదీన ప్రకటన విడుదల చేశారు. తాను దేశానికి తిరిగి వచ్చి పార్టీకి, ప్రజలకు నాయకత్వం వహిస్తానని ఆయన ప్రకటించినట్లు కొన్ని పత్రికలు చెప్పాయి. “పార్టీ నీ ఆస్తి లేదా నీ కుటుంబ ఆస్తి కాదు, నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి” అంటూ ఆయన 5 పేజీల ఉత్తరం ముగాబెకు రాశాడని ఆ పత్రికలు చెప్పాయి. ఆయన్ను పార్టీ నుండి బహిష్కరించామని పాలక పార్టీ జాను-పి‌ఎఫ్ (Zanu-PF) బదులుగా ప్రకటించింది.

నవంబర్ 13 తేదీన ఆర్మీ చీఫ్ జనరల్ కానిస్టాంటినో చివెంగా కఠిన పదజాలంతో నంగాగ్వాకు మద్దతుగా ప్రకటన విడుదల చేశాడు. ఈ ప్రకటనతో ముగాబే, నంగాగ్వా పై చేసిన ఆరోపణలు నిజమే అని రుజువైనాయి. ముగాబే వ్యతిరేకులను పదవీచ్యుతులను చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారు. దీనిని వెంటనే ఆపాలి. లేనట్లయితే ఆపేందుకు రంగంలో దిగేందుకు సైన్యం సిద్ధంగా ఉన్నది” అని ఆయన ప్రకటించాడు.

భద్రతా మంత్రిగా పని చేసిన నంగాగ్వా మిలట్రీ అధికారులకు సన్నిహితుడు అని తెలుస్తోంది.

నవంబర్ 14 తేదీన మిలట్రీ వాహనాలు, ట్యాంకులు రాజధాని హరారే శివార్లలో కవాతు చేశాయి. హరారే లోని ముగాబే నివాసం వద్ద తుపాకి కాల్పులు వినిపించాయి. కానీ మిలట్రీ కుట్ర జరిగిందనడం నిజం కాదని మిలట్రీ ప్రకటించింది. అధ్యక్షుడు క్షేమంగా ఉన్నాడని చెప్పింది. అధ్యక్షుడు చుట్టూ ఉన్న క్రిమినల్స్ ను టార్గెట్ చేసుకున్నామని ప్రకటించింది.

నవంబర్ 15 ఉదయం నాటికి జరిగింది మిలట్రీ కుట్రే అని స్పష్టం అయింది. తెల్లవారు ఝామునే మిలట్రీ వాహనాలు హరారే వీధుల్లో ప్రవేశించాయి. తెల్లవారాక ప్రభుత్వోద్యోగులు ఆఫీసులకి వెళ్లకుండా సైన్యం అడ్డుకుని వెనక్కి పంపేసింది. జనం వీధుల్లోకి రావద్దని హెచ్చరించారు. ప్రభుత్వ టి.వి భవనం లోకి సైన్యం జొరబడి సిబ్బందిని కొట్టి బైటికి ఈడ్చేశారు. రేడియో స్టేషన్ కు అదే గతి పట్టింది.

సౌతాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జ్యూమాకు ముగాబే నుండి ఫోన్ వచ్చిందని ఆ దేశ పత్రికలు తెలిపాయి. తనను హౌస్ అరెస్ట్ చేశారనీ అయినా తాను క్షేమంగానే ఉన్నాననీ ముగాబే తనతో చెప్పినట్లు జాకబ్ ప్రకటించాడు. జింబాబ్వే సైన్యం చర్యలను ఆయన తీవ్రంగా ఖండించాడు. చట్టవిరుద్ధంగా అధికారం లాక్కోవడం ఆఫ్రికా దేశాల కూటమి రూపొందించుకున్న నియమాలకు విరుద్ధం అని స్పష్టం చేశాడు.

సరిగ్గా ఈ కారణంతోనే జింబాబ్వే సైన్యం పలు జాగ్రత్తలు తీసుకుంది. ప్రచ్చన్న యుద్ధ కాలంలో పశ్చిమ దేశాల ప్రభావంతో వారి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలను కూలదోయడం, నియంతృత్వ పాలన చేపట్టడం విడనాడాలని ఆఫ్రికా దేశాల కూటమి నియమాలు రూపొందించుకుంది. కనుక ఆఫ్రికా దేశాల నుండి మద్దతు అందాలంటే మిలట్రీ కుట్ర జరిగినట్లుగా పైకి కనిపించకూడదు. జింబాబ్వే ప్రజల్లో ముగాబేకు ఉన్న పలుకుబడిని రెచ్చగొట్టకూడదు. ఈ లక్ష్యంతో ముగాబే వ్యతిరేకులు / పశ్చిమ దేశాల సేవకులు, జాగ్రత్తగా పావులు కదిపారు.

త్వరలో జింబాబ్వేకు ప్రతినిధి వర్గాన్ని పంపిస్తానని సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జ్యూమా ప్రకటించాడు. బహుశా ఈ బృందం రాబర్ట్ ముగాబే, ఆయన కుటుంబాన్ని సౌత్ ఆఫ్రికాకు తీసుకెళ్లే పనితో రావచ్చు తప్ప జరిగిన పరిణామాలు వెనక్కి మరల్చేందుకు మాత్రం కాదు.

కొత్త మిలీనియం మొదటి దశకంలో రాబర్ట్ ముగాబే దేశంలోని వ్యవసాయ భూములకు సంబంధించి విప్లవాత్మక చర్యలు చేపట్టాడు. స్వాతంత్రం వచ్చిందని చెప్పినప్పటికీ మెజారిటీ భూములు వలస పాలకులు వారసులైన తెల్లవారి చేతుల్లోనే ఉండిపోయాయి. వ్యాపారాలు, పరిశ్రమలు సమస్తం తెల్లవారి నియంత్రణలో మిగిలిపోయాయి. ఈ నేపధ్యంలో ముగాబే భూసంస్కరణలను కఠినంగా అమలు చేశాడు. తెల్లవారి నుండి భూములు లాక్కుని ప్రభుత్వపరం చేశాడు. ఆ తర్వాత భూములు లేని నల్లవారికి -జింబాబ్వే దేశ వాసులకి- పంచాడు.

పూర్తిగా నల్లవారి దేశం అయినప్పటికీ జింబాబ్వే క్రికెట్ టీం మాత్రం పూర్తిగా తెల్లవారితో నిండి ఉండేది. ఇక్కడ కూడా ముగాబే సంస్కరణలు చేపట్టాడు. టీం లో నిర్దిష్ట సంఖ్యలోని స్ధానాలు ఖచ్చితంగా నల్ల క్రీడాకారులే ఉండేట్లు చూశాడు. ఇది నచ్చక కొందరు తెల్ల ఆటగాళ్లు దురహంకారంతో ఆట నుండి రిటైర్ ప్రకటించిన సంఘటనలు కూడా జరిగాయి.

ఈ చర్యలు ఐరోపా దేశాలకు ముఖ్యంగా బ్రిటన్ కు ఎంత మాత్రం నచ్చలేదు. జింబాబ్వే భూములు న్యాయంగా అక్కడి దేశవాసులకే చెందాలి. కాబట్టి ముగాబే చర్యలు ఆలస్యం అయినా సరైనవి. ఈ చర్యలు అప్పటి బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ ‘పిచ్కితనం” కనిపించాయి. ముగాబే ను “పిచ్చోడు” అని బ్లెయిర్ తిట్టిపోసాడు. జింబాబ్వేపై దాడి చేసి ముగాబెను తప్పిస్తే తప్ప ఆ దేశ ప్రజలకు విముక్తి లేదని ప్రకటించాడు.

అప్పటి నుండి రాబర్ట్ ముగాబే ను దించేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పలు కుట్రలు జరిగాయి. కుట్రలు అన్నింటినీ ముగాబే సమర్ధవంతంగా ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాడు. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే కుట్రలను ఓడించాడు. దానితో పశ్చిమ దేశాలు జింబాబ్వేపై అన్యాయమైన ఆంక్షలు విధించాయి. దేశ ఆర్ధిక వ్యవస్ధను సర్వనాశనం చేసే ఏకైక లక్ష్యంతో ఆంక్షలు అమలు చేశాయి. వారు ఆశించినట్లే జరిగింది. ఎగుమతులు, దిగుమతులు అనేకం స్తంభించడంతో ఆర్ధిక వ్యవస్ధ కుదేలయింది. ద్రవ్యోల్బణం అవదులు దాటింది. ఒకదశలో 500 బిలియన్ % గా కూడా ద్రవ్యోల్బణం నమోదయింది.

ఈ పరిస్ధితి నుండి తప్పించుకోవడానికి తమ కరెన్సీని అమెరికన్ డాలర్ తో ముడిపెట్టాడు ముగాబే. కానీ అప్పటి నుండి ప్రజలకు కరెన్సీ దుర్లభం అయింది. ఇండియాలో డీమానిటైజేషన్ రోజుల్లో జరిగినట్లుగా కరెన్సీ కోసం బ్యాంకుల ముందు జనం క్యూలు కట్టడం పరిపాటిగా మారింది. ఇటువంటి ఆంక్షలతో ప్రజల్లో ముగాబే పట్ల వ్యతిరేకత ప్రబలేందుకు బ్రిటన్, అమెరికా తదితర పశ్చిమ దేశాలు కృషి చేసాయి. కొంతమేరకు సఫలం అయ్యారు కూడా.

తాజా పరిణామాలకు పధక రచన ఎవరిదో, ఏయే పశ్చిమ దేశాలు ఇందులో ప్రత్యక్ష, పరోక్ష పాత్రలు పోషించాయో త్వరలో వెల్లడి కాక మానదు. అప్పటివరకూ పశ్చిమ దేశాల పత్రికలు, ఛానెళ్ల లోనూ వాటిని అనుసరించే భారత పత్రికలు, ఛానెళ్ల లోనూ వచ్చే వార్తలను విచక్షణతో పరిశీలించవలసి ఉంటుంది.

2 thoughts on “జింబాబ్వేలో మిలట్రీ కుట్ర: ముగాబే హౌస్ అరెస్ట్!

  1. పూర్తిగా నల్లవారి దేశం అయినప్పటికీ జింబాబ్వే క్రికెట్ టీం మాత్రం పూర్తిగా తెల్లవారితో నిండి ఉండేది. ఇక్కడ కూడా ముగాబే సంస్కరణలు చేపట్టాడు. టీం లో నిర్దిష్ట సంఖ్యలోని స్ధానాలు ఖచ్చితంగా నల్ల క్రీడాకారులే ఉండేట్లు చూశాడు. ఇది నచ్చక కొందరు తెల్ల ఆటగాళ్లు దురహంకారంతో ఆట నుండి రిటైర్ ప్రకటించిన సంఘటనలు కూడా జరిగాయి.

    అవును సర్,ఆండీ ఫ్లవర్ వంటి శ్వేత జాతీయుడు,హెన్రీ ఒలాంగొ వంటి స్థానికుడు(నల్ల జాతియుడు) కూడా 2003లో సౌత్ ఆఫ్రికా,జింబాబ్వే,కెన్య సమ్యుక్తంగా నిర్వహించిన క్రికెట్ ప్రపంచపోటీలలో నల్ల బ్యాడ్జీలను తొడుగుకొని తమ దేశ ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు.
    ఆ తర్వాత కొంతమంది శ్వేతజాతీయులు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించుకొని ఇంగ్లండ్ లో కౌంటీలలో ఆడుతూ స్థిరపడ్డారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s