ఐఫోన్ X: తయారీ ఖర్చు $358, అమ్మకం ధర $1570 -విశ్లేషణ


మాకింతోష్ (మ్యాక్) కంప్యూటర్, ఐ పాడ్, ఐ ఫోన్, ఐ ప్యాడ్… ఈ ఎలక్ట్రానిక్ వస్తువులకు ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. ఎంత గిరాకీ అంటే ప్రపంచంలో అనేక దేశాల జి‌డి‌పి విలువల కంటే ఎక్కువగా యాపిల్ కంపెనీ వద్ద డబ్బు పోగుబడేటంత! ఐ ఫోన్ ను సొంతం చేసుకోవడం కోసం రెండేళ్ల క్రితం చైనా యువకుడు ఒకరు తన కిడ్నీని అమ్ముకున్నాడంటే యాపిల్ ఉత్పత్తులకు ఉన్న గిరాకీ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.

భారీ మొత్తంలో డబ్బు పోగేసుకుంటున్న యాపిల్ ఉత్పత్తులను తయారు చేయడం కోసం కంపెనీకి వాస్తవంగా ఎంత ఖర్చు అవుతుందన్నది నిత్యం ఒక చర్చగా ఉంటోంది. తయారీ ఖర్చు కంటే చాలా ఎక్కువ ధరని యాపిల్ కంపెనీ వసూలు చేస్తుందని ప్రపంచానికి తెలుసు. కానీ ఆ ‘ఎక్కువ’ ఎంత అన్నది చాలా మందికి తెలియదు.

యాపిల్ కంపెనీ ఉత్పత్తి చేసిన తాజా ఫోన్ మోడల్ పేరు ఐ ఫోన్ X. అమెరికా మార్కెట్ లో దీని ధర 999 డాలర్లు. అంటే భారత కరెన్సీలో ఇది రు 65,000 లు కి సమానం.

ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ పత్రిక తాజా ఐ ఫోన్ తయారీ ఖర్చు ఎంతో వెల్లడి చేసింది. పత్రిక ప్రకారం ఐ ఫోన్ X (64 GB మోడల్) తయారు చేయడానికి 357.5 డాలర్లు ఖర్చు అవుతుంది. ముడి సరుకులు, పెట్టుబడి సరుకులు, పెట్టుబడి, వర్కర్ల వేతనాలు… ఇలా ఒక ఐ ఫోన్ X తయారీ కోసం అయిన  ప్రతి ఒక్క ఖర్చుని లెక్క గడితే $357.50 అవుతుందని పత్రిక చెప్పింది.  ఇది మన కరెన్సీలో దాదాపు రు 23,000/- కి సమానం.

అమెరికాలో అమ్మకం ధరకీ, తయారీ ఖర్చుకీ ఉన్న వ్యత్యాసం 641.5 డాలర్లు. ఇది దాదాపు రు 42,000 లు కు సమానం. ఐ ఫోన్ X తయారీ ఖర్చు రు 23,000 అవుతుంటే దాని అమ్మకం రేటు మాత్రం “అమెరికాలో” రు 65,000. లెక్క కడితే లాభం మార్జిన్ 64%గా తేలుతుంది. ఇంత లాభం వస్తుంటే డబ్బు కుప్పలు పొగుపడక ఏమవుతుంది.

అంతేనా?! అప్పుడే పూర్తి కాలేదు. ఇంకా ఉంది.

ఇదే ఐ ఫోన్ X ని యాపిల్ కంపెనీ ఇండియాలో ఇంకా ఎక్కువ ధరకి అమ్ముతోంది. అనగా అమెరికా వినియోగదారులకి ఒక రేటు, భారత వినియోగదారులకి మరో రేటూ యాపిల్ అమలు చేస్తోంది. “లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్” గురించి, స్వదేశీ-విదేశీ కంపెనీల మధ్య వివక్ష గురించీ అమెరికన్, యూరోపియన్ కంపెనీలు తెగ లెక్చర్లు దంచుతాయి. భారత ప్రభుత్వం స్వదేశీ కంపెనీలనీ, విదేశీ కంపెనీలనీ ఒకే రకంగా చూడాలని బోధిస్తాయి. అందుకోసం బ్లాక్ మెయిల్ కి కూడా దిగుతాయి. తమ వద్దకి వచ్చేసరికి వివక్ష వివక్ష కాకుండా పోతుంది.

సరే ఇండియాలో ఐ ఫోన్ X ధర ఎంత? 64 GB మోడల్ అయితే రు 89,000 కి ($1370) యాపిల్ అమ్ముతోంది. అదే 256 GB మోడల్ ని రు 1,02,000 (1570$) కి అమ్ముతోంది. 64 GB మోడల్ ని అమెరికాలో కంటే ఇండియాలో రు 24,000 ఎక్కువ రేటుకి యాపిల్ వసూలు చేస్తోంది. అమెరికా రేటూ, ఇండియా రేటులో వ్యత్యాసంతో ఇంకో ఐ ఫోన్ X ని తయారు చెయ్యొచ్చన్నమాట! ఎంత ఘోరం!

ఈ లెక్క ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ పత్రిక వేసినది కాదు. టెక్ ఇన్సైట్స్ (TechInsights) అనే టెక్నాలజీ అనాలసిస్ సంస్ధ కట్టిన లెక్క ఇది. ఈ సంస్ధ ఆయా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లోని విడివిడి భాగాల తయారీకి పట్టే ఖర్చు, వాటిని అసెంబుల్ చేయడానికి పట్టే ఖర్చు, ఇంకా ఇతర ఖర్చులు లెక్క వేసి అంతిమ ఉత్పత్తి తయారీకి పట్టే ఖర్చుని అంచనా వేస్తుంది. ఇది సరైన లెక్కే. అందులో అనుమానం లేదు.

కానీ ఇంత లాభం సంపాదించడం ఎలా సాధ్యం? ఇలా ప్రతి కంపెనీ కూడా తనకు కావలసినంత లాభాన్ని అసలు తయారీ ఖర్చుకి కలిపేసుకుని అమ్మేస్తాయా? దీనికి ప్రభుత్వ చట్టాలు ఎలా, ఎందుకు ఒప్పుకుంటున్నాయి? జనాలు ఎందుకు కొంటున్నారు?

ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఐ ఫోన్ X అసలు తయారీ ఖర్చు TechInsights సంస్ధ చెప్పినట్లు $357.50 కాదు. యాపిల్ కంపెనీ చెప్పే ధరే -999$- అసలు ఖర్చు. వాస్తవంగా ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకి ఇచ్చేస్తే అంతిమంగా యాపిల్ కంపెనీకి ఒక్కో ఐ ఫోన్ X ఫోన్ తయారీకి నిజంగానే 999$ ఖర్చు అవుతుంది.

అయితే యాపిల్ కంపెనీ వాస్తవంగా ఎవరికి చెల్లించాల్సిన విలువ వాళ్ళకి చెల్లించడం లేదా? చెల్లించాల్సిన విలువ కంటే తక్కువ విలువ చెల్లించి మిగిలింది లాభంగా జమ చేసుకుంటోందా?

ఈ ప్రశ్నలకు సమాధానం: A BIG “YES”! అవును! అవును!! అవును!!!

ఎలాగ?

ముందుగా సరుకుల తయారీలో ఒక సూక్ష్మ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

సరుకులు తయారీలో సజీవ శ్రమ, నిర్జీవ శ్రమ అని రెండు శ్రమలు దాగి ఉంటాయి. సజీవ శ్రమ అంటే నిర్దిష్ట మనుషులు (వర్కర్లు, ఆఫీసు ఉద్యోగులు, శాస్త్రవేత్తలు మొ.) వాస్తవంగా చేసే శ్రమ. నిర్జీవ శ్రమ అంటే సరుకు (ఫోన్) తయారీ కోసం ఉపయోగించే పెట్టుబడి సరుకులు (యంత్రాలు, బల్లలు, కుర్చీలు మొ.వి). నిర్జీవ శ్రమ అనడం ఎందుకంటే యాపిల్ కంపెనీకి వచ్చేసరికి అవి అప్పటికే (మరో కంపెనీ కార్మికుల శ్రమతో) తయారై వస్తాయి. వాటిని యాపిల్ తయారు చేయదు. మరో కంపెనీలో తయారై ఒక విలువను పొంది -ఆ విలువ యాపిల్ చేత చెల్లించబడి- అక్కడికి వస్తుంది.

సూక్ష్మ విషయం ఏమిటి అంటే

నిర్జీవ శ్రమ తనను తన సొంతదారులు ఎంత విలువ (ఖరీదు) పెట్టి కొన్నారో అంత విలువను మాత్రమే తన సొంతదారులకి ఇస్తుంది. అంతకు మించి ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వదు.

ఉదాహరణకి ఐ ఫోన్ తయారీలో ఎలక్ట్రానిక్ యంత్రాలని ఉపయోగిస్తారు కదా.  అందులో ఒక యంత్రాన్ని లక్ష డాలర్ల పెట్టి యాపిల్ కొంటే గనక ఆ లక్ష డాలర్ల విలువనే యాపిల్ కి ఆ యంత్రం ఇస్తుంది. లక్ష డాలర్ల విలువ ఇచ్చేసరికి ఆ యంత్రం పని అయిపోతుంది. అరిగిపోవడం (depreciation) వల్ల అంతకు మించి ఎక్కువ విలువ ఇవ్వదు. (సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని కొత్త వస్తువు రేటుకి అమ్మజూపితే ఎవరన్నా కొంటారా?)

కానీ సజీవ శ్రమ సంగతి అలా కాదు.

సజీవ శ్రమకి ఇచ్చే ధర/విలువ/వేతనం కంటే అధిక విలువని కంపెనీకి తిరిగి ఇస్తుంది. కార్మికుడికి వేతనం ఎంత ఇవ్వాలి అంటే అతను/ఆమె మళ్ళీ పునరుత్పత్తికి తయారు అయ్యేంత ఇవ్వాలి. అది సూత్రం. కార్మికుడు/ఉద్యోగి/శాస్త్రవేత్త మళ్ళీ పనిలోకి వచ్చి శ్రమ చేయాలంటే అతని కడుపు నిండాలి. అతని కుటుంబం కడుపు నిండాలి. అతను శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలి. అప్పుడే అతను/ఆమె మరుసటి రోజు పనిలోకి వస్తారు. వారిని పనిలోకి తీసుకునే కంపెనీ / పెట్టుబడిదారుడు అంత విలువని చెల్లించాలి. అప్పుడే కింది సూత్రం చెల్లుబాటు అవుతుంది.

కానీ కార్మికులు బ్రతికి ఉండి తిరిగి శ్రమకు అందుబాటులోకి వచ్చే మొత్తంలో కనీస (కనిష్ట) విలువను మాత్రమే చెల్లిస్తారు. తద్వారా కార్మికుడు పెట్టుబడిదారుడికి ఇచ్చే మొత్తం విలువలో కనీస మొత్తాన్ని మాత్రమే కార్మికుడికి చెల్లించి మిగిలిన విలువని లాభంగా తన జేబులో వేసుకుంటాడు.

ఇలా జేబులో వేసుకునే విలువనే అదనపు విలువ -surplus value- అంటారు. ఈ కీలక అంశాన్ని కారల్ మార్క్స్ కనిపెట్టాడు.

మరొక ముఖ్య సూత్రం ఏమిటంటే

వివిధ శ్రమలు ఉపయోగించి ఒక ఉత్పత్తి తీసినపుడు ఆ శ్రమల మొత్తం విలువ, ఉత్పత్తి మొత్తం విలువతో సమానంగా ఉంటుంది. ఉండాలి

(పెట్టుబడిదారీ) ఆర్ధిక శాస్త్రవేత్తలకు మూల పురుషుల్లో ఒకరయిన ధామస్ రాబర్డ్ మాల్తూస్ (ఆర్ధిక శాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ కు తర్వాత తరం వాడు. స్మిత్ కు శిష్యుడు) కనిపెట్టిన సూత్రం/సిద్ధాంతం ఇది.

కాబట్టి ఐ ఫోన్ X తయారీ విషయంలో చూస్తే;

సజీవ శ్రమ విలువ + నిర్జీవ శ్రమ విలువ = యాపిల్ ఐ ఫోన్ X విలువ (ధర)

ఇందులో నిర్జీవ శ్రమ తనకు సమానమైన విలువను మాత్రమే ఇస్తుంది. దానిని కొన్న రేటు కంటే  అదనంగా యాపిల్ కంపెనీ రాబట్టేది ఏమీ ఉండదు. ఇక మిగిలింది సజీవ శ్రమ. పైన చెప్పుకున్నట్లు సజీవ శ్రమ (కార్మికులు, ఉద్యోగులు) తమకు చెల్లించిన విలువ (వేతనం) కంటే అధిక విలువని తాము తయారు చేసే సరుకు విలువలో భాగంగా పెట్టుబడిదారుడికి / కంపెనీకి చెల్లిస్తుంది. ఇలా సజీవ శ్రమ యాపిల్ కంపెనీ తనకు ఇచ్చేదాని కంటే ఆ కంపెనీకి అదనంగా చెల్లించే విలువనే లాభంగా యాపిల్ తన జేబులో వేసుకుంటుంది.

అంటే యాపిల్ కంపెనీ తన లాభం అని చెప్పి సొంత చేసుకునే విలువ వాస్తవానికి కార్మికులకి ఉద్యోగులకి చెందవలసినది. పెట్టుబడి, యంత్రాలు తాను తెచ్చాన్నన్న ఒకే ఒక్క కారణంతో కార్మికులకి చెందవలసిన అదనపు విలువని తన సొంతం చేసుకుంటుంది.

ఈ అదనపు విలువకి అనేక పేర్లు: లాభం, బారు వడ్డీ, చక్ర వడ్డీ, అద్దె, పన్ను, సుంకం, నాగు, శిస్తు….

కాబట్టి సజీవ శ్రమకు వేతనం రూపంలో తిరిగి ఎంత తక్కువ చెల్లిస్తే అంత ఎక్కువ లాభం యాపిల్ కంపెనీకి చేరుతుంది. యంత్రాలకి తక్కువ చెల్లించే సౌకర్యం కంపెనీకి ఉండదు. అవతలి కంపెనీ తన యంత్రాన్ని నష్టానికి అమ్ముకోడు కదా.

సజీవ శ్రమకు ఉన్న ప్రత్యేక లక్షణం ఏమిటంటే తాను సజీవంగా ఉండేందుకు అవసరమైన విలువ కంటే అధిక విలువని తిరిగి ఉత్పత్తి చేయగలగడం.

ఈ సజీవ శ్రమ (కార్మికులు) అనేకమంది కలిసి ఉమ్మడిగా పని చేస్తే మరింత అధిక విలువని ఉత్పత్తి చేస్తారు.  సజీవ శ్రమ ఒక రోజు సజీవంగా ఉండేందుకు (భోజనం, బట్ట, నిద్రలకు) 100/- ఖర్చు అయిందనుకుందాం. ఆ రోజులో ఆ సజీవ శ్రమ 150/- (ఉదాహరణకి) విలువని ఉత్పత్తి చేస్తుంది. ఓ పది మంది కలిస్తే, ఉమ్మడి శ్రమలో 150 x 10 = 1500/- కాకుండా 1700/- ఉత్పత్తి చేస్తుంది.

ఈ విధంగా సజీవ శ్రమ ప్రత్యేక లక్షణం ద్వారా పుట్టే అదనపు విలువను పెట్టుబడిదారుడు సొమ్ము చేస్కుంటాడు. అనేకమంది కార్మికుల్ని ఒక చోటకి చేర్చి ఉమ్మడి శ్రమ ద్వారా ఉత్పత్తి అయ్యే మరింత అదనపు విలువనీ సొమ్ము చేసుకుంటాడు.

అంతిమ ఉత్పత్తి (ఐ ఫోన్ X) కి అమెరికా కొనుగోలుదారుడు చెల్లించే 999 డాలర్లు సరైన విలువే/ధరే. ఎటొచ్చీ ఉత్పత్తిలో పాల్గొనే సజీవ శ్రమకి (కార్మికులకీ ఇతర ఉద్యోగులకీ) మాత్రమే ఆ శ్రమకి సమానమైన విలువ దక్కడం లేదు. దానిని పెట్టుబడిదారుడు జేబులో వేసుకుంటున్నాడు.

మార్క్సిస్టు-లెనినిస్టులు చెప్పే పెట్టుబడిదారీ దోపిడీ అంటే ఇదే.

యాపిల్ గానీ, మరొక కంపెనీ గానీ మూకుమ్మడిగా చైనాకి తరలివెళ్లి ఫ్యాక్టరీలు ఎందుకు పెట్టినట్లు? ఎందుకంటే అక్కడ సజీవ శ్రమకు అమెరికాలో కంటే చాలా తక్కువ విలువ చెల్లించవచ్చు గనక. ఆ ఏర్పాటు చైనా ప్రభుత్వం చేసింది గనుక. అమెరికాలో ఐతే కార్మిక చట్టాల ప్రకారం చైనాలో కంటే రెండు మూడు రెట్లు అధికంగా వేతనాల నిమిత్తం చెల్లించాలి. అమెరికాలో ఫ్యాక్టరీలు నడిపినా యాపిల్ కంపెనీకి లాభాలు వస్తాయి. కానీ చైనాలో అయితే ఇంకా అనేక రెట్లు లాభాలు వస్తాయి. లాభాలు పెంచుకోవడంతో పాటు తన లాభంలో రవంత మార్జిన్ వదులుకుని తక్కువ ధరకు ఉత్పత్తిని మార్కెట్ లోకి తెచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా అమ్మకాలని పెంచుకుని మరింత లాభం సంపాదిస్తారు.

మరి ఇండియాలో ఐ ఫోన్ రేటు అమెరికాలో కంటే ఎందుకు ఎక్కువ ఉంది? ఎందుకంటే…

ఇండియాలో ఉత్పాదక శక్తి అమెరికాలో కంటే చాలా తక్కువ. ఉత్పాదక శక్తి (తక్కువ సమయంలో మెరుగైన నాణ్యత, మన్నిక గలిగిన ఉత్పత్తి తీయగల శక్తి) ఎంత ఎక్కువ ఉంటే ఉత్పత్తి ధర అంత తగ్గుతుంది. ఉత్పాదక శక్తి ఎక్కువ ఉన్న చోట అక్కడి కరెన్సీ విలువ కూడా ఎక్కువగా ఉంటుంది. కరెన్సీ విలువ ఎక్కువగా ఉండడం అంటే తక్కువ కరెన్సీకి ఎక్కువ సరుకులు రావడం. ఉదాహరణకి 10 రూపాయల కంటే 10 డాలర్లకి ఎక్కువ సరుకులు మనం కొనుక్కోగలం.

ఇండియా ఉత్పాదక శక్తి తక్కువ గనక ఐ ఫోన్ X ధర ఇండియాలో ఎక్కువ అవుతుంది.

ఈ ఎక్కువలో కొంత భాగాన్ని భారత ప్రభుత్వం సుంకం రూపంలో తన ఖజానాలో వేసుకుంటుంది. మిగిలింది యాపిల్ కంపెనీకి అప్పగిస్తుంది. ఆ విధంగా భారత ప్రభుత్వం కూడా విదేశీ సరుకుల ద్వారా భారత ప్రజల్ని మోసం చేసి ఖజానా నింపుకుంటుంది. ఆ ఖజానా డబ్బు కూడా వివిధ రాయితీలు, సబ్సిడీలు, రుణాల రూపంలో మళ్ళీ విదేశీ, స్వదేశీ కంపెనీలకి అత్యధిక భాగం వెళ్లిపోతుంది. భారత జనానికి మిగిలేది అల్ప వేతనాలు, మానసిక & శారీరక రోగాలు, నిరుద్యోగం, ఆకలి, దరిద్రం….!

ఇప్పుడు అనగా సెప్టెంబర్ 2017 ముగిసే నాటికి యాపిల్ కంపెనీ వద్ద 246 బిలియన్ డాలర్ల డబ్బు పోగుబడి ఉన్నది. ఇది 16 లక్షల కోట్ల రూపాయలకు సమానం. అలాగే 125 కోట్ల జనాభా నివశిస్తున్న భారత దేశం వార్షిక బడ్జెట్ తో ఇది సమానం.

120 వేల ఉద్యోగుల కలిగిన యాపిల్ కంపెనీ వద్ద ఉన్న డబ్బు 125 కోట్ల ఇండియా వార్షిక బడ్జెట్ కు సరిపోతుంది! ఈ $246 బిలియన్లు యాపిల్ కంపెనీ మొత్తం విలువ అనుకునేరు సుమా! కాదు, కాదు. కేవలం యాపిల్ వద్ద నిల్వ ఉన్న డబ్బు మాత్రమే $246 బిలియన్లు. యాపిల్ కంపెనీ విలువ $901 బిలియన్లు!

************

ఇది చాలా చాలా క్లుప్తీకరించబడిన విశ్లేషణ.  లోతు వివరాలలోకి వెళితే విషయం సంక్లిష్టం అవుతుంది. అయోమయం ఏర్పడుతుంది. స్ధూలంగా ఒక ఐడియా రావడం కోసం వివరాలను పరిమితం చేయడం జరిగింది. -విశేఖర్

7 thoughts on “ఐఫోన్ X: తయారీ ఖర్చు $358, అమ్మకం ధర $1570 -విశ్లేషణ

  1. యాపిల్ ఇంజనీర్‌లలో ఇండియా నుంచి వెళ్ళిన NRIలు కూడా ఉంటారు. వాళ్ళు స్థానిక అమెరికన్‌ల కంటే తక్కువ జీతానికి పని చేస్తారు. Manufacturing అనేది machine intensive కానీ research మాత్రం human intensive. ఆ research పని చేసే ఇంజనీర్‌లు తమకి ఇండియాలో కంటే అమెరికాలో జీతం ఎక్కువ వస్తున్నందుకు సంతోషిస్తారు కానీ విదేశాల నుంచి చవక శ్రమని దిగుమతి చేసుకునే neoliberal economics యొక్క అసలు రంగు వాళ్ళకి తెలియదు.

  2. నిర్జీవ శ్రమ తనను తన సొంతదారులు ఎంత విలువ (ఖరీదు) పెట్టి కొన్నారో అంత విలువను మాత్రమే తన సొంతదారులకి ఇస్తుంది. అంతకు మించి ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వదు.

    సర్,దీనిని ఒక స్వీకృతంగా తీసుకోవాలా?(ఉదా:సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఒక స్వీకృతం-దీనికి ఎటువంటి రుజువులు ఉండవు.)
    లేకపోతే దీనికి రుజువులు ఉన్నాయా?

    ఒక మనిషి/సంస్థ/దేశం ఎక్కువ సొమ్మును పోగుచేసుకొంటున్నాయని అంటే ఇతరుల శ్రమలను ఎక్కువగా దోపిడీ చేసుకొంటున్నాయని అర్ధం చేసుకోవచ్చా?

  3. సూర్యుడు తూర్పున ఉదయించడానికి రుజువులు ఎందుకు లేవు? అది రోజూ మనం కళ్ళతో చూసేదే కదా? రుజువుల సంగతి పక్కనబెడదాం. సూర్యోదయం స్వీకృతం అయితే నిర్జీవ శ్రమ సూత్రమూ స్వీకృతమే.

    “ఒక మనిషి/సంస్ధ/దేశం…. ?”

    అవును. అనుకోవచ్చు.

  4. యాపిల్‌వాడు పేటెంట్ ధర కూడా కలిపి తన ఉత్పత్తులని అమ్ముతాడు. ఒక కంపెనీవాడు మొబైల్ తయారు చెయ్యడానికి ఉపయోగించే టెక్నాలజీ ఇంకో మొబైల్ తయారీ కంపెనీకి తెలియదు. ఆ కంపెనీ ఇంజనీర్‌కి లంచం ఇచ్చి రహస్యాలు లాగినా ఆ కంపెనీ ఉత్పత్తికి identical తయారు చెయ్యడానికి పేటెంట్ చట్టాలు ఒప్పుకోవు. ఆ రెండో కంపెనీవాడు తన ఇంజనీర్ల చేత రీసర్చ్ చెయ్యించి కొత్త మోడల్ తయారు చేసుకోవాలి తప్ప ఇంకొకడు తయారు చేసిన మోడల్‌ని కాపీ కొట్టడానికి అవ్వదు. అందుకే మొబైల్ ఫోన్‌ల ధర ఎక్కువగా ఉంది. మందుల కంపెనీవాడు కూడా ఇలాగే పేటెంట్‌ని రిజర్వ్ చేసుకుని బతుకుతుంటాడు. అయితే మందుల తయారీలో ప్రాసెస్‌కి మాత్రమే పేటెంట్ ఉంటుంది, ప్రాడక్ట్‌కి పేటెంట్ ఉండదు.

    Imported goodsపై customs duty కూడా ఉంటుంది. ఈ మధ్యనే హైదరాబాద్‌కి చెందిన ఒక గన్ డీలర్‌తో మాట్లాడాను. అతను Indian made double barrel gun ధర సెకండ్ హ్యాండ్‌ది ఐదు వేలు నుంచి ఉంటుందని చెప్పాడు. Imported double barrel gun ధర లక్ష రూపాయలు వరకు ఉంటుందన్నాడు. మొబైల్ ఫోన్‌లపై customs duty ఎంతో నాకు తెలియదు కానీ imported good ఏదైనా దాని మీద customs duty ఉంటుందని మాత్రం చెప్పగలను.

  5. కస్టమ్స్ డ్యూటీ మొ.న పన్నుల్ని వ్యాసంలో ‘సుంకం’ కింద చెప్పాను. ఇవన్నీ సరుకు విలువలోని సజీవ శ్రమ నుండి వచ్చేవే. అదనంగా ఎక్కడి నుండో రావు. సరుకు అసలు విలువకి అదనపు ధరని మార్కెట్లు వసూలు చేయలేవు. మార్కెట్ లో ఉండే డైనమిక్స్ అలా జరగకుండా అడ్డుకుంటాయి. మీకు వీలైతే ‘పెట్టుబడి’ (రంగనాయకమ్మ గారి పరిచయం) చదవండి.

    వ్యాఖ్యలు ఆర్టికల్ లోని అంశానికి పరిమితం అయ్యేలా చూడగలరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s