ఉత్తర కొరియాపై సామ్రాజ్యవాద యుద్ధ మేఘాలు?!


Image: New York Times

గత కొద్ది నెలలుగా అంతర్జాతీయ వార్తల్లో ఉత్తర కొరియా ఒక ప్రధాన అంశంగా వార్తల్లో నానుతోంది. ఈ వార్తలను ప్రధానంగా సృష్టిస్తున్నది అమెరికా, ఐరోపాలకు చెందిన బహుళజాతి కార్పొరేట్ మీడియా కంపెనీలు. కాగా ఇండియాతో సహా ఇతర మూడో ప్రపంచ దేశాలలోని చిన్నా, పెద్దా వార్తా సంస్థలన్నీ ఈ వార్తా కధనాలను క్రమం తప్పకుండా మోసి పెడుతున్నాయి. వాస్తవాల జోలికి పోకుండా అవాస్తవాలనే వాస్తవాలుగా నెత్తి మీద వేసుకుని ప్రచారం చేస్తున్నాయి. భారత దేశంలో అయితే ప్రాంతీయ భాష పత్రికలు సైతం పశ్చిమ కార్పొరేట్ పత్రికలు చెప్పే అబద్ధాలను, అర్ధ సత్యాలను గొప్ప వార్తా కధనాలుగా ప్రజల ముందు ఉంచుతున్నాయి. ఉత్తర కొరియాలో కిం-జోంగ్-ఉన్ పేరుతో యువ నియంత ఒకడున్నాడనీ, అతను పిచ్చి వాడనీ, అమెరికాతో యుద్ధం కోసం ఉర్రూతలూగుతున్నాడనీ, వరస పెట్టి అణుబాంబులు నిర్మిస్తున్నాడనీ, అణుబాంబు బటన్ పైన వేలు పెట్టి కూర్చొన్న ఈ యువ రాక్షసుడు ఏ క్షణంలోనైనా పిచ్చి ముదిరి బటన్ నోక్కేస్తాడనీ, తాను మాత్రం విలాసవంతమైన భవనాలలో కులుకుతూ ప్రజలను దరిద్రంలోకి నెట్టివేస్తున్నాడనీ, ప్రజాస్వామ్య ప్రియులైన తన వ్యతిరేకులను చంపేస్తున్నాడనీ… ఈ వార్తా కధనాల సారాంశం.

పిచ్చి ముదిరిన యువ నియంతను కట్టడి చేసేందుకు, తద్వారా తమ (అమెరికా) దేశాన్ని రక్షించుకోవడానికీ, అమెరికాతో పాటు ప్రపంచానికి కూడా కిం జోంగ్ ఉన్ పీడ వదిలించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంకణం కట్టుకున్నాడనీ, అందుకోసం వివిధ పధకాలను అమెరికా రచిస్తున్నదనీ, ఒక వేళ యుద్ధం అంటూ వస్తే ప్రపంచం అంతా అమెరికాకు, డొనాల్డ్ ట్రంప్ కూ అండగా ఉండాలనీ, మద్దతు ఇవ్వాలనీ ఈ వార్తా కధనాలు కొన్ని సార్లు ప్రత్యక్షంగా మరి కొన్ని సార్లు పరోక్షంగా సందేశాలు ఇస్తున్నాయి.

అణ్వాయుధ కోణం

ఉత్తర కొరియా అణు బాంబులను సాకుగా చూపుతూ అమెరికా, ఐరోపాలతో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి కొద్ది వారాల క్రితం అత్యంత కఠినమైన ఆంక్షలను ప్రకటించింది. ఓ వైపు ఉత్తర కొరియా ప్రజలు దరిద్రంలో మగ్గుతున్నారని కన్నీళ్లు పెట్టుకుంటూ మరోవైపు అదే ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసే వాణిజ్య, ఆర్ధిక ఆంక్షలను ఐరాస, పశ్చిమ దేశాలు ప్రకటించాయి. గత కొద్ది నెలల కాలంలోనే రెండు విడతలుగా ఆంక్షలను ప్రకటించి ఉత్తర కొరియా ప్రజలు తయారు చేసే సరుకులకు ఎగుమతి మార్కెట్లు లేకుండా ఆటంకాలు విధించారు. ఉత్తర కొరియాకు ఈ ఆంక్షల వల్ల బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులకు మార్కెట్ రద్దయింది. అతి చిన్న దేశమైన ఉత్తర కొరియా మొత్తం వార్షిక ఎగుమతులు 4 బిలియన్ డాలర్లు. అనగా తాజా ఆంక్షల వల్ల 25% ఎగుమతి ఆదాయాన్ని ఆ దేశం కోల్పోయింది. ఉత్తర కొరియా ఎగుమతుల్లో అతి పెద్ద వాటాదారు అయిన చైనా సైతం, తాజా ఆంక్షల దరిమిలా, ఉత్తర కొరియా నుండి బొగ్గు దిగుమతుల్లో కోత పెట్టడంతో ఆ చిన్న దేశం ఆర్ధికంగా ప్రతికూల పరిస్ధితిని ఎదుర్కొంటోంది. నిజానికి ఉత్తర కొరియాపై పశ్చిమ దేశాలు, ఐరాసలు ఆంక్షలు విధించడం ఇది కొత్త కాదు. 1950-53 కొరియా యుద్ధం ముగిసినప్పటి నుండి ఉత్తర కొరియాను వెంటాడి వేధిస్తున్న అమెరికాను వదిలి, బాధిత దేశమైన ఉత్తర కొరియానే దోషి స్ధానంలో నిలబెట్టి ఐక్యరాజ్య సమితి విడతలు విడతలుగా అనేకమార్లు వాణిజ్య, ఆర్ధిక, దౌత్య, వ్యక్తిగత ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలే ఆ దేశాన్ని ఒంటరిని చేశాయి. కాగా ఉత్తర కొరియాయే ఇనుప తెర నిర్మించుకుని ఒంటరిగా బతుకుతోందని ఎదురు నింద వేసి దుష్ప్రచారం చేశారు.

వైశాల్యంలో తెలంగాణ రాష్ట్రానికి కాస్త ఎక్కువగా ఉండే ఉత్తర కొరియా జనాభా కేవలం 2.50 కోట్లు. ఇంత చిన్న దేశంపై అమెరికా, ఐరోపాలు కట్టగట్టుకుని ఎందుకు కక్ష సాధిస్తున్నట్లు? సందు చివర కాకా హోటల్ లో ఉచితంగా పేపర్ చదివి ఫోజులు కొట్టే బడుద్ధాయిలు కూడా ఉత్తర కొరియా పాలకులను తిట్టిపోసేలా ఒక పద్ధతి ప్రకారం అసత్యాలను, అర్ధ సత్యాలను ఎందుకు ప్రచారంలో పెడుతున్నట్లు?

ఉత్తర కొరియా అణు బాంబులు నిర్మించి ప్రపంచానికి శాంతి లేకుండా చేస్తున్నదని అమెరికా, ఐరోపాలు ఆరోపిస్తున్నాయి. అమెరికా, జపాన్ లపైకి అణు బాంబులు ప్రయోగిస్తామని ఉత్తర కొరియా బెదిరిస్తున్నదని చెప్పబోతాయి. ఇరాక్ పైన అవే ఆరోపణలు చేసిన పశ్చిమ దేశాలు ఆ దేశం పైన దాడి చేసి లక్షల మందిని చంపాయి. పసి బిడ్డలకు పాలు, మందులు లేకుండా మాడ్చాయి. ఆ దేశ జాతీయ సైన్యాన్ని రద్దు చేసి ఇస్లామిక్ స్టేట్ లాంటి టెర్రరిస్టు సంస్థలు పుట్ట గొడుగుల్లా పుట్టుకు రావడానికి దోహదం చేశాయి. షియా, సున్నీల మధ్య తగవులు పెట్టి ఎడతెగని రక్తపాతానికి కారణం అయ్యాయి. అమెరికా దురాక్రమణకు ఎదురొడ్డి పోరాడిన ప్రతిఘటనా శ్రేణుల పైన రసాయన ఆయుధాలతో పాటు, డిప్లిటెడ్ యురేనియం బాంబులు ప్రయోగించాయి. కానీ సద్దాం హుస్సేన్ దాచాడని చెప్పిన రసాయన, అణు బాంబులు మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపెట్టలేకపోయాయి. అదేమని అడిగితే జార్జి బుష్ (అమెరికా అధ్యక్షుడు), టోనీ బ్లెయిర్ (బ్రిటన్ ప్రధాని) లు అత్యంత తేలికగా ‘సారీ’ చెప్పి తప్పుకున్నారు. మానవాభివృద్ధి సూచికలో అత్యంత ఉన్నత స్ధాయిలో ఉన్న ఒక దేశాన్ని సర్వ నాశనం చేసి తీరిగ్గా ‘సారీ’ చెప్పే అమెరికా, ఐరోపా పాలకుల కంటే మించిన రాక్షసాధములు ఉండగలరా? ఉత్తర కొరియాగానీ, ఆ దేశ పాలకుడు గానీ ఒక దేశం జోలికి వెళ్లింది లేదు. పొరుగునే ఉన్న దక్షిణ కొరియాలో 40కి పైగా అణు బాంబులు మోహరించిన అమెరికా నుండి ఆత్మ రక్షణ కోసం ఒకటి రెండు అణు బాంబులు తయారు చేసుకున్నందుకు ఉత్తర కొరియా పాలకుడు పిచ్చోడు, మూర్ఖుడు, యుద్ధ పిపాసి అని ఆరోపించడం ఎలా అర్ధం చేసుకోవాలి? ఆ ఆరోపణలను నమ్మడం, ప్రచారం చేయడం ఎంత తెలివితక్కువతనం కావాలి?

అమెరికా, ఐరోపాల బెదిరింపులకు లొంగి లిబియా మాజీ అధ్యక్షుడు మౌమ్మర్ గడాఫీ తన దేశ అణు కార్యక్రమాన్ని 2003లోనే బొందలో పెట్టుకున్నాడు. రసాయన ఆయుధాలను నిర్మూలించాడు. యురేనియం నిల్వలను కూడా ఖాళీ చేసుకున్నాడు. తద్వారా అమెరికా, పశ్చిమ రాజ్యాలతో శాంతి సాధించవచ్చని గడాఫీ ఆశించాడు. ఆ రోజుల్లో అమెరికా, ఐరోపా దేశాలు గడాఫీ పైన ప్రశంసలు కురిపించాయి. ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అణ్వాయుధాలు సంపాదించాలని కోరుకునే దేశాలు లిబియా/గడాఫీ ని చూసి పాఠాలు నేర్చుకోవాలని హితబోధ సైతం చేశాయి. (గడాఫీ నుండి పాఠాలు నేర్వాల్సిన అవసరం తమకు మాత్రం లేదన్నది అమెరికా, ఐరోపా దేశాల అలిఖిత, అప్రకటిత, ఆధిపత్యపూర్వక సూత్రం!) ఆ విధంగా పశ్చిమ రాజ్యాల ఆధిపత్య దాహాన్ని నిలువరించగల ఆయుధాలను వదులుకున్న గడాఫీ 2011 నాటి ‘అరబ్ వసంతం’ లో అత్యంత సులభమైన టార్గెట్ గా అమెరికా, ఐరోపాలకు దొరికిపోయాడు. ఆదర్శ గడాఫీ కాస్తా నియంత గడాఫీ అయ్యాడు. లిబియా ప్రజలను సామూహికంగా వధించబోతున్న రక్త పిపాసి అయ్యాడు. ఐరాస భద్రతా సమితి కదిలింది. అరబ్ లీగ్ మొఖం చాటేసింది. తర్వాత భద్రతా సమితితో (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లతో) చేతులు కలిపింది. ఫలితంగా గడాఫీ, అమెరికా పెంచి పోషించిన ఆల్-ఖైదా గుంపుల చేతుల్లో హత్యకు గురయ్యాడు. గడాఫీ లేని లిబియా కుక్కలు చింపిన విస్తరి అయింది. టెర్రరిస్టులను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసే కర్మాగారంగా అవతరించింది. ఇప్పటికీ లిబియాకు స్థిరమైన ప్రభుత్వం లేదు. అనేక గుంపులు, గ్రూపులు ఆ దేశాన్ని పంచుకుని ఏలుతున్నాయి. ప్రజలకు శాంతి, స్థిరమైన జీవనం కరువయింది. అత్యద్భుతమైన నీటి ప్రాజెక్టులను నిర్మించి, ఎడారి దేశాన్ని సస్యశ్యామల దేశంగా మార్చివేసి మానవాభివృద్ధి సూచికలో పశ్చిమ దేశాల సరసన నిలబెట్టిన గడాఫీ చేసిన తప్పు ఒకటే. పశ్చిమ దేశాల ఆధిపత్య యుద్ధ పిపాసులను దూరంగా పెట్టగల రసాయన, అణ్వాయుధ కార్యక్రమాన్ని, అదే యుద్ధపిపాసులతో శాంతి లభించగలదన్న ఆశతో, స్వయంగా రద్దు చేసుకోవడం. తన అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగించి ఉన్నట్లయితే బహుశా లిబియా ప్రజలు నేడు ఎదుర్కొంటున్న పరిస్ధితి వచ్చి ఉండేది కాదు. ఆ దేశం పశ్చిమ సామ్రాజ్యవాద పిచ్చి కుక్కల విషపు గాట్లకు బలై ఉండేది కాదు.

Kim Jong-Un

ఈ నేపధ్యంలో చూసినప్పుడు పట్టుబట్టి అణ్వాయుధాలు నిర్మించుకున్న ఉత్తర కొరియా పాలకులు పిచ్చోళ్లని చెప్పగలమా? ఉత్తర కొరియా పాలకుడు పిచ్చివాడా కాదా అన్నది మరొకరెవరో చెప్పవలసిన అవసరం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాం మొదలయ్యాక ‘డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటలిజెన్స్’ గా నియమితులైన డేనియల్ రే కొట్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడో చూడండి:

“ఆయన (కిం జోంగ్-ఉన్) బహిరంగ ప్రవర్తన బట్టి ఆయన ఎవరు, ఆయన ఆలోచనలు ఏమిటి, ఏం చేయబోతున్నాడు అన్న అంశాలపై కొన్ని అనుమానాలు కలగొచ్చు. కానీ మా (గూఢచార వర్గాల) లోతైన విశ్లేషణలో వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే ఆయన అసాధారణ తరహా వ్యక్తి కావచ్చు గానీ, ఖచ్చితంగా పిచ్చివాడు మాత్రం కాదు. ఆయన చర్యల వెనుక సహేతుకత ఉన్నది కూడా. ఎలాగైనా తమ మనుగడ కొనసాగించడమే ఆ సహేతుకత. తాము మనుగడ ఎలా కొనసాగించాలి, తన రాజ్య పాలనకు మనుగడ ఎలా, ఒక దేశంగా తమ మనుగడ ఎలా కొనసాగించడం అన్నదే ఆయన చర్యల వెనుక ఉన్న కారణం. ప్రపంచంలో ఇతర చోట్ల ఏం జరిగిందో ఆయన చూశాడు. ఇతర దేశాలతో పోల్చితే అణ్వాయుధ పటిమ గల దేశాలు సంపాదించిన ‘దాడి నివారక’ (deterrence) శక్తి, (అంతర్జాతీ రాజకీయాల్లో) వారి పరపతి… ఆయన చూశాడు. అణు కార్డు జేబులో ఉంచుకుంటే దాడి నివారక సామర్ధ్యం (ఒక దేశానికి అణ్వాయుధం ఉన్నపుడు ఆ దేశంపై శత్రు దేశం లేదా ఆధిపత్య దేశం మొదటి దాడి/దెబ్బ వేయడానికి సాహసించదు. దాడి చేస్తే ఎదురు దాడిలో అణ్వాయుధం ప్రయోగించవచ్చన్న భయం ఉంటుంది. దీనినే ఆంగ్లంలో డిటరెన్స్ కెపాసిటీ -deterrence capacity- అంటారు. తెలుగులో సమానార్ధాన్ని ఇచ్చే పదం ఉన్నట్లు లేదు. ప్రస్తుతానికి నివారణా సామర్ధ్యం లేదా అడ్డగింపు సామర్ధ్యం అని చెప్పుకుందాం -రచయిత) చాలా అధికంగా సమకూరుతుంది. తమ అణ్వాయుధ కార్యక్రమం వదులుకున్నందుకు లిబియా, ఉక్రెయిన్ తదితర దేశాలు ఎదుర్కొన్న పరిణామాల నుండి మనం నేర్చుకున్న పాఠాలు దురదృష్టవశాత్తూ… ఏమిటంటే, మీ దగ్గర అణ్వాయుధాలు ఉన్నట్లయితే, వాటిని ఎప్పటికీ వదులుకోవద్దు… మీ వద్ద అవి లేకపోతే సంపాదించండి అని. ఇప్పుడు చాలా దేశాలు అణ్వాయుధాలు సంపాదించడం ఎలా అని ఆలోచిస్తున్నాయి. ఆ విషయంలో ఉత్తర కొరియా కంటే గట్టిగా ఎవరూ లేరు….”

ఇదే పెద్ద మనిషి ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమం విషయంలో 2008లో ఓ ఆర్టికల్ రాస్తూ ఏమన్నాడంటే…

“ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కు అణ్వాయుధ సామర్ధ్యం సంపాదించడం మనకు వ్యూహాత్మకంగా భద్రం కాదు. ఎందుకంటే అమెరికా దాడి జరగకుండా అది అడ్డుకుంటుంది. మన దాడిని అడ్డుకునేందుకు ఇరాన్ అణ్వాయుధ సామర్ధ్యం సంపాదించకుండా ఉండాలంటే మనం ఆ దేశంపై దాడి చేయాలి.”

కాబట్టి చిన్న దేశాలు అణ్వాయుధాలు సంపాదించుకుండా అమెరికా, ఐరోపా దేశాలు ఎందుకు అడ్డుకుంటున్నాయి? ఆ చిన్న దేశాలు మొదటి దాడిగా అమెరికాపై అణ్వాయుధ దాడి చేస్తాయనా? కానే కాదు. అలా ఏ దేశమైనా మొదటిసారి అమెరికాపై అణు దాడి చేస్తే ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చేయగల సామర్ధ్యం అమెరికాకు ఉన్నదని అన్ని దేశాలకూ తెలుసు. వాస్తవ కారణం ఏమిటంటే అమెరికాయే ఎప్పుడన్నా ఆ చిన్న దేశాలపై, తన ఆర్ధిక, రాజకీయ ప్రపంచాధిపత్యం కొనసాగించడం కోసం, దాడి చేయాలని భావిస్తే అప్పుడు వాటి వద్ద ఉన్న అణ్వాయుధాలు అమెరికాని భయపెడతాయి కనుక. ప్రతి చిన్న దేశమూ అణ్వాయుధం సంపాదించుకుంటే అమెరికా ఆ దేశాలపై దాడి చేసే ఆలోచననే విరమించుకోవాల్సి ఉంటుంది. ఇక అమెరికా ఆధిపత్యం, ఆ మాటకు వస్తే ఆధిపత్యంలో ఉన్న ఏ సామ్రాజ్యవాద దేశ ఆధిపత్యం అయినా ప్రమాదంలో పడిపోతుంది. మార్కెట్ విస్తరణకు దారులు మూసుకుపోతాయి. ఆర్ధిక సంక్షోభం చుట్టుముడుతుంది. అది కాస్తా స్వవినాశనానికే దారి తీస్తుంది.

అందుకే అణ్వాయుధాలు లేని దేశాలు కొత్తగా అణ్వాయుధాలు సంపాదించుకోకుండా పెద్ద దేశాలు వివిధ ఒప్పందాలు చేసుకున్నాయి. ఆ ఒప్పందాల్ని అణ్వస్త్ర, అణ్వస్త్ర రహిత దేశాలపై సమానంగా రుద్దాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పి‌టి) సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం (సి‌టి‌బి‌టి) మొ.వి ఆ కోవలోనివే. ఇప్పటికే అణ్వాయుధాలు సంపాదించిన మూడో ప్రపంచ దేశాలు మరిన్ని అణు పరీక్షలు జరపకుండా, మరింత అణు సాంకేతిక సామర్ధ్యం సంపాదించుకోకుండా ఈ ఒప్పందాల ద్వారా నిరోధిస్తున్నాయి.

అణ్వాయుధ భారతదేశం మరింత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసుకోకుండా 1970ల నుండి అమెరికా, ఐరోపాలు ఇండియా పైన అణు నిషేధం అమలు చేశాయి. 2008లో అమెరికా కుదుర్చుకున్న “పౌర అణు ఒప్పందం” తో భారత దేశానికి “అణు ఒంటరితనం” రద్దయిపోయిందని మన పాలకులు చంకలు గుద్దుకుంటారు. కానీ వాస్తవంలో జరిగింది ఏమిటంటే భారత దేశం భవిష్యత్తులో జరిపే అణు పరీక్షలు (ఒక వేళ జరిపితే) గానీ, సంపాదించే అణు పరిజ్ఞానం గానీ అన్నీ అమెరికా కనుసన్నల్లో జరిగేలా ఈ ఒప్పందం బంధనాలు విధించింది. ఇండియా ప్రతి అణు చర్యనీ డేగ కళ్ళతో కాపలా కాయడానికి అణు కర్మాగారాల్లో నిఘా కెమెరాలు పెట్టేందుకు ఈ ఒప్పందంలో ఇండియా అంగీకరించింది. ఇండియాని ఇలాగే ఒంటరిగా వదిలేస్తే సొంతగా అణు పరిజ్ఞానం అభివృద్ధి చేసుకోవచ్చన్న పెద్ద అనుమానం అమెరికాకు కలగడం వల్లనే ఈ ఒప్పందానికైనా అమెరికా రాక తప్పలేదు. క్రయోజనిక్ ఇంజన్లు తయారు చేసే సామర్ధ్యం నుండి సూపర్ కంప్యూటర్ తయారీ వరకూ ఇండియా 2000 సంల ఆరంభం వరకు పశ్చిమ దేశాలతో పోటీ పడింది. ఇండియా సాంకేతిక, అణు అభివృద్ధిని కట్టడి చేసేందుకు ‘పౌర అణు ఒప్పందం’ అమెరికా విసిరిన ఒక వ్యూహాత్మక పాచిక మాత్రమే.

యుద్ధ కోణం

ఇప్పటి వరకూ ఉత్తర కొరియా సమస్యగా చెబుతున్న అంశంలో అణ్వాయుధ కోణం గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నాం. అమెరికా సృష్టించిన ఈ సమస్యకు గల ముఖ్య కోణం యుద్ధ కోణం. గట్టిగా చెప్పాలంటే సామ్రాజ్యవాద ఆధిపత్య యుద్ధ కోణం.

ఉత్తర కొరియాపై తాజాగా అమెరికా కారాలు మిరియాలు నూరడానికి అది చెబుతున్న కారణం ఆగస్ట్ నెలలో ఉత్తర కొరియా పరీక్షించిన ఖండాంతర క్షిపణి (ఐ‌సి‌బి‌ఎం – ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్). రెండు సార్లు జపాన్ దేశం ఉత్తరంలో చివర ఉన్న హోక్కైడో ద్వీపం మీదుగా ఉత్తర కొరియా రెండుసార్లు ఐ‌సి‌బి‌ఎం లను ప్రయోగించి పరీక్షించింది. ఈ ఐ‌సి‌బి‌ఎం లు హోక్కైడో మీదుగా వెళ్ళాయన్న మాటే గానీ అవి జపాన్ గగనతలంలో ప్రవేశించలేదు. లేదా జపాన్ జాతీయ గగనతల సరిహద్దుని అతిక్రమించలేదు. ఈ ఐ‌సి‌బి‌ఎం లు ఏ విధంగానూ జపాన్ కు ప్రమాదకరం కాదు. ఉత్తర కొరియా మిసైళ్లను కూల్చివేయడానికి మీరు ఎందుకు ప్రయత్నించలేదని జపాన్ అధికారులను ప్రశ్నించినప్పుడు వారిచ్చిన సమాధానం, “ఎందుకంటే అవి జపాన్ కు ప్రమాదకరం కాదు కనుక” అని. జపాన్ పైన 370 మైళ్ళ ఎత్తులో ప్రయాణించి పసిఫిక్ మహా సముద్రంలో (ఉత్తర కొరియా నుండి) 1700 మైళ్ళ దూరంలో నీటిని తాకిన ఐ‌సి‌బి‌ఎం ప్రయోగం ఉత్తర కొరియాకు ప్రచార ప్రయోజనం మాత్రమే కల్పించింది. ఈ దూరం వరకు మేము లక్ష్యాలు ఛేదించగలం అన్న డిటరెన్స్ ను మాత్రమే ఉత్తర కొరియా సాధించదలిచింది. ఆ సమయంలో అమెరికా, దక్షిణ కొరియాలు సాగిస్తున్న మిలటరీ డ్రిల్ కు ప్రతిస్పందనగా ఉత్తర కొరియా ఐ‌సి‌బి‌ఎంలు పరీక్షించింది తప్ప యుద్ధోన్మాదంతో కాదు. (నిజానికి ఇలాంటి ఎత్తులో అమెరికా రెక్కీ విమానాలు, నిరంతరం అన్ని దేశాలపైనా నిత్యం తిరుగుతుంటాయి. ఇరాన్ లాంటి దేశాలు పలుమార్లు అమెరికా నిఘా విమానాల్ని కూల్చివేసిన ఉదాహరణలు ఉన్నాయి కూడా.)

దీనికే అమెరికా, జపాన్, ఐరోపా దేశాలు హాహాకారాలు చేశాయి. ఐరాస భద్రతా సమితి సమావేశం కావాలని డిమాండ్ చేశాయి. జపాన్ లో ఎన్నడూ లేని విధంగా సైరన్ లు మోగించి ప్రజలను సురక్షిత ప్రదేశాలలో తలదాచుకోవాలని చెప్పవలసి వచ్చిందని పశ్చిమ పత్రికలు ఊదరగొట్టాయి. అయితే న్యూయార్క్ టైమ్స్ పత్రిక (ఆగస్టు 28, 2017) ప్రకారం జపాన్ లో సైరన్ లు మోగింది ఉత్తర కొరియా మిసైల్ దాడి చేసిందని చెప్పడానికి కాదు. మిసైల్ నుండి ముక్కలు జారిపడతాయేమో జాగ్రత్తవహించమని జనాన్ని హెచ్చరించడానికి మాత్రమే. ఈ గోరంత వార్తను కొండంత చేసి పశ్చిమ పత్రికలు ప్రచురిస్తే దానికి తెలుగు పత్రికలు, చానెళ్లు తమకు తోచిన మసాలా జోడించి హోరెత్తించాయి.

ఉత్తర కొరియా ఐ‌సి‌బి‌ఎం మిసైల్ పరీక్షలను సాకుగా చూపుతూ అమెరికా అరాచకానికి తెర తీసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరాస వేదికగా చేసుకుని ఉత్తర కొరియాకు “ఫైర్ అండ్ ఫ్యురీ” (నిప్పులు మరియు క్రోధం) తో బదులు ఇస్తామని హుంకరించాడు. ఉత్తర కొరియాపై అణు దాడి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని పదే పదే మాట్లాడాడు. ఉత్తర కొరియా దేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని ప్రకటించాడు. గతంలో ఎన్నడూ ఏ అధ్యక్షుడు ఈ తరహాలో ప్రత్యక్షంగా అణు హెచ్చరికలు జారీ చేయలేదు. “అన్ని అవకాశాలు టేబుల్ మీద పెట్టుకున్నాం” (పరోక్షంగా అణు బాంబు ప్రయోగం కూడా ఒక అవకాశం అని చెప్పడం) అంటూ పరోక్ష హెచ్చరిక చేసారే తప్ప నేరుగా “అణు దాడి చేస్తాం” అని అనలేదు. ట్రంప్ బెదిరింపులు తమ దేశంపై ‘యుద్ధ ప్రకటన’ తో సమానం అని ఉత్తర కొరియా హెచ్చరించింది. అమెరికా బాంబర్లు తమ దేశంపై ఎగిరితే కూల్చివేస్తామని హెచ్చరించింది.

ట్రంప్ హెచ్చరికలకు తగ్గట్టుగానే, ఉత్తర కొరియా బదులు హెచ్చరికను తృణీకరిస్తూ, అక్టోబర్ రెండో వారంలో అమెరికాకు చెందిన B- 1B సూపర్ సోనిక్ బాంబర్లు ఉత్తర కొరియాపై రాత్రి పూట ఎగిరాయి. తద్వారా ఉత్తర కొరియాను రెచ్చగొట్టి స్పందన రాబట్టేందుకు ప్రయత్నించింది అమెరికా. ఏ మిసైల్ తోనో ఉత్తర కొరియా స్పందిస్తే అదే అదనుగా ఉత్తర కొరియాపై యుద్ధం ప్రకటించవచ్చని అమెరికా ఆశించిందని పలువురు నిపుణులు విశ్లేషించడం గమనార్హం. అమెరికా బాంబర్లకు జపాన్, దక్షిణ కొరియాలకు చెందిన ఫైటర్ జెట్ లు కూడా జత కలిశాయి. రాత్రి వేళల్లో ఈ మూడు దేశాలు జాయింట్ డ్రిల్ చేయడం ఇదే మొదటిసారి. దక్షిణ కొరియాకు తూర్పున ఉన్న సముద్ర జలాల్లో ఆకాశం నుండి భూమికి మిసైల్ ప్రయోగించే విన్యాసాలు చేశాయి. ఈ తరహా విన్యాసాలకు మరో దేశమైతే ఖచ్చితంగా స్పందిస్తుంది. కానీ ఉత్తర కొరియా మిన్నకుంది. అమెరికా B- 1B బాంబర్లు ఉత్తర కొరియాకు అత్యంత సమీపంగా ఎగరడం కూడా కొత్త మిలీనియంలో ఇదే మొదటిసారని తెలుస్తోంది.

ఇది కాక కొరియా ద్వీపకల్పానికి సమీపంలో అమెరికా నౌకా యుద్ధ బలగాల్ని సమీకరిస్తున్నది. అణు దాడి నిర్వహించగల సబ్ మెరైన్ యూ‌ఎస్‌ఎస్ టక్సన్ అక్టోబర్ 7న దక్షిణ కొరియా తీరాన్ని చేరుకుంది. యుద్ధ విమాన వాహక నౌక ‘యూ‌ఎస్‌ఎస్ రోనాల్డ్ రీగన్’, దానికి చెందిన దాడి నౌకలు, డిస్ట్రాయర్లు మరి కొద్ది రోజుల్లో రానున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన రెండు ఫ్రిగేట్ యుద్ధ నౌకలు రానున్నాయి. వాషింగ్టన్ లో ఉత్తర కొరియాపై యుద్ధం కోసం ఆర్మీని సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 9 తేదీన ఆర్మీ అధికారుల సమావేశంలో కీ నోట్ ప్రసంగం చేస్తూ రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ “మన అధ్యక్షుడు అవసరం అని భావిస్తే మిలట్రీ దాడి చేసే అవకాశం ఉందని చూపేందుకు ఆర్మీ సిద్ధంగా ఉంచండి” అని ఆదేశించాడు. అదే సమావేశంలో అమెరికా ఆర్మీ బలగాల కమాండర్ జనరల్ రాబర్ట్ అబ్రామ్స్ మాట్లాడుతూ “వరల్డ్ వార్ II తరహాలో పూర్తి స్ధాయి యుద్ధం చేయడానికి అమెరికా బలగాల్ని పంపడం అంటే ఒక కఠిన వాస్తవాన్ని ఎదుర్కోవడమే: బలగాలు చచ్చిపోతాయి, అది కూడా పెద్ద సంఖ్యలో” అని హెచ్చరించాడు. జేమ్స్ మాటిస్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ జోసెఫ్ డన్ ఫర్డ్ లు అక్టోబర్ 10 తేదీన అధ్యక్షుడు ట్రంప్ తో సమావేశం అయ్యారు. మిలట్రీ ప్రయోగించే అవకాశాన్ని ఈ సమావేశంలో సమీక్షించినట్లు పశ్చిమ పత్రికలు చెప్పాయి. “అమెరికా, దాని మిత్ర దేశాలను ఉత్తర కొరియా తన అణ్వాయుధాలతో బెదిరించడాన్ని అడ్డుకోవడం ఎలా” అన్న అంశాన్ని చర్చించారని చెప్పాయి. దీని అర్ధం ఉత్తర కొరియాపై అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా దురాక్రమణ యుద్ధం చేసేందుకు అమెరికా దాదాపు సిద్ధపడినట్లే అని కెనడాకు చెందిన భౌగోళిక రాజకీయ నిపుణులు ప్రొఫెసర్ మైఖేల్ ఛోసుడోవ్ స్కీ విశ్లేషించాడు.

ఉత్తర కొరియాపై దాడి చేయడం అంటూ జరిగితే చైనా, రష్యాలు చూస్తూ ఉండవు. ఎందుకంటే ఉత్తర కొరియాపై యుద్ధానికి వాస్తవ లక్ష్యం ఉత్తర కొరియా కాదు, చైనా మరియు రష్యాలు. ఉత్తర కొరియాలో అమెరికా తన అనుకూల ప్రభుత్వాన్ని ప్రతిష్టిస్తే చైనా కలలు అన్నీ కల్లలు అవుతాయి. బెల్ట్ అండ్ రోడ్ ద్వారా, శ్రీలంక, పాకిస్తాన్, ఇరాన్, గ్జిబౌటిలతో పాటు ఆఫ్రికాలోని అనేక చోట్ల వందల బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టి నౌకా రేవులు, వాణిజ్య మండలులు, ఎక్స్ ప్రెస్ హై వేలు, సైనిక స్ధావరాలు నిర్మిస్తున్నది ఉత్తర కొరియాను అమెరికా, పశ్చిమ రాజ్యాల ప్రాపకానికి వదిలేయడం కాదు. నాలుగు దశాబ్దాల పాటు జాగ్రత్తగా, చైనా కార్మికవర్గ శ్రమశక్తిని చౌకగా పశ్చిమ బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పి కూడబెట్టిన అదనపు విలువ సంపదను బూడిదలో పోసిన పన్నీరు చేసుకోవటానికి చైనా ఇచ్చగిస్తుందా? దక్షిణ చైనా సముద్రంలో పలు కృత్రిమ ద్వీపాలు నిర్మించి నౌకాదళ స్ధావరాలు అభివృద్ధి చేస్తూ సాయుధ శక్తి సామర్ధ్యాలు పెంచుకుంటున్న చైనా అదే సముద్రం ఒడ్డున తన పక్కనే అమెరికా తోలు బొమ్మ ప్రభుత్వాన్ని ససేమిరా అంగీకరించలేదు. అంగీకరిస్తే అది చైనా వాణిజ్య, రవాణా, ఆర్ధిక ప్రయోజనాలకు తీవ్ర ప్రతిబంధకం అవుతుంది. కనుక ఆరు నూరైనా ఉత్తర కొరియాను చైనా కాపాడుకునేందుకు బరిలో దిగుతుంది. చైనాతో పలు వాణిజ్య, మిలట్రీ ఒప్పందాలు చేసుకున్న రష్యాకు సైతం ఉత్తర కొరియాలో అమెరికా అనుకూల ప్రభుత్వం ప్రమాదకారి అవుతుంది. చైనా, రష్యాలకు ఉత్తర కొరియా ఒక ముఖ్యమైన ఫ్రంట్. ప్రాక్సీ డిఫెన్స్. మిలట్రీ పరంగా, వ్యూహాత్మకంగా, వాణిజ్య ప్రయోజనాల రీత్యా, చమురు తదితర సరుకుల రవాణా రీత్యా ఉత్తర కొరియాను, దక్షిణ చైనా సముద్రాన్ని అవి కాపాడుకుని తీరాలి.

మరోవైపు డొనాల్డ్ ట్రంప్ అధికారం లోకి వచ్చీ రాగానే చైనాపై ఆరోపణలతో విరుచుకుపడుతూ వచ్చాడు. చైనాను ‘కరెన్సీ మానిపులేటర్’ గా ప్రకటించడానికి సిద్ధపడ్డాడు. అనగా తన కరెన్సీ విలువను కృత్రిమంగా తక్కువ స్ధాయిలో ఉంచడం ద్వారా ఎగుమతులు పెంపొందించుకుని అమెరికాతో వాణిజ్య మిగులు సంపాదిస్తోందని అధికారికంగా ప్రకటించేందుకు ఉద్యుక్తం అయ్యాడు. కానీ అలా ప్రకటిస్తే చైనాపై ప్రతీకార వాణిజ్య చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అది మళ్ళీ చైనాలో పరిశ్రమలు, కంపెనీలు, శాఖలు నిర్వహించి లబ్ది పొందుతున్న అమెరికా కంపెనీలు నష్టపోయెందుకు దారి తీస్తుంది. చైనాలోని అమెరికా కంపెనీల ఒత్తిడితో ట్రంప్ ప్రస్తుతానికి వెనక్కి తగ్గాడు. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిక్యతను తగ్గించేందుకు ‘ఫ్రీడం ఆఫ్ నావిగేషన్’ పేరుతో యుద్ధ నౌకలు తిప్పుతూ ఉద్రిక్తతలు పెరిగేందుకు అమెరికా కారణం అయింది. దక్షిణ చైనా సముద్ర సంపాదల్లో (చమురు, మత్స్య, ఖనిజ సంపదలు) ఫిలిప్పైన్స్, వియత్నాం, బ్రూనో తదితర దేశాలను రెచ్చగొట్టి చైనాకు వ్యతిరేకంగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. దౌత్య, ఆర్ధిక, మిలట్రీ రంగాలు అన్నింటిలో చైనాకు సమస్యలు సృష్టించడం అమెరికా ఒక విధానంగా అమలు చేస్తోంది. ట్రంప్ ఏలుబడిలో ఇది తీవ్రం అయింది.

ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయి? అమెరికా ఒక వైపు, చైనా, రష్యాలు ఒక వైపు మోహరించి ఉన్న రెండు శిబిరాల మధ్య ఆసియాలో ఆధిపత్యం కోసం తీవ్రంగా ఘర్షణ పడుతున్న పరిస్ధితిని సూచిస్తోంది.

మూడు దశాబ్దాలుగా వాణిజ్య మిగులు ద్వారా చైనా వద్ద భారీ మొత్తంలో పెట్టుబడి పొగుబడింది. ఈ పెట్టుబడి, లాభాలు సంపాదించే పెట్టుబడిగా రియలైజ్ కావాలంటే చైనాకు మార్కెట్లు కావాలి. ఖనిజ వనరులు కావాలి. చమురు, గ్యాస్ లాంటి శక్తి వనరులు కావాలి. ఈ వనరులతో తయారు చేసే సరుకుల అమ్మకానికి మార్కెట్ మరింతగా విస్తరించాలి. పైకి ఎగబాకే దశలో ఉన్న చైనా బలమైన ప్రత్యర్ధులతో సర్దుబాట్ల ద్వారా, బలహీన ప్రత్యర్ధులకు పెట్టుబడి ఆశలు కల్పించడం ద్వారా మార్కెట్ విస్తరణకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ముందస్తు వ్యూహంగా మిలట్రీ శక్తిని పెంచుకుంటూ లాజిస్టిక్ ప్రయోజనాలు, రావాణా నౌకల రక్షణ కోసం అంటూ మిలట్రీ స్ధావరాలు నిర్మిస్తోంది. ఇవన్నీ ఇప్పటికే మార్కెట్లను వశంలో ఉంచుకున్న పశ్చిమ దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు సవాలు విసురుతున్నాయి. కానీ ఆర్ధికంగా చైనాతో పోటీ పడలేని స్ధితిలో అమెరికా ఉన్నది. దానితో మిలట్రీ భారీ మిలట్రీ శక్తిని మోహరించి చైనాను దారికి తెచ్చుకోవటానికీ, ఐరోపా దేశాల వలె జూనియర్ వాటాదారుగా మార్చుకోవటానికి ఒత్తిడి చేస్తున్నది. ఇదే వ్యూహంతో ఇరాన్ చమురు రవాణాకు ఆటంకాలు కల్పించి ఐరోపాకు మధ్య ఆసియా దేశాల చమురు గ్యాస్ లు సిరియా మీదుగా పొందేందుకు సిరియాలో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నిలిపేందుకు ఒబామా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించి విఫలం అయింది. ఈ వైఫల్యానికి ప్రధాన కారణం సిరియా ప్రజల అలుపెరుగని సాహస పోరాటం కాగా రష్యా అందజేసిన ఆయుధ, వైమానిక, వ్యూహ చతురతా సాయం మరో ముఖ్య కారణం.

అమెరికాలో రాజకీయ, సామాజిక పరిస్ధితులు నిలకడగా లేవు. ఆర్ధిక అస్ధిరత, సంక్షోభంలు అనివార్యంగా రాజకీయ, సామాజిక సంక్షోభాలకు దారి తీస్తున్నది. అమెరికా ఆధిపత్యం కొనసాగింపుకు ట్రంప్ ఒక మార్గాన్ని ప్రతిపాదిస్తుంటే హిల్లరీ-ఒబామా వెనక నిలబడ్డ అమెరికా పాలకవర్గంలోని ఒక బలమైన సెక్షన్ మరో దారిలో వెళ్లాలని పట్టుబడుతోంది. ఈ మార్గాలు రెండు ప్రత్యర్ధి సెక్షన్ లోని పాలక వర్గాల ప్రయోజనాలను దెబ్బ తీసేలా ఉండడంతో ఇరు సెక్షన్లూ అమీ తుమీ తేల్చుకునే దశలో ఉన్నాయి. ప్రస్తుతానికి ట్రంప్ వ్యతిరేక సెక్షన్ ది పై చేయిగా ఉన్నది. ఆయన నియమించుకున్న ప్రధాన అధికారులను ఒక్కొక్కరినీ వివిధ ఆరోపణలతో దింపడంలో ట్రంప్ ప్రత్యర్ధి సెక్షన్ విజయవంతం అయింది. మిగిలిన వారేమో క్రమంగా ట్రంప్ కూ దూరం అవుతున్నారు. అమెరికా పాలక సెక్షన్ లలో ఒక్కో సెక్షన్ ఒక్కో విదేశీ విధానాన్ని అమలు చేస్తుండడం బట్టి వారిలో అంతర్గత వైరుధ్యాలు ఎంత తీవ్ర స్ధాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. సిరియాలో అమెరికా ప్రత్యేక (సి‌ఐ‌ఏ) బలగాలను వెనక్కి రప్పించాలని ట్రంప్ నిర్ణయిస్తే ఆ మరుసటి రోజే అమెరికా రక్షణ శాఖ సిరియాపై కుంటిసాకుతో వైమానికి దాడి నిర్వహిస్తుంది. నైరుతి సిరియాలో సిరియా సైన్యంతో ట్రంప్ శాంతి (కాల్పుల విరమణ) ఒప్పందం చేసుకోగా దానిని చెదరగొట్టేందుకు సి‌ఐ‌ఏ ఆల్-ఖైదా, ఇసిస్ లను ప్రయోగించి కాల్పులు జరిపిస్తుంది. ఉత్తర కొరియా సర్వనాశనమే తరువాయి అని ట్రంప్ ప్రకటిస్తే విదేశీ మంత్రి టిల్లర్సన్ “ఉత్తర కొరియాతో చర్చలకే మొదటి ప్రాధాన్యం” అని ప్రకటిస్తాడు. టిల్లర్సన్ ప్రకటనను ఖండిస్తూ ట్రంప్ “టిల్లర్సన్ అనవసరంగా సమయాన్ని వృధా చేస్తున్నాడు” అని మరో ప్రకటన ట్రంప్ జారీ చేస్టాడు. అమెరికా అణ్వాయుధ పాటవాన్ని పది రెట్లు పెంచాలని రక్షణ శాఖ సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ చెప్పినందుకు టిల్లర్సన్ ఆయన్ను మోరన్ (పశుప్రాయుడు) అని తిట్టిపోస్తాడు. ట్రంప్ తో విభేదాల వల్ల ఒక దశలో రాజీనామాకు సైతం టిల్లర్సన్ సిద్ధపడ్డాడు.

ఈ నేపధ్యంలో ఇంట గెలవడానికి ముందు రచ్చ గెలవాలని ట్రంప్ భావిస్తున్నాడు. అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేసే గట్టి చర్యకు పాల్పడి అమెరికాలో తన పాలనకు ఎదురు లేకుండా చేసుకోవాలని తలపోస్తున్నాడు. అమెరికా పాలకవర్గాల్లో తలెత్తిన ఈ తీవ్ర వైరుధ్యాలకు కారణం అమెరికా సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్ధలో నెలకొన్న లోతైన సంక్షోభం. ఓ వైపు యుద్ధ ఆర్ధిక వ్యవస్ధను కొనసాగించవలసిన అగత్యం, మరోవైపు రాకాసి యుద్ధ బడ్జెట్ ను కొనసాగించలేని సంక్షోభం. ఓ వైపు కునారిల్లుతున్న కార్మికవర్గ కొనుగోలు శక్తి. మరోవైపు రాశుల కొద్దీ పోగుబడుతున్న ఉత్పత్తులకు కొనుగోలుదారులు లేని పరిస్ధితి. డాలర్ ను కూలదోయడానికి చైనీస్ యువాన్ అంతకంతకూ ప్రభావం పెంచుకుంటున్న పరిస్ధితి. బహుశా పెట్రో డాలర్ ఒక్కటే అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు చివరి రక్షణ దుర్గంగా పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. పెట్రో డాలర్ లేకపోతే (చమురు వ్యాపారం ప్రధానంగా డాలర్లలో బదులు ఇతర కరెన్సీలలో జరిగితే) అమెరికా ఆర్ధిక వ్యవస్ధ పతనాన్ని ఎవరూ ఆపలేరు.

కనుక ఉత్తర కొరియాపై అమెరికా ప్రకటిస్తున్న ఫాసిస్టు యుద్ధోన్మాదం కేవలం డొనాల్డ్ ట్రంప్ బుర్రలో పుట్టిన వెర్రి ఆలోచన కాదు. అమెరికా సామ్రాజ్యవాదం నానాటికీ లోతైన ఆర్ధిక, సామాజిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోతున్న దానికి ప్రతిస్పందనగా, నిస్సహాయతలో నుండి, నిస్పృహ నుండి డొనాల్డ్ ట్రంప్ యుద్ధ సన్నాహాలకు పురిగొల్పుతున్నాడు. ఉత్తర కొరియాపై యుద్ధ సన్నాహాలకు హిల్లరీ-ఒబామా పాలక సెక్షన్ నుండి పైకి మద్దతు లేనట్లు కనిపిస్తోంది. కానీ యుద్ధం తప్పదని నిర్ణయం అయితే, దాని వల్ల తమకూ లాభమే అని ఆ సెక్షన్ భావిస్తే అమెరికా పాలకవర్గం లోని అన్నీ సెక్షన్లూ ఒకటి అయ్యే అవకాశాన్ని కొట్టిపారవేయలేము. అయితే ఈ సెక్షన్లు ఒకటై యుద్ధ సైరన్ మొగిస్తాయా లేక వైరుధ్యాల తీవ్రత వల్ల యుద్ధాన్ని వాయిదా వేస్తాయా అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. యుద్ధమే నిర్ణయమైతే ఇక జరిగేది మూడో ప్రపంచ యుద్ధమే.

……………(వచ్చే భాగంలో చారిత్రక కోణం)

3 thoughts on “ఉత్తర కొరియాపై సామ్రాజ్యవాద యుద్ధ మేఘాలు?!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s