ఉత్తర కొరియా ఏమి ఆశిస్తోంది? -3


People participate in a Pyongyang city mass rally held at Kim Il Sung Square on August 9, 2017, to fully support the statement of the Democratic People’s Republic of Korea (DPRK) government in this photo released on August 10, 2017 by North Korea’s Korean Central News Agency (KCNA) in Pyongyang. KCNA/via REUTERS

[ఉత్తర కొరియా వ్యాస పరంపరలో ఇది మూడవ భాగం. -విశేఖర్]

*************

ఇప్పటి ఉత్తర కొరియా సోషలిస్టు దేశం కాదు. ఆ దేశ పాలకులకు సోషలిస్టు సమాజాన్ని నిర్మించే లక్ష్యం ఏమీ ప్రస్తుతం లేదు. కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ హయాం లోనే ఉత్తర కొరియాలో మార్కెట్ సంస్కరణలు ప్రారంభం అయ్యాయి. పెట్టుబడిదారీ దేశాల అండతో పెట్టుబడిదారీ అభివృద్ధి వైపు త్వరత్వరగా ప్రయాణం చేయాలని ఉత్తర కొరియా పాలకులు ఆశిస్తున్నారు. అయితే వారు జాతీయవాదులు. కిమ్ ఇల్ సంగ్ ప్రబోదించిన స్వతంత్ర మనుగడ వారికి ముఖ్య లక్ష్యం. స్వతంత్ర ప్రతిపత్తి కలిగి, ఎవరిపైనా ఆధారపడవలసిన అవసరం లేని పెట్టుబడిదారీ అభివృద్ధి లక్ష్యాన్ని చేరడంలో ఎవరి సహాయాన్నయినా స్వీకరించడానికి వారు సిద్ధమే. అది చైనా అయినా, రష్యా అయినా లేదా అమెరికా అయినా సరే.

అయితే సామ్రాజ్యవాద ప్రపంచాధిపత్యాన్ని కాంక్షించే అమెరికా ఉత్తర కొరియా లక్ష్యానికి అడ్డుగోడగా నిలబడింది. ఆధిపత్యం కోసం చైనా, రష్యాలతో ఘర్షణ పడుతున్న అమెరికాకు తన పోటీదారుల పొరుగునే ఉన్న ఉభయ కొరియాలలో తన మాటను తు.చ తప్పక పాటించేవాళ్ళే పాలకులుగా ఉండాలి. స్వతంత్రంగా వ్యవహరిస్తానంటే కుదరదు. ఇదే అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉన్న ప్రధాన వైరుధ్యాంశం. 1953లో అమెరికాతో కుదిరిన ‘కాల్పుల విరమణ ఒప్పందాన్ని’ శాంతి ఒప్పందంగా మార్చుకోవాలని ఉత్తర కొరియా తపిస్తోంది. ఇందుకోసం 1970ల నుండే ఉత్తర కొరియా వివిధ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఒకటి రెండు సందర్భాలలో శాంతి ఒప్పందం కుదిరే వైపుగా ఇరు దేశాలు కొంతమేరకు ప్రయాణించాయి కూడా. కానీ తనకు కావలసిన ఫలితం రాబట్టిన తర్వాత అమెరికాయే అర్ధాంతరంగా శాంతి ప్రక్రియ నుండి వైదొలిగి మళ్ళీ మళ్ళీ శత్రు వైఖరిని రగిలిస్తూ వచ్చింది. శాంతి ప్రక్రియ వైఫల్యాన్ని మీడియా ప్రచారం సహాయంతో తిరిగి ఉత్తర కొరియా మీదికే నెట్టివేస్తూ వచ్చింది. ఉత్తర కొరియాను నమ్మదగిన భాగస్వామి కాదంటూ చర్చలకు నిరాకరిస్తోంది. చర్చల కోసం ఉత్తర కొరియా పలుమార్లు వివిధ రూపాల్లో, వివిధ వేదికల ద్వారా వ్యక్తుల ద్వారా సందేశాలు పంపినప్పటికీ నిరాకరిస్తూ వచ్చింది. మోసపూరితమైన విధానాన్ని అవలంబిస్తూ కేవలం తన ఆధిపత్య దాహాన్ని తీర్చుకోవడం కోసం ఉత్తర కొరియాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోకుండా మోకాలడ్డుతోంది.

ఉదాహరణకి ఆయా దేశాల (అమెరికా, దక్షిణ కొరియా, చైనా, రష్యా, జపాన్, దక్షిణ కొరియా) చర్చల ఫలితంగా 2005 సెప్టెంబర్ లో అమెరికా, ఉత్తర కొరియాలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఉత్తర కొరియా అణ్వస్త్ర రహిత దేశంగా మారటానికీ, ఆ దేశంపై ఆంక్షలు ఎత్తివేసి సాధారణ ఆర్ధిక, దౌత్య సంబంధాలు అభివృద్ధి చేసుకునేలా సహకరించడానికి అవసరమైన చర్యలు ఆ ప్రకటనలో పొందుపరిచారు. ఒప్పందం ప్రకారం ఉత్తర కొరియాపై శత్రు వైఖరి లేదని అమెరికా ప్రకటించింది. కొరియా ద్వీపకల్పాన్ని అణు విముక్తం చేయడానికి సూత్రబద్ధంగా అంగీకారం తెలిపింది. దీని అర్ధం దక్షిణ కొరియాలో కూడా అణ్వాయుధాలు ఉండకూడదని అంగీకరించడమే. శాంతియుత లక్ష్యాల కోసం (విద్యుత్, వైద్యం) అణు పరిజ్ఞానం కలిగి ఉండేందుకు ఉత్తర కొరియాకు గల హక్కుని గుర్తించింది. తగిన సమయంలో లైట్ వాటర్ రియాక్టర్ ను ఉత్తర కొరియా సమకూర్చుకునే విషయమై చర్చిద్దామని చెప్పింది. జపాన్ కూడా ఉత్తర కొరియాతో సాధారణ సంబంధాలు నెలకొల్పుకోవాలని అంగీకరించారు. “పరస్పర గౌరవం, సమానత్వం” ప్రాతిపదికన కొరియా ద్వీపకల్పంలో శాశ్వత శాంతి చేకూరేందుకు కృషి చేయాలని అంగీకరించారు. రెండేళ్ల పాటు కొనసాగిన ఈ చర్చల్లో అమెరికా మొదటి నుండి చివరి వరకూ ఉదాసీన పాత్రధారి (reluctant party) గా ఉంటూ వచ్చింది. “ఒప్పందంపై సంతకం చేయండి లేదా చర్చల వైఫల్యానికి బాధ్యత వహించండి” అంటూ చైనా హెచ్చరించడంతో అమెరికా ఒప్పందంపై సంతకం చేసింది. సెప్టెంబర్ 19, 2005 తేదీన ఒప్పందంపై సంతకం చేసిన అమెరికా ఆ మరుసటి రోజే, అనగా సెప్టెంబర్ 20, 2005 తేదీనే ఉత్తర కొరియాపై మరిన్ని ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు ప్రకటించింది. “ఒప్పందంపై సిరా తడి ఆరక ముందే” అన్న నానుడి ప్రయోగానికి కూడా ఆస్కారం లేకుండా 2005 ఒప్పందాన్ని అమెరికా తుంగలో తొక్కింది.

2012 లో కుదిరిన ఒప్పందానికి కూడా అమెరికా ఇదే గతి పట్టించింది. బీజింగ్ లో జరిగిన ద్వైపాక్షిక చర్చల మేరకు 29 ఫిబ్రవరి, 2012 తేదీన కుదిరిన ఒప్పందం ప్రకారం ఉత్తర కొరియా సుదూర లక్ష్యాలను ఛేదించే మిసైళ్ళ పరీక్షలు, అణు పరీక్షలు, అణు కార్యకలాపాలపై మారిటోరియం ప్రకటించాలి. అంతర్జాతీయ అణు శక్తి సంస్ధ (ఐ‌ఏ‌ఈ‌ఏ) ఇనస్పెక్టర్లను తనిఖీలకు అనుమతించాలి. ప్రతిఫలంగా 240,000 మెట్రిక్ టన్నుల పౌష్టికాహారాన్ని అమెరికా అందజేయాలి. ఉత్తర కొరియా పట్ల శత్రుభావం లేదని చెప్పాలి. “పరస్పర గౌరవం, సమానత్వం, సార్వభౌమత్వం” ప్రాతిపదికన ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలి. 19 సెప్టెంబర్ 2005 నాటి ఒప్పందానికి కట్టుబడి ఉండాలి. కానీ 2005, 2007 ఒప్పందాలకు మల్లేనే 2012 ఒప్పందం కూడా అమలుకు నోచుకోలేదు. కొద్ది రోజులలోనే అమెరికా తన పాత వైఖరిని పునరుద్ధరించింది. మోసపూరిత ఒప్పందాల ద్వారా ఉత్తర కొరియా అణు పాటవాన్ని తగ్గించడమే అమెరికా లక్ష్యంగా చేసుకుంది. 2005, 2007 ఒప్పందాల ద్వారా ఉత్తర కొరియా వద్ద ఉన్న ప్లుటోనీయం నిల్వలను భారీగా తగ్గించగలిగింది. 60 బాంబుల వరకూ తయారు చేయగల నిల్వలను 4-5 బాంబుల తయారీ స్ధాయికి తగ్గించింది. ఐ‌సి‌బి‌ఎం ల పరిజ్ఞానం అభివృద్ధి కాకుండా నిరోధించింది. అణు పరీక్షల స్ధావరాలను, నిర్మాణాలను, వ్యవస్ధలను పెద్ద మొత్తంలో నిర్వీర్యం చేసింది. కనుక అమెరికా ఆరోపిస్తున్నట్లు చర్చలలో మోసపూరిత భాగస్వామికి వాస్తవంలో ఉత్తర కొరియా కాదు, అమెరికాయే.

People cheer as a missile is driven past the stand with North Korean leader Kim Jong Un and other high ranking officials during a military parade marking the 105th birth anniversary of country’s founding father Kim Il Sung, in Pyongyang April 15, 2017. REUTERS/Damir Sagolj

పైన చెప్పుకున్నట్లు ఉత్తర కొరియాలో శాంతి స్ధాపన అమెరికా భౌగోళిక రాజకీయ ఆధిపత్యానికి విరుద్ధంగా పని చేస్తుంది. ఉత్తర కొరియా ఒప్పందాన్ని అమలు చేస్తే దక్షిణ కొరియాలో అణు బాంబులను అమెరికా ఖాళీ చేయాలి. ఈ అణు బాంబులు అక్కడ ఉన్నది రష్యా-చైనాల కోసమే తప్ప ఉత్తర కొరియాను ఎదుర్కొనేందుకు కాదు. స్వతంత్ర పెట్టుబడిదారీ ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఉనికికి భంగం కలిగించకూడదు. అలాగే తూర్పు, దక్షిణ చైనా సముద్రాలలో అమెరికా యుద్ధ నౌకాల పహారా కొనసాగాలంటే తద్వారా తూర్పు ఆసియాలో అమెరికా ప్రయోజనాలు నెరవేరాలంటే ఉత్తర కొరియా కేంద్రంగా నిత్యం ఉద్రిక్తతలు రగులుతూనే ఉండాలి.

ఉత్తర కొరియా విషయంలో నెలకొన్న మరొక పరిస్ధితిని కూడా గమనించాలి. ఎల్లకాలం చైనా, రష్యాలపై ఆధారపడి ఉండటం ఉత్తర కొరియాకు ఇష్టం లేదు. అదీకాక ఆర్ధిక, దౌత్య ఒంటరితనం నుండి బైటపడాలంటే అమెరికాతో శాంతి ఒప్పందమే ఏకైక మార్గమని ఆ దేశం భావిస్తోంది. దేశంలో మరిన్ని ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి పెట్టుబడులు ఆకర్షించాలని కిమ్ జోంగ్ ఉన్ భావిస్తున్నాడు. ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు రాబట్టడంతో పాటు సైనిక రంగంపై పెడుతున్న ఖర్చుని ఇతర రంగాలకు తరలించాలి. ప్రపంచ దేశాలతో చట్టబద్ధ సంబంధాలు పెంపొందాలి. బ్యాకింగ్, ఇన్సూరెన్స్ లాంటి కేపిటల్ మార్కెట్ తో లావాదేవీలు జరపాలి. అందుకోసం అమెరికాతో ఘర్షణ వైఖరిని తప్పించాలి. అది జరగాలంటే 1953 లో కుదిరిన ఆర్మీస్టైస్ స్ధానంలో శాంతి ఒప్పందాన్ని అమెరికాతో కుదుర్చుకోవాలి.

ఉత్తర కొరియా వైఖరి రష్యా, చైనాల దృష్టి దాటిపోలేదు. ఉత్తర కొరియా తమ ప్రభావం నుండి తప్పిపోకుండా ముఖ్యంగా రష్యా జాగ్రత్తలు తీసుకుంటోంది. కిమ్ జోంగ్ ఉన్ ను కూలదొసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయితే ప్రాంతీయంగా రష్యాకు ఉన్న అనుకూలత, పలుకుబడిలు అదృశ్యం అవుతాయి. సిరియాలో బషర్ ఆల్-అస్సాద్ అధికారంలో ఉంటేనే రష్యా పలుకుబడి, ప్రభావం కొనసాగినట్లే ఉత్తర కొరియాలో కిమ్ పాలన కొనసాగితేనే తూర్పు ఆసియాలో రష్యా పలుకుబడి నిలుస్తుంది. అదీకాక ఆసియా వైపు అమెరికా బలం పెరగడం రష్యా రక్షణకు అనుకూలం కాదు. ఈ కారణంతో ఆంక్షల ప్రభావం ఉత్తర కొరియాపైనా, కిమ్ పాలనపైనా బలీయంగా పడకుండా ఉండేందుకు రష్యా కొన్ని చర్యలు తీసుకుంటోంది. అక్టోబర్ నెలలో ఉత్తర కొరియా ఇంటర్నెట్ ట్రాఫిక్ కు రష్యాకు చెందిన ఒక కంపెనీ గుట్టు చప్పుడు కాకుండా మార్గాలు తెరిచింది. తద్వారా ప్రపంచంతో సంబంధాలకు చైనాతో పాటు మరో దారి ఉత్తర కొరియాకు లభించింది. ఉత్తర కొరియాకు చమురు ఉత్పత్తుల ఎగుమతిని రెట్టింపు చేసింది. దానితో ఉత్తర కొరియా – రష్యాల ద్వైపాక్షిక వాణిజ్యం 2017 మొదటి క్వార్టర్ లో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. చమురు సరఫరాను అధికం చేసింది. (రష్యా నౌకలు అధికారికంగా ఒక గమ్యాన్ని ప్రకటించి వాస్తవంగా ఉత్తర కొరియాను చేరాయి.) రష్యాలో పని చేసే ఉత్తర కొరియా కార్మికులను వెనక్కి పంపేయాలన్న అమెరికా ఒత్తిడిని రష్యా ప్రతిఘటించింది. విదేశాల్లో పని చేసే ఉత్తర కొరియా కార్మికులు స్వదేశం లోని కుటుంబాలకు పంపే ఆదాయం ఉత్తర కొరియా ఆర్ధిక వ్యవస్ధకు ఒక ఆధారం కనుక ఇది ఆ దేశానికి బాగా ఉపకరిస్తుంది.

ఇవన్నీ ఉత్తర కొరియా సంక్షోభం ఉత్తర కొరియా కోరుకున్నది కాదనీ, ఆ దేశ పాలకుడు సృష్టించుకున్నది అసలే కాదని స్పష్టం చేస్తాయి. ఉత్తర కొరియా పాలకులు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ ఉత్తర కొరియా సాధారణ ప్రజల మనుగడ, వారి భవిష్యత్తులు ప్రగతిశీల శక్తులకు ఆందోళన కారకాలు. సామ్రాజ్యవాద ఆధిపత్య రాజకీయాల వలన ఉత్తర కొరియా ప్రజలతో పాటు, దక్షిణ కొరియా ప్రజలు సైతం తీవ్రంగా నష్టపోతున్నారు. మొన్నటి వరకు దశాబ్దాల నియంతృత్వంలో మగ్గిన దక్షిణ కొరియా ప్రజలు ఇప్పుడు సామ్ సంగ్ లాంటి కార్పొరేట్ కంపెనీల లాభాలకు పనిముట్లుగా మారారు. కొద్ది మంది సంపన్నులు కాగా మెజారిటీ ప్రజలు చాలీ చాలని వేతనాలతో దరిద్రం అనుభవిస్తున్నారు. దక్షిణ కొరియా పాలకులు వరుస అవినీతి కుంభకోణాలకు పాల్పడుతూ సంపదల కేంద్రీకరణకు సహకరిస్తున్నారు.

మరోవైపు అంతర్జాతీయ ఆంక్షలు ఉత్తర కొరియా ప్రజల అభివృద్ధికి తీవ్ర ఆటంకాలుగా పరిణమించాయి. ఆంక్షల ద్వారా ప్రజలను తీవ్ర కడగండ్లకు గురి చేసి, భరించలేని పరిస్ధితులను సృష్టించి చివరకు తమ పాలకులపై తిరుగుబాటుకు ఉత్తర కొరియా ప్రజలను ప్రేరేపించడమే లక్ష్యంగా అమెరికా అమానుష ఆంక్షలు విధిస్తున్నదని వాషింగ్టన్ టైమ్స్ లాంటి పత్రికలు వెల్లడి చేసిన నేపధ్యంలో అమెరికా ఆంక్షలకు ప్రధాన లక్ష్యం ఉత్తర కొరియా ప్రజలే అన్నది స్పష్టం అవుతోంది. నాగరిక ప్రపంచంలో ఇలాంటి దుర్మార్గాలకు తావు ఉండకూడదు. కనుక ఉత్తర కొరియా ప్రజలకు మద్దతుగా నిలబడాలంటే అమెరికా ఆంక్షలను, ఆధిపత్య విధానాలను, అణు బాంబు పేరుతో సృష్టిస్తున్న విధ్వంసక యుద్ధ వాతావరణాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి.

2 thoughts on “ఉత్తర కొరియా ఏమి ఆశిస్తోంది? -3

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s